జైశ్రీరామ్.
ఒక నానుడి – మూడు శతాబ్దాల పరిణామం
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ – అని, నానుడిగా మారిన ఈ పద్యపాదం, విన్నప్పుడల్లా మొదటగా మన స్మృతిపథంలో మెదిలేది శ్రీకృష్ణదేవరాయలు, ఆ రాజకవిచే రచించబడిన ప్రసిద్ధ కావ్యం, ‘ఆముక్తమాల్యద’ లోని ఈ క్రింది పద్యం:
ఆ.వె. తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి,
దేశభాషలందు తెలుగు లెస్స.
తెలుగు వల్లభుడైన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు, శ్రీకృష్ణదేవరాయలకు కలలో కనుపించి, తెలుగు భాషలో తనకు ప్రియమగునట్లు ఒక ప్రబంధాన్ని రచించమని కోరి, అంతలోనే, సంస్కృతభాషలో గొప్ప పాండిత్యాన్ని కలిగి వుండి, మదాలసచరిత్రాది ప్రబంధాలను రచించిన వాడైయుండిన కృష్ణదేవరాయలు, ఇప్పుడు వ్రాయబోయే ఈ గ్రంథాన్ని తెలుగు భాషలోనే ఎందుకు వ్రాయాలి? అన్న ప్రశ్న వేసుకుని, దానికి సమాధానంగానూ, తనకుతానుగా సందేహనివృత్తిచేసినట్లుగానూ, చెప్పిన సందర్భంలోనిది ఈ పద్యం.
అయితే, ఆముక్తమాల్యదలోని ఈ పద్యానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పద్యం రాయల కలం (గంటం) నుంచి ఒక్కసారిగా జాలువారింది కాదు. ఇలా పూర్తికావడానికి ముందు ఈ పద్యానికి దాదాపుగా మూడు శతాబ్దాల చరిత్ర వుందనీ, అంత కాలం ఈ పద్యం పూర్ణత్వం సంతరించుకోని ఒక చిత్రంలా వుండి తన ప్రయాణాన్ని సాగిస్తూనే వుండినదనీ తెలుసుకున్నపుడు ఒక ఆసక్తికరమైన అనుభూతి కలుగుతుంది.
మూలఘటిక కేతన రచించిన ‘ఆంధ్ర భాషాభూషణము’అనే తెలుగు వ్యాకరణ గ్రంథంలో ఈ పద్యం పుట్టుక, (అక్కడినుంచి దాని ప్రయాణం) ఇలా మొదలయింది:
ఆ.వె. తల్లి సంస్కృతంబె యెల్లభాషలకును
దానివలన గొంత గానబడియె
గొంత తాన కలిగె నంతయు నేకమై
తెనుగుబాస నాగ వినుతి కెక్కె.
మూలఘటిక కేతన క్రీ.శ.13వ శతాబ్దంవాడు. తిక్కన సమకాలికుడు, శిష్యుడు కూడా. సంస్కృతభాషలో దండి మహాకవి రచించిన ‘దశకుమారచరితా’న్ని తెలుగులోకి అంత సమర్థవంతంగానూ అనువదించి ‘అభినవదండి’గా పేరుపొందాడు. తెలుగుభాషకు తెలుగులో మొదటగా వ్యాకరణాన్ని ‘ఆంధ్ర భాషాభూషణము’ అనే పేరుతో రచించించాడు. అందులో పదునాల్గవది పై పద్యం.
ఆ తరువాత దాదాపు ఒక వందేళ్ళు గడిచిపోయాయి. కాకతీయుల పరిపాలన సాగుతున్న రోజులు వచ్చాయి. ‘ఆంధ్ర భాషాభూషణము’లోని ఈ పద్యం మొదటి పాదం అర్థాన్ని స్ఫూర్తిగా తీసుకుని, క్రీ.శ.14వ శతాబ్దం కాకతీయుల కాలపు కవి అయిన వినుకొండ వల్లభరాయుడు, తన ‘క్రీడాభిరామం’లో ఈ క్రింది పద్యంగా రూపాంతరం చెందించాడు:
ఆ.వె. జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశ భాషలందు తెలుగు లెస్స,
జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
ఈ పద్యంతో, కేతన ముందుకుతెచ్చి అసంపూర్తిగా వదిలేసిన ఒక ప్రతిపాదనలోని మిగతా సగాన్ని పూరించి, ఆ ప్రతిపాదనకి పూర్ణత్వాన్ని తెచ్చినట్లుగా చేశాడు వల్లభరాయుడు. అలా అన్నానంటే, కేతన పద్యం అసంపూర్తి అని నా ఉద్దేశ్యం కాదు. కేతన దృష్టి భాషలోని పదాల నిర్మాణాన్ని గురించి విశదీకరించడం మాత్రమే. వల్లభరాయడి దృష్టి వ్యాకరణానికి సంబంధించినది కాదు. తన భాష గొప్పదనాన్ని చాటిచెప్పుకునే ప్రయత్నం. ఈ పద్యాన్ని బట్టి చూస్తే, ‘క్రీడాభిరామం’ రచనా కాలానికే ‘దేశబాషలందు తెలుగు లెస్స’ అనే నానుడి లోకాభిప్రాయమై వుండి, బహుళ ప్రచారంలో కూడా వుండివుండవచ్చుననీ, ఆ జనాభిప్రాయమే వల్లభరాయుని రచన ద్వారా కావ్యాంతర్గమై స్థిరపడిపోయిందనీ అనుకోవడానికి వీలుంది.
