జైశ్రీరామ్ .
శ్రీ లలితా మధురాక్కరలు - కవితా వైభవం.
శ్రీ కవితా ప్రసాద్ జగమెఱిగిన సంప్రదాయ కవి. ఆలా అని వారి కవిత్వం కేవలం సంప్రదాయ మార్గంలోనే సాగుతుం దనుకోవడానికి లేదు. వీరు వచనకవితలలోను, సాంఘికనేపథ్యం గల కథారచనలోను ఇంకా యితర ప్రక్రియలలోను గూడా సిద్ధహస్తులే. అయితే వీరు స్పృశించే ప్రతి ప్రక్రియ లోను ఆర్ష సాంప్రదాయాభిమానం కొట్టవచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. నేటి సమాజంలోని విపరీత పోకడల పట్ల వీరికి గల వైముఖ్యాన్ని చాటుతూ ఉంటాయవి. అటువంటి పోకడలను నిస్సంకోచంగా ఉతికి ఆరేయడం కనిపిస్తుంది. సాంఘిక వైపరీత్యాలను ఎండగట్టే కవికి ముఖ్యంగా కావలసింది నిర్మొహమాటం, నిర్భీతి, సత్సంప్రదాయాల పట్ల పరిపూర్ణావగాహన. వీరిలో ఆ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
కవితాప్రసాదు గారు సంస్కృతాంధ్రాలలో పద ప్రయోగంలో పట్టు తెలిసినవారు. అంతేకాదు అచ్చతెనుగులో కూడా అందెవేసిన చేయి. అచ్చతెనుగు పదాలతో ధార కుంటువడకుండా సొగసుగా సాగుతుంది వీరి పద్యరచన. అలాగే వీరి రచనలకు చేసే నామకరణం కూడా ఒక ప్రత్యేకతతో అలరారుతుంది. ఉదాహరణకు పచన కవితలు, ప్రవచన కవితా కవితలు, మాట వెలదులు ఇలా వైవిధ్యభరితంగా ఉంటాయి ఆ నామకరణాలు.
ప్రస్తుత విషయానికి వస్తే కవితా ప్రసాదు గారు పరమాత్మ పట్ల అచంచల విశ్వాసి. మీదుమిక్కిలి పరాశక్తి భక్తులు ఉపాసకులు కూడా. వారితో చేసే సంభాషణలలో అమ్మవారిపై వీరికి గల గురి ప్రస్ఫుటంగా ప్రకటిత మవుతూ ఉంటుంది. అటువంటి అచంచలమైన విశ్వాసంతో అమ్మ వారికి ఆత్మసమర్పణగా వీరు చేసిన కృతియే యీ "శ్రీ లలితా మధురాక్కరలు". లలితాపరాభట్టారిక మీద మధురాక్కర ఛందస్సులో సాగిన స్తుతి మాల యీ కృతి. లలిత అన్న నామమే అత్యంత మధురమై భక్తుని మనస్సును అమ్మవారి పాదాల వైపు మళ్లేలా చేస్తుంది. అటువంటి మధురమైన నామాన్ని మకుటంగా ఉంచి మధురాక్కరలలో చేయబడిన యీ కృతి మరింకెంత మధురంగా ఉంటుందో వేరే చెప్పనక్కర లేదు. ఇది అమరభాషా పదాలు అమ్మ బాస పల్కులు, గుడము చక్కెర, కలబోసిన కవితా వంటకం. ఆస్వదనైకవేద్య మీ పద్య నైవేద్యము.
శతకంలో అమ్మవారి పరాశక్తి తత్త్వాన్ని చాటి చెప్పే సుందరమైన సంస్కృత సమాసాలు, అందమైన అచ్చతెనుగు పదబంధాలు పడుగూపేకల్లా కలిసిపోయి పఠితకు మంచి ఆనందాన్ని కలిగిస్తాయి. తెనుగు పద్య సాహిత్యంలో మధురాక్కరలకు యెందుచేతనో సముచిత స్థానం లభించ లేదని చెప్పవచ్చును. లబ్ధ ప్రతిష్ఠు లైన కొందఱు కవులు మాత్రమే అడపా తడపా యీ ఛందస్సును వాడినట్లు కనిపిస్తుంది. సమర్ధుడైన కవి మనసుపెట్టి అందమైన పదగుంఫనతో, సుందరమైన భావపరంపరతో పద్యరచన చేస్తే మధురాక్కరలు నిజంగానే సుమధురంగా ఉంటాయి అని కవితాప్రసాదు గారు నిరూపించారు యీ శతకరచన ద్వారా. వా రన్నట్లు మధురాక్కరలలో పూర్తి కృతి తెలుగులో బహుశా ఇదే కావచ్చును. అందుకు కవి యెంతయు అభినందనీయులు.
