జైశ్రీరామ్.
సీ|| ప్రాణికోటి మదిని పరమాత్మయై వెల్గు.,
తేజంబు నీవెగా తిరుమలేశ!
సకలంబు భ్రమయైన సంసారబంధాల.,
తీరుమార్చగగల్గు తిరుమలేశ!
కాలగమనరీతి కనిపింప నీయని.,
చిద్విలాసపు హాస! శ్రీనివాస!
భక్తి తత్త్వపు నిజభావనల్ జూపిన.,
అభయంబు నిచ్చెడి యమలతేజ!
తే.గీ. స్వామి! సప్తగిరీశ! “విశ్వావసు”వన.,
నీవె, ఎన్నిజన్మలకైన నిర్ణయాత్మ
కుండవు మహితమూర్తి! వైకుంఠవాస! .,
జగతి గావుమయ్య సతముప్రగతిజూపి..1.
సీ|| ఏడేడు లోకాల నెచ్చట జూచినన్.,
కలిమాయ తప్పించు ఘనుడవీవె.
అలమేలు మంగమ్మ యలుకలు దీర్చుచు.,
నవ్వించి కవ్వించు నటుడవీవె.
భక్తుల హృదయాలు పండించి నిండించి.,
పరవశించెడు ఘనపాఠివీవె.
లడ్డుకంబులనిచ్చి లాలస జూపించి.,
దరిజేర్చు కొనునట్టి హరివి నీవె.
తే.గీ. క్రొత్త పంచాంగ మందున కూర్మితోడ .,
నీదు కరుణనుజూపించి నిర్మలాత్మ!
అన్ని రాసుల వారికి తిన్ననైన.,
కనకవర్షంబు గురియించు కమలనాభ! 2.
సీ|| కొండలలోన పుంస్కోకిలంబులతతి .,
చైత్రమాసపుసౌరు చాటుచుండె
తుమ్మెద రాగాల తోషణ గానాల .,
మల్లెతోటలలోన మారుమ్రోగె
చిత్తజు పదునైన మెత్తని బాణముల్ .,
గుండె లోతులలోన గ్రుచ్చుకొనియె
వాసంత లక్ష్మియే వయ్యారముల్ జూపి .,
చిలిపిప్రకృతితోడ చేయిగలిపె
తే.గీ. ఈ ‘‘యుగాది’’ని నిట్లుగా నీశ్వరయ్య! .,
మార్చివేయుట కీవెగా మంచిగురువు
పరమకారుణ్య సౌజన్య! వరద! మాకు .,‘‘
విశ్వవసువు’’న శుభముల విసరుమయ్య 3.
సీ|| వేంగమాంబాదేవి విష్ణుభక్తికిమెచ్చి .,
అన్నదానమిచట నమలు పరచ
వృద్ధులు పంగులు వికలాంగులెల్లరు .,
శీఘ్ర దర్శనములు చేయుచుండ
గోసేవ జేయుచు గోవులనన్నిటన్ .,
తనివార ప్రేమను దనుపుచుండ
తిరుమల క్షేత్రంబు దేదీప్యమానమై .,
ఘనపు టుగాదిగా కాంతులీనె
తే.గీ. నిత్యకల్యాణమిచ్చట నిర్మలాంగ.,
పచ్చతోరణమైచను పరమపురుష!
నీదుపాదంబులే సాక్షి నిజము నిజము .,
ధన్యమాయెను మాజన్మ ధరణినాథ! 4.
సీ|| షడ్రసో పేతమై సకలజ నాళికి .,
పలురుచుల్ చూపించు పండుగిదియ
క్రొత్తవస్త్రాలతో కోలాహలమునిండి.,
ప్రతియింట వనలక్ష్మి వరలుచుండ
పంచాంగ పఠనాన భావిని దలచుచు .,
కష్టసుఖంబులు కలలుగనుట
ఆదాయ వ్యయములు సాదాగనుండుటన్ .,
జీర్ణించుకొనలేని జీవితాలు
తే.గీ. మానసికమైన దైహిక మార్పులన్ని .,
నీదు కరుణాంత రంగమే నిశ్చయముగ
నిజము కదటయ్య లోకేశ! నీరజాక్ష! .,
కాక, రుచులును ప్రతిభలు కలుగుటెట్లు?5.
