శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.
ఓం శ్రీరామాయ నమః.
శ్రీమద్వాల్మీకి రామాయణము…యుద్ధకాండ..౧౩౧వ సర్గ…శ్రీరామ పట్టాభిషేకము.
రచన…చింతా రామకృష్ణారావు.
II నాంది II
శాII శ్రీమన్మంగళ విఘ్ననాయకుని నే చింతించెదన్ భక్తితోన్,
నా మర్యాదను నిల్పుశాంభవిని, వీణాపాణి నా శ్రీరమన్,
శ్రీమన్మంగళ రాఘవార్యగురునిన్ చిత్తంబులో మ్రొక్కెదన్,
ధీమంతంబుగ వ్రాయఁ జేయుఁడనుచున్, దీవింపఁగా వేడుచున్.
భావముII నేను వ్రాయుచున్న యీ గ్రంథమును ధీమతినై వ్రాయునట్లు దీవించవలసినదిగా కోరుచు మంగళాకరుఁడయిన విఘ్నేశ్వరుని భక్తితో మనసులోఁ దలచెదను. నా గౌరవమును నిలిపెడి నా తల్లి శాంభవిని, శారదామాతను, మహాలక్ష్మీ అమ్మవారిని, వేంకట వీర రాఘవాచార్య గురుదేవులను భక్తితో మ్రొక్కెదను.
II ప్రస్తావన II
శాII శ్రీమన్మంగళ రామచంద్రుని దయన్ సీతమ్మ ప్రేమన్ లస
ద్వామాలంకృత జానకీ సుదతితోఁ బట్టాభిషేకమ్మునన్
రాముండెట్టుల వెల్గెనో తెలిపెనా ప్రఖ్యాత వాల్మీకి,నే
క్షేమంబంచును వ్రాసితిన్ దెలుఁగులో, గీర్వాణులున్ మెచ్చఁగన్.
భావముII శ్రీ మంగళప్రదులయిన సీతారాముల ప్రేమ, దయ కారణముగా ఆదికవి వాల్మీకి శ్రీరామచంద్రుఁడు పట్టాభిషేక మహోత్సవ సమయములో వామభాగమునందు వసించు సీతామహాసాధ్వితోఁ గూడి యే విధముగా ప్రకాశించెనో తన రామాయణ కావ్యమున సుప్రసిద్ధముగా తెలిపియున్నాడు. అద్దానిని నేను దేవతలు కూడా మెచ్చుకొను విధముగా తెలుఁగు పద్యములలో వ్రాసియుంటిని.
చం. ప్రణవము రామనామ మది వ్రాయఁగఁ జేయఁగ తేటగీతులన్
దినములు రెంటికిన్ నడుమ దీనిని నేను రచించినాడ, నా
మనమది రామ నామ పరమార్థము నీ యభిషేక వృత్తమే
ఘనమని చెప్పుటన్, మహిత గాధను నే గ్రహియించి తిత్తరిన్.
భావముII ప్రణవతత్త్వమున నొప్పునది రామనామము. అది వ్రాయునట్లు చేయుటచే రెండు రోజులకు నడిమి భాగమున ఒక రాత్రిలో నేను తేటగీతి పద్యములలో ఈ గ్రంథమును రచించితిని. ఈ రామ నామ పరమార్థము ఈ పట్టాభిషేక వృత్తాంతమే అని నా మనసు చెప్పుటచేత గొప్పదైన యీ వృత్తాంతమును స్వీకరించి రచించితిని.
II అంకితము II
శాII సీతా రాముల పాదపద్మములకున్ జిత్తంబు పొంగంగ నే
నేతత్ కావ్యము నంకితం బొసగితిన్, హృష్టాత్ములై కైకొనన్,
బ్రాతస్సంధ్యఁ బఠించు భక్తులకు సంప్రాప్తించు నారోగ్యమున్
ఖ్యాతంబౌ ధన ధాన్య ధేను శుభముల్ గణ్యంబుగా నిత్యమున్.
భావముII శ్రీ సీతారాములు సంతోషించుచు స్వీకరించుటకు గాను నా మనసు ఉప్పొంగునట్లు నేను ఈ కావ్యమును ఆ దంపతుల పాదపద్మములకు అంకితమొసఁగితిని. ప్రాతఃకాలముననే ఈ గ్రంథమును చదివెడి భక్తులకు ఎల్లప్పుడు ఆరోగ్యము, ప్రసిద్ధ ధన ధాన్యములు ధేనువులు, శుభములు చేకూరును.
II శ్రీరామ పట్టాభిషేకము II
౧) తే.గీ.II సుందరాత్ముఁడు కైక కానందకరుఁడు,
మహిత భరతుఁడు శిరసా నమస్కరించి,
సత్య సత్పరాక్రమశాలి సాధుశీలి
నన్న రామునిఁ గాంచి తా ననియెనిట్లు.
భావముII కైకేయి నందనుడైన భరతుడు, శిరస్సుపైన తన చేతులను ఉంచి అంజలి ఘటించి, సత్యమగు పరాక్రమము కలిగిన తన పెద్దన్న అయిన శ్రీరామునితో ఇట్లు పలికెను.
౨) తే.గీ.II పూజ్యురాలైన తల్లిచే పొందినట్టి
రాజ్యమిది నాకు, మీరిది రమ్యముగను
నాకు నిచ్చిన విధముగా మీకు నేను
నిచ్చుచుంటిని యని బల్కె నీప్సితముగ.
భావముII ఇది పూజ్యురాలైన మా అమ్మగారి వలన నాకు వచ్చిన రాజ్యము. దీనిని మీరు నాకు ఇచ్చినట్టుగా మరల మీకు తిరిగి ఇచ్చుచున్నాను.
౩) తే.గీ.II బల వృషభము మోసెడి గొప్ప భారమిద్ది,
బక్క లేగను బోలు నే నొక్కరుండ
మోయ లేకుంటి నగ్రజా! పుణ్య పురుష!
చూడుమిది నాకు భారమే, సుజన పూజ్య!
భావముII బలమైన ఎద్దువలె మోయఁ దగిన ఈ రాజ్యభారమును లేగదూడ వలె ఒక్కఁడిగా ఉన్న నేను మోయలేకపోవుచున్నాను.
౪) తే.గీ.II వేగముగ పారు నదిచేత భిన్నమయిన
సేతువును బోలె రాజ్యంబు, నా తరంబె
దీని నిఁక నియంత్రించంగ? దీన రక్ష!
నాకుఁ దోచుచున్నది యిట్లు నయనిధాన!
భావముII నదీవేగమునకు పగుళ్ళు వచ్చిన ఆనకట్టవలె, ఈ రాజ్యము నియంత్రించుటకు వీలుపడకున్నదని నాకు తోచుచున్నది.
౫) తే.గీ.II శత్రు సంహారకా! రామ! ఆత్రముగను
నశ్వ గతిఁ గొన్న ఖరమట్లు, హంస గతిని
గొన్న కాకి నాన్, గొన రాని గొప్ప మార్గ
మందుకొనఁ జాలకుంటి నో యమర వినుత!
భావముII ఓ శత్రునాశకా ! గుర్రములయొక్క గతిని ఒక గాడిద పొందలేని విధముగా, హంసలయొక్క గతిని ఒక కాకి పొందలేని విధముగా, నేను మీ మార్గమును అందుకొన లేకపోవుచున్నాను.
౬) తే.గీ.II పెరటిలో నాటి పెంచిన వృక్షమెటుల
పెరిఁగి శాఖోపశాఖలన్ పెద్దగనయి,
బలము గలవాఁడె యెక్కగా వలను పడని
విధముగా నుండి యయ్యది మధుర భావ!
భావముII ఏ విధముగా ఇంటి పెరటిలో నాటి, పెంచఁబడిన వృక్షము పెద్దదై, భారీ శాఖల వలన బలవంతులకు సైతము ఎక్కుటకు వీలుపడకుండి, మరియు…
౭) తే.గీ.II పుష్పములు కూడ వచ్చియు, పూజ్య రామ!
ఫలము లను గాంచకెండునో యిలనునట్టి
చెట్టు నాటిన వార లా చెట్టు ఫలము
లనుభ వింపగ లేనట్టు లమరవినుత!
భావముII పుష్పములు కలిగిన తరువాత, ఫలములు కలుగక ఎండిపోవునో, అటువంటి చెట్టు, నాటిన వాడు అనుభవింపలేని విధముగా ఉన్నట్లున్నది.
౮) తే.గీ.II ఓ మహాబాహు! యిట్టి యీ యుపమ, మమ్ము
మీదు దాసులన్ బాలనన్ మేదిని పయి,
రాజువలె చేయనట్టి మీ రమ్య మతికి
నర్ధమగు చూడ జగతి, నిస్స్వా ర్థపరుఁడ!
భావముII ఓ మహాబాహో ! మీ దాసులగు మమ్ములను రాజువలె పరిపాలింపని మీకు ఈ ఉపమానము అర్థము కాఁగలదు.
౯) తే.గీ.II లోక పాలనమున కభిషేకమునను
మిట్టమద్ధ్యాహ్న రవియట్లు, మితియె లేని
కాంతి నొప్పెడి మిమ్మిలఁ గాంచ వలయు,
రమ్య గుణ సాంద్ర! మహిత! శ్రీ రామ చంద్ర!
భావముII ఈ రోజు పట్టాభిషేకముచే, అమితమైన వేడి కలిగిన మధ్యాహ్న సూర్యుని వలె ప్రకాశించు మిమ్ములను లోకమంతా చూడవలెను.
౧౦) తే.గీ.II తూర్య సంఘాత ఘోషతో, శౌర్య రామ!
చిరుత మువ్వల ధ్వనితోడ, నిరుపమాన
గానములతోడ “మేలుకో మాననీయ!”
యనెడి వఱకు సేదను తీరు, ముని సుపూజ్య!
భావముII సంగీత వాయిద్యముల ఘోషలతో, చిఱుగంటల సవ్వడులతో, మధురమైన గానములతో మిమ్ములను మేలుకొలుపునంతవరకు మీరు విశ్రాంతి తీసుకొనుఁడు.
౧౧) తే.గీ.II ఎంత వఱకు జ్యోతిశ్చక్ర మెంతవరకు
భూమి యుండునో, మేమును పూజ్య రామ!
అంత వఱకు మీ స్వామిత్వ మనుపమగతి
ననుసరించెదమయ్య! యో యసమ తేజ!
భావముII “ఎప్పటివరకు ఖగోళము ఉండునో, ఎప్పటివరకు వసుంధర ఉండునో, అప్పటి వరకు ఈ లోకమున మీ ఆధిపత్యమును మేము అనుసరించెదము.”
