గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఏప్రిల్ 2025, మంగళవారం

పంచ మహాయజ్ఞాలు ... మనం ఆచరించే విధానం.

జైశ్రీరామ్.

పంచ మహాయజ్ఞాలంటే ఏమిటి? దేన్ని ఎవరు చేయాలో తెలుసా? - మన ఋషులు బ్రహ్మ యజ్ఞం, పితృ యజ్ఞం, దేవ యజ్ఞం, భూత యజ్ఞం, మనుష్య యజ్ఞం అని ఐదు మహా యజ్ఞాలను నిర్ణయించి ప్రతి వ్యక్తీ వీటిని తప్ప నిసరిగా నిర్వర్తించాలని శాసించారు. అయితే మనం వాటినన్నిటినీ ఆచరిం చగలమా అని కంగారుపడాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే అవన్నీ మనం సులభంగా చేయగలిగినవే. ఈ పంచ మహాయజ్ఞాల గురించి విపులంగా తెలుసుకుందాం.


1. బ్రహ్మయజ్ఞమంటే...!

బ్రహ్మయజ్ఞమంటే వేదాన్ని అద్య యనం చేయడం. కానీ, అది అందరికీ సాధ్యమయ్యేది, అవకాశమున్నదీ కాదు. కనుక మహర్షులు మరొక సులభమైన అవకాశాన్నిచ్చారు. 'వేదః ప్రాచేత సాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా.. రామాయణం సాక్షాత్తూ వేదమే! భారతం పంచమవేదం. భాగవతం వేదమనే కల్పవృక్షం నుంచి జారిపడిన మధురఫలం. కనుక మనం రామాయణ, భారత, భాగవత, భగవద్గీతాదులను చదివినట్లయితే బ్రహ్మయజ్ఞం చేసినట్లే! దీనివల్ల మన రుషులు తృప్తిపడతారు. బ్రహ్మయజ్ఞమంటే ఇదే! రుషి యజ్ఞమన్నా ఇదే!.


2. పితృ యజ్ఞం

ఇక ప్రతి ఒక్కరికీ కంటికి కనిపించే దేవతలు తల్లిదండ్రులు. మరణించిన తాత ముత్తాతలు, మన వంశీయులు, మనకు పితృదేవతలు. సదా పూజ్యులు. తల్లిదండ్రులు మరణిస్తే వారు మరణించిన తిథిని గుర్తు పెట్టుకుని ఆ రోజున ఆబ్దికం పెట్టి, బంధుమిత్రులకు భోజనం పెట్టడం, నిత్యం పితృదేవతలకు తర్పణాలివ్వడం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు. పితృయజ్ఞమంటే ఇదే!


3. దేవ యజ్ఞం

నియమ నిష్టలతో, మడి ఆచారాలతో, శాస్త్రోక్తంగా ఇటుకలతో హోమకుండాన్ని నిర్మించి, రావి, మోదుగ, మొదలైన సమిధలను అందులో వేసి అరణులను మధించగా వచ్చిన అగ్నితో అగ్నిహోత్రం చేసి, మంత్రపూర్వకంగా హవిస్సులను అర్పిస్తూ చేసే హోమ విధానానికి దేవయజ్ఞం అని పేరు. కానీ, ఇదీ అందరికీ సాధ్యమయ్యేది కాదు. దానికి బదులుగా నిత్యం దేవుడికి పూజ చేసి ధూప హారతి, కర్పూర హారతి ఇవ్వడం వల్ల దేవతలు తృప్తి చెందుతారు. ఇదే దేవయజ్ఞం!


4. భూత యజ్ఞం

ఈ భూమిపై మానవులతో పాటు అసంఖ్యాకమైన పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఇంకా అనేక విధాలైన జీవరాశులు నివసిస్తున్నాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మన మనుగడకు అవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కనుక వాటికి కావలసిన ఆహారాన్ని అందించడం మానవుని కర్తవ్యం. ఉదాహరణకు చీమలకు పంచదార పెట్టడం. బియ్యపు పిండితో ముగ్గులు పెట్టినా అది చీమలకు ఆహారంగా ఉపయోగపడుతుంది. మనం వండుకున్న పదార్థాలను ఒక ఆకులో పెట్టి ఇంటి గోడ మీద పెడితే పక్షులు తింటాయి. మరికొంత అన్నాన్ని వాకిలి ముందు పెడితే కుక్కలు మొదలైన జంతువులు తింటాయి. ఇంటి ముందుకు వచ్చే ఆవులకు బియ్యం, అరటిపళ్లు వంటివి పెట్టవచ్చు. ఇలా మనతో పాటు ఇతర ప్రాణులకు కూడా జీవించడానికి ఆహారాన్ని అందించడం కూడా ఒక యజ్ఞమే! భూతయజ్ఞం అంటే ఇదే!


5. మనుష్య యజ్ఞం

మన ఇంటికి వచ్చే అతిథి, అభ్యాగతులందరూ విష్ణుస్వరూపులే! గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన ప్రతి గృహస్తు కూడా తన ఇంటికి వచ్చే అతిథి, అభ్యాగతులను ఆదరించాలి. అతిధులు తమంత తాము మన ఇంటికి భోజనానికి వస్తే మహదానందం. లేదూ మనమే వారి వద్దకు వెళ్లి మన ఇంటికి ఆహ్వానించి ఆప్యాయతతో వారికి భోజనాన్ని పెట్టినట్లయితే వారందరూ తృప్తిపడతారు. ఆ తృప్తి మనకు శ్రేయస్సునందిస్తుంది. మనుష్య యజ్ఞమంటే ఇదే!.


చూసారుగా! పంచయజ్ఞాలంటే ఎంతో క్లిష్టతరమైనవనుకుంటాం కానీ, ఇవన్నీ ఎంత సులభమైనవో చూశారు కదా! వీటిని మనందరం బాధ్యతగా నిర్వర్తించినట్లయితే మనకూ మన కుటుంబానికి, సమాజానికి శ్రేయస్సును ప్రసాదిస్తాయి.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.