గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2024, సోమవారం

లక్ష్మీసహస్రం. 12వ శ్లోకం. 88 - 97. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

 శ్రీలక్ష్మీసహస్రనామావలిః 

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.

రచన.   చింతా రామకృష్ణారావు.

గానం. శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి. 


శ్లోసంఖ్యా జాతిః క్రియాశక్తిః ప్రకృతిర్మోహినీ మహీ

యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా విభావరీ 12  

88. ఓం *సంఖ్యా*యై నమః

నామ వివరణ.

దేహ విలక్షణమయిన ఆత్మజ్ఞానమే సంఖ్యగా పిలువబడు మన అమ్మ.

తే.గీఆత్మ సుజ్ఞాన రూపిణీయాసురగుణ

బాహ్యునిగఁ జేయుమో *సంఖ్య!* భక్తిఁ గొలుతు,

నీవె సుజ్ఞాన దీప్తివై నిత్యముగను

నిలుమ నామది లోగిలిన్ నిండంకృపను.

89. ఓం *జాతా* యై నమః

నామ వివరణ.

సృష్టికి పూర్వమే జాతమయిన తల్లి  జాత.

తే.గీ.  *జాత!* కననిమ్ము నీలోని భాతి కృపను,

నా తరంబౌనె  నిన్ దెల్ప నయ నిధాన!

ఖ్యాతిఁ గాంచగ నీ దివ్య ఘనత వ్రాసి

లోకులకుదెల్పనిమ్ము నా లోననుండి.

90. ఓం *క్రియాశక్త్యై* నమః

నామ వివరణ.

సృష్టి క్రియా శూన్యమై యుండకుండుటకు జగన్మాత క్రియాశక్తిగా జీవకోటిలో

చైతన్యరూపమున ఉండును, కావుననే తల్లి క్రియా శక్తి.

తే.గీ.    *క్రియాశక్తి!* నిన్ గనుటొప్పు నాకు,

నిన్ను దర్శించుకోనిమ్ము నీదు శక్తి

నాకు ప్రేరకమగునమ్మ నమ్ముమమ్మ.

వందనమ్ములు చేసెదనందుకొమ్మ.

91. ఓం *ప్రకృత్యై* నమః

నామ వివరణ.

అమ్మ ప్రకృతిస్వరూపిణి.ప్రకృతి అమ్మయే.

తే.గీదివ్య సంభాసవగు *ప్రకృతీ!* మదంబ!

నాదు ప్రకృతిలో సుగుణముల్ మోదమలర

నీవె దయతోడఁ జేర్చుమా నిరుపమాన!

వందనమ్ములు చేసెద వనజ నయన!

92. ఓం *మోహిన్యై* నమః

నామ వివరణ.

శ్రీమన్నారాయణుని మోహింపఁజేయు జనని మోహిని,

తే.గీ*మోహినీ*! లోకమందున మోహమేల

సృష్టి చేయఁబడెనొ కాని స్పష్టమమ్మ

మోహమున మద మత్సరాల్ పూని మతిని

పాడుచేయుటన్ నినుఁ గనన్ వలనుపడదు.

93. ఓం *మహ్యై* నమః

నామ వివరణ.

అమ్మ మహిగా సుప్రసిద్ధ.గోరూపమునను, భూ రూపమునను గల తల్లి మహి.

తే.గీమహిమలకు నిలయంబైన *మహి!* నుతింపఁ

జాలనమ్మరో నిన్ను, నీ మ్రోల నిలిచి

సంతసంబును పొందెదన్ జక్కనయిన

నీదు సద్రూపమున్ గాంచినిఖిలవేద్య!

94. ఓం *యజ్ఞవిద్యా*యై నమః

నామ వివరణ.

జ్ఞాన మోక్షప్రదమయిన యజ్ఞములకు సంబంధించిన విద్య మన అమ్మ,

తే.గీ. *యజ్ఞవిద్యా!* ప్రభాపూర్ణ యజ్ఞ మహిమ

నరయఁజేసి నిన్ గనఁ జేసిపరమపథము

నొందు మార్గము సూపుమా! సుందరముగ

నీకు ఋణపడియుందును నిన్ నుతింతు.

95. ఓం *మహావిద్యా*యై నమః

నామ వివరణ.

మహా విద్యా స్వరూపిణి మన అమ్మ.

తే.గీ *మహావిద్య!* పరము నాకోర్పుతోడ

ఘన మహావిద్యలంద నేన్మనము పెట్టి

నేర్పుమోయమ్మ పరమంద నేర్చుకొందు,

నిన్నుఁ జేరగ నాకగు నేర్పుతోడ.

96 ఓం *గుహ్యవిద్యా* యై నమః

నామ వివరణ.

అతి రహస్యమయిన గుహ్యమయిన విద్య ఏది కలదో గుహ్యవిద్య అమ్మయే.

తే.గీ*గుహ్యవిద్యా!* మహామాత! కూర్మితోడ

గుహ్యమైనట్టి సద్విద్య కోరి నేర్తు,

చెప్పుమోయమ్మ నాకది గొప్పగాను,

నిన్ను చేరంగ నాకగున్ నేర్చుకొనిన.

97. ఓం *విభావర్యై* నమః

నామ వివరణ.

పసుపు మన జననియ్. రాత్రి అను గుణము జనని విభావరియే.

తే.గీకనగ లేను *విభావరీ!* గాఢ తమస

మలముకొన్నట్టి బుద్ధిచే నరసి నిన్ను,

నాదు తమసమ్ము బాపుచున్ నీదు తేజ

మును గనంజేయుమమ్మరో! ముచ్చటగను.

జైహింద్.



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.