జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శాంభవీ శతకము
మధ్యాక్కఱ గర్భ ఉత్పల- చంపకములు.
ప్రతీ పాదమునందలి ఆఖరి మూడు క్షరములు తొలగించి చూచినచో
మా జగదంబ! మకుటముతో కూడిన
మద్ధ్యాక్కఱ శతకము అగును.
౧) శ్రీగణనాథునిన్ గొలుతు, చిత్తమునందున నిల్పి, ప్రేమతో
జాగృతిఁ గొల్పి నామదిని చక్కఁగ నిన్ గనఁ జేసి, గొప్పగా,
నీ గుణరాజమున్ దెలిపి, నిన్ను రచింపఁగఁ జేయఁ గోరుచున్,
యోగమె నీవు గర్భ కృతి నొప్పుట మా జగదంబ! శాంభవీ!
౨) సుందరభావనాకలిత సూనృత వాక్సుధనిమ్ము, నీ కృపన్,
చందన చర్చలన్ గలుగు చల్లదనంబునొసంగి, నిత్యమున్
డెందములందు నీ ద్యుతిని లీలగ నిల్పువిధాన నొప్పగా
బంధుర బంధ సత్కవిత వ్రాసెద, మా జగదంబ! శాంభవీ!
౩) శ్రీకర చక్రరాజమున చిద్వరరూపిణి వీవె, చూడగా,
లోకములన్నిటన్ వెలుగు శ్లోక! ప్రసిద్ధవగణ్య తేజమా!
నీకరుణాకటాక్షములు నేఁ గనుచుంటిని మాన్య! నిత్యమున్,
హే కరుణాలవాల! పరమేశ్వరి మా జగదంబ! శాంభవీ!
౪) శ్రీకరుణాలవాల! విధుశేఖరు రాణివి నీవు, నిత్యమున్
నీకరుణా కటాక్షములు నిల్పు జనాళిని ధాత్రి, నెమ్మితోన్,
మోకరిలున్ జగమ్ములవి, పూజ్య! త్వదీయపదాళి నెన్నుచున్,
శ్రీకరమంచు, నిన్ గొలుతు, చిత్ప్రభ! మా జగదంబ! శాంభవీ!
౫) లోకములన్నినొక్కటయి లుబ్ధతఁ గొల్పగవచ్చు, నీకృపన్
నీ కమనీయ దృక్కులవి నేఁ గన జాలినఁ జాలు, నీశ్వరీ!
శ్రీకరమైన సద్గుణమె చేరును నా మదిలోన, భక్తుఁడన్
నీకు సమర్పితంబయితి నేనిల, మా జగదంబ! శాంభవీ!
౬) వాక్కులరాణివౌచు వర వాగ్ఝరినిచ్చెద వీవె, సత్ కృపన్,
నిక్కము సత్కవిత్వమది నీ కృప చేతనె గల్గు, వ్రాయగా
స్రుక్కగ లేదు నే నెపుడు శోభిల నిన్ బ్రవచించి, భక్తితో
మక్కువతోడ వ్రాసితిని, మాతరొ! మా జగదంబ! శాంభవీ!
౭) మక్కువతోడ నాశివుఁడె మానక నిన్ ధరియించె, నమ్మరో
చక్కని లోకమాతవని సన్నుతిఁ జేయుచు పొంగు చుండి తాన్,
నిక్కము నీవు కల్గిననె నీ విభుఁడొప్పు జగాన, నిత్యుఁడై,
మ్రొక్కెద నీకు, నన్ గనుచు ప్రోవుమ, మా జగదంబ! శాంభవీ!
౮) అక్షయ మైన నీదయ ననారతమొందిన చాలు, నీశ్వరీ!
రక్షణ మాకునెల్లెడలఁ, బ్రాపుగ నిల్చుచునుండు, ప్రేమతోన్,
మోక్షము కోరనేల? వరముక్తి యె నీ కృప మాకు, గాంచగా
నీ క్షితి నీవె నన్ గనెడి యేలిక, మా జగదంబ! శాంభవీ!
౯) శ్రీకరమైన నీ స్మరణ చిత్తము చేయుచునుండ, నమ్మరో!
యాకలి దప్పులే కనము, హాయిగ నిన్ గనుచుండగా భువిన్,
భీకరమైన బాధలును భీతిలి వీడుచు పోవు, మమ్ములన్,
నీకరుణన్ వెలింగెదను, నేనిల, మా జగదంబ! శాంభవీ!
౧౦) లోక హితార్థ మీ కృతి విలోకన చేయగ నమ్మ, భక్తితో
లోకులు నిన్ను నమ్ముచు, ప్రలోభము వీడి పఠింప నీకృతిన్
నీ కృప నొంద నేర్తురు, గణించి పఠింపఁగఁ జేసి, కావుమా,
నా కృషి సత్ఫలంబునిడ, నన్ గను మా జగదంబ! శాంభవీ!
౧౧) జ్ఞానమనంగ నీవె గుణ గణ్యవు నీవె కనంగ, నమ్మరో!
గానమునందు మాధురివి కానగ నీవె వినంగ నౌనదే,
ప్రాణము నీవె యౌచు పరివర్ధనఁ జేసెద వీవె, మమ్ములన్,
నీ నయదృక్కులన్ నిలుతు నేనిల, మా జగదంబ! శాంభవీ!
౧౨) శాస్త్రచయంబు నందు గుణసాంద్రత నీవె గణింప గానిలన్,
శస్త్ర మహత్వశాస్త్రముల సన్నుతినొప్పుదువీవె, చూడగా,
విస్తృతమైన చర్చలను వెల్గుదువీవె జగాన, నిత్యమున్
విస్తృతిఁ గొల్పు భక్తినిల, వేడెద, మా జగదంబ! శాంభవీ!
౧౩) భారముగా గణింపకుము, భద్రత గొల్పుము మాకుఁ, బ్రేమతో
భారము నీదె కావున, సపర్యలు చేయగనిమ్ము మమ్ములన్,
నీరజ పత్రనేత్ర! కరుణించుము మాపయి నీవు , నిత్యసు
స్మేరముఖాంబుజా! వినుతి చేయుదు, మా జగదంబ! శాంభవీ!
