గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2024, సోమవారం

లక్ష్మీసహస్రం. 9వ శ్లోకం. 62 - 69. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

 శ్రీలక్ష్మీసహస్రనామావలిః 

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.

రచన.   చింతా రామకృష్ణారావు.

గానం. శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.


శ్లోప్రత్యంగిరా ధరావేలా లోకమాతా హరిప్రియా

పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యాప్రదాయినీ 9

62. ఓం *ప్రత్యఙ్గిరా*యై నమః

నామ వివరణ.

హిరణ్య కశ్యప వధానంతరము కూడా నరసింహుని కోపము శాంతించనందున

శివుఁడు శరభేశ్వరుఁడుగా యుద్ధము చేయుటకు రాగా అమ్మవారు, శూలిని,

మహాప్రత్యంగిర, అను రెండు రూపములలో ప్రభవించి శరభేశ్వరునకు రెండు

రెక్కలుగా మారెను. ఆమెను ప్రప్రథమముగా చూచవారు ప్రత్యంగుడు

అంగిరసుడు ను. కావున తల్లికి ప్రత్యంగిరస అను నామము కలిగెను.

ప్రత్యంగిరా అనగా ఎదురుతిరిగే దేవత అని కూడా అర్థమున్నందున అమ్మ

ప్రత్యంగిరస సార్థక నామధేయ యినది.

కంప్రత్యఙ్గుడు, నంగిరసుఁడు

*ప్రత్యఙ్గిర!* కనుటను నిను ప్రప్రథమముగా

ప్రత్యఙ్గిరగా నిలిచితి

వత్యంతశుభాళినిడ మహాత్ములకెపుడున్.

63. ఓం *ధరా*యై నమః

నామ వివరణ.

సమస్థమును  ధరించునది కావున ధరా మన జనని.

కంపరమాద్భుత చిత్రంబిది,

ధరియింతువు నీవఖిలము,  *ధర!*కనుమన్నన్

కరుణింపవప్పుడప్పుడు

చరణంబులు పట్టితి నను సదయ కను, రమా!

64. ఓం *వేలా*యై నమః

నామ వివరణ.

కాలస్వరూపిణి అమ్మ, అందువలననే ఆమె వేళ అయినది.

కం.  *వేలా!* నన్నున్ గనుగొన

వేలన్? నా పయిని కృప యదేలఁ గలుఁగదో?

వేళ గతించుచునుండెను,

జాలిని గని ముక్తి నీయ జాలవొ? జననీ!

65. ఓం *లోకమాత్రే* నమః

నామ వివరణ.

లోకములన్నింటికినీ తల్లి మన లోకమాత.

తే.గీ*లోకమాతా! * దయోపేత! శోక తప్త

జగతిలో బాధలన్ దీర్చి ప్రగణితముగ

మంచి బ్రతు కీయ రావమ్మ! మంచిఁ గొలిపి,

సంచితము వాపి రక్షించు చక్కగాను.

66. ఓం *హరిప్రియా*యై నమః

నామ వివరణ.

విష్ణుమూర్తియొక్క ప్రియురాలు హరిప్రియ.

పంచచామరము.

*హరిప్రియా!* నమోస్తు తే, మహాత్ములైన భక్తులన్,

నిరంతరంబు కావుమమ్మ, నిన్ను నమ్మి యుండి నీ

దరిన్ శుభాళి కల్గునంచు తత్ శుభాళిఁ గోరుచున్

పరంబునందవేడువారి పాలిటన్ కృపాబ్ధివై.

67. ఓం *పార్వత్యై* నమః

నామ వివరణ.

పర్వతరాజ పుత్రి మన పార్వతీ మాత.

తే.గీ.  *పార్వతీ*మాత నీ కృపన్ బ్రతుకుచున్న

నన్ను దయఁజూచి పెంచిన సన్నుత మతి!

జన్మ సార్థకంబగునట్లు సన్మనోజ్ఞ

ముక్తి మార్గసుదర్శివై భక్తినిమ్ము.

68. ఓం *పరమాదేవ్యై* నమః.

కంకృపఁ గను *పరమా! దేవీ! *

యపవిత్రము కాను నే నహంబుగ నీవే

సుపవిత్రతఁ గొలుపగను

నుపమ! మదిని నిలిచితేని యొప్పుగ, జననీ!

ఓం పరమాయై నమః.

నామ వివరణ.

ఉత్కృష్టమైన, ప్రథానమైన,ఆద్ద్యయైన పరమేశ్వరస్వరూపము పరమ.

కం*పరమా!* నినువివరింపగ

తరమా  కవినైన గాని, దాక్షిణ్యముతో

నిరతము లోకము లేలుచు

పరిపరివిధములను కాచి వరలింతువుగా.

ఓం *దేవ్యై* నమః.

కం.  *దేవీ!* నీ సౌభాగ్యము

భావింపగ సాధ్యమగునె? భాగ్యద జననీ!

నీవేగా నా దైవము,

రావమ్మా నన్ను కావ రసరమ్య గుణా!

69. ఓం *బ్రహ్మవిద్యాప్రదాయిన్యై* నమః

నామ వివరణ.

బ్రహ్మవిద్యను ప్రసాదించు తల్లి బ్రహ్మవిద్యాప్రదాయిని.

తే.గీ*బ్రహ్మవిద్యాప్రదాయినీ!* బ్రహ్మమెఱుగ,

నిన్నె బ్రహ్మంబుగా నేను నిత్య మెన్ని

కొలుచుచుందును, నీలోన కలవనుందు

నాకు బ్రహ్మైక్యసిద్ధిని నయత నిమ్ము.

జైహింద్.


 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.