జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శ్రీ సీతా రామచంద్ర పరబ్రహ్మణే నమః.
సభకి నమస్కారం.
ఈ రోజు ఎంతో సుదినం
ఒంటిమిట్ట శ్రీ సీతారామ కల్యాణం జరుగుచున్న శుభదినం, చైత్రశుద్ధ పూర్ణిమా పర్వదినం, అయ్యప్పస్వామి జన్మదినం, ఆంజనేయునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఇట్టి పవిత్రమైన దినమున
రామరాజ్యం క్షేమరాజ్యం అనే అంశంపై జగన్మాతోపాసకులు, బ్రహ్మజ్ఞాని, వాగ్విదాంవరులు అయిన శ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణగారి
ప్రవచనము వినే భాగ్యం ఆ పరమేశ్వరి మనకు అనుగ్రహించుట మన పూర్వజన్మ సుకృతం.
దీనికంటే ముందుగా మనలో ఒకరై మనచే కవికల్పభూజ బిరుదును స్వీకరించిన
చిత్రకవితాసమ్రాట్ రచించిన శ్రీరామ పట్టాభిషేకము అనే గ్రంథావిష్కరణ జరుపుకొనుట
దానిపై అనంతకృష్ణగారి సమీక్ష వినుట మనందరికీ ముదావహం. ఈ సందర్భంగా ఆహ్వానింపబడి
వచ్చిన మీ అందరికీ మా స్వాగతం సుస్వాగతం.
(1) బ్రహ్మశ్రీ
నరహరిరావుగారికి
తే. శ్రీమనోహర
పనకంటి శ్రీనృసింహుఁడు
అమిత శుభదులు మనలకు ప్రముదముగను
స్వాగతింతును వేదికన్ సభకు పతిగ
వచ్చి శుభకార్యమును వేగ మెచ్చఁ జేయ.
ఈ కార్యక్రమము నిర్వహించుటకై అధ్యక్షస్థానంలో వేదికనలంకరించ వలసినదిగా బ్రహ్మశ్రీ నరహరిరావు మహోదయులను మీ అందరి కరతాళ ధ్వనులమధ్యా ఆహ్వానిస్తున్నాను.
(2) డా.డీ.వీ.జీ.యే.సోమయాజులు
గారికి
కం. రాజీ పడ నేరని
డీ
వీజీయే సోమయాజి విద్వన్మణులన్
రాజిల్లఁ జేయ సభనిట
రాజిత ముఖ్యాతిథిగను రమ్మని పిలితున్.
ప్రముఖ జ్యోతిశ్శాస్త్రవేత్త, విశ్రాంత కళాశాల ఉపన్యాసకులు, అయిన డా.డీ.వీ.జీ.యే.సోమయాజులు గారిని
ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాను.
(3) బ్రహ్మశ్రీ భమిడిపాటి వీరనారాయణ గారికి
తే. భమిడిపాటి
సద్వంశజుల్ భవ్య మూర్తి
వీరనారాయణున్ సభన్ వెలయఁజేయ
స్వాగతించుచునుంటిని సత్ ప్రపూజ్య
గ్రంథమావిష్కరింపగా కరుణ తోడ.
గ్రంథావిష్కరణ చేయగలందులకు బ్రహ్మశ్రీ భమిడిపాటి వీరనారాయణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
(4) బ్రహ్మశ్రీ నారుమంచె వేంకట అనంతకృష్ణగారికి
ఆ.వె. నోరు మంచిదయిన
ఊరు మంచి దనుచు
నారుమంచివారి నడత నేర్పు,
సాటిలేనియట్టి సత్పూజ్య వాగ్విదాం
వరుని స్వాగతింతు వక్తగాను.
ప్రముఖ ప్రవక్త, సుప్రసిద్ధ న్యాయవాది, వాగ్విదాంవర బిరుదమును మన సమక్షమున స్వీకరించిన సహృదయశిరోమణి బ్రహ్మశ్రీ నారుమంచె వేంకట అనంతకృష్ణగారిని అందరి కరతాళ ధ్వనులమధ్యా సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
(5) బ్రహ్మశ్రీ సాధన నరసింహాచార్యులవారికి
ఆ.వె. సాధనమున పనులు
సాధించి యింటినే
సాధనముగ మార్చె సరసమతులు,
నారసింహ మహిత నయవర్తనాచార్యు
స్వాగతింతు సభకు సన్నుతముగ.
ఆత్మీయ అతిథులుగా బ్రహ్మశ్రీ సాధన నరసింహాచార్యులవారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
(6) బ్రహ్మశ్రీ ముద్దు రాజయ్య గారికి
ఆ.వె.
క్షిప్రసద్వధాని, సుప్రసిద్ధకవిని
చిరు నగవులతోడ చెలగువాని
ముద్దు పలుకు లొలుకు ముద్దురాజయ్యను
స్వాగతింతు సభకు సన్నుతముగ.
బ్రహ్మశ్రీ ముద్దు రాజయ్య అవధాని మహోదయులను సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
(7) బ్రహ్మశ్రీ రాళ్ళపల్లి మురళీధరసర్వేశ్వరశాస్త్రి గారికి
కం. శ్రీ రమ్యాత్ముఁడు శుభదుఁడు,
శ్రీరాముని భక్తవరుఁడు శ్రీమంతంబౌ
సారస్వత సంపూజ్యుండు
ఆరెమ్మెస్స్ శాస్త్రికిపుడు స్వాగతమందున్.
భాషాప్రవీణులు, విశ్రాంత ఉన్నతపాఠశాల ప్రథానోపాధ్యాయులు, మన చిత్రకవితాసమ్రాట్టుల మిత్రులు అయిన బ్రహ్మశ్రీ RMS. శాస్రి,గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
(8) బ్రహ్మశ్రీ కటకం వెంకటరామశర్మ గారికి స్వాగతం.
కం. పటుతర వాగ్విభవా! మీ
రిట మా సభయందు నిలిచి యీప్సితరీతిన్
కటకము వేంకట రామా
నిటలాక్షునిబోలి నిలువ నే వాంఛింతున్.
బ్రహ్మశ్రీ కటకం వెంకటరామశర్మ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
(9) చింతా రామకృష్ణారావుగారికి
కం. మన రామకృష్ణ
సుకవిని
మనలో నొక్కనిగవెలుగు మహితాత్ముని సద్
వినయవిధేయతలొప్పెడి
ఘనునకుసుస్వాగతమ్ము గౌరవమొప్పన్.
మనకు తలలో నాలుకవంటి మన చింతా రామకృష్ణారావుగారిని
వేదికనలంకరించవలసినదిగా ఆహ్వానిస్తున్నాను.


.jpeg)





0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.