మరి ఈ నానుడికి సృష్టికర్తగా కృష్ణదేవరాయలు ఎందుకు ప్రసిద్ధుడైనట్లు? తెలుగు సాహిత్యంలో ‘క్రీడాభిరామం’ మీద జరిగినన్ని తర్జన భర్జనలు మరే కావ్యం గురించి జరగలేదంటే అతిశయోక్తి కాదు. రచనా ప్రక్రియలలో ఆధునిక దృక్పథమయిన సమకాలీన జీవన చిత్రణను తెలుగులో ‘క్రీడాభిరామం’ కావ్యం పరిపూర్ణంగా పోషించి (క్రీ.శ.14వ శతాబ్దపు తొలినాళ్ళలో వరంగల్లుకోటలో ఒక పగలు, వివిధ వర్గాల వేషభాషల మరియు జన జీవన చిత్రణ చేయడం ద్వారా), ప్రాచీన సాహిత్యంలో ఈ పంథాలో సాగిన రచనలలో దానికదే సాటిగా నిలిచిపోయింది. అయితే, ఇదంతా ఇప్పటి మాట. 20వ శతాబ్దపు తొలి దశకంలో (1909లో) మానవల్లి రామకృష్ణకవి తమ ‘విస్మృత కవులు’లో భాగంగా ఈ కావ్యాన్ని తొలి సారిగా ముద్రించి సాహితీ లోకానికి పరిచయం చేసిన దాకా ఈ కావ్యాన్ని గురించి తెలిసినవారు ఎంతమంది వుండేవారో ఇప్పుడు చెప్పడం కష్టమే. ఆ తెలిసిన కొంతమంది పండితుల దృష్టిలో కూడా ‘క్రీడాభిరామం’ ఒక చెడ్డ కావ్యం. అందులోని కొన్ని అశ్లీల పదజాలంతోటివైన పద్యాలు, ఆ పద్యాలలోని వర్ణనలు ఆ కావ్యాన్ని అందరికీ పఠనయోగ్యం కానిదిగా మార్చేశాయి. సాహితీలోకం నుంచి ‘క్రీడాభిరామం’ కావ్యాన్ని దూరం చేశాయి. అదలా వుండగా, ఒకవైపు ఇది వినుకొండ వల్లభరాయని కృతిగా ప్రసిద్ధమై వుండగా కూడా, ఈ కావ్య కర్తృత్వాన్ని గురించిన (అనవసర) సందేహాన్ని పుట్టించి, ఈ కావ్య కర్తృత్వాన్ని శ్రీనాథునికి కట్టబెట్టడానికి వేటూరి ప్రభాకరశాస్త్రి (1928లో) చేసిన ప్రయత్నం వలన కూడా ఈ కావ్యాన్ని రచించినదెవరన్నది, అప్పటి పండితలోకంలో, ఒక ఎడ తెగని సమస్యగా మిగిలిపోయేట్టు చేసింది.
‘ఆముక్తమాల్యద’కు ఈ సమస్యలేమీ లేవు. అది మొదటినుంచీ అందరికీ తెలిసిన ప్రసిద్ధ కావ్యమే. క్రీ.శ.19వ శతాబ్దపు మధ్య సంవత్సరాల నుంచీ (1869లో ‘వావిళ్ళ’ వారి సంస్థ నుంచి మొదటి ప్రచురణ జరిగింది-టీకతో సహా) ఈ కావ్యం ప్రచురించబడి పాఠకులకు అందుబాటులో వుంది. ఆ కారణంగా, అందులోని పద్యాంతర్గతమై కనుపించిన ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అనే పద్యపాదం శ్రీకృష్ణదేవరాయలచే సృష్టించబడినదిగా గుర్తించబడి, ప్రచారంలోకి తేబడింది. అదేకాకుండా, శ్రీకృష్ణదేవరాయల ప్రభుత మీద ప్రజలకు కుదురుకున్న ప్రియత్వం, చిరకాలంగా ప్రచారంలో వున్న గాథల వలన ఆయన మీద ప్రజలలో ఏర్పడిన భక్తిభావం కూడా, ఆ నానుడికి ఆ ప్రభువునే అర్హునిగా చేయడంలో అసంబద్ధత ఏదీ లేనట్లుగా చేశాయి.
అయితే, కర్తృత్వానికి సంబంధించిన సందేహాలన్నీ సద్దుమణిగి, ‘క్రీడాభిరామం’ వినుకొండ వల్లభరాయ కృతంగానే అందరిచేత ఆమోదించబడి, సామాన్య పాఠకలోకానికి కూడా ఆ కావ్యం చదవడానికి అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా, ఈ నానుడి ఇంకా శ్రీకృష్ణదేవరాయనికే ఆపాదించబడుతూ కనబడడానికి ఏమిటి కారణమో అర్థం కాదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.