గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 96 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

సీబ్రహ్మరాణిని గొల్చి భవ్య సత్ కవులయి వాణీపతిగ కీర్తిఁ బరగువారు,

శ్రీలక్ష్మినే గొల్చి శ్రీదేవి కృపచేత ధనికులై పేరొంది ధనపతులుగ

వెలుఁగువారు కలరు, విశ్వేశుఁడొక్కఁడే పార్వతీపతియని ప్రబలు ధాత్రి,

పతిని వీడక నిత్యమతనినే యెదనిల్పి పరవశించెడి నిన్ను బడయనేర

తే.గీదవని కురవకమయిననో యమ్మ! నీదు

యెదను పులకించు భాగ్యము నిందువదన!

నీదుపతిఁగూడి యున్న నిన్ నాదు మదిని

నిలిపి పులకించనిమ్ము నన్ నీరజాక్షి! 96

భావము

ఎందరు కవులు విద్వాంసులు బ్రహ్మదేవుని భార్య యైన సరస్వతిని సేవించుట లేదు? (అనేక మంది సేవించు చున్నారని భావము. పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడు వాణి నా రాణి అని గర్వము గా చెప్పుకొని విషయం ఇక్కడ గమనించ దగినది.) లక్ష్మీ దేవిని సేవించి లక్ష్మీ పతి లేదా ధనపతి అని ఎందరు ప్రసిద్ధి కెక్కలేదు? (ఎంతో మంది ప్రసిద్ధి పొందిరని భావము. ఇతరులు పై విధముగా ప్రసిద్ధి పొందుట ఒక విధముగా లక్ష్మీ సరస్వతుల పాతివ్రత్యమునకు కళంకము అని భావము.) పార్వతీ దేవి స్తన ద్వయ సంపర్కము కేవలం ఒక్క పరమేశ్వరునికి తప్ప ఎవరికిని అచేత నములయిన కురవకము (నీల గోరింట చెట్టు)నకు కూడా అలభ్యము. (లోకములో పార్వతీ పతి అను మాట పరమేశ్వరునికి తప్ప మరెవరికీ లేదని భావము. వాని నా రాణి అని, లక్ష్మీ పతి అని అనిపించుకున్న వాళ్ళు ఉంటే ఉండవచ్చు. పార్వతీ పతి అని ఒక్క పరమేశ్వరుని తప్ప ఎవ్వరినీ అనరు. ఇది పార్వతీ దేవి పాతి వ్రత్య ము అవాఙ్మా నస గోచరము అనుటకు నిదర్శనము. లక్ష్మీ సర స్వతుల కంటే పార్వతీ దేవి పాతి వ్రతము ఉదాత్తమైన ది అని ఫలితార్థము. నీలగోరింట చెట్టునకు దోహద క్రియ స్త్రీల స్తనస్పర్శ అని చెప్పుదురు. కాలములో పుష్పించుటకు చేయు క్రియలు దోహద క్రియలు అని చెప్పుదురు.)

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.