గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఏప్రిల్ 2025, గురువారం

శ్రీ విశ్వావసు ఉగాది కవితాగానం. ... చింతా రామకృష్ణారావు. తే.28 - 3 - 2025. శ్రీమతి స్వేతవాసుకి చానల్ లో ప్రసారితము.

 

జైశ్రీరామ్.

శ్రీరస్తు                             శుభమస్తు                    అవిఘ్నమస్తు.

విశ్వావసు వాసంతిక.

చింతా రామకృష్ణారావు.


శాశ్రీమన్మంగళ సద్ వసంత కళతో శ్రీమంత విశ్వావసున్

క్షేమానంద శుభ ప్రమోద సుఫల శ్రీలన్ బ్రసాదింపగా

ధీమాన్యుల్ గల భారతావని కిలన్ దేదీప్యమానంబుగాఁ

బ్రేమన్ రమ్మని స్వాగతమ్ము పలికెన్ విఖ్యాతి నీ కోకిలల్.

 

చల్లని పిల్లగాలులిల చక్కని పుష్ప పరీమళంబులన్

మెల్లగ సంతరించుకొని మేలగు నూతనవత్సరాదిలో

సల్లలితంపు భావన లసాదృశ రీతిని గొల్పుచుండె, రం

జిల్లగ మానసంబులు, ప్రసిద్ధ కవీశుల మెప్పులందుచున్.

 

హైందవధర్మ తేజము, మహేశ్వరి రూపము వత్సరాదిమో

హాంధము బాపి, సత్ప్రభ నహర్నిశలున్ వెలుగంగఁ జేసి,

ర్వాంధులఁ బారఁద్రోలి, జరామర కీర్తిని దేశమాతకున్

సంధిలఁజేయ లోకమున చక్కగ వచ్చెను నేడు ప్రేమతో,

 

నూతన శక్తి సంపద ననూనముగా ప్రభవింపఁ జేయగా

ఖ్యాతిగ షడ్రుచుల్ కలిగి కమ్మగనొప్పు నుగాదిపచ్చడిన్

ప్రీతిగనిచ్చి చిత్తములు వెల్గగఁ జేయు మహోత్సవంబిదే,

నీతిగనుండువారల ననేక విధంబుల కావ వచ్చెనే.

 

భావజవైరి పత్నికి శుభంకర కాళికి మంగళంబు, వి

శ్వావసు వత్సతంబునకు, భాగ్యవిధాతకు  మంగళంబగున్,

ధీవర పండితాళికిని, దేవులఁ గొల్చెడి భక్తపాళికిన్,

జీవనభాగ్యమై వెలుగు స్రీ  జనపాళికి మంగళంబగున్.

స్వస్తి.

తే. 20 – 3 – 2025.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.