శా. లావణ్యాంచితస్వచ్ఛభాసురముఖీ! శ్లాఘింతునద్దానినే
భావంబందున నర్థచంద్రుఁడనుచున్ భాసించుటన్ గాంచి,పై
నావంకన్ గలనీకిరీట శశిదౌ యాఖండభాగంబిదే,
శ్రావించుంసుధరెండునొక్కటగుటన్, సన్మాన్య పూజ్యా! సతీ! ॥ 46 ॥
భావము.
దేవీ నీ నుదురు నిర్మలమైన లావణ్యమును, నిర్మల మైన కాంతియు కలిగియున్నది. దీనికి గల లావణ్యా న్నీ, కాంతినీబట్టి చూస్తే , బ్రహ్మ ఒకే చంద్ర బింబాన్ని రెండు ఖండములుగా జేసి ఆరెంటిలో క్రింది ఖండాన్నినీ కిరీటములో చంద్ర శకలము గానూ, పై ఖండాన్ని కిరీటంలోని చంద్ర ఖండానికి ఎదురు దిశలో నీ నుదురు గానూ అమర్చినాడని ఊహిస్తున్నాను. ఎందుకనగా ఈ రెంటిలో పై ఖండాన్ని క్రింది కి గానీ క్రింది ఖండాన్ని పైకిగానీజరిపి, ఈ రెండు ముక్కల నాలుగు కొనలలో, రెండేసి ఒక్కొక్క చోట కలిసేటట్లు అమృతపు వెన్నెలతో అతికితే, పున్నమినాటి చంద్రుడు అవుతాడు. అనగా నీ లలాటము పున్నమినాటి చంద్రుని వలె ప్రకాశించుచున్నది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.