ముందుగా, మీరిచ్చిన శిక్షణ, విద్యాభిక్ష మాత్రమే నేటి కీ రీతిగా ఫలించాయి అని తండ్రిగారికి జోత లర్పించి వారి పట్ల తనకు గల అపారగౌరవాదరాభిమానాలను చాటుకొన్నారు. "అమ్మ (పరాత్పర) నేర్పిన అలవడితోను పలుకులతోను కొంత వేడుకొంటూను కొంత వేడుకగాను మాట్లాడుకొంటూనే ఉంటాను. ఆమె విని చూపులు నాపై నిలిపి నాతో మాట్లాడే వరకు" అని అవతారికలో చెప్పుకొన్నట్లుగానే అదే ఒరవడిలో సాగుతుంది శతకమంతా. శతకాన్ని పరిశీలిస్తే ప్రతి పద్యంలోను యేదో ఒక విశేషం పదాల పోహళింపులోనో భావ ప్రకటన శైలిలోనో అచ్చ తెనుగు నుడికారంలోనో సువిశేష పదబంధంలోనో కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. ప్రతి పద్యమూ కవిత్వ రసగుళికయే. ఇక్కడ కొన్ని విశేషాలను మాత్రం స్థాలీపులాక న్యాయంగా స్పృశిస్తాను .
ఇందులో మొదటి ముప్పది పద్యాలూ పరమ విశేషములు. పరదేవతామంత్ర బీజాక్షరాలను పద్యారంభాక్షరాలుగా నిల్పి రచింపబడ్డవి. పదవ పద్యం నుంచి ఇరుది నాలుగు వరకు గల పద్యాలు పంచదశి బీజాలతో ఉంటే రెండునుంచి ఇరవై తొమ్మిది వరకు షోడశి అష్టావింశద్బీజాక్షరాలతో ప్రారంభించబడ్డాయి. మొదటి పద్యం లోని ప్రారంభాక్షరం ముప్పదవ పద్యంలోని ద్వితీయ తృతీయాక్షరాలను వీటికి చేరిస్తే అవి మహా షోడశి ఔతుంది.
యిరువదితొమ్మిది పద్యాల వరకు అమ్మవారి బీజాక్షరాలైన ఓం, శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌః లను, వాటికి సంబంధించిన వర్ణాలను పద్యాదులలో పొదిగి ఆ పద్యాలను బీజాక్షర మంత్రగర్భితాలుగా తీర్చి దిద్దడం, ముప్పదియవ పద్యంలో తే నమః అని అమ్మకు వందన మొనరించడం కవి గారి అసామాన్యమైన ప్రతిభకు, భాషపై వారికి గల అద్భుతమైన పట్టుకు నిదర్శనం. వీటిలో ప్రతి పద్యం లోను ప్రధానంగా కవి తన అవిద్యను దూరం చేయమని , పాప పంకిలాన్ని కడిగివేయమని , దయాదృష్టితో వీక్షించి తన దగ్గఱకు జేర్చుకోమని అమ్మను శరణాగతి చేస్తారు .ఈ పద్యాలను పారాయణ యోగ్యాలని బ్రహ్మశ్రీ సామవేదం వారు బ్రహ్మశ్రీ కాశీభొట్ల వారు తమ అభిప్రాయంలో వెలిబుచ్చినట్లు అమ్మవారి అనుగ్రహానికి తప్పక పాత్రులవుతారు. ఆ పద్యపంక్తితోనే లలితాపరాభట్టారిక పరవశించి పోయియుంటుంది. తన చూపును వెంటనే కవి గారిపైకి మఱింత ప్రసరింపజేసే ఉంటుంది. బహుశా ఇటువంటి ప్రయోగం ప్రత్యేకించి శతకసాహిత్యంలో మరెక్కడా ఉండి ఉండదు. సంస్కృతంలోని కల్యాణ వృష్టి స్తవం ( పంచదశీ స్తోత్రం) ఈ ప్రయోగానికి ఒరవడిగా తోస్తోంది. లలితాసహస్రనామాలలోని పలు నామాలను శతకంలో అందంగా మధురాక్కర ఛందంలో యిమడ్చగలగడం ఒక కళ. సామాన్యమైన సంగతి కాదు. ఆ కళలో తన సమర్థతను నిరూపించుకొన్నారు కవిప్రసాదు గారు.
ఇప్పుడు కొన్ని పద్యాలలోని సొబగులను ఆస్వాదిద్దాం.