౧౨) తే.గీ.II పర పురంజయ రాముండు భరతుఁడన్న
మాటలన్నియు తా విని, మదిని పొంగి,
శుభకరాసనమునను గూర్చుండి యలరె
నద్భుతంబుగ నా యెడ ననుపమముగ.
భావముII భరతుని వచనములు విన్న పరపురంజయుఁడైన రాముఁడు అటులనే అని అంగీకరించి, శుభప్రదమైన ఆసనమున కూర్చుండెను.
౧౩) తే.గీ.II పిదప శత్రుఘ్న సూచనన్ వినుతులయిన
శ్మశ్రువర్ధకుల్ నిపుణులు, సత్వరముగ
రాముఁడున్న యచ్చోటికిఁ బ్రేమతోడ
వచ్చి చేరిరి యాత్మలన్ మెచ్చుకొనుచు.
భావముII తరువాత, శత్రుఘ్నుని సూచన మేరకు, నైపుణ్యము కలిగి, తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయఁగల క్షురకులు, రాముని వద్దకు వచ్చిరి.
౧౪) తే.గీ.II భరతుఁడొనరింప స్నానము ప్రథితబలుఁడు
లక్ష్మణుండు, సుగ్రీవుఁడున్ లక్ష్యమొప్ప
రాక్షస పతి విభీషణుం డాక్షణమున
స్నానమును జేసి రానంద మానసులయి.
భావముII ముందుగా భరతుఁడు స్నానమాచరింపగా మహాబలుఁడగు లక్ష్మణుఁడు, వానరరాజగు సుగ్రీవుఁడు, రాక్షసరాజగు విభీషణుఁడు, స్నానము చేసిరి.
౧౫) తే.గీ.II చిక్కులను విడదీసిన చికురములను,
స్నాన మొనరించి, విరిమాల, చక్కనైన
గంధ లేపనముల నొప్పి, సుందరమగు
శుభ్రవస్త్రుఁడై రాముండు శోభిలె నఁట.
భావముII అక్కడ ఉన్న రాముఁడు చిక్కులు విడఁదీయబడిన జటలతో స్నానముచేసి, అందమైన మాలలతో, గంధములతో లేపనము చేయఁబడి, శ్రేష్ఠమగు వస్త్రములు కట్టుకొని మిక్కిలి ప్రకాశించెను.
౧౬) తే.గీ.II రాముని నలంకృతునిఁ జేయు రమ్య వీర్య
వంతుఁడును లక్ష్మినొప్పుచు వరలువాఁ డ
తులుఁడు వంశవర్ధనుఁడు శత్రుఘ్నుఁడపుడు
లక్ష్మణునిఁ జేయఁ జొచ్చెను లక్ష్యమునను.
భావముII రాముని అలంకారమును చేయు వీర్యవంతుఁడు, లక్ష్మీత్వము కలిగిన ఇక్ష్వాకు వంశ వర్ధనుఁడు అగు శత్రుఘ్నుఁడు లక్ష్మణునకు కూడ అలంకారము చేయసాగిరి.
౧౭) తే.గీ.II దశరథస్త్రీలు సీతకు తమకు తాము
చేసుకొనున ట్లలంకృతిఁ జేసినారు,
రామచంద్రుని మదిఁగొను రమ్యతేజ
మొదవఁ జేసిరి, సీతమ్మ ముదము కనఁగ.
భావముII సీత యొక్క అలంకరణను దశరథుని భార్యలు తమకు తాము చేసుకొనినట్లు మనోహరముగా చేసిరి.
౧౮) తే.గీ.II పుత్ర వాత్సల్యమును చేసి పొంగుచున్న
వినుత కౌసల్య వానర వనితలకును
చేసె సుమహితాలంకృతి, శ్రీకరముగ,
నుత్సవ ప్రభ లా వేళనొప్పెనచట.
భావముII తదుపరి వానరపత్నులందరకును, పుత్రవాత్సల్యము చేత ఆనందభరితురాలైన కౌసల్య ఉత్సాముగా అలంకారము చేసెను.
౧౯) తే.గీ.II పిదప శత్రుఘ్నునాదేశ మెదను నిలిపి,
ఘన సుమంత్రుఁడన్ సారథి వినుత గతిని
ధృతి నలంకృత రథమును దెచ్చెనఁటకు
నుత్సహించుచుఁ గనఁగ మహోత్సవమును.
భావముII తరువాత, శత్రుఘ్నుని ఆదేశము మేర సుమంత్రుడు అను రథసారథి సర్వాలంకారములు చేయబడిన రథమును తీసుకువచ్చెను.
౨౦) తే.గీ. సూర్యమండల తేజంపు శోభనొప్పు
దివ్య రథమును గన్నట్టి భవ్యుఁడయిన
సత్య సత్పరాక్రముఁడైన స్తుత్యుఁడైన
రాముఁ డధిరోహణము చేసె రమ్య గతిని.
భావముII మహాబాహువు, సత్యపరాక్రమవంతుడు అయిన రాముఁడు సూర్యమండలము వంటి శోభఁ గలిగిన దివ్యమైన ఆ రథమును తన ఎదురుగా చూచి దానిని అధిరోహించెను.
౨౧) తే.గీ.II హనుమ సుగ్రీవు లపుడు మహత్వయుతులు
యింద్ర శోభనునొప్పుచు సాంద్ర భక్తి
స్నానమును జేసి వస్త్రముల్ చక్కగాను
వేసికొని కుండలమ్ములున్ బెట్టుకొనిరి.
భావముII సుగ్రీవుఁడు మరియు హనుమంతుఁడు మహేంద్రుని వంటి శోభ కలవారై, స్నానము చేసి దివ్యమైన వస్త్రములు కట్టుకుని, శుభకరమైన చెవికుండలములు పెట్టుకొనిరి.
౨౨) తే.గీ.II గొప్పగానొప్పు తొడవులున్ గుండలములు
యత్నమునఁ దాల్చి సుగ్రీవు పత్ని మరియు
సీతయున్, నగరంబును బ్రీతితోడఁ
జూడ నుత్సాహమున నొప్పి శోభిలిరఁట.
భావముII గొప్ప ఆభరణములు మరియు శుభకుండలములు పెట్టుకొని వచ్చిన సుగ్రీవపత్ని మరియు సీత, నగరము చూచుటకు ఉత్సాహముగా నుండిరి.
౨౩) తే.గీ.II దశరథుని మంత్రు లవ్వేళ ధర్మ వాక్కు
లైన ఘనపురోహితులిచ్చు జ్ఞానపూర్ణ
సూచనల నెన్ని భవ్య కార్యాచరణకు
సత్ప్రణాళికల్ రచియింపసాగినారు.
భావముII దశరథరాజు యొక్క మంత్రులు అయోధ్యయందు పురోహితుల సూచనలను అనుసరించి అర్థవంతముగా ప్రణాళికను సిద్ధము చేసిరి.
౨౪) తే.గీ.II విజయుఁడును, సుమంతుఁ, డశోకు డజయుఁడయిన
రామచంద్రుని యభివృద్ధి, రాజ్యలక్ష్మి
వృద్ధి కొరకు మంతనములు విశ్వమెన్నఁ
జేసినారు మహాత్ముల చిత్తమలర.
భావముII అశోకుఁడు, విజయుఁడు, సుమంత్రుఁడు కలిసి, రాముని యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు కొరకు నగరమందు శ్రద్ధగా మంతనములు చేసిరి.
౨౫) తే.గీ.II శ్రీకరుండైన రాముని చిత్తమలర
జరుపు పట్టాభిషేకమ్ము కొరకు మీరు
విజయ సూచకముగఁ జేయు వినుతమయిన
సర్వమంగళ కార్యముల్ జరుపుఁడనుచు.
భావముII మహాత్ముఁ డైన రాముని పట్టభిషేకము కొరకు విజయ సూచికగా చేయవలసిన అన్ని మంగళకరమైన పనులను తప్పక చేయుఁడు.
౨౬) తే.గీ.II ఆ పురోహిత వరులకు నచట నున్న
మంత్రివరులకున్ జెప్పిరి, మాన్యుఁడయిన
రామచంద్రుని గననెంచి రమ్య గతిని
నగరమున నుండి వెడలిరి నయము కోరి.
భావముII అని ఆ మంత్రులకు, పురోహితులకు తగు సూచనలు చేసి, శ్రీరామ దర్శనము కొరకు నగరము నుండి బయలుదేరిరి.
౨౭) తే.గీ.II ఉత్తమంబైన రథమున నుత్తముఁడగు
రామచంద్రుండు వజ్రినాన్ ప్రాభవమున
రథము నధిరోహణము చేసి రమ్య గతిని
నడుప సాగెను, సంతోషపడగఁ బ్రజలు.
భావముII ఉత్తమమైన రథమునందు ఇంద్రునివలె కళంక రహితుఁడయిన రాముఁడు స్వారీ చేయ సాగెను.
౨౮) తే.గీ.II పగ్గముల్ బట్టె భరతుండు ప్రాభవమున,
ఛత్రమున్ బట్టె శత్రుఘ్నుఁ డాత్రమునను,
వ్యజనమును పట్టి లక్ష్మణుం డమర వినుత
రామునకు వీచు నుదుటను ప్రజిన మమర.
(ప్రజినము = గాలి)
భావముII భరతుఁడు పగ్గాలను, శత్రుఘ్నుఁడు ఛత్రమును పట్టుకొనిరి. లక్ష్మణుఁడు వీవన పట్టుకొని రాముని నుదురునకు సోకునట్లుగా గాలి వీయసాగెను.
౨౯) తే.గీ.II పేర్మి రాక్షస రాజు విభీషణుండు
ప్రీతి కదురగ వీచె విఖ్యాతిగాను
తెల్ల వీవనఁ బట్టి తా నుల్లమలర,
రామచంద్రునకయ్యెడ రమ్యముగను.
భావముII తెలుపు రంగు చామరమును ముందువైపున, చంద్రప్రభ కలిగిన రాక్షసరాజగు విభీషణుఁడు పట్టుకొనెను.
౩౦) తే.గీ.II అప్పుడాకాశమందున నమరగణము,
ఋషులు. దివ్య మరుత్తులు తృప్తిగాను
రామునెన్నుచుఁ జేసెడి రమ్యమైన
కీర్తనలు గొప్పగానొప్పె స్ఫూర్తినిడుచు.
భావముII అప్పుడు ఆకాశమునందు ఋషి సమూహము, దేవతలు మరియు మరుద్గణములు చేయుచున్న రాముని యొక్క కీర్తనలు మధురముగా వినిపించినవి.
