జైశ్రీరామ్.
శ్రీయాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారికి అష్టోత్తరశత నామాంచిత పద్యపుష్పార్చన.
1. ఓం నారసింహాయ నమః.
చంపకమాల వృత్త గర్భ సీసము.
అగణిత భవ్యదేహ! శుభుఁడైన మహేశ్వ - ర, శ్రీగణేశులన్! సుశ్రవణుని,
జగమును నిల్పు మా జనని సన్నుత భార - తి, శ్రీరమాసతిన్, దీక్షఁ గొలుతు,
బ్రగణిత రాఘవున్, పరమ పావన సత్క - వి వ్రాతమున్, లసత్ విశ్వ జనుల,
జగతికి వెల్గులౌ సుగుణసాంద్రుల నంచి - త ప్రేమఁ గొల్చెదన్, తలచి మదిని.
గీ. బంధ బహుఛంద సీసముల్ వరలఁ గొలుప - వీర నరసింహ శతకంబు *నారసింహ*.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
1వ సీస గర్భస్థ చంపకమాల వృత్తము.. (న జ భ జ జ జ ర .. యతి 11)
అగణిత భవ్యదేహ! శుభుఁడైన మహేశ్వ - ర, శ్రీగణేశులన్!
జగమును నిల్పు మా జనని సన్నుత భార - తి, శ్రీరమాసతిన్,
బ్రగణిత రాఘవున్, పరమ పావన సత్క - వి భ్రాతలన్, లసత్
జగతికి వెల్గులౌ సుగుణసాంద్రుల నంచి - త ప్రేమఁ గొల్చెదన్,
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా! ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పొగడ శక్యముకాని గొప్ప దేహము కలవాఁడా! వీర
నరసింహ! శతకము అనేక ఛందములు గర్భితములై వరలు గొలుపు నిమిత్తము శుభములను కలిగించు శ్రీ
మహేశ్వరులను, సుశ్రవణుఁడయిన గణపతి దేవులను, సృష్టిని నిలిపెడి నా తల్లి శారదాంబను, మంగళస్వరూపిణియైన
లక్ష్మీదేవిని, సాటి లేనిదైన పార్వతీ మాతను దీక్షతో కొలిచెదను, మిక్కిలి పొగడఁ బడు శ్రీరాముని, గొప్ప పావన మూర్తులైన
సత్కవుల సమూహమును, విశ్వమందలి సజ్జనులను, ఈ లోకమునకే వెలుఁగుగానున్న మంచిగుణములు కలవారిని,
నా మదిలో తలచి తగిన విధముగా ప్రేమతో కొలిచెదను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.