సీ|| నాదనీరాజన వేదసమర్చనల్ .,
నిత్యసంపూజిత నెలవు మీకు
భక్తదర్శనములు పల్లాండు దీవనల్
పరవశంబునుగొల్పుప్రభలు మీకు
మాడవీధులద్రిప్పు మానితసేవలే
నిత్యకల్యాణముల్ నీకునెపుడు
తిరుమల గడపిన దివ్యక్షణంబులే.,
వైకుంఠమునుజేరు వరుసమెట్లు
తే.గీ. మాకు దక్కిన భాగ్యంబు మదనజనక! .,
కలియుగంబున వెలసిన కైటభారి
ఏడుకొండల మా సామి వేడుకొందు.,
పాదపద్మములంటుచు ప్రతిదినంబు..6.
సీ|| ఆదిశేషునిపేర యమితకీర్తినిగాంచి.,
“శేషాద్రి”యయ్యెను సేవ కొరకు
నీలాంబరీ దేవి నీలాలనిచ్చుటన్.,
“నీలాద్రి”యైనిల్చె నిన్నుగొల్వ
అంజనాదేవియె ఆత్మనిన్ దలచుచు.,
“అంజనాద్రి”యనగ యలరెనాడు
వృషభాసురుని గర్వ విచ్ఛిత్తి జేయుటన్.,
“వృషాద్రి”యైచనె వినయమొప్ప
నారాయణాఖ్యుడన్ నవవిధ భక్తుడే.,
“నారాయణాద్రి”యై నభముదాకె
గరుడవాహనమది కంజాక్షుసేవింప .,
“గరుడాద్రి”యయ్యెను ఘనముగాను
వివిధపాపంబులన్ వీగగ జేయుటన్.,
“వేంకటాద్రి”గ మారె విభవమొప్ప
తే.గీ. నామజపముల శక్తిమై నడక తోడ .,
ఏడుకొండలు భక్తితోనెక్కి వచ్చి
నిన్ను దర్శించు నరునకు నీరజాక్ష!.,
సప్తజన్మల పాపాలు సమసిపోవు..7
సీ|| తీర్థయాత్రనుజేయ తిరుమలనెంచుటే.,
పూర్వజన్మలలోని పుణ్యఫలము
తలనీలములనిచ్చు ధర్మంబుపాటింప.,
దర్పహీనుండైన దాసుడనుట
కోనేటినీటను గ్రుంకులాడుటయన్న.,
జాహ్నవీతటిలోన స్నానమగును
బాలాజి చెంగటన్ భక్తినుగాదికై.,
అక్షరార్చనసల్ప మోక్షదంబు
తే.గీ. అన్నిగ్రహముల కరుణకు నంజలించి.,
ప్రకృతిశోభకు నిలువెల్ల పరవశించి
మానితావకాశ మిడిన మాన్యులకును.,
వందనమ్ములు శ్రీకర చందనములు..8.
సీ.: శ్రీదేవి తో నీవు చిద్విలాసుడవౌచు
భువియంత దిరుగాడ పులకరించు
పంచబాణుని గురి బ్రహ్మాస్త్రమై తోచి
అనురాగ రాగాలనలర జేయు
పాదపంబులు పూర్ణ పల్లవ శోభలన్
పచ్చదనంబును బరచుకొనును
శృంగార భావముల్ చిత్తాన మొలకెత్తి
సౌంజ్ఞల సరసాల సాగుచుండు
తే.గీ: ఆదిపురుషా ! కమలనాభ! యమలచరిత!
చేతనత్వము నీదివ్య సృష్టి యనుచు
చేసిచూపితివయ్యరో!శ్రీనివాస!
కాలచక్రంపుటాకు నుగాదియనగ..9
సీ: వేపపూతయు నుప్పుబెల్లంబు కారముల్
పులుపు వగరు లెల్ల పొందుపరచి
గా జులచేతితో ఘనమైన ప్రేమతో
నోర్పుగా నొకటిగా నూరినూరి
నళిననేత్రుని ముందు నైవేద్యమిడకున్న
రుచియురాదు మరియు శుచియులేదు
తే.గీ: భక్తి తాత్పర్యభావముల్ రక్తిదనర
వింతలేహ్యంబు విష్ణు నైవేద్యమిడిన
అమృతతుల్యంబు రుచులు మహత్తరములు
శ్రీనివాసుడ!నీలీల చెప్పదరమె?..10
నమస్సులతో....‘‘సూర్యశ్రీ’’
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.