౧౪) నాదరి నుండు వారు కరుణారస చిత్తులె చూడ, శైలజా!
నీ దరినున్న నామనసు నిశ్చలమై వికసించుచున్ లసన్
మోదము గూర్చు సద్వినుత పూజ్జ్యులకెల్ల సతంబు, సన్నుతుల్
రాదగువారు నీదరికి ప్రాజ్ఞులు మా జగదంబ! శాంభవీ!
౧౫) చేరగనిమ్ము నన్ను, విరచింపఁగ నిన్ గనుచుండి, సత్కృతుల్,
కోరగనిమ్ము నీకృపను, కూర్మిని, లోక హితంబు నిత్యమున్
నేరుపు మీరఁ గూర్పగను, నిత్యవసంతము నీవె, చూడగా
కారణమీవె సృష్టికిని కావుము మా జగదంబ! శాంభవీ!
౧౬) తారలు మింటనుండియును తప్పవు సద్గతి నుండి యెప్పుడున్,
కారణ మీవె యట్టులవి కట్టడినొప్పి రహింప, మింటిపై,
నీ రమణీయ తేజమవి, నిత్యము గాంచెదమమ్మ, పొంగుచున్,
సూరివరుల్ వచించుటను, శోభిలు మా జగదంబ! శాంభవీ!
౧౭) దారయు పుత్రికల్ సుతులు ధాత్రిని నీ జనితంబె చూడగా,
ధీరత నొప్పి నిన్ గొలిచి తీరుగ వారిని పెంచి, తుచ్ఛమౌ
కోరికలన్ త్యజించి, నినుకూర్మిని చేరఁగనౌను, వ్యగ్రునై
కోరను లంపటంబులను, గొప్పగు మా జగదంబ! శాంభవీ!
౧౮) మారు వచింపకమ్మ! గుణమాంద్యుఁడ నీ ధర నెన్న నీవె నన్
జేరగనిమ్మ నీ దరికిఁ, జేతినొసంగుము కావ గాననున్,
నేరమె యౌనుగాక నిను నేనిది కోరుట చూడ నమ్మరో!
భారము మోయ లేను, కను, భద్రద! మా జగదంబ! శాంభవీ!
౧౯) ధీరగుణంబు సన్నగిలె, తేజము వాసె ధరిత్రి పైన సు
స్మేరముఖంబు వాడె నిలఁ జేసిన పాపమదేమొ? చండికా
కారణమేమొ నేనెఱుఁగ, కావుము నన్నిక నీవె, నిన్ను నే
కోరనిహంబు, సత్ పరమె కోరెద, మా జగదంబ! శాంభవీ!
౨౦) చారు సులోచనా! స్మృతుల సారము నీవె గణింప నెత్తరిన్,
ధీరత వీవె చూడగను, తేజము నీవె కనంగ, నన్నిటన్
శారదరాత్రులందు గల చల్లదనంబది నీవె యెప్పుడున్
దారి కనంగ నీవె కద, తల్లిరొ! మా జగదంబ! శాంభవీ!
౨౧) చిత్రవిచిత్రమౌ జగతిఁ జేసెడి మా పనులందు నెన్నగా
నాత్రమె యుండుఁ గాని, పరమార్ధము నెంచగలేము, నిక్కమౌ
సూత్రము నీవెయైతివని చూడఁగఁ జాలము మేము నిన్ను నే
స్తోత్రము చేయుదున్ గనుమ శోభిల, మా జగదంబ! శాంభవీ!
౨౨) విద్యలవెన్నియో కలవు విశ్వమునందున చూడ, ధాత్రిపై
సద్యశ హేతువై జగతి సంస్తుతి నొప్పెడిదైన గొప్పదౌ
విద్య యనంగ నిన్ దెలుపు విద్యయె విద్య గణింపు, నిచ్చునా
విద్యవు నీవె , కన్నులను వెల్గుము మా జగదంబ! శాంభవీ!
౨౩) వేదమనంగనేది? పరవిద్యయె వేదమ? తల్లి! నిత్యమున్,
మోదముతోడ నిన్ దెలుపు మూలమె వేదము, నన్ను నెత్తరిన్
నీ దరి చేర్చు వేదమె గణింపగ వేదమనందు నమ్మరో!
వేదసువేద్య! నన్ గనఁగ వేడెద, మా జగదంబ! శాంభవీ!
౨౪) కండబలంబు తగ్గినది, కాంచెడి శక్తియు తగ్గె కంటికిన్,
మెండగు గర్వమే యణగె, మేదిని నాశయువీడె భూమిపై
నండగ నీవె యుండి, మహిమాన్విత! కావుమ నన్ను నీ కృపన్,
పండిత భావ మోమదుగ? భద్రద! మా జగదంబ! శాంభవీ!
౨౫) ఎట్టుల జన్మమెత్తితినొ? యేమి యొనర్చితొ నేను నింక నా
కట్టెదుటన్ నినున్ గనుచు కమ్మగ కొల్చితొ? లేదొ? నోటితోఁ
బట్టుగ నొక్కమారయిన భక్తిగఁ బిల్చితొ లేదొ? గాంచితే?
యెట్టులఁ జేయఁ జేసితివొ యీశ్వరి! మా జగదంబ! శాంభవీ!
౨౬) సన్నుతి చేసెదన్ జనని చక్కఁగ నొప్పుగ నిన్ను, నెంచుచున్
గ్రన్నన నీవె చేరఁదగు గమ్యము మాకుఁ గనంగ నీశ్వరీ!
మన్ననఁ జేసి నా నుతు లమందశుభాకరవౌచుఁ బ్రేమతోఁ
గ్రొన్నెలతాల్పురాణి! గొను, కోరితి, మా జగదంబ! శాంభవీ!
౨౭) మంచినె చూడఁ జేయుమిల, మంచినె చేయగనిమ్ము, నీ కృపన్
మంచినె వీనులన్ వినగ మంచిగ చేయుము నీవు, మా మదిన్
మంచి యనంగ నీవె, గుణమాన్యులు నీవె కనంగ ధాత్రిపై
మంచిగ నిన్ను చేరెదను, మాతరొ! మా జగదంబ! శాంభవీ!