౩౧) తే.గీ.II పర్వతముతోడ సాటిగాఁ బరఁగుచున్న
వినుత శత్రుంజయంబను విక్కము పయి
పరమ తేజోవిరాజిత వానరపతి
వినుత సుగ్రీవుఁడెక్కెను, ప్రీతి గదుర.
(విక్కము = ఏనుగు)
భావముII అప్పుడు శత్రుంజయ అను పర్వతము వంటి ఏనుగును మహాతేజోవంతుఁడు, వానరముఖ్యుఁడు అగు సుగ్రీవుఁడు అధిరోహించెను.
౩౨) తే.గీ.II నవ సహస్ర నాగములపై ప్రవర గతిని
వానరులు ప్రయాణించగా పరఁగెనవ్వి
మానవుల యట్లలంకృతిన్ మన్ననఁ గని
యొప్పుచుండఁగ ధరపైనఁ గొప్పగాను.
భావముII తొమ్మిది వేల యేనుగులను అధిరోహించి వెంట వెళ్ళుచున్న వానరులు మనుష్య రూపమున సర్వాభరణములతోఁ గనిపించిరి.
౩౩) తే.గీ.II శంఖ దుందుభి స్వనములు చక్కగాను
మ్రోగుచుండంగ రాముఁడన్ పురుషభేల
మొప్పుగా నటు భవనాళినొప్పునట్టి
తమ యయోధ్యకున్ జేరంగ తాను వెడలె.
(భేలము = పులి)
భావముII శంఖ నాదము మరియు దుందుభి ధ్వనులు మారుమ్రోగుచుండగా, పురుషవ్యాఘ్రమగు రాముఁడు భవనముల మాలలు కలిగిన అయోధ్యా పురమునందు వెడలసాగెను.
౩౪) తే.గీ.II ముందు పరిచారకులతోడ నందముగను
వచ్చుచున్నట్టి రాఘవుండచ్చమయిన
భవ్యమైనట్టి యోధుని పగిదినొప్పి
కనులకానందమున్ గూర్చె ఘనతరముగ.
భావముII ముందు పరిచారకులతో వచ్చుచున్న రాఘవుఁడు అందమైన రూపముతో గొప్ప యోధుని వలె కనిపించెను.
౩౫) తే.గీ.II తనకు జేజేలు కొట్టుచు దరిని యున్న
వారల న్బల్కరింపగా భక్తవరదుఁ
డైన సోదర యుతుఁడగు నా రఘుపతి
ననుసరించిరి వారును వినుత గతిని.
భావముII తనకు జేజేలు పలుకు వారిని రాముఁడు తిరిగి పలకరింపగా, వారు కూడా సోదరులు చుట్టూ ఉన్న రాముని అనుసరించిరి.
౩౬) తే.గీ.II మంత్రులున్ భువి బ్రాహ్మణుల్ మాన్యులెలమి
పురజనంబులు తన తోడ పరిఢవిల్లఁ
జుక్కలకు మధ్య చంద్రుని శోభతోడ
నొప్పియుండెను రాముండు గొప్పగాను.
భావముII మంత్రులు, బ్రాహ్మణులు మరియు పౌరులు చుట్టూ ఉండగా ప్రకాశవంతుఁడగు రాముడు, నక్షత్రముల మధ్య చంద్రునివలె శోభించెను.
౩౭) తే.గీ.II ముందువైపునఁ జనువా రమంద గతిని
తాళములు, స్వస్తికాదిగా మేలుతరపు
పరికరములు చేతను బట్టి పాడుచుండ
రమ్యగతి నాలకించుచు రాముఁడరిగె.
భావముII ముందువైపు నడచుచున్నవారు తాళములు, స్వస్తిక, వాద్య పరికరములు చేతులతో పట్టుకొని, ఆనందకరము మంగళకరము అగు కీర్తనలు ఆలపింపగా, రాముఁడు వెడలసాగెను.
౩౮) తే.గీ.II పెట్టుకొని గోవులన్ ముందు, పట్టుకొని సు
వర్ణ దివ్యాక్షతల్ ద్విజవరులు, మరియు
పూజ్యముత్తైదువల్, చేత మోదకములఁ
బట్టి మనుజులు, ప్రభువుతోపాటు చనిరి.
భావముII ఆవులను ముందు పెట్టుకుని అక్షతలు చేతితో పట్టుకుని బ్రాహ్మణులు, ముత్తైదువులు ముందు నడుచుచుండగా, వచ్చుచున్న మగవారు తమ చేతిలో తీపిపదార్థములు పట్టుకుని ప్రభువుతోపాటు వెళ్ళసాగారు.
౩౯) తే.గీ.II అల విభీషణు, సుగ్రీవునమర మైత్రి,
వాయునందను శక్తిని, వానరతతి
చేసిన ఘనమౌ కార్యముల్ శ్రీవిభుండు
రక్క సులబల్మి మంత్రులకెక్కఁ జెప్పె.
భావముII సుగ్రీవునితో స్నేహమును, హనుమంతుని బలమును, వానరులు చేసిన మహత్కార్యములు, రాక్షసులు మరియు వారి బలములను గూర్చి విభీషణునితో జరిగిన సమావేశమును గూర్చి రాముఁడు మంత్రులకు వర్ణించి చెప్పసాగెను.
౪౦) తే.గీ.II రామచంద్రుఁడు మాటలు ప్రేమతోడ
మంత్రులకుఁ జెప్పు వేళలో మాన్యులయిన
నికటముననున్న ప్రజలెల్లఁ బ్రకటితముగ
నాలకించుచు నాశ్చర్యమందినారు.
భావముII ఇది వినిన అయోధ్యా పురవాసులు ఆశ్చర్యము పొందిరి.
౪౧) తే.గీ. వినుత తేజోఽభిరాముఁడు మనమునందు
వీటినన్నిటిన్ దలచుచుఁ బ్రీతితోడ
ముచ్చటించుచున్ గపులతో ముందుఁ జనుచు
పొంగు జనులతోడ నయోధ్యపురము సొచ్చె.
భావముII ప్రకాశవంతుఁడైన రాముఁడు వాటిని గుర్తు చేసుకుని ముచ్చటించుచూ, వానరములతోఁ గలసి ఆనందభరితమైన జనసందోహముతో అయోధ్యలో ప్రవేశించెను.
౪౨) తే.గీ.II తమదు గృహముల పైన పతాక చయము
నింటనింటను కట్టిరి యెగురునటుల,
రామచంద్రుని రాకకై ప్రేమతోడ
నెదురు చూచిన జనులకు ముదము కలిగె.
భావముII తరువాత పౌరులు పతాకములను తమ తమ గృహములపై ఎగురవేసిరి.
౪౩) తే.గీ.II పడిన కష్టాలు, బాధలున్ మడిసిపోవ
నాత్మనానందభరితుఁడై యనుపమముగ
ధరణి నిక్ష్వాకు వంశానఁ దండ్రిదైన
రాజ గృహమును చేరెను రాముఁడపుడు.
భావముII రమ్యము, ఇక్ష్వాకు రాజగృహము అయిన తన తండ్రిగృహమునకు రాముఁడు చేరెను.
౪౪) తే.గీ.II పిదప రఘునందనుండు సత్ప్రీతితోడ
వినుత ధర్మాత్ము భరతుతో విపుల గతిని
యర్థయుక్త సద్భాషణనపుడు చేసె,
మధురమధురముగాను తానెదనుపొంగి.
భావముII తరువాత ఆ రాజపుత్రుఁడగు రాముఁడు, ధర్మము పాటించు భరతునితో అర్థవంతమైన వచనమును మధురముగా పలుకసాగెను.
౪౫) తే.గీ.II పితృగృహంబును రాముండు ప్రీతిఁ జేరి,
కైకకు నల సుమిత్రకున్, గౌరవముగ
తల్లి కౌసల్యకును తాను తనివితీర
వందనమ్ములు చేసెను సుందరముగ.
భావముII పితృగృహమునందు ప్రవేశించిన ఆ మహాత్ముడు కౌసల్యా, సుమిత్రా, మరియు కైకేయి లకు నమస్కరించెను. తరువాత భరతునితో ఇటుల చెప్పసాగెను.
౪౬) తే.గీ.II ఘనముగా నొప్పెడి యశోక వనముతోడ,
ముత్యములును వైడూర్యముల్ పొదగఁ బడిన
నాదు భవనంబు శ్రేష్ఠమై మోదమిడును,
భరత! సుగ్రీవునకుఁ జూపు, మరువకుమనె.
భావముII భరతా! నాయొక్క ఈ భవనము శ్రేష్ఠమైనది, అశోకవనములతోఁ గూడి యున్నది, ముత్యములు మరియు వైడూర్యములతో పొదగఁబడి యున్నది. దీనిని సుగ్రీవునకు చూపుమని పలికెను.
౪౭) తే.గీ.II భవ్య సత్యపరాక్రమవంతుఁడయిన
భరతుఁ డన్న మాటలువిని పట్టుకొనుచు
వినుత సుగ్రీవు చేతులన్ బ్రేమతోడ
తీసుకొనివచ్చె లోనికి ధ్యాసఁ బెట్టి.
భావముII ఆ వచనమును వినిన సత్యపరాక్రమవంతుఁడగు భరతుఁడు, సుగ్రీవుని చేతిని పట్టుకొని ఆ గృహములోనికి తీసుకొని వచ్చెను.
౪౮) తే.గీ.II తైల దీపముల్, మంచముల్, నేలచాప
ల నల తెచ్చి రా శత్రుఘ్నుఁ డనినమాట
లను వినిన భటు లచటకు వినయమొప్ప
చెప్పు సత్కార్యముల్ త్వరన్ జేయు ఘనులు.
భావముII అప్పుడు శత్రుఘ్నుని ఆనతి మేర కొందరు సహాయకులు తైలదీపములు, మంచములు, నేలచాపలు తీసుకుని గృహములోకి వచ్చిరి.
౪౯) తే.గీ.II వినుత సుగ్రీవ సత్ప్రభూ! వినుము మాట,
రామునకునభిషేకమ్ము రమ్యగతిని
జేయ దూతలన్ బనుపుమం చా యనుపమ
తేజుఁడగునట్టి భరతుండు తెలిపెనపుడు.
భావముII మహాతేజోవంతుఁడగు భరతుఁడు సుగ్రీవునితో “రాముని అభిషేకము కొరకు దూతలను పురమాయింపు” మని చెప్పెను.
