గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2024, సోమవారం

లక్ష్మీసహస్రం. 1వ శ్లోకం. 1 - 6. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్యగానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 

జైశ్రీరామ్.

శ్రీలక్ష్మీసహస్రనామావలిః

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.

రచన.   చింతా రామకృష్ణారావు.


శ్రీలక్ష్మీసహస్రనామావలిః

శ్లోనిత్యాగతానంతనిత్యా నందినీ జనరంజనీ

నిత్యప్రకాశినీ చైవ స్వప్రకాశస్వరూపిణీ 1

1.  ఓం *నిత్యాగతా*యై నమః

నామ వివరణ.

నిత్యమూ వచ్చుచుండెడి తల్లి మన అమ్మ లక్ష్మీ మాత.

శాశ్రీమన్మంగళ భవ్యభాగ్యద రమా! శ్రీ రూప! *నిత్యాగతా!*

ప్రేమోదార గుణాలయా! శుభద! నీవే సృష్టిలో మూలమై

క్షేమంబున్ గలిగింప మాకు సతమున్, శ్రీదేవివై వత్తువే,

నీ మాతృత్వమునెన్న నాకుఁ దరమా, నిన్నున్ సదా కొల్చెదన్.

2. ఓం *అనన్తనిత్యా*యై నమః

నామ వివరణ.

అంతము లేని శాశ్వతమయిన తల్లి రమామాత.

కంపరమాత్ముని నారాయణు

నరయుట నీ కృపను గలుగు నమ్మా! శుభదా!

కరుణ ననంతుని జూపెడి

నిరుపమ జననీ! *యనంత నిత్యా!* కొలుతున్,

3. ఓం *నన్దిన్యై* నమః

నామ వివరణ.

ఆనందమును కలుగఁ జేయు తల్లి మన అమ్మ శ్రీదేవి.

తే.గీవినుత *నన్దినీ!* యానంద మనుభవైక

వేద్యమమ్మరో నీకృపన్ బ్రీతిఁ గనిన,

సతతమానందము న్మదిన్ సదయ నిలిపి,

కాచి రక్షించఁ, గొల్తు నిన్ గమల నయన!

4. ఓం *జనరఞ్జన్యై* నమః

నామ వివరణ.

జనుల మనసులకానందము కలుగజేయు తల్లి మన శ్రీదేవి.

తే.గీదివ్య  *జనరఞ్జనీ!* సన్నిధిగనె నీకు

నన్ను నిలుపుకొనుము కృపన్, సన్నుతముగ

జనుల రంజింప జేసెదన్ ఘనతనెన్ని

పద్యములు వ్రాసి నీపైన భవహరముగ.

5. ఓం *నిత్యప్రకాశిన్యై* నమః

నామ వివరణ.

ఎల్లప్పుడూ ప్రకాశించు తల్లి లక్ష్మీదేవి.

తే.గీజనని *నిత్యప్రకాశినీ!* జయము నీకు,

నీవె నిత్యప్రకాశమై నిండి మదిని

నీదు తేజంబు నాలోన నిండనిమ్ము

జ్ఞానసద్భాగ్య దాయినీ! కరుణఁ గనుమ.

6. ఓం *స్వప్రకాశస్వరూపిణ్యై* నమః

నామ వివరణ.

స్వయముగా ప్రకాశించు స్వరూపము కల తల్లి.

తే.గీ.  *స్వప్రకాశస్వరూపిణీ!* విప్ర పూజ్య!

నీ ప్రకాశమ్ము నాలోన నిలువనిమ్ము,

జ్ఞాన దివ్యప్రకాశమ్ము కలుగఁ జేసి,

కనఁగఁ జేయుము  నీ పతిన్ గాంక్షతీర.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.