౨౮) కారణమౌదు వీవె వర కార్యము నీవె మదంబ! చూడగా
నీరజపత్రనేత్ర! గణనీయ ఫలంబది నీవె, యీశ్వరీ!
యారసి సత్ప్రవర్తననె యంచిత రీతి నొసంగి ప్రేమతో
దూరము చేసి మా భ్రమను, తోచుమ, మా జగదంబ! శాంభవీ!
౨౯) కల్పన చేసి లోకములు, కారణమైతివి నీవె సృష్టికిన్,
స్వల్పమనన్యమాయ పరివర్ధనచేసితి వీవె, చూడగా
కల్పక మీవె యౌచు, కృత కర్మఫలంబులఁ గాల్చి మమ్ములన్
నిల్పెడి నిన్ను, నేఁ గొలుతు, నేర్పున మా జగదంబ! శాంభవీ!
౩౦) లాలన చేసి భక్తులకు లక్ష్యము చూపుదువీవు, నిత్యమున్,
శ్రీలలితాపరాత్పరివి, చిత్తములందు వసించి, ప్రేమతో
జాలిగ మమ్ము చూచుచును చక్కగ కాతువు నీవె నెమ్మితోన్,
పాలన చేయు నిన్ గొలుతు, పార్వతి! మా జగదంబ! శాంభవీ!
౩౧) గమ్యము లేని జీవితము గౌరవహీనమె చూడ, నమ్మరో!
సౌమ్యవు నీవు, నిన్ గనుచు చక్కని గమ్యమునెంచి నిత్యమౌ
రమ్య మనోజ్ఞ మార్గమున రాజిల నొప్పుగ నుండఁ జేయగా
కామ్యము లెల్ల వీడునటు కాంచుము, మా జగదంబ! శాంభవీ!
౩౨) అంబ నవాంబుజోజ్వల! పదాంబుజ సేవ నొనర్తు నీకు నా
సాంబుడు మెచ్చు నేనిటులఁ జక్కగ చేయుచు నుండ, సేవలన్,
కంబుసుకంఠి! నీ స్మరణ కాల్చును కర్మ ఫలంబు, నీవు మా
డంబము పాపి చూపుము కటాక్షము, మా జగదంబ! శాంభవీ!
౩౩) ధర్మమనంగనెయ్యది? య ధర్మము నెంచగ నేది? యౌనొ? యా
మర్మమనంగ నేది? పరమంబెటులెంచుట యౌను? తెల్పుమా
కర్మలఁ వీడు మార్గమును కానగఁ జేయు నదేది? భైరవీ!
మర్మము వీడ తెల్పుము సమస్తము, మా జగదంబ! శాంభవీ!
౩౪) ప్రాణము పంచ భూతములొ? ప్రాణము కన్బడదేల? నో మహా
ప్రాణులు సంచరింతురిల, ప్రాణము పోవుటదేల కల్గునో?
జ్ఞానము తోడ ప్రాణమును కావగ లేమదియేల? చెప్పుమా,
ప్రాణము నీవె యౌదువొ? విభాసిత! మా జగదంబ! శాంభవీ!
౩౫) సంతతి నీకు మేము, గుణసన్నుత నీ కృప గల్గ ధాత్రిపై
శాంతియు సత్యమున్ శుభము సర్వ సుఖమ్ములు కల్గు చుండెడున్,
సంతసమొప్ప నిన్ గొలువ సాధ్యమె యన్నియు మాకు, నెప్పుడున్,
సుంత యనుగ్రహించి మము చూడుము, మా జగదంబ! శాంభవీ!
౩౬) సద్గతిపొంద నీకృపయె సాధనమెన్నగ మాకు నిద్ధరన్,
సద్గతిఁ గూర్ప దుర్గతిని చక్కగ పాపు నిజంబు చూడగా,
సద్గుణగణ్యవీవనుచు సన్నుతి చేయుచునుంటినమ్మరో!
మద్గతి వీవె, కావుమిల మాతరొ! మా జగదంబ! శాంభవీ!
౩౭) సారమతిన్ జగజ్జనని! సత్వగుణంబులెఱింగి, జ్ఞానియై
స్మేరముఖారవిందుఁడయి మేదిని వెల్గెడువాఁడు నేర్పుగా
పారమునంటు ధ్యేయమున, భక్తియె మార్గము చూడ, నింతకున్
గోరెద భక్తి నిమ్మనుచు కూర్మిని, మా జగదంబ! శాంభవీ!
౩౮) స్వల్పమె యౌత భక్తి,, గుణ సన్నుత నిన్ గణియింప జాలినన్
వేల్పులు మెచ్చుచుందురుగ, వేయి విధంబు లవేల? మాకహో
నిల్పిన చాలు నిన్ మదిని, నిస్తుల భాగ్యము లబ్బు భార్గవీ!
కల్పిత మీ జగమ్ము, నను కావుము, మా జగదంబ! శాంభవీ!
౩౯) సామ్యత లేదు నీదు గుణ సన్నుతి చేయగ నెంచ నాకిలన్,
సౌమ్య లసత్ స్వరూపిణివి, సద్గుణ పాళివి నీవు, భ్రామరీ!
గమ్యము చేర్చి మమ్ము నిల కావుము నీవె కృపాబ్ధి! నెమ్మితో
రమ్య గుణాఢ్య! నీ స్మరణ ప్రాపగు, మా జగదంబ! శాంభవీ!
౪౦) ఏ శుభ వేళలో నిను ననేకవిధంబులఁ గావ భక్తితో
నాశగ సంస్మరించితినొ, యా శుభవేళ నుతంబు చూడగా,
క్లేశములెల్ల దూరమయె, కీడులు వాసె, నిజంబు నెన్నితిన్,
నీ శరణాగతుండ, గను నిత్యము, మా జగదంబ! శాంభవీ!
