గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 12వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.


12. ఓం యోగానందాయ నమః.

శంభునటన వృత్త గర్భ సీసము.

ఘన హరీ! కరుణతో వినుమయా. నిరుపమా - సదయా, కనుమయా నయముతోడ.

చిర ధరన్ నిరతమున్ హరి పదంబులను నేఁ - గొననెదన్ దలతునే గురువుగాను.  

కల చరాచరములన్ గలుగు సచ్చిర హరీ! - కనఁగ సాక్షివి కదా! కరినుతాంఘ్రి!

కరి పరాత్పరుఁడవే కద భవా! ననుఁ గనన్ - దలపవా? శరణమో ధనప్రదాద్య!  

గీ. కలుఁగు రాజయోగానంద కారకుఁడవు. - రాజ యోగము కల్పించి ప్రబలనిమ్ము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

12 సీస గర్భస్థ శంభు నటన వృత్తము. ( .. యతి 1-10-18)

హరీ కరుణతో వినుమయా. నిరుపమాన సదయా కనుమయా నయముతో.

ధరన్ నిరతమున్ హరి పదంబులను నేఁ గొననెదన్ దలతునే గురువుగా.

చరాచరములన్ గలుగు సచ్చిర హరీ! కనఁగ సాక్షివికదా! కరినుతా!

పరాత్పరుఁడవే కద భవా! ననుఁగనన్ దలపవా? శరణమో ధనప్రదా!  

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! గొప్ప శ్రీహరీ! సాటి లేనిదయతో కూడుకొన్నవాఁడా!

కరుణతో నా మాట వినుము. నయ మార్గమున నన్ను చూడుము. ప్రాచీన మైన భూమిపై ఎల్లప్పుడును హరి

పదములను నేను గురువుగా పట్టుకొనుటకు నా మనసులో తలంతును. సృష్టిలో ఉన్న సమస్త చరాచరములందును

ఉన్నట్టి సత్యమైన శాశ్వితమైన హరీ!  గజేంద్రనుత పాదపద్మా! చూడగా సమస్తమునకు సాక్షివి నీవే కదా.   భవా!

గజేంద్రునికి పరాత్పరుఁడవైనవాఁడివే కదా,  నన్ను చూడతలపవాయేమిధనప్రదాతలలో ప్రథముఁడా! శరణు.

ఇప్పుడు సంభవించు రాజయోగము వలన కలిగెడి ఆనందమునకు కారకుఁడవు నీవే కదా. నాకు రాజయోగమును

కల్పించి వృద్ధియగునట్లు చేయుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.