గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2024, సోమవారం

లక్ష్మీసహస్రం. 6వ శ్లోకం. 37 - 45. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

  జైశ్రీరామ్.

 శ్రీలక్ష్మీసహస్రనామావలిః 

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.

రచన.   చింతా రామకృష్ణారావు.

గానం. శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.


శ్లోభద్రకాలీ కరాలీ మహాకాలీ తిలోత్తమా

కాలీ కరాలవక్త్రాంతా కామాక్షీ కామదా శుభా 6

37. ఓం *భద్రకాల్యై* నమః

నామ వివరణ.

భద్రమునకు, మంగలమునకు స్థానమయిన తల్లి, భద్రమును కల్యాణ

ప్రదయు అయిన తల్లి మన భద్ర కాలి.

తే.గీ.  *భద్రకాలీ!* కృపన్నాకు భద్రదవయి

మానసంబున నెలకొని మసలుచున్న

నిన్ను మహనీయ యుక్తితో నెన్ని కొల్తు

భక్తి భావంబుతో  నాదు శక్తి కొలది.

38. ఓం *కరాళ్యై* నమః

నామ వివరణ.

దుష్ట సంహరూపిణి కరాలి మాత శిష్టులకు మంగలప్రద.

తే.గీమహితమౌ భీకర *కరాళి!* మానసమున

నిన్ను నిలుపు టసాధ్యంబు, నిజము కనగ,

నీవె నాలోన రహియించు నేర్పు మీర

నిత్య మంగళ కారివై నిష్ఠతోడ.

39. ఓం *మహాకాల్యై* నమః

నామ వివరణ.

అమ్మ మహాకాలీ స్వరూపమే. అంతు లేని కాలస్వరూపము అమ్మయే.

తే.గీశ్రీ *మహాకాలి*! నీ దివ్య చేతన మది

లోకమునఁ గల్గు జనులకు, శ్రీకరమగు,

నా మదిన్ జేతనంబీవె, నన్ను లోక

మందు వెలయింతు వీవమ్మ, సుందరముగ.

40. ఓం *తిలోత్తమా*యై నమః

నామ వివరణ.

అమ్మ తిలోత్తమ. సర్వశ్రేష్ఠురాలు. దివ్యాత్మ అయిన తిలోత్తమ అమ్మయే.

అత్యంత సౌందర్య వారాశి అయిన తిలొత్తమ అమ్మయే.

చంసుగుణ *తిలోత్తమా! * జగతి శోభిలు నీ పదపంకజప్రభన్,

సగుణసురూపధారిణుల సంస్కృతి వీవె దయా సుధాంబుధీ!

యగణిత సత్య సత్ పథ మయాచితరీతిని గల్గు నీ కృపన్,

నిగమ సువేద్యవీవు, గణనీయ శుభంబులు నాకుఁ గొల్పుమా.

41. ఓం *కాల్యై* నమః

నామ వివరణ.

కాల వర్ణముననొప్పు కాలీస్వరూపము కూడా అమ్మయే.

తే.గీగౌరి! నీవె యీ సృష్టిలో కలిని పెంచు

టేలను? హరించుమమ్మరో! *కాళి!* దుష్ట

కలిని బాపుము నా లోనఁ గలిగి నీవు,

కలిత సద్గుణ సన్నుతా! సలలితాత్మ!

42. ఓం *కరాలవక్త్రాన్తా*యై నమః

నామ వివరణ.

కరాలవక్త్రాంతము అనగా భయంకరమయిన నోరు కలతల్లి మన అమ్మ

లక్ష్మీదేవియే.

సంతత సత్య సన్నుత లసద్గుణదాయిని! యో *కరాల

క్త్రాంత! * శుభాస్పదా! జయము కల్గగఁ జేయుచు మంచివారికిన్,

చింతలఁ ముంచు దుష్టులను జీల్చుచు నీ శుభ నామధేయమున్

సాంతము నిల్పుకొందువు, ప్రశాంతతఁ గూర్చగ లోకమందునన్

43. ఓం *కామాక్ష్యై* నమః

నామ వివరణ.

భక్తుల కోరికలు తీర్చెడి కామాక్షీమాత మన అమ్మలక్ష్మీదేవియే.

కం.  *కామాక్షీ!* శుభ దృష్టిని

క్షేమము కలుగంగఁ జేసి కీర్తిని గనుచున్.

శ్రీమన్మంగల సుజనుల

కైమోడ్పులు గొనెడి నీకు కైమోడ్తునిటన్!

44. ఓం *కామదాయై* నమః

నామ వివరణ.

కోరికలను తీర్చు జనని కామద, మన అమ్మ. కమేశ్వర దర్శన భాగ్య ప్రదాత

మన అమ్మ.

కం. *కామద!* నీ సద్భక్తుల

కామములగు భుక్తి, ముక్తి, కరుణనొసగుచున్,

క్షేమము గొలిపెదవమ్మా!

యేమని నిన్ గోరువాడ నిమ్ము శుభాళిన్.

45. ఓం *శుభా*యై నమః

నామ వివరణ.

శుభమనిన మన అమ్మ్యే. కారణముగనే అమ్మ శుభా అను పేరు

గడించగలిగినది.

తే. గీవర *శుభా! * సుజనాళికిన్  వరములొసగి

మంచినెన్నుచు కాచెదవెంచి చూడ,

నేను నీ దాసుడఁ, గనుచు నీవె నన్నుఁ

గాచి రక్షించుమమ్మరో కనికరించి.

జైహింద్.



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.