౪౧) అమ్మరొ! నీ పదాబ్జము లనంత శుభావహ మంచు, నమ్మితిన్
నెమ్మనమందునన్ గొలుతు నేర్పున నిత్యము నేను, మంగళా!
రమ్ము మనంబునన్ నిలిచి రక్షణఁ గొల్పుము నాకు, నిత్యమున్,
నెమ్మిని గాంచుమా నను గణించుమ, మా జగదంబ! శాంభవీ!
౪౨) జాతకముల్ గణించెదరు శాస్త్రవిధానమునెన్ని ధాత్రిపై,
వ్రాతలు మార్చ నేర్చితిరె వాసిని గాంచినవారు? నేర్పుతో,
మా తలనుండు వ్రాతలవి మా కనుభోగ్యమె యౌను, చూడగా
ఖ్యాతిగ నీవె మార్చుదువు, కాళిక! మా జగదంబ! శాంభవీ!
౪౩) నేను నినున్ దలంచుటకు నీ దయ కావలెనమ్మ, నమ్ముమా,
జ్ఞానము నీ వొసంగిననె గౌరవ మొప్ప దలంతు నెమ్మితో,
ప్రాణము నీవెయై ఘనతరంబగు మాయను ముంచి యుంచుచున్,
మౌనము తోడఁ జూచెదవు, మాతరొ! మా జగదంబ! శాంభవీ!
౪౪) జీవిత మేల యిచ్చితివి? చేసిన కర్మలె చేసి నిత్యమున్
భావియె లేక పాపముల వార్ధిని మున్గుచు నుండి కర్మచే
త్రోవ యెరుంగ రాని కడు దుర్మతి నొప్పుచు నుండి, భూమిపై
జీవితమంతవ్యర్థముగ చేయనొ? మా జగదంబ! శాంభవీ!
౪౫) కన్నుల తోడఁ గాంచి నిను గౌరవ మొప్ప భజించి, పొంగుచున్,
మిన్నగు నీ గుణంబులను మేలుగ పల్కుచు నుండి, నేర్పుతో
సన్నుతి తోడ నిన్ గొలిచి సత్వగుణంబును గల్గి, యుండి, సన్
మన్నననొప్పుటొప్పుఁ గద? మాలిని! మా జగదంబ! శాంభవీ!
౪౬) చాలను నిన్ భజింపగను చాలను నేను స్మరింప నీ కృపన్,
జాలను పూజ చేయ నిను, చాలను నిన్ గని పొంగ నిద్ధరన్,
జాలను పద్య సద్రచన సన్నుతిఁ జేసి రహింప, సాత్వికీ!
చాలుదు కోర్కెలన్ దెలుప సన్నుత! మా జగదంబ! శాంభవీ!
౪౭) మాన్యత నొప్పుచున్, దురభిమానము వీడుచు నుండి, ధాత్రిపై
గణ్యముగా మెలంగుచు, నగ ణ్యవు నిన్నునెఱింగి నిచ్చలున్
ధన్యతతోడ జీవితము దాటగఁ జేయుచు నొప్పు గణ్యులౌ
మాన్యులు ధన్యజీవనులు. మంగళ! మా జగదంబ! శాంభవీ!
౪౮) సారవిహీన జీవితము చక్కని నీ స్మృతినొప్పి, గణ్యులై,
శూరులునై, మహాత్ములయి శోభిలుచుండిరి ధాత్రి, కర్వరీ!
స్మేర ముఖాబ్జ! నిన్ గనెడి సిద్ధులు ధన్యులు, చూడనిద్ధరన్,
కోరెద నిన్ శుభంబులను గొల్పగ, మా జగదంబ! శాంభవీ!
౪౯) లాక్షణికోత్తముల్ సకల లక్షణముల్వచియించుచుండియున్,
రక్షణమార్గమెన్నుచు పరంబును తెల్పఁగ లేరు, మాకిలన్,
మోక్షమునిత్తు వీవెయని పూర్తిగ చెప్పగ లేరు, నీవెగా
దక్షత నొప్పి మమ్ము గను తల్లివి, మా జగదంబ! శాంభవీ!
౫౦) జంతువులున్ భజించునిను చక్కగ సేవలు చేసి కోవెలన్
శాంతిగనుండు మౌనులును సన్నుతులై నిను గొల్త్రు, జ్ఞానులై
అంతయు నీ కృపామృతమె యందరిభాగ్యము నీవె చూడగా
పంతము వీడి కావు నను పాటల! మా జగదంబ! శాంభవీ!
౫౧) జయమగు నీకు నెల్లెడల సన్నుత దేవి! శుభంబు కల్గెడున్,
జయమగు నీదు చూపునకు, శాంతతనొప్పును గాక నిత్యమున్,
జయమగు నీదు భక్తులగు సద్గుణపాళికి ధాత్రి జీవనీ!
జయము లొసంగు మాకును, ప్రశస్తిగ మా జగదంబ! శాంభవీ!
౫౨) వినయవిధేయతల్ గొలిపి వెల్గగఁ జేసితివమ్మ నీవు నన్,
మననము చేయుచున్ మదిని మన్ననఁ గాంచెద నిన్ను నెప్పుడున్,
ఋణముల నుండి ముక్తిఁ గని నేన్ నినుఁ జేరెదనమ్మ, కౌశికీ!
ఘనతను గొల్ప కావుమిల కామ్యద! మా జగదంబ! శాంభవీ!
౫౩) జననివి, సత్యమార్గమున చక్కగనుంచుమ మమ్ము ప్రేమతో,
మనమున నిల్చి నీవు గుణ మాన్యునిగా నను తీర్చి దిద్దుచున్,
ధనముగ గౌరవంబునిడి తస్కరబాధను బాపి, నీకృపన్
మనునటు చేయుమమ్మ! పరమంబదె, మా జగదంబ! శాంభవీ!
౫౪) వరముగ లభ్యమైతివని వర్ణనఁ జేసితి నిన్ను, నేను, నే
భరమని నీకు తోచితినొ భక్తిని గాంచవు నీవు, నన్నిలన్,
నిరుపమ సద్దయాన్వితవు నీవె కృపన్ నను గాంచు, చుండుమా
వరములు నీదు సత్ కృపయె భాగ్యము మా జగదంబ! శాంభవీ!