౫౦) తే.గీ.II స్వర్ణ, రత్నమయంబగు చక్కనైన
నాల్గు కుంభముల్ వానరుల్ నల్వురకును
తెచ్చి యిచ్చె సుగ్రీవుండు దీపితముగ,
హెచ్చ సంతోష మప్పు డహీన గతిని.
భావముII సువర్ణమయము, సర్వరత్నమయములు అయిన నాలుగు కుండలను నలుగురు వానరశ్రేష్ఠులకు సుగ్రీవుఁడు ఇచ్చి,ఇట్లు పలికెను.
౫౧) తే.గీ.II రేపు ప్రత్యూష వేళకు శ్రీకరమగు
సాగర చతుష్టయ జలంబుఁ జక్కగాను
తెచ్చియుంచుఁడు నే నాజ్ఞ నిచ్చు వఱకు
వేచియుండు డటంచును బ్రీతిఁ బలికె.
భావముII రేపు తెల్లవారే లోపుగా నాలుగు సాగర జలములతో ఈ కుండలను నింపి, నా ఆజ్ఞ కొరకు వేచియుండుఁడని పలికెను.
౫౨) తే.గీ.II శ్రీ మహాత్ముఁడు వానరశ్రేష్ఠుఁడటుల
నానతీయగా వేగమే యాకసమున
కెగిరె గరుఁడుని పోలి గణించి వారు,
రాజునాజ్ఞకు బద్ధులై ప్రకటితముగ.
భావముII మహాత్ముఁ డగు వానరశ్రేష్ఠుఁడు ఈ విధముగ చెప్పగనే, వారు గరుడునివలె వేగముగా ఆకాశమునకు ఎగిరి వెళ్ళిరి.
౫౩) తే.గీ.II ఋషభుఁడును జాంబవంతుఁడున్ వేగదర్శి,
హనుమ, యను వానరోత్తముల్ ఘనతరముగ
నీరు నింపిన ఘటములన్ నేర్పుమీర
వచ్చిరచ్చోటికప్పుడు మెచ్చ జనులు.
భావముII అటు తరువాత జాంబవంతుఁడు, హనుమంతుఁడు, వేగదర్శీ మరియు ఋషభుఁడు అను వానరులు, నీరు నింపఁబడిన కలశములతో వచ్చిరి.
౫౪) తే.గీ.II ఐదు వందల నదులలోనంబువులను
కలశములు నింపఁబడియెను, ఘనతరముగ
శ్రీ రఘూత్తము పట్టాభిషేకవేళ
లోక మానందవారిధిలోన మునిగె.
భావముII అయిదువందల నదులలోని జలములతో ఆ కలశములు నింపబడియున్నవి.
౫౫) తే.గీ.II క్షితిని సత్వసంపన్న సుషేణుఁడెలమిఁ
దూర్పుసంద్రమందున్నట్టి తోయములను
రత్నములు పెక్కు పొదివిన రమ్యమైన
కలశమునఁ బట్టి తెచ్చెను గౌరవమున.
భావముII తూర్పుసముద్రము యొక్క నీటిచే నింపఁబడిన, రత్నమయమైన కలశమును సత్త్వగుణ సంపన్నుఁడైన సుషేణుఁడు తెచ్చెను.
౫౬) తే.గీ.II దక్షిణార్ణవ జలమును త్వరిత గతిని
రక్తచందన శాఖచే రమ్యముగను
మూయఁబడినట్టి కలశతోఁ బూజ్యగతిని
ఋషభుఁడర్మిలి తెచ్చెను, పృథ్విపొంగ.
భావముII దక్షిణసముద్రము యొక్క జలమును, ఎర్రచందనపు కాండములతో మూసినటువంటి బంగారు కుండలో ఋషభుఁడు త్వరగా తెచ్చెను.
౫౭) తే.గీ.II పశ్చిమాద్రిజలంబును ప్రకటితముగ
రత్నభూషిత ఘటమున రయముగాను
గవయుఁడను వాఁడు తెచ్చెను ఘనతరముగ,
రామ పట్టాభిషేకంబు రాజిలంగ.
భావముII పశ్చిమమహాసముద్రము యొక్క చల్లటి జలమును రత్నభూషితమైన కుంభములో వాయువేగముతో గవయుఁడు తెచ్చెను.
౫౮) తే.గీ.II ఉత్తరార్ణవ జలము మహత్తరముగ
గరుడ వాయు వేగంబులన్ గలిగినట్టి
సర్వ గుణసంపదుండగు సౌమ్య నలుఁడు
సత్వరంబుగ దెచ్చె నా స్థానమునకు.
భావముII ఉత్తరమందున్న జలమును శీఘ్రముగా, గరుడ మరియు వాయువిక్రమము గల ధర్మాత్ముఁ డు, సర్వగుణసంపన్నుఁడు అయిన నలుఁడు తెచ్చెను.
౫౯) తే.గీ.II రామ పట్టాభిషేకంబు క్రాలు వేళ
కపులు జలమును తెచ్చిరం చపుడు మంత్రి
వరులతోఁ గూడి శత్రుఘ్నుఁ డరిగి యచట
ఘన పురోహితులకుఁ జెప్పె ననుపమముగ.
భావముII ఆ విధముగ వానరశ్రేష్ఠులచే రామ పట్టాభిషేకము కొరకు తీసుకురాబడిన జలముల గురించి, శత్రుఘ్నుఁడు తన మంత్రులతోఁ గలసి, పురోహిత శ్రేష్ఠులకు మరియు వారి సహచరులకు విన్నవించెను.
II పట్టాభిషేక ఘట్టము II
౬౦) తే.గీ.II అపుడు పెద్దయైన వశిష్ఠుఁ డనుపమగతిఁ
దోటివారితోఁ గూడి యా మేటి యైన
రామచంద్రుని, సీతను, రమ్యమైన
పీఠమున తాను కూర్చుండఁ బెట్టెనెలమి.
భావముII అప్పుడు వారిలో పెద్దవారైన వశిష్ఠులవారు, తోటి బ్రాహ్మణులతోఁ గలసి, రత్నమయ పీఠముపైన సీతతో సహా శ్రీరాముని మర్యాదపూర్వకముగా కూర్చుండఁబెట్టెను.
౬౧) తే.గీ.II కశ్యపుండును, జాబాలి, గౌతముఁడును,
వడి వశిష్ఠుఁడు వామదేవుఁడును, మరియు
విజయ, కాత్యాయన, సుయజ్ఞు లజితమతులు
మహితమైనట్టి యా వేళ మధుర గతిని.
భావముII వశిష్ఠుఁడు, వామదేవుఁడు, జాబాలి, కశ్యపుఁడు, కాత్యాయనుఁడు, సుయజ్ఞుఁడు, గౌతముఁడు మరియు విజయుఁడు .
౬౨) తే.గీ.II ఘన సుగంధ సంయుక్తమౌ గంగతోడ,
మనుజ శార్దూలమగు రామ మహితునకును
నష్ట వసువు లాయింద్రున కిష్టముగను
జేసిన ట్లభిషేకమున్ జేసి రపుడు.
భావముII మానవులలో పులివంటి రామునకు సంతోషభరితముగా సుగంధభరితమైన జలములతో, అష్టవసువులు ఇంద్రునకు చేసిన విధముగ అభిషేకము చేసిరి.
౬౩) తే.గీ.II ఋత్విజులతోడ, బ్రాహ్మణ శ్రేష్ఠులయిన
వారితో, గన్యకలతోడఁ, బ్రజలతోడ,
మంత్రి యోధాళితోడను, మంత్రములవి
మించగ నభి షేకమ్ము చేయించిరపుడు.
భావముII ఋత్విక్కులు మొదట బ్రాహ్మణులతో, తరువాత కన్యలతో, మంత్రులతో, యోధులతో, ఆనందముగా నున్న పట్టణవాసులతో అభిషేకము చేయించిరి.
౬౪) తే.గీ.II లోకపాలురు, మరియు సుశ్లోకులయిన
నభమునందలి దేవతల్, శుభకరులగు
దేవతాతతి, సకలౌషధి రసములను
రమ్యముగఁ జల్లినారలీ రామునిపయి.
భావముII సర్వ ఔషధ రసములు కలిసిన పన్నీరును ఆకాశమందున్న దేవతలు, నలుగురు లోకపాలకులు, సర్వదేవతలు కలిసి రామునిపై చల్లిరి.
II కిరీట వర్ణన II
౬౫) తే.గీ.II బ్రహ్మనిర్మితమైనదీ రత్నఖచిత
నుత కిరీటంబు దీనిన్ మనువునకిలను
దివ్యపట్టాభిషేకంబు తేజమెలయ
చేసినందున దీప్తమై చెలఁగుచుండె.
భావముII బ్రహ్మచే సృష్టికి పూర్వము నిర్మింపఁబడినటువంటి కిరీటము రత్నములశోభతో యున్నది. దీనితో చాలా కాలము క్రితము మనువునకు పట్టాభిషేకము చేయుటవలన తేజస్సుచే దీప్తమైనది.
౬౬) తే.గీ.II నాటి నుండియు క్రమముగా నేటి వరకు
రహిని పట్టాభిషేకముల్ రాజులకును
చేసి రీ కిరీటముతోడ, చిత్ర రత్న
స్వర్ణ ధనయుత శోభతో, వరలు సభను.
భావముII ఆయన తరువాత ఉన్న రాజులకు దీనిచే పట్టాభిషేకము చేయబడినది. ఇప్పుడు అది సభయందు బంగారువర్ణపు శోభతో, మహాధనవంతమయి, వివిధరత్నములచేత చిత్రముగా మంచిశోభను కలిగియున్నది.
౬౭) తే.గీ.II సకల రత్నాల పీఠిపై సముచితముగ
నుంచి నట్టి కిరీటమున్ మంచి నెంచి,
నుత వశిష్ఠుఁడు తొడిగెను క్షితిని తాను
బ్రహ్మవరులతోఁ గూడి తా రామునకును.
భావముII నానారత్నములు పొదగఁబడినటువంటి పిఠముపై యథావిధిగా ఉంచబడిన కిరీటమును అటు పిమ్మట మహాత్ముఁడైన వసిష్ఠులవారు తన తోటి ఋత్విక్కులతో కలసి మిగిలిన భూషణములతోపాటు రాఘవునకు అలంకారము చేసిరి.
౬౮) తే.గీ.II ధవళఛత్రమున్ బట్టెను తనివి తీర
నపుడు శత్రుఘ్నుఁ డచ్చట నా కపి పతి
శ్వేత ఛత్రమున్ బట్టె, శశి వలె మెరయు
వ్యజనమున్ విభీషణుడిల పట్టెనపుడు.