తపస్సు చేసుకుందా మంటే ఇంట్లో పెళ్ళాంపిల్లలు, అడవిలో చేద్దామంటే యింద్రుడు పంపిన మేనకాదులు సాగనీయడం లేదు. 'పెద్ద చావొచ్చి పడిందమ్మా' అని అందమైన తెనుగు పలుకుబడిని యిమిడ్చి నవ్వొచ్చే భావంతో వ్రాశారు ఒక పద్యాన్ని(32). ఐహికము అంటే భయపడడం యెందుకో తరచి చూస్తే అది నీ బీజాక్షర సముదాయమే (ఇందులో ఉన్న ఐ(ం),హ,క అనేవి) కదా తల్లీ (34) అని అద్భుతంగా అనడం ఐహికంలోనూ అమ్మవారినే దర్శించటం కవికే చెల్లింది. సృష్టి సమస్తం ప్రళయపయోధిలో మునిగినప్పుడు నీ బిడ్డడైన వటపత్రశాయిని నువ్వే సాకేవు కదా. మరి నేనేమో ఆ శిశువును కాదు సంసార విషధి లో పడ్డ కుఱ్ఱగాడిని. యీద లేక పోతున్న వెఱ్ఱివాడిని. కనీసం ఆ ప్రవాహాన్నైనా నా యీతకు వాలుగా మలచవమ్మా (36) అంటారు. 'విషధి' పద ప్రయోగం ఇక్కడ శ్లేషాత్మకంగా అలరారింది. అంతేకాని ఆ సముద్రంలోంచి నన్ను బయటపడేయమని మాత్రం కోరలేదు. అల్పసంతోషి. ఏ తల్లి మనసు ద్రవించి పోదూ బిడ్డ యిలా అడుగుతూంటే? జగజ్జనని యెలా ఉండగలదు అటు చూడకుండా? ఈ పద్యం చదువుతూంటేనే మన మనోనేత్రానికి సంసారసాగరంలో యీదలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న మనవంటి ఒక అర్భకుడు కనిపిస్తాడు .
త్వక్స్థ ఋక్స్థ త్యక్స్థ ద్వాక్స్థ ... దుష్కర ప్రాసతో పద్యాన్ని నడిపి అమ్మవారి మనస్సును గెల్చుకున్నారు(38). అమ్మా నన్ను లెక్కచేయడం లేదు నువ్వు. నా మనవులను వినడం లేదు. మ్రొక్కినప్పుడు వరమీయని వేల్పును విడచిపెట్టేయాలని మా సుమతీ కర్త చెప్పారు. మరి నిన్ను కాదని యింకో వేల్పును పట్టుకొందామంటే యెవరూ కనపడ్డం లేదు అంటారు చమత్కారంగా(41). అంటే ఆవిడ కన్నా వేరే మరొక దైవమే లేదు అని నిర్ద్వంద్వముగా ఉద్ఘాటించా రన్నమాట .
చిలువ తాలుపు కలికి(నాగభూషణుని భార్య పార్వతి), పెంజిలువ పానుపు వేలుపు పొలఁతి(శేషసాయికి సతి లక్ష్మి), బొడ్డుతమ్మి యలరు పుట్టువ(బ్రహ్మ గారి భార్య సరస్వతి) - మడతులకుం దొలుదొలుతటి యమ్మ(వీరందఱి కన్న ముందుగానే ఉన్న అమ్మ)! అమ్మవారికి మంచి మన్నికైన సంబోధన(43). తరువాతి పద్యంలో (44) ఎంత దురపిల్లుతున్నా దయ చూపవు. నీ తొత్తరికాన్ని ముగిస్తాను అంటూ చిన్నపిల్లాడిలా బెదిరిస్తాడు కవి. చూడు ఆవులు చెవులు నిక్కపొడుచుకొని నావైపే చూస్తున్నాయి అంటారు. మంత్ర దీక్షాపరులు కారణాంతారలవలన దీక్ష విడిచిపెట్టటానికి ఆ మంత్రాన్ని ఆవు చెవిలో చెప్పి విడిచేయటం సంప్రదాయము. అదీ కవి ఈ గోకర్ణ ప్రస్తావనకు కారణం. అఖిలాండకోటి బ్రహ్మాండాలకు తల్లీ! యెక్కడో ఓ మూల నున్న నా పిలుపు నీ కెలా వినిపిస్తుందంటావేమో యెంతదూరంలోనున్నా దూడ బాధతో అరిస్తే తల్లి గోవుకు వినపడదా అని నిలదీస్తారు అమ్మని (45). కలిలో దుర్మార్గుడు కాకపోతే సన్మార్గుడి క్రిందే లెక్క. అంటూ అహీనము అనే పదాన్ని కవులు శ్రేష్ఠము అనే అర్థంలో వాడటాన్ని ఉదాహరణగా చూపి సమర్థించుకోవటం ఒక గొప్ప చమత్కారం. అంతేకాదు నీకు వేవేల కన్నులున్నాయి (సహస్రాక్షివి) గదా వాటితో నిరంతర పర్యవేక్షణము చేస్తూ ఉంటావు కదా మృగాక్షి వలె విశ్వమంతటినీ. ఈరేడు లోకాల్లో యే ఒక్క ప్రాణైనా నీ కంట బడకుండా ఉంటుందా? నా బాధను చూడు చేదుకో అంటారు తల్లిని(58).