౫౫) కవనమునందు నీ యునికి గాంచుదురుత్తములెన్ని, ప్రేమతో,
శ్రవణకుతూహలంబుగప్రశస్తిని పాడుదురర్ధి, తోడుతన్,
కవిగను నేను పొంగుదును కల్పనఁ జేసినదీవె యౌటచే
భవహరణంబుఁ జేసి మది వర్ధిలు మా జగదంబ! శాంభవీ!
౫౬) స్మరహరు రాణి వీవు, మనసార భజించెద నమ్మ నిన్ను నేన్,
పురహరునట్లె భక్తులకు భుక్తిని గొల్పుదు వమ్మ నిచ్చలున్,
కరుణరసాలవాలమ! సుఖంబుగ నిన్ గననిమ్ము, నెమ్మితో,
పరమ వివేక సౌరభము పంచుము మా జగదంబ! శాంభవీ!
౫౭) జతనము చేసి వ్రాయుటది సాధ్యము కాదుగ నిన్ను నెంచుచున్?
నుతమగు రీతి నేఁ దెలుప నోచిన పుణ్య ఫలంబె, యౌనుగా,
యతులిత వీవు నీ కృప ననారత మొందెద నమ్మ, మ్రొక్కుచున్,
క్షితిని శుభాళినే గొలిపు శేముషి! మా జగదంబ! శాంభవీ!
౫౮) జననివి నిన్ స్మరింపగనె సద్గుణ మబ్బును మాకు! గొప్పగా,
ఘనమగు కార్యకర్తలుగ గౌరవమందుదుమమ్మ, యెప్పుడున్,
ప్రణవమె నీదు రూపమొకొ? వర్ధిలఁ జేయును మమ్ము నెత్తరిన్,
సునిశిత బుద్ధి నిమ్ము నినుఁ జూచెద మా జగదంబ! శాంభవీ!
౫౯) సరగున వచ్చి నీవు మము చక్కగ కావుము ధాత్రి పొంగగా,
పరమ పవిత్ర భావ మిడి పాడిగ వర్ధిలనిమ్ము, మమ్ములన్,
సురుచిర పద్య సద్రచన శోభిలఁ జేయగనిమ్ము, ప్రేమతో,
కరుణరసార్ణవా! కనుచు కావుము మా జగదంబ! శాంభవీ!
౬౦) జయదవటంచు నమ్మితిని, సన్నుత భావనతోడ నిన్నునేన్,
భయమును పాపు శక్తివని భక్తిని గొల్చెదనమ్మ నిత్యమున్,
నయవర మార్గ దర్శి వని నా యెద నిన్ విడలేను , నీవె సత్
ప్రియముగ కావుమమ్మ నను వేల్పుగ మా జగదంబ! శాంభవీ!
౬౧) నిరుపమమౌ దరిద్రమున నిత్యము మ్రగ్గెడి వారు, ధాత్రిపై
దరి కనలేక దుఃఖమున దారిని తప్పెడివారు, బాధతో
స్మరణము చేసి నిన్నిలఁ బ్రశాంతత నిమ్మని వేడ వెంటనే
కరుణను కాచుచుండెడి సుగణ్యవు, మా జగదంబ! శాంభవీ!
౬౨) పరమ దయాస్వరూపిణివి, బాభ్రవి! నిన్ను దలంతు, నిత్యమున్
సురుచిర సుందరోజ్వల విశుద్ధకవీశ్వరి వీవె, యమ్మరో,
ధరణిని బాపి బాధలను ధర్మము నిల్పుము నీవు, కర్వరీ!
చరణములంటి మ్రొక్కెదను, సన్నుత! మా జగదంబ! శాంభవీ!
౬౩) శ్రుతిచయమాశ్రయించి నిను శోభిలె దేవతలౌచు సృష్టిలో,
నుతమగు మార్గదర్శకమనూనవిధంబుగ జేయు, చున్ సదా
గతమును వర్తమానమును కల్గెడి భావిని చూపు నేర్పుతో,
మతిఁ గన నీవె వేదములు మానిత! మా జగదంబ! శాంభవీ!
౬౪) కలతల మూలకారణము కల్లగ నొప్పెడి సృష్టి చూడగా,
వెలవెలబాటె శేషమగు విశ్వము నమ్మిన మాకు, నమ్మరో!
సులలితభావనల్ శుభము శోభిల గొల్పగరాదొ? నిత్యమై
వెలసిన నిన్ను గొల్వనగు వేల్పుగ, మా జగదంబ! శాంభవీ!
౬౫) అమలిన భావనాగరిమ నందముగా నిడు మమ్మ! నిత్యమున్
క్షమయు నహింసయున్ గొలిపి కావుము కాలుని నుండి నేర్పుతో,
ప్రముదముతోడ నిన్ గొలిచి వర్ధిలునట్లొనరింపు సత్ కృపన్,
నిముసము కూడ నిన్ మరువ నేరను, మా జగదంబ! శాంభవీ!
౬౬) మనుటకు నీవె జీవులకు మార్గము నిత్యము చూడ నిద్ధరన్,
ప్రణవమె నీవు, జీవులను ప్రాణము నీవె కదమ్మ! నేర్పునన్,
ఘనతర సృష్టి సాగుటకు కారణ మిద్దియె కాంచ పాటలా!
వినుతి నొనర్తు, కావుమము వేల్పగు మా జగదంబ! శాంభవీ!
౬౭) నరకమనంగ నయ్యె భువి, న్యాయము కానగ రాదుగా కనన్,
పరమ పవిత్ర భావులకు బాధలె దక్కుచు నుండె నిత్యమున్,
వరములొసంగు దేవతవు, వర్ధిలు ధర్మము నీవె, సంస్కృతిన్
వరలఁగఁ జేయ హైందవము వర్ధిలు, మా జగదంబ! శాంభవీ!