భావముII శుభకరమైన ధవళ ఛత్రమును శత్రుఘ్నుఁడు పట్టుకొనెను. తెలుపు రంగు చామరమును వానరేశ్వరుఁడగు సుగ్రీవుడు పట్టుకొనెను. చంద్రునివలె మెరయు మరియొక వ్యజనమును రాక్షసరాజగు విభీషణుఁడు పట్టుకొనెను.
౬౯) తే.గీ.II రామ పట్టాభిషేకమ్ము ప్రబలు వేళ
వాయుదేవుఁడా యింద్రుని పలుకులు విని,
నూరు బంగారు పద్మాల మీరు రుచుల
నొప్పు మాలను రామునకప్పుడిచ్చె.
భావముII నూరు బంగారు పద్మములతో అందముగా వెలుగొందు మాలను, రాఘవునకు వాయుదేవుఁడు, ఇంద్రుని ప్రోత్సాహముతో ఇచ్చెను.
౭౦) తే.గీ.II సకల రత్నముల్ పొదిగిన సరసమైన
మణిని భాసించు ముత్యపు మహిత హార
ము నొసగెను వాయు వచట రామునకు నింద్రు
నాజ్ఞచే నప్పుడచ్చోట విజ్ఞుఁడగుచు.
భావముII సర్వరత్నములతో పొదగబడి, మణిరత్నముతో విశేషముగా భాసించు ముత్యముల హారమును, ఆ రాజునకు, ఇంద్రుని ఆదేశము మేర వాయుదేవుఁడు ఇచ్చినాడు.
౭౧) తే.గీ.II దేవగంధర్వులావేళ దివ్య గాన
ములను నాట్యముల్ చేసిరి, పూజ్యుఁడైన
రామ పట్టాభిషేకంబు ప్రబలు వేళఁ
జక్కగా నొప్పినవి యవి సన్నుతముగ.
భావముII లావణ్యముగా అలాపించు దేవగంధర్వుల పాటలు, అందముగా నాట్యమాడు అప్సర గణములు, బుద్ధిశాలియగు రాముని పట్టాభిషేకమునకు తగిన రీతిలో ఉండెను.
౭౨) తే.గీ.II రామ పట్టాభిషేకమ్ము క్రాలు వేళ
భూమి పంటలతో నిండె, భూజపాళి
ఫలములను నిండె, పుష్పముల్ పరిమళించె
శుభదుఁడైనట్టి రాముని శోభఁ గాంచ.
భావముII భూమి సస్యశ్యామలముగా, చెట్లు ఫలములుతో, పుష్పములు మంచి సువాసనలతో, రాఘవ ఉత్సవములో నిండినవి.
౭౩) తే.గీ.II శతసహస్రాశ్వములను, గోచయము, మరియు
ధేనువులను, వృషభములన్ దీపితముగ
నూరుగురు బ్రాహ్మణులకిచ్చె ధీరవరుఁడు
రాముఁ డవ్వేళ, పట్టాభిరాముఁ డతఁడు.
భావముII మనుజ శ్రేష్ఠుఁడగు రాముఁడు శత సహస్ర అశ్వములను, ధేనువులను, గోవులను, నూరు వృషభములను మొదటగా ద్విజులకు ఇచ్చెను.
౭౪) తే.గీ.II మూడువందలకోట్లు సంపూర్ణ మతిని
వినుత బంగారు నాణెముల్ విలువనొప్పు
వస్త్రచయ మాభరణములు, బ్రాహ్మణులకు
రాముఁడొసగెను లోకాభిరాముఁడగుచు.
భావముII మూడువందలకోట్ల బంగారు నాణెములను, నానా విధములైన విలువైన ఆభరణములను, వస్త్రములను బ్రాహ్మణులకు రాఘవుఁడు మరల ఇచ్చెను.
౭౫) తే.గీ.II సూర్య రస్మి సత్ ప్రభ వెల్గు చున్నదియును,
మణులు పొదివిన బంగారు మాలను గొని
వినుత సుగ్రీవునకు నిచ్చె, విశ్వభర్త
రామచంద్రుండు ప్రేమతో రమ్యముగను.
భావముII సూర్యరశ్మివంటి ప్రభతో, బంగారముతో పొదగబడిన మణులు కలిగిన దివ్యమైన మాలను సుగ్రీవునకు మనుజర్షభుఁడగు రాముఁడు ఇచ్చెను.
౭౬) తే.గీ.II మహిత వైడూర్య చిత్రిత మైనదియును,
వజ్ర రత్న విభూషిత భవ్యమైన
యంగదము నిచ్చెఁ నవ్వేళ నంగదునకుఁ,
బ్రేమతోడుత రాముండు, విశ్వమెన్న.
భావముII వైడూర్యమణితో చిత్రితమై, వజ్రరత్నముతో విభూషితమైన అంగదమును, ధృతిమంతుఁడు అయిన అంగదునకు రాముఁడు ఇచ్చెను.
౭౭) తే.గీ.II శ్రేష్ఠమైనట్టి మణులతో చిందువేయు
చంద్రకాంతితో సమమైన జక్కని ప్రభ
నొప్పు ముత్యాల పేట తా నొప్పుగాను
సీత కొసఁగెను రాముండు, ప్రీతి తోడ.
భావముII శ్రేష్ఠములైన మణులతో, చంద్రకాంతితో సమానమైన ప్రభతో ఉన్న, ఉత్తమమైన ముత్యాలహారమును రాముఁడు సీతకు ఇచ్చెను.
౭౮) తే.గీ.II శుద్ధమై ధారణార్హమై శుభకర మగు
చక్కనైనట్టి తొడవు తా నొక్కదాని
వాయు సూనున కీయంగ వలయు ననుచుఁ
దలఁచె సీతమ్మ, మెడలోన దాల్చినదియె.
భావముII శుద్ధము, ధారణయోగ్యము, శుభకరమునైన ఆభరణమును వైదేహి వాయుసూనునకు (హనుమంతుడు) ఇవ్వఁజూచెను.
౭౯) తే.గీ.II మెడను దాల్చిన హారమున్ దడయకపుడు
తీయుటను గాంచి రా యెడ ధీరుఁ డయిన
రామచంద్రునితో పాటు ప్రకృతమున్న
కపులు, సీతను, ధరపైన జ్ఞానఖనిని.
భావముII సీత తన కంఠమునకు ధరించినఆ ఆభరణమును తీయుట అక్కడ ఉన్న తన భర్త వానరులు కూడా మరల మరల చూడసాగిరి.
౮౦) తే.గీ.II జనకజకు నిట్లు పలికె నా జానకిపతి
పౌరుషము, పరాక్రమము, సత్ ప్రతిభతోడ
నుండి నీ యాదరణగన్న పండితునకు
నిమ్ము బహుమతి సీతా! రహింప, యనుచు.
భావముII ఇంగితజ్ఞుఁడగు రాముఁడు, జనకాత్మజ యగు సీతను చూచి ఇట్లనెను. "ప్రియమైన సీతా, ఆ హారమును నీవు ఎవనికి ఇచ్చిన ఆనందము కలుగునో, ఎవనికి తేజస్సు, ధృతి, యశస్సు, దాక్షిణ్యము, సామర్థ్యము, వినయము, దూరదృష్టి, వీరత్వము, పరాక్రమము, మేధస్సు నిత్యము ఉండునో వానికి ఇమ్ము.
౮౧) తే.గీ.II హనుమకిచ్చెను సీత యా హారమపుడు,
హారమును దాల్చి హనుమ యాహా! యనంగ
చంద్రికల తోడ తెల్లని జలదములను
క్రమ్ముకొనియున్న కొండనాన్ రహిని వెలిగె.
భావముII ఆ హారమును నల్లటి కనులు కలిగిన సీత వాయుపుత్రునకు ఇచ్చెను. వానర వరేణ్యుఁడగు హనుమంతుఁడు ఆ హారమును ధరించగా, చంద్రకాంతులతో, తెల్లని మబ్బులతో అలంకరింపబడిన పర్వతమువలె ఒప్పెను.
౮౨) తే.గీ.II ద్వివిదునకు, మైందునకును సత్ ప్రవరుఁడైన
నీలునకు, పరంతపుడిచ్చె మేలుగాను
వారుకోరుకొన్నట్టివి, భవ్యుడైన
రామచంద్రుండు చూపిన ప్రేమ యదియె.
భావముII శత్రువులను హింసించునట్టి ద్వివిదునకు, మైందునకు మరియు నీలునకు వారి ఇష్టములను బట్టి బహుమతులు రాముఁడు ఇచ్చెను.
౮౩) తే.గీ.II సర్వ వానర వృద్ధులు, సకల వాన
రేశ్వరుల్ పొంది రచ్చోట నిన కులజుఁడు
చేసినట్టి సత్కృతులఁ బ్రసిద్ధ వస్త్ర
చయము నాభరణంబులన్ జక్కగాను.
భావముII వానరవృద్ధులందరును, ఇతర వానరేశ్వరులు యథాయోగ్యముగా వస్త్రాభరణములతో సన్మానింపఁబడిరి.
౮౪) తే.గీ.II రామ కార్యమునందున శ్రమను గనక
కష్టపడినట్టివారికి, గౌరవమున
కని విభీషణున్, సుగ్రీవు, హనుమ, జాంబ
వంతునిని, సర్వ వృద్ధులౌ వానరులను.
భావముII విభిషణుని, సుగ్రీవుని, హనుమంతుని, జాంబవంతుని మరియు సర్వ వానరవృద్ధులను రాముని కొరకు విసుగు, అలసట చెందకుండా ఉన్నవారిని.
౮౫) తే.గీ.II సత్కరించుచు కోరిన చక్కనైన
రత్న భూషణాదు లొసంగ, రాముని గని
రామచంద్రుని పాలన రమ్య మనుచు
గృహములకు నేగినారు సత్ కీర్తితోడ.
భావముII వారికి ఇష్టములైన అన్ని రత్నములతో సత్కారములు చేయగా, వారు సంతోషమనస్కులై తిరిగి వెడలిరి.
౮౬) తే.గీ.II వందనంబులు చేయు చానందముగను
వానరోత్తముల్ ప్రభువుచే భవ్యగతిని
వీడుకోలును గొని వారు వెడలిరటుల
మహిత కిష్కింధకప్పుడు క్షేమమొప్ప.
భావముII వందనము చేయుచూ ఆ మహాత్ములగు వానరోత్తములు, రామునిచే వీడ్కోలు గొని కిష్కింధకు వెడలిరి.
