గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 51 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

సారస నేత్రి! నీ కనులు శర్వునెడన్ గురిపించు దివ్య శృం

గారము, భీతిఁగొల్పు కలికల్మషులందు, భయానకంబు సం

చార భుజంగ భూషలన, స్వర్ఝరిపైన ననన్యరౌద్రమున్,

కోరుచు నాపయిన్ గరుణ, గోపతి గాధలకద్భుతంబు నా

వీరము యుద్ధవేళలను, విస్త్రుత హాస్యము మిత్రపాళికిన్,

చేరఁగ వచ్చు భక్తులకు శ్రీలనుగొల్పుచు శోభఁ గూర్తువే. 51
భావము.
తల్లీ! నీ కన్నుల యొక్క చూపు సదాశివునియందు "శృంగార రసము " చే తడుప బడినదై ఆయనకు అనురాగం పుట్టించేదిగా ఉన్నది. శివునికంటే ఇతరులైన ప్రాకృత జనుల యందు రోత గల్గి, " బీభత్స రసము "తో గూడి వున్నది. సవతి యగు గంగా దేవియందు రోషముతో ఉండి, "రౌద్రరసము" కలదిగా యున్నది . త్రిపురాసుర సంహారముమొదలయిన శివుని విజయ గాథల యందు విస్మయము కలిగి "అద్భుతరసా"విష్టమై ఉన్నది. శివుడు ఆభరణములు గా ధరించిన సర్పముల యందు భయము కల్గి "భయానక" రసముతో కూడినదై యున్నది. ఎర్రకలువల సౌందర్యాన్నీ , రక్తిమనూ పుట్టించేదయి, "వీరరసము" తో కూడినట్లు భాసించు చున్నది . చెలికత్తె లందు కదలిక లేని స్థిరమైన కంటిగ్రుడ్లతో అనగా చిరునవ్వుతో ఉండి "హాస్యరసము" తో ఒప్పుచున్నది. నిన్ను స్తుతించే నాయందు "కరుణ" రసముతో నిండియున్నది.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.