జైశ్రీరామ్.
22. ఓం ఘోరవిక్రమాయ నమః.
మంజరీద్విపద చతుష్టయ గర్భ సీసము.
పాపంబులను జేయు పాపులనుండి నన్ - భువిఁ గాచుమా నయ పుణ్య ఫలద!
సన్మార్గ దూరుల సమయింతువయ్య. నన్ - గని బ్రోవు మాన్యుఁడ! గౌరవాఢ్య.!
నిర్భాగ్యులను గాచు నిరుపమ భాగ్య సా - ధనమార్గమున్ జను తత్వమిమ్ము.
ప్రవరులఁ బూజించు, పాపులనణచు. మా - పయి. చూపు ప్రేమను భక్తపాల.
గీ. జగతిలో వెల్గు నీవెల్గు జనులలోన - నడుపుమయ *ఘోరవిక్రమా*! నాయకుఁడుగ.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
22వ సీస గర్భస్థ మంజరీ ద్విపద చతుష్టయము. (మంజరీద్విపద 3ఇం.గ, 1సూ.గ.
2పాదములు. ప్రాస లేదు. యతి 3వగణం 1వ అక్షరం)
1.పాపంబులను జేయు పాపులనుండి - నన్ భువిఁ గాచుమా నయ పుణ్య ఫలద!
2.సన్మార్గ దూరుల సమయింతువయ్య - నన్ గని బ్రోవు మాన్యుఁడ! గౌరవాఢ్య.!
3.నిర్భాగ్యులను గాచు నిరుపమ భాగ్య - సాధన మార్గమున్ జను తత్వమిమ్ము.
4.ప్రవరులఁ బూజించు, పాపులనణచు. - మా పయి. చూపు ప్రేమను, భక్తపాల!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా!
పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రితజనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! గౌరవప్రదుడా! నీతిని, పుణ్య ఫలములను ఇచ్చువాడా!
పాపకర్ముల
నుండి నన్ను కాపాడుము. దుర్మార్గులను నశింపఁ జేసెదవు. నన్ను చూచు మాన్యుడా! నీవు నన్ను
కాపాడుము నిర్భాగ్యులను కాపాడ గలిగిన సాటిలేని భాగ్య సాధన మార్గమున ప్రవర్తించు స్వభావమునిమ్ము. ఓ భక్తపాలకా!
ప్రవరులను పూజించేటువంటి, పాపులనణచేటువంటి వాడవు, మాపైన ప్రేమను చూపుము.ఓ ఘోర విక్రమా! జనులలోన
జగతిలోన నీ వెలుగే వెలుగును. నాయకుడుగా నీవే మమ్ము నడుపుము..
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.