౮౭) తే.గీ.II వానరశ్రేష్ఠ సుగ్రీవుఁ డా నరపతి
సుహిత పట్టాభిషేకమ్ము శోభఁ జూచి,
రామ సత్కృతులంది తా రమ్య గతిని
చేరె కిష్కింధ కప్పుడు శ్రీకరముగ.
భావముII వానరశ్రేష్ఠుడగు సుగ్రీవుఁడు రామ పట్టాభిషేకము చూచి, రామునిచే సత్కరింపబడి కిష్కింధకు వెడలెను.
౮౮) తే.గీ.II రాక్షస పతి విభీషణుం డా క్షణమున
కుల ధనంబును గైకొని గూర్మితోడఁ
జేరె లంకకున్ దృప్తిగా శ్రీకరముగ,
ధర్మ సంపూర్ణ తేజుండు ధాత్రినతఁడు.
భావముII ధర్మాత్ముఁడు, ప్రఖ్యాతి కలిగిన రాక్షసరాజగు విభిషణుఁడు, తన కులధనమగు రాక్షస రాజ్యము మరియు పరివారమును తీసుకుని లంకకు మరలెను.
౮౯) తే.గీ.II రాజ్య శాసన దక్షుఁడు, రామ విభుఁడు,
శత్రు సంహారి, వర కీర్తిసాంద్రుఁ డతఁడు,
ఘన మహోదార సుగుణుండు, ప్రణవదీప్తి
సచ్చిదానంద సన్మూర్తి, సంతసమున.
భావముII అఖిల రాజ్యములు శాసించగల, శత్రువులను సంహరించిన, మహాయశస్సు కలిగిన రాఘవుఁడు పరమ ఔదార్యముతో, పరమానందముతోనుండెను .
౯౦) తే.గీ.II ధర్మ వత్సల రాముండు తమ్ముఁడయిన
ధర్మ వర్తియై చెలగెడి మర్మ రహిత
లక్ష్మణునిఁ గాంచి పలికె తా లక్ష్యమొప్ప,
ధర్మమును నిల్పనెంచుచు ధరణిపైన.
భావముII ధర్మవత్సలుఁడగు రాముఁడు ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ఇట్లనెను.
౯౧) తే.గీ.II వినుత లక్ష్మణా! ధర్మజ్ఞ! వినుము మాట,
నీవు నాతో సముండవు, ప్రీతితోడ
పూర్వులొసగిన రాజ్యమ్మునిర్వహణము
చేయ యువరాజువగుమనెన్ శ్రీకరముగ.
భావముII “ధర్మజ్ఞా! నాతో పాటు ఈ రాజ్యమును పూర్వరాజులు సైన్యముతో కూడి పాలించినట్లు, నేను మన పితరుల నుంచి పొందినట్లు, నీవు కూడా యువరాజు వలె రాజ్యభారమును తీసుకొనుము అనెను.
౯౨) తే.గీ.II లక్ష్మణుండొప్పుకొనలేదు, సూక్ష్మబుద్ధి
రాముఁడా భరతునకును రమ్య గతిని
యౌవరాజ్యాభిషేకమ్ము నతివిభవము
గానొనర్చెను, కల్యాణకరము కాగ.
భావముII అన్నివిధముల బ్రతిమిలాడినగాని సౌమిత్రి అంగీకారము తెలుపని కారణమున, యౌవరాజ్యాభిషేకమును రాముఁడు భరతునకుఁ జేసెను.
౯౩) తే.గీ.II మేలు పౌండరీకము నశ్వమేధములును,
వాజపేయాది యజ్ఞముల్ ప్రణుతిఁ జేసె,
రఘుకులాంబుధి సోముండు రాఘవుండు,
జనుల పాలిటికానంద జయకరుండు.
భావముII పౌండరీకము, అశ్వమేధము, వాజపేయాది ఇతర యజ్ఞములు రాముఁడు ఆచరించెను.
౯౪) తే.గీ.II తాను పదివేల వర్షముల్ ధరణి నేలె,
నశ్వమేధ శతంబుల ననుపమముగఁ
జేసి మహితాశ్వములను సద్ వాసిగాను
భూరి దక్షిణ లిచ్చె నీ పుడమి పొంగ.
భావముII రాజ్యమును పదివేల సంవత్సరములు అనుభవించిన రాఘవుఁడు నూరు అశ్వమేధయజ్ఞములలో మంచి అశ్వములు మరియు దక్షిణలు దేవతల కోసము సమర్పించెను.
౯౫) తే.గీ.II రాముఁ డాజానుబాహువు, రమ్య గుణుఁడు,
లక్ష్మణునిఁ గూడి పాలించె లక్ష్యమొప్ప
రాజ్యమును తాను, రంజిల్ల రాజ్యమంత,
రామరాజ్యము వైకుంఠధామమనగ.
భావముII ఆజానుబాహుఁడు, ప్రతాపవంతుఁడునైన రాముఁడు, లక్ష్మణునితోఁ గలిసి రాజ్యమును పాలించెను.
౯౬) తే.గీ.II ధర్మపరుఁడగు రాముండు ధరణి పయిని
యజ్ఞములు పెక్కు చేసె ప్రియంబుతోడ
పుత్రబాంధవ సహితుఁడై పూజ్యముగను,
రామ రాజ్యంబు ఘనమని రాణఁ గాంచె.
భావముII ధర్మాత్ముఁడగు రాముఁడు గొప్పది ఉత్తమమైనది అగు రాజ్యమును పొంది, దేవతల ప్రసన్నము కొరకు తన పుత్రులు, భ్రాతృలు, బంధువులుతోఁ గలసి బహువిధములగు యజ్ఞములు చేసెను.
౯౭) తే.గీ.II క్షితిని వైధవ్యములు లేవు, క్రూరమృగ భ
యంబులును లేవు, లేకుండె వ్యాధిభయము,
రామరాజ్యంబు సుక్షేమ రాజ్యమయ్యె,
ప్రజలు సంతోషములతోడ ప్రబలిరిలను.
భావముII వైధవ్య విషాదము, కౄరమృగముల భయము, వ్యాధి భయములు లేక రామరాజ్యము కీర్తింపఁబడెను.
౯౮) తే.గీ.II చోరభయమన్నదే లేదు, సుజనులె కన,
వ్యర్థభావంబులే లేవు, బాలురకును
వృద్ధులే కర్మలను జేయు రీతి లేదు,
రామ రాజ్యంబు రమ్యంబు ప్రాణులకును.
భావముII దొంగతనము లోకమునందు లేదు. జనుల యందు వ్యర్థభావము లేకుండెను. వృద్ధులు బాలురపై ప్రేతకార్యములు చేయవలసిన అవసరము రాకుండెను.
౯౯) తే.గీ.II సర్వ మానందమయమయ్యె, శాంతి వెలసె,
ధర్మపరులైరి జనులంత, మర్మ మెఱుఁగ
రెవ్వరును కూడ, హింసయే యెఱుగరైరి.
రామ రాజ్యంబు రమ్యంబు ప్రాణులకును.
భావముII అంతా ఆనందముతో ఉండెను. అందరూ ధర్మపరులై ఉండిరి. రాముని దృష్టిలో ఉంచుకుని పరస్పరము హింసించుకొనక యుండిరి.
౧౦౦) తే.గీ.II వేల వత్సరాల్ జీవించి వేలమంది
పుత్రులను గాంచి, స్వస్థతన్ బొంగుచుండి,
శోకమేలేని రాజ్యంబు శ్రీకరమగు
రామ రాజ్యంబటంచును బ్రణుతిఁ గాంచె.
భావముII వేల సంవత్సరముల ఆయుర్దాయముతో, వేలమంది పుత్రులతో, అనారోగ్యము లేక, శోకము లేక రామునిచే రాజ్యము పాలింపఁబడెను.
౧౦౧) తే.గీ.II రామ రామ రామా యంచు రామ కథలు
చెప్పు కొనసాగె లోకంబు గొప్పగాను,
రామచంద్రుని పాలనన్ రామరాజ్య
మన్న నానుడి ప్రభవించె మిన్నగాను,
భావముII రామ, రామ, రామ అనుచు రాముని గురించి, రామరాజ్యమును గురించి ప్రజలు చర్చించుకొనిరి. జగత్తంతయు రామరాజ్యమును కీర్తించెను.
౧౦౨) తే.గీ.II నిత్యమును పుష్ప ఫలములన్ నిరుపమాన
ముగను వృక్షంబులొప్పెను, ప్రగణితముగ
మేఘములు వాన గురిసెను మింటనొప్పి,
చల్ల గాలులు పొంగించె జనులను భువి.
భావముII నిత్యము పుష్పములతో, ఫలములతో మరియు విస్తృతమైన కొమ్మలతో చెట్లు ఉండెను. మబ్బులు సకాలములమున వర్షించెను. శరీరములకు సుఖము కలిగించు విధముగ గాలి వీచెను.
౧౦౩) తే.గీ.II బ్రాహ్మణులు, శూద్రజాతియు, వైశ్యులు, మరి
క్షత్రియులు లోభశూన్యులై ఘనతరముగ
వృత్తులం జేసుకొంచును వెలసిరి భువి,
రామ రాజ్యంబు రమ్యంబు ప్రాణులకును.
భావముII బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లోభము లేక, తమ తమ కర్మలయందు ఆనందముగా ప్రవర్తించుచుండిరి.
౧౦౪) తే.గీ.II అనృత మెఱుఁగని ప్రజలిల నమరులనఁగఁ
జెలఁగుచుండిరి గొప్పగా, వెలసెను ధర
ధర్మ మలరెను ఘనముగా ధాత్రిపైన,
రామరాజ్యంబు ప్రజల స్వరాజ్యమయ్యె.
భావముII ప్రజలు ధర్మపరులై, అబద్ధములు పలుకక, రామరాజ్యమున అందరు మంచి లక్షణములతో ధర్మపరాయణులై యుండిరి.
౧౦౫) తే.గీ.II పదియు నొక్కవేల్ వర్షముల్ ప్రాభవమున
రాముఁ డేలెను రాజ్యంబు రమ్య సుగతి
నన్నదమ్ములతోఁ గూడి మన్ననమున,
రామ రాజ్యంబు రమ్యంబు ప్రాణులకును.
భావముII పదకొండు వేల సంవత్సరములు తన తమ్ములతోఁ గలిసి శ్రీరాముడు రాజ్యపాలనను చేసెను.
II ఫలశ్రుతి II
౧౦౬) తే.గీ.II అమరులును మెచ్చునట్టి పట్టాభిషేక
మమిత హితమున పఠియించు సుమతులకును
రామచంద్రుండు, సీతయు, ప్రేమ మీర
శుభములను గూర్చుచుందుమంచభయమిడుత.