చేప పూపలు అమ్మవారి కన్నుగవ. కైతూడులు తల్లి హస్తయుగము. పూప తమ్మిపూయజ్జలు మాత శ్రీపాదద్వయము. మనోహరమైన అచ్చతెనుగు పదాలలో అమ్మ అభయాంగాల వర్ణన(52). అగ్రజన్ములమని గొప్పవారమని పలువురు విఱ్ఱవీగే యీ కాలంలో నేను ద్విజుడనే కానీ విప్రుడను కాను బ్రాహ్మణబ్రువుడను అని తనగురించి చెప్పుకొంటూ చిదయనచారము (ముక్తిమార్గ సంచారము) ననుగ్రహింపమని తల్లిని ఆర్తితో వేడుకొనడం కవిగారి వినయమునకు, నిగర్వమునకు నిదర్శనము (54). నిన్ను నుతింపని నరుడు మొసలితో సమానం, నిన్ను నుతిస్తూంటే వినలేని వాడు పాముతో సమానం, నిన్ను చూడలేని మనిషి కళ్ళున్నా చూడలేని కురుపతి వంటి అంధుడు అని నిర్మొహమాటంగా చెపుతారు. మొసలికి నాలుక ఉండదు. పాముకు చెవులుండవు. ఆ అవయవాలున్నా మనిషికి లేనట్లే నని కవి భావం (59). నాకు యిలాటి పుట్టుక నిచ్చావేమిటో యేమీ అచ్చిరాలేదమ్మా ('అచ్చిరావడం' మరో అందమైన తెనుగు నుడికారం) యింక మహానిద్రని యిచ్చేశావనుకో యీ జీవుడు బయటకు వచ్చి నీ అఖండ సచ్చిదానంద ప్రాప్తిని అందుకొంటాడు అంటారు (63). ఐహిక వైముఖ్యత ప్రబలమైతేనే కాని యిటువంటి వేడుకోలు చేయలేడు భక్తుడు. కవి ఆధ్యాత్మిక పరిణతికి యిది మచ్చుతునక.
నీకు సాకారార్చన చేద్దామంటే నా ముఖం ఎలా చూపించను తల్లీ? ఎందుకంటే నేనెన్ని చెడు ఆలోచనలను చేశానో యెన్ని తప్పుడు మాటలు మాట్లాడేనో యెన్నెన్ని దుండగాలను చేశానో. అందుచేత నీకు నిరాకారార్చననే చేస్తాను అంటారు చమత్కారంగా (66). ఇవాళో రేపో యీ జీవుడు పైకి పోక తప్పదు. చేసిన పాపాలు నిజం కాక తప్పదు. కాస్త యముడితో చెప్పమ్మా వీడు తాను చేసిన కర్మల ఫలితాన్ని నాకు సమర్పించాడు అని తన కర్మఫలసమర్పణను గుర్తు చేస్తారు పరదేవతకి (69). కర్మఫలత్యాగం చేసిన వాడికి నరకం స్వర్గం రెండూ ఉండకూడదు కదా! సరాసరి మణిద్వీపమే! సీతమ్మ వారిని పట్టుకొని విరాధుడు భూమిలో పాతిపెట్టబడ్డాడు. ఆమెనే చెరబట్టి రావణుడు మాడిమసై పోయాడు. నేటి కాలంలో మహిళలపైన అకృత్యాలను జరిపే నీచులు మట్టైపోయేలా నీ మహిమ చూపించు తల్లీ అని తన సామాజిక స్పృహను చాటుకొన్నారు మరొకచోట (71).