౬౮) కమలదళాయతాక్షివిగ, కాంచగఁ జాలఁగ లేవొ? దౌష్ట్యముల్,
విమలమనోజ్ఞమానసుల వేల్పువు నీవెగదమ్మ! నిత్యమున్,
కుములుచునున్నవారలను, కూర్మిని గాచుట పాడి కాదొకో?
ప్రముదమునేలు మీ జగతి, భద్రద! మా జగదంబ! శాంభవీ!
౬౯) ననుఁ గను కల్పవల్లివని నా సఖులెల్ల గణింత్రు, వారు నా
మనమున నిన్ను నెన్ని యభిమానముతోఁ గనుచుంద్రు ప్రేమతో,
వినయవిధేయతల్ గొలిపి పృథ్విని నిల్పిన నిన్ను నెన్ని నే
ఘనముగఁ జూపనెంచితిని కామ్యద! మా జగదంబ! శాంభవీ!
౭౦) సహృదయ సోదరీమణులు, సన్నుత సోదరులుండి నన్నిటన్
మహిత కవి ప్రకాండునిగ మన్నన చేయుట, చూడు మమ్మరో!
సహచరులిట్లు నీ మహిమ చక్కగ గాంచుట వింత కాదుగా,
మహిమను వారినేలుమిక మంచిగ, మా జగదంబ! శాంభవీ!
౭౧) కులసతు లెందరో మిగుల కూర్మిని గాంచుదు రమ్మ, నీవలెన్,
సులలిత భావనా కలిత సుందర సద్గుణు లెన్న గాభువిన్,
కలుష విదూరులందరిని కావుమ నేర్పుగ నీవు నిత్యమున్,
నిలుచుచు వారి చిత్తముల, నిర్మల! మా జగదంబ! శాంభవీ!
౭౨) చెప్పుడుమాటలన్ వినుచు చేయగరానివి చేసి దుష్టులై
తప్పుగనున్నవారలను దండన చేసెడి తల్లి! మ్రొక్కెదన్
తప్పులు చేయనీయకుము, ధర్మము నిల్పుము ధాత్రి పైన నా
తప్పులు మన్ననన్ గనక తప్పదు, మా జగదంబ! శాంభవీ!
౭౩) ధర్మము నిప్పువంటిదది దాగదు దాచిననంద్రు పెద్దలే
మర్మముతోడ ధర్మమును మాయము చేయుచునుండి ధాత్రిపై
ధర్మమధర్మమే యనుచు తప్పుగ చెప్పుటదేల నీశ్వరీ!
కర్మలు మార్చి ధర్మమును కావుము మా జగదంబ! శాంభవీ!
౭౪) నుతమతులైనవారల కనూనజయంబిడుమమ్మ నిత్యమున్,
బ్రతుకగ లేనివారలకు భద్రతఁ గొల్పుమ నీవు ప్రేమతో,
చితికిన జీవితమ్ములను చిందర చేయక నిల్పు మమ్మరో!
గతుకగ లోటు గొల్పకుమ కామ్యద! మా జగదంబ! శాంభవీ!
౭౫) రచనలు పెక్కు చేసితి వరంబుగ నీవె యొసంగ ధాత్రిపై,
సుచరిత నెన్ని చూపితిని శోభిల పాఠకు లెల్ల నన్నిటన్,
ప్రచురణ చేసి రార్యులు ప్రపంచమునందున చూప మెప్పుగా
నచలజ! నీవు కొల్పిన మహత్వమె, మా జగదంబ! శాంభవీ!
౭౬) ఆత్మయనంగనేది? పరమాత్మయె యాత్మయనంద్రు, నిక్కమా?
స్వాత్మసుదర్శనంబయిన నార్యుల లోకమె వేరు చూడగా,
నాత్మను చూపి సందియమునంతము చేయగదమ్మ, నాకిలన్,
స్వాత్మనెఱింగి వర్తిలుదు నమ్మరొ! మా జగదంబ! శాంభవీ!
౭౭) వయసు గతించుచుండు నిల ప్రాయము పైఁబడుచుండు నిత్యమున్,
భయము జనించుచుండు బహు పాపపు కార్యములెంచి, ప్రేమతో
నయమగు మార్గవర్తనను నాకు నొసంగ వదేల? చెప్పుమా,
ప్రియముగ నేలు నన్నుఁ గృప వేగమె, మా జగదంబ! శాంభవీ!
౭౮) నుతమతులైనవారల ననూన దయామతి గావు, మమ్మరో,
క్షితిపయి ధర్మమున్ నిలుప, కీర్తిని గొల్పుము నీవు సన్నుతిన్,
బ్రతుకు నొసంగు మమ్మ! వరభావన లిచ్చుచు నుండి, సమ్మతిన్
స్థితిని రహింపఁ జేయుమ ప్రసిద్ధిగ, మా జగదంబ! శాంభవీ!
౭౯) లోపము సృష్టిలో కలదొ? లోకుల నున్నదొ తెల్పు మమ్మరో!
శాపమొ భారతావనికి? శాత్రవులెందరొ చూడు కూల్చగన్
కోపమురాదొ నీకుఁ? గని క్రూరుల నొంచ వదేమి చిత్రమో?
శాపము పాపి కావుమిల చక్కఁగ మా జగదంబ! శాంభవీ!
౮౦) ఘనత వధాన సత్క్రియకుఁ గల్గగఁ జేయుమదంబ! సంస్తుతుల్,
జనులకు పద్య విద్యపయి చక్కని బోధను గొల్పి భక్తితో
ఘనులగు సద్వధానులకు గౌరవమీయఁగఁ జేసి, ధాత్రిపై
వినుతిగ కావుమా నుతకవిత్వము మా జగదంబ! శాంభవీ!
౮౧) మంచికి చెడ్డకున్ చెలిమి మాకు రహింపదు చూడ వేలనో,
సంచిత పాపపుణ్యములు సత్క్రియలన్విడఁ జేసి, నేర్పుతో
మంచిగ లోకమందున సమంచిత రీతిని నిల్పి శైలజా!
గాంచగ నీకు పుట్టుకను, కావుమ, మా జగదంబ! శాంభవీ!