భావముII దేవతలు కూడా మెచ్చుకొనెడి ఈ పట్టాభిషేక కావ్యమును మిక్కిలి యిష్టముతో చదివెడి సుహృదయులకు ఆ సీతారాములు ప్రేమతో శుభములను కలిగించెదమని అభయమునిచ్చుదురు గాక.
౧౦౭) తే.గీ.II భువిని చింతాన్వయుండను, పూజ్యులయిన
రాఘవాచార్య శిష్యుఁడన్, రామకృష్ణ
నామధేయుఁడ, రాముఁడు ప్రేమఁ జూడ
రామ పట్టాభిషేకంబు వ్రాసినాడ.
భావముII ఈ భారత భూలిపై నేను చింతావారి వంశమువాఁడను. రామకృష్ణారావు పేరు గలవాఁడను. శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యులవారి శిష్యుఁడను. శ్రీరాముఁడు ప్రేమతో చూచుటచే తత్ఫలితముగా యీ పట్టాభిషేక కావ్యమును వ్రాసితిని.
౧౦౮) తే.గీ.II మంగళంబగు ధాత్రి సమ్మాన్యులకును,
మంగళంబగు హైందవ మహితులకును,
మంగళంబగు భువిని సత్సంగులకును,
మంగళంబగు భారతమాతకిలను.
భావముII మంచి గుణములచే గౌరవింపఁబడు మహితులకు, హిందూధర్మమును హృదయపూర్వకముగా అనుసరించు మనసు కలవారికి, మంచిసాంగత్యములతోఁ బ్రకాశించు వారికి, మన భారత దేశమాతకు, ఎల్లప్పుడూ మంగళములు చేకూరుఁగాక.
స్వస్తి.
శ్రీమత్ కౌశకసగోత్రులును, కాత్యాయన సూత్రులును, శ్రీమచ్చింతాన్వయ జానకీ రామమూర్తుల పౌత్రుండను, సంగీతసాహిత్య విద్వన్మణులైన వేంకటరత్నమాంబా సన్యాసిరామారావు దంపతుల పుత్రుండను, విద్వన్మణి కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యులవారి శిష్యుండను, కవికల్పభూజ, చిత్రకవితాసమ్రాట్ ఇత్యాది బిరుదాంకితుండనయిన రామకృష్ణారావు నామధేయుండనగు నాచే విరచితంబయిన శ్రీమద్వాల్మీకి రామాయణము…యుద్ధకాండ..౧౩౧ వ సర్గ…శ్రీరామ పట్టాభిషేకఘట్టము
పద్యానువాదము సమాప్తము.
చింతా రామకృష్ణారావు. తేదీ. 10 - 3 -2025 to 11 - 3 - 2025.
II శ్రీరామ పట్టాభిషేకము .. కథా సంగ్రహము II
కైకేయి నందనుడైన భరతుడు, శిరస్సుపైన తన చేతులను ఉంచి అంజలి ఘటించి, సత్యమగు పరాక్రమము కలిగిన తన పెద్దన్న అయిన శ్రీరామునితో ఇట్లు పలికెను.
ఇది పూజ్యురాలైన మా అమ్మగారి వలన నాకు వచ్చిన రాజ్యము. దీనిని మీరు నాకు ఇచ్చినట్టుగా మరల మీకు తిరిగి ఇచ్చుచున్నాను. బలమైన ఎద్దువలె మోయఁ దగిన ఈ రాజ్యభారమును లేగదూడ వలె ఒక్కఁడిగా ఉన్న నేను మోయలేకపోవుచున్నాను. నదీవేగమునకు పగుళ్ళు వచ్చిన ఆనకట్టవలె, ఈ రాజ్యము నియంత్రించుటకు వీలుపడకున్నదని నాకు తోచుచున్నది. ఓ శత్రునాశకా ! గుర్రములయొక్క గతిని ఒక గాడిద పొందలేని విధముగా, హంసలయొక్క గతిని ఒక కాకి పొందలేని విధముగా, నేను మీ మార్గమును అందుకొన లేకపోవుచున్నాను. ఏ విధముగా ఇంటి పెరటిలో నాటి, పెంచఁబడిన వృక్షము పెద్దదై, భారీ శాఖల వలన బలవంతులకు సైతము ఎక్కుటకు వీలుపడకుండి, మరియు, పుష్పములు కలిగిన తరువాత, ఫలములు కలుగక ఎండిపోవునో, అటువంటి చెట్టు, నాటిన వాడు అనుభవింపలేని విధముగా ఉన్నట్లున్నది.
ఓ మహాబాహో ! మీ దాసులగు మమ్ములను రాజువలె పరిపాలింపని మీకు ఈ ఉపమానము అర్థము కాఁగలదు. సంగీత వాయిద్యముల ఘోషలతో, చిఱుగంటల సవ్వడులతో, మధురమైన గానములతో మిమ్ములను మేలుకొలుపునంతవరకు మీరు విశ్రాంతి తీసుకొనుఁడు. “ఎప్పటివరకు ఖగోళము ఉండునో, ఎప్పటివరకు వసుంధర ఉండునో, అప్పటి వరకు ఈ లోకమున మీ ఆధిపత్యమును మేము అనుసరించెదము.”
భరతుని వచనములు విన్న పరపురంజయుఁడైన రాముఁడు అటులనే అని అంగీకరించి, శుభప్రదమైన ఆసనమున కూర్చుండెను. తరువాత, శత్రుఘ్నుని సూచన మేరకు, నైపుణ్యము కలిగి, తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయఁగల క్షురకులు, రాముని వద్దకు వచ్చిరి. ముందుగా భరతుఁడు స్నానమాచరింపగా మహాబలుఁడగు లక్ష్మణుఁడు, వానరరాజగు సుగ్రీవుఁడు, రాక్షసరాజగు విభీషణుఁడు, స్నానము చేసిరి.
అక్కడ ఉన్న రాముఁడు చిక్కులు విడఁదీయబడిన జటలతో స్నానముచేసి, అందమైన మాలలతో, గంధములతో లేపనము చేయఁబడి, శ్రేష్ఠమగు వస్త్రములు కట్టుకొని మిక్కిలి ప్రకాశించెను. రాముని అలంకారమును చేయు వీర్యవంతుఁడు, లక్ష్మీత్వము కలిగిన ఇక్ష్వాకు వంశ వర్ధనుఁడు అగు శత్రుఘ్నుఁడు లక్ష్మణునకు కూడ అలంకారము చేయసాగిరి. సీత యొక్క అలంకరణను దశరథుని భార్యలు తమకు తాము చేసుకొనినట్లు మనోహరముగా చేసిరి. తదుపరి వానరపత్నులందరకును, పుత్రవాత్సల్యము చేత ఆనందభరితురాలైన కౌసల్య ఉత్సాముగా అలంకారము చేసెను.
తరువాత, శత్రుఘ్నుని ఆదేశము మేర సుమంత్రుడు అను రథసారథి సర్వాలంకారములు చేయబడిన రథమును తీసుకువచ్చెను. మహాబాహువు, సత్యపరాక్రమవంతుడు అయిన రాముఁడు సూర్యమండలము వంటి శోభఁ గలిగిన దివ్యమైన ఆ రథమును తన ఎదురుగా చూచి దానిని అధిరోహించెను. సుగ్రీవుఁడు మరియు హనుమంతుఁడు మహేంద్రుని వంటి శోభ కలవారై, స్నానము చేసి దివ్యమైన వస్త్రములు కట్టుకుని, శుభకరమైన చెవికుండలములు పెట్టుకొనిరి. గొప్ప ఆభరణములు మరియు శుభకుండలములు పెట్టుకొని వచ్చిన సుగ్రీవపత్ని మరియు సీత, నగరము చూచుటకు ఉత్సాహముగా నుండిరి. దశరథరాజు యొక్క మంత్రులు అయోధ్యయందు పురోహితుల సూచనలను అనుసరించి అర్థవంతముగా ప్రణాళికను సిద్ధము చేసిరి.
అశోకుఁడు, విజయుఁడు, సుమంత్రుఁడు కలిసి, రాముని యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు కొరకు నగరమందు శ్రద్ధగా మంతనములు చేసిరి. మహాత్ముఁ డైన రాముని పట్టభిషేకము కొరకు విజయ సూచికగా చేయవలసిన అన్ని మంగళకరమైన పనులను తప్పక చేయుఁడు. అని ఆ మంత్రులకు, పురోహితులకు తగు సూచనలు చేసి, శ్రీరామ దర్శనము కొరకు నగరము నుండి బయలుదేరిరి. ఉత్తమమైన రథమునందు ఇంద్రునివలె కళంక రహితుఁడయిన రాముఁడు స్వారీ చేయ సాగెను. భరతుఁడు పగ్గాలను, శత్రుఘ్నుఁడు ఛత్రమును పట్టుకొనిరి. లక్ష్మణుఁడు వీవన పట్టుకొని రాముని నుదురునకు సోకునట్లుగా గాలి వీయసాగెను. తెలుపు రంగు చామరమును ముందువైపున, చంద్రప్రభ కలిగిన రాక్షసరాజగు విభీషణుఁడు పట్టుకొనెను. అప్పుడు ఆకాశమునందు ఋషి సమూహము, దేవతలు మరియు మరుద్గణములు చేయుచున్న రాముని యొక్క కీర్తనలు మధురముగా వినిపించినవి. అప్పుడు శత్రుంజయ అను పర్వతము వంటి ఏనుగును మహాతేజోవంతుఁడు, వానరముఖ్యుఁడు అగు సుగ్రీవుఁడు అధిరోహించెను. తొమ్మిది వేల యేనుగులను అధిరోహించి వెంట వెళ్ళుచున్న వానరులు మనుష్య రూపమున సర్వాభరణములతోఁ గనిపించిరి.
శంఖ నాదము మరియు దుందుభి ధ్వనులు మారుమ్రోగుచుండగా, పురుషవ్యాఘ్రమగు రాముఁడు భవనముల మాలలు కలిగిన అయోధ్యా పురమునందు వెడలసాగెను.
ముందు పరిచారకులతో వచ్చుచున్న రాఘవుఁడు అందమైన రూపముతో గొప్ప యోధుని వలె కనిపించెను.