కష్టాలన్నీ మంచివాళ్ళకే వస్తాయి అని లోకోక్తి కదా నాకూ చాలా కష్టాలు వచ్చాయి నేను కూడా మంచివాణ్ణేనేమో! మరి ఆ మంచితనానికి నీ దయకు నోచుకునే అర్హత లేదంటావా చెప్పు మాతా అని గడుసుగా మాట్లాడుతారు (77). నేను పైకి సోహం అంటానే కానీ లోపల ఆ భావన నిజంగా కుదురుకోక పొతే జ్ఞానం యెలా కలుగుతుంది? నా యీ శరీరంలోని జీవాత్మ హంసగా మారి అద్వైత సుధాప్రవాహంలో విహరించేలా దయ చూడు తల్లీ అని వేడుకొంటారు (80). నన్ను ముక్తిపదానికి జేర్చు అని నేరుగా అడగకుండా "మా మూలంగా జనాభా పెరిగిపోయింది, అందులో నేను కూడా ఒకడిని, నా మూలంగా పాపం నీకు చాలా గడబిడయి పోతోంది, అందుచేత నేనెక్కడినుంచి వచ్చానో అక్కడికే నన్ను పంపించెయ్యి నీకు కొంచెం భారం తగ్గుతుంది" అంటారు బహు లౌక్యంగా (81).
అరికాల్లో కన్నుంది నాకు శివున కేమీ తక్కువ కాను అనుకొని భృగుమహర్షి హరిని వక్షస్స్థలం మీద తన్నగానే ఆయన దాన్ని చిదిమిపారేశాడు. అందుకే అల్పులైన యీ మనుషులకు జ్ఞాన నేత్రాన్నిస్తే తట్టుకోలేక దుర్వినియోగ పరుస్తారని భావించి యివ్వలేదేమో నమ్మా అంటారు కవి . ఈ పద్యంలో భృగువును అడుగు కన్ తబిసి అనే అందమైన విశేషణంతో చెప్పారు. అలాగే విష్ణుమూర్తిని వేల్గంటి (వేల కంటి ) అన్నారు. సాధారణంగా యీ విశేషణం యింద్రుణ్ణి సూచిస్తుంది. కాని యిక్కడ సహస్రాక్ష స్సహస్రపాత్ అయిన విష్ణుమూర్తికి అన్వయించడం విశేషం. జ్ఞాన నేత్రాన్ని యెఱుక కన్ను అనడం కూడా ఎంతో బాగుంది (82).
ఇంకో చమత్కారం. స్వర్గం అపవర్గం యీ రెండు మాటల్లో రెండో పదానికే యెక్కువ అక్షరాలున్నాయి కాబట్టి దాన్నే నాకియ్యి ఓ స్వర్గాపవర్గదా ! తక్కువనే యెందుకు కోరుకోవడం యిచ్చే దానివి నువ్వుండగా? ఎక్కువనే కోరుకుంటాను. పిల్లలని తక్కువచేసి ఒప్పించేద్దామనుకుంటున్నావా అంటారు (83). స్వర్గం అపవర్గం యీ రెండింటిలో మోక్షమైన అపవర్గాన్నే కోరుకొంటాడు జ్ఞాని. ఎందుకంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని కదా గీతాచార్యుని వాక్కు . మోక్షకామికి తిరిగి పుట్టవలసిన కర్మ ఉండదు.
ఇక్కడ తనను గూర్చి తానే యిలా మొరబెట్టుకుంటారు అమ్మతో. అయ్యో వీడికి వయసైపోయింది కాని వీసమెత్తైనా జ్ఞానం కలగ లేదు అని వృద్ధుడనైన నన్ను గుఱించి బాధపడుతున్నావేమో చూడమ్మా మీ దేవతల కాలమానంతో పోలిస్తే నేను శిశువునే కదా ఎందుకంటే మా ఒక సంవత్సరం అంటే మీ కొక రోజు కదా. అంటే నేను రోజుల పిల్లాణ్ణి. అలాంటి యీ నీ శిశువుని దగ్గరకు తీసుకుని కాస్త జ్ఞానమనే ఉగ్గు పట్టించు తల్లీ అంటున్నారు గడుసుగా (87).
ప్రతి మనిషిలోను త్రిగుణాలు అంటే సత్త్వరజస్తమో గుణాలు నిండి ఉంటాయి కదా. ఏదో ఒకటి మాత్రం యెక్కువగా ఉండి బహిర్గతమవుతూ ఉంటుంది. ఇక త్రిమూర్తులైన విష్ణు బ్రహ్మ మహేశ్వరులను యీ మూడు గుణాలకు వరుసగా ప్రతీకలుగా చెపుతూ ఉంటారు. ఇప్పుడు కవిగా రేమంటా రంటే అమ్మా ఒక్కసారి ఆ త్రిమూర్తులను నా దగ్గఱకు పంపించు తల్లీ నాలో ఉన్న ఆ మూడు గుణాలను యెవరి గుణాన్ని వారికిచ్చేస్తాను. అప్పుడు నన్ను నీ దగ్గఱకు తీసుకోవడం చాలా సులభమవుతుంది అని. ఎందుకంటే యీ గుణత్రయం నుంచి బయటపడనిదే దైవసాన్నిధ్యం దొరకదు కదా మరి. పనిలో పనిగా త్రిమూర్తుల దర్శనమూ ఔతుంది. ఎంత లౌక్యం ప్రదర్శించారో చూడండి (88). తిగగొనములు అందమైన ప్రయోగం.
