గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2024, శనివారం

లక్ష్మీసహస్రం. 16వ శ్లోకం. 117 - 124. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 

జైశ్రీరామ్.

శ్లోజయా విజయా చైవ జయంతీ చాఽపరాజితా

కుబ్జికా కాలికా శాస్త్రీ వీణాపుస్తకధారిణీ 16  

117. ఓం *జయా* యై నమః

నామ వివరణ.

జయమే తానుగా అయియున్నది మన అమ్మ.

కంనయమార్గంబున వెల్గు వి

నయశీలురనెన్ని జయము, నైతిక శక్తిన్

దయతో నొసగెడి *జయ!* ని

శ్చయముగ నన్ గాతువమ్మ, జయము లొసగుచున్.

118. ఓం *విజయా* యై నమః

నామ వివరణ.

నిరంతర విజయ స్వరూపిణి లక్ష్మీమాత.

కం.  *విజయా!* నీ శుభ నామమె

విజయంబులు కూర్చునమ్మ విజ్ఞులకెపుడున్,

నిజమిది, నిన్ గొలిచెడి

న్నజయ్యునిగ చేసి కావు మద్భుత శక్తిన్.

(క్షయ్యజయ్యౌ శక్యార్థే...సూత్రం మేరకు జయింపవీలు గానివాడు అజయ్యుడు . ఇది శక్తిని తెలుపుతుంది. క్షయ్య, జయ్య, శబ్దములు శక్యార్థములు:2 క్షయింప శక్యమైనది క్షయ్యము: జయింప శక్యమైనది జయ్యము. శక్యార్థముకాక యోగ్యార్థము గలిగినప్పుడు క్షేయము, జేయము, అనురూపములు గలుగును.

'క్రయ్యమనగా కొనువారు కొందురనుబుద్ధి నంగడియం దుంచబడినది. 'క్రేయ' మనగా విక్రయించుట కర్హమైనది.)

119. ఓం *జయన్త్యై* నమః

నామ వివరణ.

నిరంతర జయములతో ప్రకాశించు తల్లి.

పంచ చామరము.

*జయన్తి! * నీకసాధ్యమా నిజంబుగా జయంబిడన్,

నయంబుతోడ వెల్గుచు న్ననారతంబు కాతువే,

ప్రియంబుగా కవిత్వమున్ భవిష్యవాణి యై మనన్

జయంబు గొల్పు రీతిలో ప్రశస్తిగా నొసంగుమా.

120. ఓం *అపరాజితా* యై నమః

నామ వివరణ.

ఇతరులచే ఓడింప బడని తల్లి.

కం.  *అపరాజితా! * మదంబా

సుపవిత్ర చరిత్ర కలిగి శోభిలు భక్తుల్

జపియింతురు నిను నార్తిని,

ప్రపవై నీవాదుకొని, పిపాస నడచుమా.

121. ఓం *కుబ్జికా*యై నమః

నామ వివరణ.

ఆమె ఎనిమిదేళ్ల బాలిక. ముడుచుకుని నిద్రపోవుచున్న జనని.

తే.గీ.  *కుబ్జికా!* మాపుమా మరుగుజ్జుతనము

నాదు దుర్భావ మిళితమౌ మేధ యందు,

నిన్ను సేవించు నా బుద్ధి నిశ్చయముగ

నిన్ను మెప్పించు నటులుండనిమ్ము జనని.

122. ఓం *కాలికా*యై నమః

నామ వివరణ.

కాలికారూపమున ఉన్న తల్లి మన అమ్మ.

తే.గీ*కాలికా! * నీదు రూపమున్ గలయఁ జూచి

యైహికాముష్మికములంది యలరుదురుగ

నీదు భక్తులు, నేనును నిన్నుఁ గొలిచి

భక్తి యుక్తుఁడనై పొంది శక్తి , మనుదు.

123. ఓం *శాస్త్ర్యై* నమః

నామ వివరణ.

జ్ఞానమును శాసించు తల్లి.

తే.గీశాస్త్ర విజ్ఞాన ఖనివైన శాస్త్రివమ్మ,

నీవు *శాస్త్రీ! * నిజంబిద్ది, నేర్పు మీర

శాస్త్ర విజ్ఞానమందించి చక్కగ నను

చూడుమమ్మరో పుత్రుఁడన్, శుభద వగుచు.

124. ఓం *వీణాపుస్తకధారిణ్యై* నమః

నామ వివరణ.

వీణను, పుస్తకమును ధరించు జనని, నాద బ్రహ్మమును, జ్ఞానబ్రహ్మమును

తనలో ధరించుతల్లి.

కం*వీణాపుస్తక ధారిణి! *

కాణాచివి విద్యలకును, కల్పకమీవే,

క్షోణిని నిను స్మరియించిన

ప్రాణములను నిలుపు విద్యఁ బడయగవచ్చున్.


జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.