౮౨) నీ కృప పొందఁ గల్గితిని, నిన్ను స్మరించుచునుండి నిత్యమున్,
లోకుల మంచి చూచి మదిలోననె పొంగుచునుంటినమ్మరో
నీకు కృతజ్ఞతల్ తెలుప నేరను కారణ మీవె నన్నిలన్
సాకెడి తల్లివైన గుణ సన్నుత! మా జగదంబ! శాంభవీ!
౮౩) వినుతపురాణ గాధలకు పెక్కులు మార్పులు చేసి ధర్మమున్
కనఁదగు దారి మూసి, కొరగాని విధంబుగ చేసి, రద్దిరా
మనము కరుక్కుమంచనగ మాన్యులకున్ ఖలపాళి దుష్టులై
వినుమ! స్వధర్మమున్ నిలుపు వేల్పుగ మా జగదంబ! శాంభవీ!
౮౪) భారము నీదె మాజనని భద్రతనీవె కనంగ మాకిలన్,
ఘోరము చేయువారలను కూర్మిని గాంచకు మమ్మ, ధీరతన్
శూరతఁ గొల్పి భక్తులకు, శోభిలఁజేయుమనన్య! శాంతమున్
జేరగనీక దుష్టులను చీల్చుమ, మా జగదంబ! శాంభవీ!
౮౫) పరమత ధర్మమేల? మన భారతదేశముపైన, చెప్పుమా,
వరగుణభాస భారతము వర్ధిలె నాడు ప్రశస్తి నొప్పుచున్,
కరుణను చూపి కావుమిక కమ్మని భారతినెన్ని ప్రేమతో,
నిరుపమ! నిన్ను గొల్చెదను నిత్యము, మా జగదంబ! శాంభవీ!
౮౬) స్త్రీలను మాతృమూర్తులుగ చిత్తములన్ గనినారు, దివ్యులే,
కాలము మారిపోయినది, గౌరవభావము తగ్గె నేలనో?
పాలన చేయువారికిది పట్టదదేలనొగాని, ధాత్రిపై
క్షాళన చేయఁజేయుమ లసన్మణి! మా జగదంబ! శాంభవీ!
౮౭) కొండలనుండువారలకు కొల్పుట ధర్మము దారి, వారలన్
బండలవోలె గాంచుటది పాడియుకాదుగ చూడ వారికిన్
మెండుగ సౌఖ్యముల్ గొలిపి, మేలును గూర్చుట పాడి, శైలజా!
అండగ నుండి కావు మిల నార్తిని మా జగదంబ! శాంభవీ!
౮౮) విద్యగడింపగా ధనము వేలును లక్షలె యౌను నేడిటుల్
సద్యశమొప్పనొప్పునది సంస్కృత భాషయు లేదు చూడగన్,
పద్యములాయె మృగ్యము, ప్రభావ దీనతనొందె చూడగా,
వేద్యము నీకు, కావుమిల ప్రీతిగ మా జగదంబ! శాంభవీ!
౮౯) చక్కని సంస్కృతిన్ గొలుపు సంస్కృతభాషను నిల్పు, ధాత్రిపై,
దక్కును శాస్త్రసంపదలు, దక్కును పూర్వుల విద్య ప్రేమతో
మక్కువతోడ శ్లోకములు మంచిగ నేర్పుము నీవె, శైలజా!
వాక్కులె వాఙ్మయమ్మగుచు వర్ధిలు, మా జగదంబ! శాంభవీ!
౯౦) నామది నిల్చి నీవు కరుణన్ రచియింపఁగఁ జేసి ప్రోచితే
నేమముతోడ నేడిటుల, నీకు నమస్కృతులమ్మ! సంస్కృతిన్
ధీమతులెల్ల కాచునటు తేజము గొల్పుమ నీవు, వారికిన్,
హే మహిమాన్వితా! వరమహేశ్వరి! మా జగదంబ! శాంభవీ!
౯౧) మాగురుదేవునానతియు మాన్యులు మెచ్చెడి మంచి, నిత్యమున్,
నేగణియించి నిన్ గనుచు నిశ్చల భక్తిని చేసి పండితుల్
బాగనునట్లు కావ్యములు భక్తిని వ్రాయుచునుంటి, ప్రేమతో
నే గణుతింతు నిన్ మదిని నేర్పున, మా జగదంబ! శాంభవీ!
౯౨) కవివరు లెందరో కలరు, కావ్యపరంపర గొల్పి ధాత్రిపై
రవికి సమానులౌచు తనరారెడువారు జగాన, నిత్యులై
ప్రవరులు వారు, సన్నుతులు వారికి నో జగదంబ, నీ కృపన్
గవితలు నిల్పుమీవె కని న్యాయము, మా జగదంబ! శాంభవీ!
౯౩) ప్రవరులు పండితోత్తములు వర్ధిలు గాత జగాన, నిత్యమున్,
నవ కవితా వతంసులు ననంత పరిశ్రమ తోడ వెల్గుచున్
కవనము పండఁ జేసి కలికాలము పాపుచునుంద్రు, భక్తితో,
భవితను వారికిమ్ము పరివర్ధిల మా జగదంబ! శాంభవీ!
౯౪) జీవులలోన శక్తివి, ప్రసిద్ధిని గొల్పెద వీవె నిత్యమున్,
భావనలన్ సృజించెదవు, భానుని తేజము నిచ్చి నీ కృపన్,
సేవలు గొంచు, మా వినతి చేఁ గొనుమమ్మరొ నీవు, ప్రేమతో,
సేవిత పాద నిన్ గొలుతు శ్రీకర మా జగదంబ! శాంభవీ!
౯౫) కనుమిల రామకృష్ణుఁడను, కమ్మగనేడిది వ్రాసి భక్తితో
గొనుమని నీకొసంగితిని కూర్మిని నీకృప చేత నమ్మరో!
ప్రణతులు నీకు, నీ పతికి, భాగ్యద వీవె గణించు నాకృతిన్,
ఘనతయె గల్గ నీదె యది, కామ్యద! మా జగదంబ! శాంభవీ!