నా శరీరాన్ని జీవుని కొక యిల్లుగానే యిన్నాళ్ళూ అనుకున్నాను కాని అది నికాయనికాయ మని అంటే పరమాత్ముని వాసమనే యెఱుక లేకుండానే బ్రతుకును వెళ్లదీసేశాను. ఇప్పుడీ చివరి రోజుల్లో బాధపడి ప్రయోజనం యేముంటుంది తల్లీ అని నైరాశ్యాన్ని ప్రకటిస్తారు మరో చోట (91). కుంతి పెద్దకొడుకైన ధర్మరాజు బొందితో స్వర్గానికి వెళ్లినా రాగద్వేషాలను విడిచిపెట్టలేకపోయాడు. ఎందుచేత నంటే ఆ శరీరం చితిలో కాలిపోలేదు కనుక. అంటే ఏమిటన్న మాట యీ మమకారం అనేది మనిషి నరనరాన జీర్ణించుకొనిపోయి కట్టెను కట్టెలమీద పెట్టేదాకా పోదు. ధర్మరాజంతటి వాడికే తప్ప లేదమ్మా నేనెంతటి వాడిని ? ఈ అవిద్యనుంచి నన్ను బయటపడెయ్యి తల్లీ అని వేడుకుంటున్నారు (93).
శ్రీరామ రామ రామేతి ....సహస్రనామ తుల్యం అని శంకరుడు పార్వతితో చెప్పడాన్ని ప్రస్తావిస్తూ అమ్మా మూడు సార్లు రామ అంటే సహస్రనామ పారాయణ ఫలితం దక్కుతుంది కదా నా రామ వు నువ్వే అని నా విశ్వాసం అంటూ " రామ నీవంచు నే నెంచెద రామా ! జన్మ విరామ !" అని మూడు సార్లు రామ అంటారు .శ్రీరామో లలితాంబికా శ్రీకృష్ణశ్శ్యామలాదేవీ అనే పురాణవచనాన్ని ఇక్కడ అన్వయించుకొన్నారు కవి. రామా అంటే లలితా దేవి సహస్ర నామాల్లో ఒకటి కూడా కదా! ...రామా! రమణలంపటా!....అలా అమ్మవారిని రామా అని సంబోధించి ఆమె లోనే రాముడిని కూడా దర్శించి దర్శింపజేసిన ఘనులు కవితాప్రసాదు గారు (96). 'మేక కుతుక బట్టి మెడ చన్ను గుడువఁగా ఆక లేల మాను నాశ గాక' అంటాడు వేమన యోగి. దాన్ని గుర్తు చేస్తూ అమ్మా కామధేనువు వంటి నీ అండ నాకు దొరుకుతుంటే వేరెవరినో ఆశ్రయించడం అంటే కామధేనువిచ్చే పాలను కాలదన్ని అజాగళ స్తనాలను చప్పరించడం వంటిది కాదా నాకెందు కా వృథా శ్రమ ? అలాగే సాక్షాత్తు కల్పవృక్షం లాంటి నిన్ను కాదని వేరే యేదో కల్పవృక్షం ఉందని దాని నీడను జేరుదామనుకోవడం యెందుకు తల్లీ అంటారు (97).
ధర్మాచరణాన్ని మించిన వేరే తపస్సు ఉంటుందా అమ్మా అంటూ, రావణుడు ఘోర తపస్సు చేసి గొప్ప శక్తులను పొందాడు కానీ రామచంద్రుడు యేమి తపస్సు చేశాడని ఆ రావణుని చంప గల శక్తిని పొందాడు? కేవలం తన ధర్మాచరణ వలననే కదా! అంటారు. రామో విగ్రహవాన్ ధర్మః అని రాక్షసుని చేతనే కీర్తింప బడ్డాడు కదా రామమూర్తి . ధర్మాచరణమే ఎల్లరికి శ్రీ'రామ'రక్ష. యెట్టి పరిస్థితులలోను దాని నుంచి వైదొలగరాదు అని తమ మతాన్ని స్పష్టపరుస్తా రిక్కడ (99). 'మమ '(నాది నాకు) అనే మనోధర్మాన్ని ఓడించగలిగిన గొప్ప మల్లుడిని కాదు నేను. అయితే నా యీ 'మమ' కారం ప్రస్తుతం నీ మీదే కేంద్రీకృతమై ఉంది. మరి అలాంటి మమకారం కనీసం గోరంతయినా నీకెప్పుడు కలుగుతుందో కదా నా మీద ? ఎందుకంటే నువ్వు మమతాహంత్రివి కదా తల్లీ అంటారు (101).
