గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2024, శనివారం

లక్ష్మీసహస్రం. 18వ శ్లోకం. 129 - 135. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోయజ్ఞేశానీ ప్రథా దీక్షా దక్షిణా సర్వమోహినీ

అష్టాంగయోగినీ దేవీ నిర్బీజధ్యానగోచరా 18  

129. ఓం *యజ్ఞేశాన్యై* నమః

నామ వివరణ.

యజ్ఞమునకు ప్రభ్విణి అమ్మయే,

కం*యజ్ఞేశానీ!* సమ్య

గ్విజ్ఞాననిధానమనుచు విశ్వమునందున్

విజ్ఞులు మెచ్చగఁ జేయుము

సుజ్ఞానము కలుగఁజేసి, చూపుము సుగతిన్.

130. ఓం *ప్రధా*యై నమః

నామ వివరణ.

సృష్టిలో సుప్రసిద్ధ అమ్మ.

పంచ చామరము

*ప్రధా!*  ప్రసిద్ధవమ్మ నీవు భక్తిఁ గొల్చు వారికిన్

ప్రదాతవై శుభాళి గొల్పి భవ్య జీవనమ్ముచే

సదా ముదంబు గొల్పుచున్ బ్రశాంతినిచ్చు తల్లిగా

మదంబ నీదు పుత్రుఁడేను, మంచిఁ గొల్పి  ప్రోవుమా.

131. ఓం *దీక్షా*యై నమః

నామ వివరణ.

యజ్ఞాదులాచరించుటకు స్వీకరించు దీక్షయే జనని.

దీక్షను బూని తీవు గణుతించుచు భక్తుల ముక్తి సాధనన్

శిక్షణ నిచ్చి సత్ పథము చేర్చుదునంచును, నీదు సత్ కృపన్

రక్షణ పొంది భక్తతతి రమ్య సుధామయ భక్తి తత్వమున్

*దీక్ష! * గ్రహించి తీరుదురు, దివ్యము నీదగు దీక్ష శ్రీ సతీ!

132. ఓం *దక్షిణా*యై నమః

నామ వివరణ.

సృష్టికి దక్షురాలుగా కలిగిన తల్లిఅన్నిటా నైపుణ్యము కలిగిన జనని.

తే.గీదక్షురాలవు నీవమ్మ  శిక్షణనిడ,

*దక్షిణా!* గొల్తు భక్తితో శిక్షణనిడి,

యక్షయంబగు సుజ్ఞాన మందఁజేసి

యిహపరమ్ములఁ గను వరంబిమ్ము కృపను.

133. ఓం *సర్వమోహిన్యై* నమః

నామ వివరణ.

సృష్టిలోని సమస్తమూ తానె అయి మోహమును కలిగించు తల్లి.

తే.గీమోహమది ముంచు నన్ను సందేహమేల?

*సర్వమోహినీ!* మోహపు గర్వమణచి

నన్ను రక్షింపుమమ్మరో నయనిధాన!

నిన్నె నమ్మితిన్ మొరవిను మన్ననమున.

134. ఓం *అష్టాఙ్గయోగిన్యై* నమః

నామ వివరణ.

అణిమాది అష్టాంగ యోగి మన జనని.

కం. అష్టాంగ యోగ నిరతులు

కష్టంబును గనరు నిన్ను గాంచుట కొఱకో

*యష్టాంగయోగినీ!*,నా

కష్టంబులు బాపి కావఁగాఁ దగు నీకున్.

ఓం *దేవ్యై* నమః.

కం. *దేవీ!* నీ కృపచేతను

శ్రీవిష్ణువు దర్శనమగు చిత్తము మురియన్,

నీవే మము గను తల్లివి,

జీవాత్మను బ్రహ్మమందుఁ జేర్చుదు వీవే.,

ఓం *అష్టాఙ్గయోగినీదేవ్యై* నమః

కంశ్రీవాణీ! నా జననీ!

నీవే *యష్టాంగయోగినీదేవీ*! నా

భావనలో విహరింతువు

సేవలనందుచును సతము చిత్తేజముతోన్.

ఓం *అష్టాఙ్గయోగినీదేవ్యై* నమః

తే.గీతెలుపు *మష్టాఙ్గయోగినీదేవి*! నీన్ను

తెలిసి పూజించుటెట్టులన్, దీనరక్ష!

భక్తి భావంబు కలిగియు భక్తులు నిను

చూడలేకుండిరేలనో? చూడనిమ్ము.

135. ఓం *నిర్బీజధ్యానగోచరా*యై నమః

నామ వివరణ.

 (ధ్యానావ స్థిత తద్గ తేన మనసా శ్య o తి యం యోగినః అని భాగవతము) ఏకాగ్రత తో

కూడిన తీవ్రమైన ధ్యాన స్థితి నిర్బీజ ధ్యానము. అట్టి

ధ్యానములోనున్న సాధకులకు గోచరించు జనని.

కం. ప్రగణిత *నిర్బీజ ధ్యా

నగోచరా!* గాంతు నిన్ను, నా ధ్యానమునన్

నిగమాంత సారమీవే,

నగుచున్ గనిపించుమమ్మ నా కన్నులకున్.


జైహింద్.



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.