గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2024, సోమవారం

లక్ష్మీసహస్రం. 2వ శ్లోకం. 7 - 12. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 లైశ్రీరామ్.

శ్రీలక్ష్మీసహస్రనామావలిః

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.

రచన.   చింతా రామకృష్ణారావు.

గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 శ్రీలక్ష్మీసహస్రనామావలిః 

శ్లోమహాలక్ష్మీర్మహాకాలీ మహాకన్యా సరస్వతీ

భోగవైభవసంధాత్రీ భక్తానుగ్రహకారిణీ 2

7. ఓం *మహాలక్ష్మ్యై* నమః

నామ వివరణ.

గొప్ప లక్ష్మీదేవి మన అమ్మ. అందరికీ జీవనాధారమయిన తల్లి మన

మహాలక్ష్మితల్లి.

తే.గీనుత *మహాలక్ష్మి!* నినుఁ గొల్చు బ్రతుకు బ్రతుకు.

క్షితిజ మానవ జాతికి బ్రతుకు నీవె,

నీవు లేకున్న బ్రతుకులే లేవు జనని,

నీదు కృపజూపి భక్తుల నాదుకొనుము.

8. ఓం *మహాకాల్యై* నమః

నామ వివరణ.

మిక్కిలి శక్తిస్వరూపిణి అయిన కాలీ స్వరూపము మన తల్లి.  మిక్కిలి నల్లగా

ఉండు తల్లి జనని.

తే.గీశ్రీ *మహాకాలి!* నిలుము నా చిత్తమందు,

నా గృహంబున నీవుండి నన్ను గనుచు

నైహికంబును బరము నాకందఁ జేసి

నన్ను గాపాడుమమ్మరో సన్నుతముగ.

9. ఓం *మహాకన్యా*యై నమః

నామ వివరణ.

మన అమ్మ లక్ష్మీమాత గొప్ప కన్యక. కన్యకలయందు ప్రకాశించు మహాకన్యక

మన అమ్మ.

తే.గీకన మహాకన్య వీవమ్మ కల్పవల్లి!

కొలిచెదన్ *మహా కన్య!* నిన్ గొప్పగాను,

కన్యకామణులందునఁ గలిగి నీవు

వినుత లక్ష్మీప్రదమ్ముగా వెలుగుదువుగ.

10. ఓం *సరస్వత్త్యై* నమః

నామ వివరణ.

మన అమ్మయగు లక్ష్మీ మాతయే సరస్వతీ స్వరూపము.

తే.గీ *సరస్వతీ!* నీకృపనొప్పిదముగ

జీవితము సాగుచుండును సేవిత పద!

హంసవాహినివగుచు నీవమరియుండి

చిత్తమునవెల్గు చుందువే చిన్మయముగ.

11. ఓం *భోగవైభవసంధాత్ర్యై* నమః

నామ వివరణ.

భోగమును వైభవములను మనకు ప్రసాదించుజనని లక్ష్మీమాత.

తే.గీ.  *భోగవైభవ సన్ధాత్రి!* పూజలంది

భోగవైభవములనిమ్ము పూజ్యముగను,

యోగమును గొల్ప ముక్తికై, యోగ్యులకును,

నిన్ను సేవించు యోగమే నిరుపమమిల.

12. ఓం *భక్తానుగ్రహకారిణ్యై* నమః

నామ వివరణ.

భక్తులపై అనుగ్రహ కారణమయిన జనని లక్ష్మీమాత.

శా.  *భక్తానుగ్రహకారిణీ!* జయము, నీ భక్తాళి ధన్యాత్ములై

రక్తిన్ నిన్ మదిలోన నిల్పి సతమున్ బ్రార్థింతురోయమ్మ! నీ

శక్తిన్ మానసమందు నెంచి కృపకై సాంతంబు నిన్ గొల్తురే,

భక్తిన్ శక్తి నిహంబు సత్ పరము నా భాగ్యంబుగాఁ గొల్పుమా.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.