లలితమ్మా నాకొక అనుమానం. చతుర్విధ పురుషార్థాలలో మూడవ స్థానంలో ఉన్న కామము అరిషడ్వర్గంలో మొదటి స్థానాన్ని యెలా ఆక్రమించింది తల్లీ ? అంటే బహుశా ధర్మార్థాలతో ముడివడని కామము నిస్సారము, ప్రతికూలము అవుతుందని కాబోలు. పురుషార్థాలలో ధర్మార్థమైనది అరిషడ్వర్గంలో ధర్మార్థము కానిదీ అన్నమాట. అంతే కదమ్మా (103). ఓ అయిదగవులకేలముపట్టా! అని పిలిచారు అమ్మని. పంచకృత్యపరాయణ కు యెంత అందమైన తెనుగు సేత ! నీవు చేసే పనుల ఆనుపానులను తెలుసుకోవడం ఆ త్రిమూర్తులకే సాధ్యం కాదు యిక నాబోటివాడి వల్ల యేమవుతుంది ? అది తెలిసే నీ పాదపద్మాలను గట్టిగా పట్టుకున్నాను. ఇంక నేను మళ్ళీ పుట్టే పని లేకుండా అంటే ముక్తిని నువ్వు అనుగ్రహించే దాకా విడిచి పెట్టను అని మంకు పట్టు పడతారు(104).
చక్రాన్ని కనుగొనటంతో మానవ నాగరికత మొదలై అభివృద్ధి చెందిందని చరిత్రకారులు అంటారు. మానవ నిర్మితాలైన చక్రాలు , యంత్రాలు ఐహిక వృద్ధినిస్తాయి. నీ శ్రీ చక్రయంత్రం మాత్రం మాకు ఆముష్మిక వృద్ధిని కలగజేస్తుంది. మా శరీరాల్లో ఉండే సూక్ష్మభూమికలైన షట్చక్రాలను దాటుకొని సహస్రారాన్ని సక్రమంగా కూడుకొనేలా నాలో ఉన్న కుండలినిని మేలుకొలుపు ఓ వక్రతుండుని తల్లీ అని ప్రార్థిస్తారు. ఇక్కడ వక్రతుండుని స్మరించడంలో ఒక విశేషం ఉంది. కుండలిని మూలాధారం దగ్గర చుట్ట చుట్టుకొని ఉంటుంది కదా. ఆ మూలాధారానికి గణపతి అధిదేవత కావడం వల్ల యీ సందర్భంలో అమ్మవారిని వక్రతుండాల్లా అని పిలవడం చాలా సముచితంగాను అందంగాను ఉంది (106).
నా హృదయం అనే ఎలతోటలో ఎప్పుడో పదహారు విత్తనాలను (బీజాలను) నాటాను. ఈపాటికైతే తోట కాపుకి వచ్చేసి ఉండాలి వ్యవసాయం చేయడంలో కొంచెం అశ్రద్ధ జరిగిందేమో మరి. నేను కాటికి జేరే సమయం ఆసన్నమవుతోంది . నీ దగ్గరకు నన్ను జేర్చుకో తల్లీ అంటున్నారు (107). ఇక్కడ పదహారు విత్తులు అంటే అమ్మవారి షోడశీ బీజాక్షరాలన్నమాట. వ్యవసాయం తదుపాసన. మరి ఫలితం కనబడ్డంలేదు . శ్రద్ధలో కొంచెం లోటుందేమో మరి నువ్వే నన్ను నీ దగ్గరకు లాక్కోవాలి అని కవి ఉద్దేశం . అమ్మను త్రికరణశుద్ధిగా నమ్ముకున్నాను స్మరిస్తున్నాను అని తన భక్తిమీద తనకు గల నమ్మకాన్ని అమ్మవారి మీద గల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు .
