గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2024, సోమవారం

లక్ష్మీసహస్రం. 4వ శ్లోకం. 21 - 26. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

 శ్రీలక్ష్మీసహస్రనామావలిః 

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.

రచన.   చింతా రామకృష్ణారావు.

గానం. శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి..


శ్లోనిత్యానందా నిత్యబోధా నాదినీ జనమోదినీ

సత్యప్రత్యయనీ చైవ స్వప్రకాశాత్మరూపిణీ 4

21. ఓం *నిత్యానన్దాయై* నమః

నామ వివరణ.

నిరంతరమూ ఆనందమయమై భక్తులకు ఆనంద ప్రదాయినిగా వెలుగు తల్లి

మన లక్ష్మీమాత.

కంనిరుపమ *నిత్యానందా!*

తరుగని యానందమిమ్ము తలచిన నిన్నున్,

పరమానందమె బ్రహ్మము,

తరణోపాయముగ ముక్తిదా! మది నిలుమా.

22. ఓం *నిత్యబోధా*యై నమః

నామ వివరణ.

నిరంతరమూ బోధను గొలుపు మాతృదేవత లక్ష్మీమాత.

తే.గీ.  *నిత్యబోధా!* నినుం గన్న నిత్యబోధ

నొందుచుండి శుభావళిన్ బొందఁగలము,

నిత్యబోధన్ మదిన్ గొల్పి నిలుపు మమ్మ!

నిన్ను స్మరియింప నిత్యమున్ నిరుపమాన!

23. ఓం *నాదిన్యై* నమః

నామ వివరణ.

నాదమునకు మూలమయి నాదమును కలిగించు తల్లి మన అమ్మ.

తే.గీ.  *నాదినీ!* నీవె యోంకార నాదమెఱుఁగ,

నాదు మదిలోన యోంకార నాదమీవె,

సేదఁ దీర్చుచు నిహలోక బాధలుడుప

ఖేదమును వాసి నీకు నేఁ గేలు మోడ్తు.

24. ఓం *జనమోదిన్యై* నమః

నామ వివరణ.

జనులకు సంతోషమును కలిగించు జనని మన అమ్మ.

కం.  *జనమోదినీ!* వసుంధర

ఘనతర శుభకర నిరుపమ కరుణామృతమై

మనఁ జేయుచు జనపాళిని

వినుతంబుగ నిలుతువు మది ప్రీతిగ శుభదా!

25. ఓం *సత్యప్రత్యయిన్యై* నమః

నామ వివరణ.

సత్యమునకు నిదర్శనముగా సత్యమై, సత్యము నిలుపు తల్లియైయొప్పు

జగజ్జనని అమ్మ.

కం.  *సత్యప్రత్యయినీ! ధర

స్తుత్యముగా సత్యధనులతో నిలిచెదవే,

నిత్యము నీదగు సుగుణౌ

న్నత్యము సత్యముగ తెలిపి నతులందింతున్.

26. ఓం స్వప్రకాశాత్మరూపిణ్యై నమః

నామ వివరణ.

స్వయముగా ప్రకాశించు ఆత్మ స్వరూపము కల తల్లి లక్ష్మీ మాత.

తే.గీ.  *స్వప్రకాశాత్మరూపిణీ!* సన్నుతింతు

నిన్ను, నేనున్ బ్రకాశింతు నిన్ను దాల్చి

మానసంబందుఁ, గృపతోడ మనుము నీవు,

నిన్నుఁ దాల్చిన  నేనును సన్నుతుఁడనె.

జైహింద్.



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.