గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2024, సోమవారం

లక్ష్మీసహస్రం. 5వ శ్లోకం. 27 - 36. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

  జైశ్రీరామ్.

 శ్రీలక్ష్మీసహస్రనామావలిః 

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.

రచన.   చింతా రామకృష్ణారావు.

గానం. శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.


శ్లోత్రిపురా భైరవీ విద్యా హంసా వాగీశ్వరీ శివా

వాగ్దేవీ మహారాత్రిః కాలరాత్రిస్త్రిలోచనా 5

27. ఓం *త్రిపురాయై* నమః

నామ వివరణ.

ముల్లోకముల స్వరూపిణి మన అమ్మ. సర్వవ్యాపి మన అమ్మ. సర్వమూ తానే

అయిన తల్లి లక్ష్మీ మాత.

కం.  *త్రిపురా!* సర్వము నీవే

కృపఁ జూపుచు నీవె మాకుఁ గేలొసగుచు

మ్మపమార్గదూరులగునటు

తపియించుచుఁ జేయు నీకు  దండములమ్మా.

28. ఓం *భైరవ్యై* నమః

నామ వివరణ.

భైరవిగా నహీజ్వల ప్రకాశనుననుండి తల్లి లక్ష్మీ మాతయే.

తే.గీ. *భైరవీ!* దుష్టులను గూల్చి  భాతినిలుపు

భారతాంబకు, నాత్మవై ప్రభను గొలుపు,

మంచివారిని కాపాడు మహితముగను

దుష్ట శిక్షణఁ జేయుము తోయజాక్షి!

29. ఓం *విద్యా*యై నమః

నామ వివరణ.

సకల విద్యా స్వరూపిణి జగన్మాతయగు లక్ష్మీదేవి.

తే.గీ. జనని! *విద్యా! * ప్రణామముల్, వినుము మొరల,

నైహికాముష్మికంబులనలరఁ జేయు

విద్యలందఁగ జేయుమా! విశ్వరూప!

విద్యగా నీవె నాలోన వెలుగుమమ్మ.

30. ఓం *హంసాయై* నమః

నామ వివరణ.

పరమహంస మన లక్ష్మీ మాతయే.

తే.గీజనని! *హంసా!* పరాశక్తి! ప్రణవమీవె,

యాత్మలో హంసవైన నిన్నరయఁ దరమె?

జ్ఞాన చక్షువు నాకిచ్చి కనఁబడుమిక.

వందనంబులు చేసెదనందుకొనుము

31. ఓం *వాగీశ్వర్యై* నమః

నామ వివరణ.

వాగీశ్వరి అయిన భారతీ మాత మన అమ్మయే.

తే.గీప్రణుత *వాగీశ్వరీ!* నీదు పదయుగమ్ము,

నాదు చిత్తమందున నిల్పి నీదు సేవ

చేయగన్ వాక్కులందించు జీవమిడుచు

వాక్ప్రభాసంపు కవితలన్ వరల నిలుము.

32. ఓం *శివా*యై నమః

నామ వివరణ.

శుభమే అస్మ్మ.శుభాకారమే మన అమ్మ, శుభాధారమే అమ్మ.

తే.గీ *శివా!* శుభాకారమా! లేశమైన

నీదు శివతత్వముల్ తెల్ప నేను జాల

ననుపమాన శుభాస్పదా! కనుము నన్ను,

శుభకరంబగు జీవన  శోభనిమ్ము.

33 ఓం *వాగ్దేవ్యై* నమః

నామ వివరణ.

పలుకులకు మూలాధారమయిన జనని మన అమ్మయే.

కం *వాగ్దేవీ!* శుభకర

భావంబులు వాగ్గరిమను వరలింపగ నన్

నీవే యొసగుమ నాకున్,

జీవాత్మను పరమమునను జేర్చగ నిమ్మా.

34. ఓం *మహారాత్ర్యై* నమః

నామ వివరణ.

అమ్మ మహారాత్రి స్వరూపము. చీకటిలో కొట్టుమిట్టాడు భక్తులకు అండగా

నిలుచు తల్లి.

. శత్రు చయంబు చేతి కిల చక్కగ చిక్కి, గణింప నిన్,  *మహా

రాత్రి!*  గ్రహింపు నా వినతి, రక్షణఁ గొల్పుము, శత్రు షట్కమున్

,ధాత్రిని మాపి, నామదికి దక్కుము నీవు ప్రపూజ్యమానవై,

యాత్రముతోడ కోరితి నహర్నిశలున్ నిను గొల్వనెంచుచున్.

35. ఓం *కాలరాత్ర్యై* నమః

నామ వివరణ.

దుష్ట భయంకర రూపమయిన కాలరాత్రి జగజ్జనని అయిన మన తల్లియే.

చంకరుణను జూపఁబోకుమిక కల్మష హారిగ *కాళరాత్రి!* దు

స్తర దురహంకృతుల్ సుజన సత్తములన్ గలగించుచుండుటన్

దురితములాచరించు పలుదుష్టులపాలిట కాలరాత్రివై

నెరపుము నీ విధానమును నివ్వెరపోవగ లోకమంతయున్.

36. ఓం *త్రిలోచనా*యై నమః

నామ వివరణ.

సూర్యచంద్రాగ్నులనే త్రిలోచనములుగా కల తల్లి లక్ష్మీదేవి.

తే.గీసూర్య చంద్రాగ్నులను గల్గి చూడ్కులొప్ప

వరలుచున్న *త్రిలోచనా! * భరమొ నీకు

నన్ను గావంగ మది నిల్చి? సన్నుతాత్మ

దివ్యసామ్రాజ్ఞి! కావనందిమ్ము కరము.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.