చివరిగా సముద్రమంత పాపాలింకిపోయి, పర్వతాలంత పేరుకుపోయిన పాపాలను అధిగమించేలా నీ దయ మాకు లభించేలా వేయి నామాలను మాకందించి దారిచూపించిన ఆ అగస్త్యమహర్షిని స్మరిస్తున్నాను ఓ అనర్ఘ్యకైవల్యపదదాయినీ అని అమ్మకు నమస్కరించి శతకాన్ని అందంగా ముగింపు పలికారు కవితాప్రసాదు గారు (108). అగస్త్యుడు సముద్రాన్ని ఆపోశన పట్టి ఇంకించిన వాడు. వింధ్యపర్వతాన్ని వంచి దాటిన వాడు అనే విషయం ఇక్కడ మనకు స్ఫురించాలి. శతకమంతా అమ్మ పరిపూర్ణతత్త్వ ప్రస్తావనతో నిండిపోయి ఉంది .
శ్రీమాతృ ప్రణిధి మకుటంతో రమణీయమైన పదబంధాలతో అమ్మతో తన ఆర్తిని వెలిబుచ్చే నవరత్నాలవంటి అనుబంధ పద్యాలు కూడా ఇందులో ఉన్నాయి.
" ఓ శ్రీచక్రచిద్బిందు సంవాసినీ ! త్రిమూర్తుల వందనముల నందుకొను తల్లీ ! కాళీ సరస్వతులకు అపరిమితమైన శక్తుల నిచ్చేది, చెవికమ్మలకు అలంకారములుగా చేసుకొని సూర్యచంద్రులను ఆడించేది నువ్వే కదా అమ్మా ! నేను వృద్ధుడ నైనాను కాని వయసుకు తగ్గ పరిణతి రాలేదు నా బుద్ధికి. దానికి కారణం నీ దయ నాపైన కలగకపోవడమే. ఓ భక్తిమత్కల్పలతికా ! నేనేమో భక్తి తప్ప జీవ దేహ క్రమ ముక్తుల పొందే యితర మార్గములను యెఱుగని వాడను . అందుచేత పశుప్రాయుడనైన నన్ను పాశముల నుండి విడిపించి సర్వజీవులలోను ఉండే నిన్ను తెలుసుకొనే జ్ఞానాన్ని ప్రసాదించవమ్మా ! ఇంకా ఎన్నిమార్లు యీ జన్మలెత్తాలి నేను ? నీ ద్వీపానికి యెప్పుడు చేరగలుగుతాను ? నా జీవవేదనాయాగానికి పూర్ణాహుతి ముహూర్తం యెప్పుడమ్మా ? నీ సన్నిధానాన్ని నాకు ప్రసాదించి త్రిమూర్తులకు నన్ను గూర్చిన శ్రమను తొందరగా తప్పించు తల్లీ! దయామృతసముద్రం నిండిన నీ కన్నుల్లోంచి నీ యీ అనుగుబిడ్డని కోసం ఒక్క బొట్టైనా విదపలేవా తల్లీ ? ఏం యెడతెగని వేదఘోష నా మనవిని నీ చెవిలో పడనివ్వడం లేదా ? విడిచిపెట్టకుండా నిన్ను కొలుస్తున్న భక్తుని కోర్కెను తీర్చని దేవత ఉండడం తగునా ? నన్నో కంట జూచి కాపాడవమ్మా . నువ్వే కదా నా బుద్ధిని ప్రచోదనం చేసి నీ పదయుగళ పద్మారాధకునిగా చేసావు. కవితాప్రసాదు నీవాడు కాడా ? నీ వైముఖ్యాన్ని విడిచిపెట్టమ్మా నీ దగ్గరకు తీసుకో తల్లీ ! " ఇంతకన్న ఆత్మసమర్పణం యెవరు చేయగలరు ? ఆత్యంతికాధ్యాత్మిక జ్ఞాని తప్ప ?
ఈ విధంగా సర్వజ్ఞురాలు, సర్వవ్యాపకురాలు , సర్వసమర్థురాలు అయిన అమ్మను అష్టోత్తరశతాధిక పద్యపుష్పాలతో తాను తరించేలా అర్చించడమే కాకుండా పాఠకులు కూడా చదివి తరించేలా మనకు అందించిన శ్రీ కవితాప్రసాదు గారికి నమశ్శతము సమర్పిస్తూ ....అమ్మ పరమపదాన్ని చేరడానికి యీ కృతి అష్టోత్తర శత సోపానపంక్తి అనడంలో సందేహం లేదు అని మనస్ఫూర్తిగా నా మటుకు నేను నమ్ముతున్నాను.
దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు ,
కొంతమూరు , రాజమహేంద్రవరం .
చరవాణి : 97012 56888, 97012 92739.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.