గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 11వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

జైశ్రీరామ్.

11. ఓం శ్రీమతే నమః.

శతపత్ర వృత్త గర్భ సీసము

నడిచి రా, కొలిచెదన్ నరహరీ! శుభములన్ - వలచి రా. పదములన్ వదల నేను.

ధరను నీ కరుణకున్ నిరతమున్ యెదురునే - కనుదు నీ దయనికన్ మనసుతోడ.  

ఘనుఁడ! శ్రీకరుఁడవే! కరముతోఁ గరముచే - కొనుము, శ్రీ ధరుఁడ! చేకొనుము నన్ను.

సకల! నాకికను నీ వొకఁడవే కలవు. నన్ - విడకు. నా కరమునే. విడకు రామ!  

గీ. శరణు శతపత్రగర్భసీసస్థ నృహరి! - వినుత *శ్రీమతీ* యుతుఁడవై వెలుఁగునిమ్ము.   

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

11 సీస గర్భస్థ శతపత్ర (చారుమతి) వృత్తము. ( .. యతి 1-13-17)

రా, కొలిచెదన్ నరహరీ! శుభములన్ వలచి రా. పదములన్ వదల నే.

నీ కరుణకున్ నిరతమున్ యెదురునే కనుదు నీ దయనికన్ మనసుతో.  

శ్రీకరుఁడవే! కరముతోఁ గరముచే కొనుము, శ్రీధరుఁడ! చేకొనుము నన్ .

నాకికను నీ వొకఁడవే కలవు. నన్ విడకు. నా కరమునే. విడకు రా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నరహరీ! శుభములనే కోరుచు నీతిగా నిన్ను నేను

కొలిచెదనా? నీ పాదములను నేను విడువనునీ దయ వలన మనస్పూర్తిగా నీ కరుణ కొఱకు భూమిపై ఎల్లప్పుడు ఎదురు

చూచుదును. గొప్ప దైవమా! మంగళప్రదుఁడవే, నీ చేతితో నా చేయి పట్టుకొనుము. శ్రీధరుఁడవైన హరీ! నన్ను

చేకొనుము. సమస్తమైనవాఁడా! అందమైన హరీ! నాకింక నీవొక్కఁడవే ఉంటివి. నన్ను విడువకుము.   శతపత్ర వృత్త గర్భ

సీసమున ఉన్న నరహరీ!పొగడఁబడెడి శ్రీమతితో కూడినవాడవై మాకు ప్రకాశము నిమ్ము.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.