౯౬) శాంభవి పేర వ్రాసితిని సన్నుతి నీ శతకంబు, గాంచుమా,
శంభుఁడు కూడ మెచ్చునటు చక్కగ వ్రాయగఁ జేసి నీకృపన్
దంభము లేని నాపయి ననారత ముండగఁ జేసి వెల్గనీ
శంభుని రాణి! నన్ గనుమ, సన్నుత! మా జగదంబ! శాంభవీ!
౯౭) జయమగునమ్మనీకు గిరిజా! కృతినొప్పగ నుండి వెల్గనీ,
నయవరవర్తనల్ నిలిపి, న్యాయము నిల్పుచునుండు మెప్పుడున్,
భయములు వీడఁ జేయుము, స్వభావమె నీవుగ మారు మన్నిటన్,
క్షయమె యెఱుంగనీక ధర కావుము, మా జగదంబ! శాంభవీ!
౯౮) చిత్రకవిత్వ తత్త్వమును చిత్తములందున నిల్పు మమ్మరో!
పాత్రులుగా నొనర్చుచును భక్తులఁ గావుమ నీవు ప్రేమతో,
నాత్రము లేని జీవన మనంత శుభంబుల నిమ్ము దుద్దురా!
పాత్రుఁడ నమ్మ, నన్ గనుము భాగ్యద! మా జగదంబ! శాంభవీ!
౯౯) నా తలిదండ్రులన్ దలతు నా కృతి చూచుచు మెచ్చ నెంచుచున్,
ఖ్తాతిని గొల్పు మిత్రులను గౌరవమొప్పదలంతు నీశ్వరీ!
ఖ్యాతిగ చిత్తమందలి నయాన్విత నాసతి నెంతు నాత్మలోన్,
నీతిగ నిల్పు నిన్ గొలుతు నేర్పున! మా జగదంబ! శాంభవీ!
౧౦౦) మంగళమూర్తివీవు పరమంబది చూడగ నీవె సృష్టిలో
మంగళముల్ సృజించెదవు, మాన్యతఁ గొల్పగ మాకు నిద్ధరన్,
మంగళసాంబునెంతు మది, మంగళరూప భవాని నీకు, సన్
మంగళమౌత యీకృతికి, మంగళ! మా జగదంబ! శాంభవీ!
౧౦౧) అమ్మవు వ్రాయఁ జేసితివి, అమ్మయి రక్షగ నిల్చి నేడిటుల్,
కమ్మని భావనా పటిమ గౌరవ మొప్పఁగఁ గొల్పి నేర్పుతో
నెమ్మది నిల్చి నీవె కరుణించి రచించితివమ్మ, కైకొనన్,
సమ్మతి నంకితమ్మిడితి చక్కగ, మా జగదంబ! శాంభవీ!
౧౦౨) భారత భూమి శోభిలుత, భద్రత నొప్పుత ధాత్రి నిత్యమున్,
ధీరులు పండితోత్తములు తేజముతోడ రహింత్రు భూమిపై,
స్మేరముఖాంబురాసులగు స్త్రీలకు నొప్పు శుభాళి యెల్లెడన్,
శ్రీకర సత్కవీశులను చేరుము మా జగదంబ! శాంభవీ!
౧౦౩) నాది గణింప లేదిచట నా జనయిత్రిది శక్తియంతయున్,
వేద నిధాన మామె, తెరువే జగదంబ కనంగ నన్నిటన్,
మోదముతోడ నీరచన పూర్తిగ నెవ్వరు గాంత్రు వారికిన్
బాధలు దూరమై శుభము వర్ధిలు, మా జగదంబ! శాంభవీ!
౧౦౪) తన మదిలోని శత్రులను తానె జయించిన చాలు, నన్నిటన్
ఘనముగ సంభవించు శుభ కల్పనలెన్నగ నొప్పి, నిత్యమున్,
ప్రణవ మహా ప్రపూజ్యవగు భాస్కర తేజమ! తల్లి, యాత్మలో
వినయముతోడ మ్రొక్కెద, సువిస్త్రుత! మా జగదంబ! శాంభవీ!
౧౦౫) చైత్రము నుత్తరార్థమున సప్తమి నాడు రచించినాడ, సత్
పాత్రుఁడనంచు నిల్పితివి భక్తిగ వ్రాయగఁ జేసి, ప్రేమతో,
స్తోత్రము లొప్పు గర్భకృతి శోభిలఁ జేసిన తల్లి! దీనికిన్
మాతృక వీవె మా జనని! మాన్యవు, మా జగదంబ! శాంభవీ!
౧౦౬) నలుబది మూడు గ్రంథములు నా జనయిత్రి! రచించి నేనుగా
సులలిత భావనా గరిమ శోభిలఁ గొల్పుచు నాకు, నిద్ధరన్,
కులసతి తోడు లేదనుచు కూర్చొనఁ జేయక నిల్పు చుంటివా?
చలితమనంబునన్ నిలుచు చల్లని మా జగదంబ! శాంభవీ!
౧౦౭) తప్పులు నావె యౌను, ఘనతన్ గొన వ్రాయను నేను మాతయే
యొప్పుగ వ్రాయఁ జేయుట ననూన ప్రశంసలు నీకె, నమ్మరో!
గొప్పయదెట్లు నాకగును? కోరుచు వ్రాసినదీవె యౌటచే,
చెప్పిన నీకె యీ సుకృతి, శ్రీన్మయ మా జగదంబ! శాంభవీ!
౧౦౮) మంగళమీకు పాఠకుఁడ! మంగళముల్ కవులార! మీకిలన్,
మంగళమీకు శ్రీ ధరుఁడ! మంగళమమ్మరొ! వాణి! నిత్యమున్
మంగళమమ్మ విష్ణు సతి! మంగళమమ్మరొ ధాత్రి! మాలినీ!
మంగళమమ్మ నీకు, శుభమంగళ! మా జగదంబ! శాంభవీ!
ఆ జగన్మాత ఈ రోజు నాచేత వ్రాయించుకొనిన శాంభవీ శతకము సమాప్తము.
చింతా రామకృష్ణారావు ... తే. 20 - 4 - 2025.
ఏతత్ సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.