తనకు జేజేలు పలుకు వారిని రాముఁడు తిరిగి పలకరింపగా, వారు కూడా సోదరులు చుట్టూ ఉన్న రాముని అనుసరించిరి.మంత్రులు, బ్రాహ్మణులు మరియు పౌరులు చుట్టూ ఉండగా ప్రకాశవంతుఁడగు రాముడు, నక్షత్రముల మధ్య చంద్రునివలె శోభించెను. ముందువైపు నడచుచున్నవారు తాళములు, స్వస్తిక, వాద్య పరికరములు చేతులతో పట్టుకొని, ఆనందకరము మంగళకరము అగు కీర్తనలు ఆలపింపగా, రాముఁడు వెడలసాగెను.
ఆవులను ముందు పెట్టుకుని అక్షతలు చేతితో పట్టుకుని బ్రాహ్మణులు, ముత్తైదువులు ముందు నడుచుచుండగా, వచ్చుచున్న మగవారు తమ చేతిలో తీపిపదార్థములు పట్టుకుని ప్రభువుతోపాటు వెళ్ళసాగారు. సుగ్రీవునితో స్నేహమును, హనుమంతుని బలమును, వానరులు చేసిన మహత్కార్యములు, రాక్షసులు మరియు వారి బలములను గూర్చి విభీషణునితో జరిగిన సమావేశమును గూర్చి రాముఁడు మంత్రులకు వర్ణించి చెప్పసాగెను. ఇది వినిన అయోధ్యా పురవాసులు ఆశ్చర్యము పొందిరి. ప్రకాశవంతుఁడైన రాముఁడు వాటిని గుర్తు చేసుకుని ముచ్చటించుచూ, వానరములతోఁ గలసి ఆనందభరితమైన జనసందోహముతో అయోధ్యలో ప్రవేశించెను.
తరువాత పౌరులు పతాకములను తమ తమ గృహములపై ఎగురవేసిరి. రమ్యము, ఇక్ష్వాకు రాజగృహము అయిన తన తండ్రిగృహమునకు రాముఁడు చేరెను. తరువాత ఆ రాజపుత్రుఁడగు రాముఁడు, ధర్మము పాటించు భరతునితో అర్థవంతమైన వచనమును మధురముగా పలుకసాగెను.
పితృగృహమునందు ప్రవేశించిన ఆ మహాత్ముడు కౌసల్యా, సుమిత్రా, మరియు కైకేయి లకు నమస్కరించెను. తరువాత భరతునితో ఇటుల చెప్పసాగెను. భరతా! నాయొక్క ఈ భవనము శ్రేష్ఠమైనది, అశోకవనములతోఁ గూడి యున్నది, ముత్యములు మరియు వైడూర్యములతో పొదగఁబడి యున్నది. దీనిని సుగ్రీవునకు చూపుమని పలికెను. ఆ వచనమును వినిన సత్యపరాక్రమవంతుఁడగు భరతుఁడు, సుగ్రీవుని చేతిని పట్టుకొని ఆ గృహములోనికి తీసుకొని వచ్చెను. అప్పుడు శత్రుఘ్నుని ఆనతి మేర కొందరు సహాయకులు తైలదీపములు, మంచములు, నేలచాపలు తీసుకుని గృహములోకి వచ్చిరి. మహాతేజోవంతుఁడగు భరతుఁడు సుగ్రీవునితో “రాముని అభిషేకము కొరకు దూతలను పురమాయింపు” మని చెప్పెను. సువర్ణమయము, సర్వరత్నమయములు అయిన నాలుగు కుండలను నలుగురు వానరశ్రేష్ఠులకు సుగ్రీవుఁడు ఇచ్చి,ఇట్లు పలికెను.
రేపు తెల్లవారే లోపుగా నాలుగు సాగర జలములతో ఈ కుండలను నింపి, నా ఆజ్ఞ కొరకు వేచియుండుఁడని పలికెను. మహాత్ముఁ డగు వానరశ్రేష్ఠుఁడు ఈ విధముగ చెప్పగనే, వారు గరుడునివలె వేగముగా ఆకాశమునకు ఎగిరి వెళ్ళిరి. అటు తరువాత జాంబవంతుఁడు, హనుమంతుఁడు, వేగదర్శీ మరియు ఋషభుఁడు అను వానరులు, నీరు నింపఁబడిన కలశములతో వచ్చిరి. అయిదువందల నదులలోని జలములతో ఆ కలశములు నింపబడియున్నవి. తూర్పుసముద్రము యొక్క నీటిచే నింపఁబడిన, రత్నమయమైన కలశమును సత్త్వగుణ సంపన్నుఁడైన సుషేణుఁడు తెచ్చెను.
దక్షిణసముద్రము యొక్క జలమును, ఎర్రచందనపు కాండములతో మూసినటువంటి బంగారు కుండలో ఋషభుఁడు త్వరగా తెచ్చెను. పశ్చిమమహాసముద్రము యొక్క చల్లటి జలమును రత్నభూషితమైన కుంభములో వాయువేగముతో గవయుఁడు తెచ్చెను. ఉత్తరమందున్న జలమును శీఘ్రముగా, గరుడ మరియు వాయువిక్రమము గల ధర్మాత్ముఁ డు, సర్వగుణసంపన్నుఁడు అయిన నలుఁడు తెచ్చెను. ఆ విధముగ వానరశ్రేష్ఠులచే రామ పట్టాభిషేకము కొరకు తీసుకురాబడిన జలముల గురించి, శత్రుఘ్నుఁడు తన మంత్రులతోఁ గలసి, పురోహిత శ్రేష్ఠులకు మరియు వారి సహచరులకు విన్నవించెను.
II పట్టాభిషేక ఘట్టము II
అప్పుడు వారిలో పెద్దవారైన వశిష్ఠులవారు, తోటి బ్రాహ్మణులతోఁ గలసి, రత్నమయ పీఠముపైన సీతతో సహా శ్రీరాముని మర్యాదపూర్వకముగా కూర్చుండఁబెట్టెను. వశిష్ఠుఁడు, వామదేవుఁడు, జాబాలి, కశ్యపుఁడు, కాత్యాయనుఁడు, సుయజ్ఞుఁడు, గౌతముఁడు మరియు విజయుఁడు . మానవులలో పులివంటి రామునకు సంతోషభరితముగా సుగంధభరితమైన జలములతో, అష్టవసువులు ఇంద్రునకు చేసిన విధముగ అభిషేకము చేసిరి. ఋత్విక్కులు మొదట బ్రాహ్మణులతో, తరువాత కన్యలతో, మంత్రులతో, యోధులతో, ఆనందముగా నున్న పట్టణవాసులతో అభిషేకము చేయించిరి. సర్వ ఔషధ రసములు కలిసిన పన్నీరును ఆకాశమందున్న దేవతలు, నలుగురు లోకపాలకులు, సర్వదేవతలు కలిసి రామునిపై చల్లిరి.
II కిరీట వర్ణన II
బ్రహ్మచే సృష్టికి పూర్వము నిర్మింపఁబడినటువంటి కిరీటము రత్నములశోభతో యున్నది. దీనితో చాలా కాలము క్రితము మనువునకు పట్టాభిషేకము చేయుటవలన తేజస్సుచే దీప్తమైనది. ఆయన తరువాత ఉన్న రాజులకు దీనిచే పట్టాభిషేకము చేయబడినది. ఇప్పుడు అది సభయందు బంగారువర్ణపు శోభతో, మహాధనవంతమయి, వివిధరత్నములచేత చిత్రముగా మంచిశోభను కలిగియున్నది. నానారత్నములు పొదగఁబడినటువంటి పిఠముపై యథావిధిగా ఉంచబడిన కిరీటమును అటు పిమ్మట మహాత్ముఁడైన వసిష్ఠులవారు తన తోటి ఋత్విక్కులతో కలసి మిగిలిన భూషణములతోపాటు రాఘవునకు అలంకారము చేసిరి. శుభకరమైన ధవళ ఛత్రమును శత్రుఘ్నుఁడు పట్టుకొనెను. తెలుపు రంగు చామరమును వానరేశ్వరుఁడగు సుగ్రీవుడు పట్టుకొనెను. చంద్రునివలె మెరయు మరియొక వ్యజనమును రాక్షసరాజగు విభీషణుఁడు పట్టుకొనెను. నూరు బంగారు పద్మములతో అందముగా వెలుగొందు మాలను, రాఘవునకు వాయుదేవుఁడు, ఇంద్రుని ప్రోత్సాహముతో ఇచ్చెను.
సర్వరత్నములతో పొదగబడి, మణిరత్నముతో విశేషముగా భాసించు ముత్యముల హారమును, ఆ రాజునకు, ఇంద్రుని ఆదేశము మేర వాయుదేవుఁడు ఇచ్చినాడు.
లావణ్యముగా అలాపించు దేవగంధర్వుల పాటలు, అందముగా నాట్యమాడు అప్సర గణములు, బుద్ధిశాలియగు రాముని పట్టాభిషేకమునకు తగిన రీతిలో ఉండెను.
భూమి సస్యశ్యామలముగా, చెట్లు ఫలములుతో, పుష్పములు మంచి సువాసనలతో, రాఘవ ఉత్సవములో నిండినవి. మనుజ శ్రేష్ఠుఁడగు రాముఁడు శత సహస్ర అశ్వములను, ధేనువులను, గోవులను, నూరు వృషభములను మొదటగా ద్విజులకు ఇచ్చెను. మూడువందలకోట్ల బంగారు నాణెములను, నానా విధములైన విలువైన ఆభరణములను, వస్త్రములను బ్రాహ్మణులకు రాఘవుఁడు మరల ఇచ్చెను.
సూర్యరశ్మివంటి ప్రభతో, బంగారముతో పొదగబడిన మణులు కలిగిన దివ్యమైన మాలను సుగ్రీవునకు మనుజర్షభుఁడగు రాముఁడు ఇచ్చెను. వైడూర్యమణితో చిత్రితమై, వజ్రరత్నముతో విభూషితమైన అంగదమును, ధృతిమంతుఁడు అయిన అంగదునకు రాముఁడు ఇచ్చెను.
శ్రేష్ఠములైన మణులతో, చంద్రకాంతితో సమానమైన ప్రభతో ఉన్న, ఉత్తమమైన ముత్యాలహారమును రాముఁడు సీతకు ఇచ్చెను. శుద్ధము, ధారణయోగ్యము, శుభకరమునైన ఆభరణమును వైదేహి వాయుసూనునకు (హనుమంతుడు) ఇవ్వఁజూచెను. సీత తన కంఠమునకు ధరించినఆ ఆభరణమును తీయుట అక్కడ ఉన్న తన భర్త వానరులు కూడా మరల మరల చూడసాగిరి. ఇంగితజ్ఞుఁడగు రాముఁడు, జనకాత్మజ యగు సీతను చూచి ఇట్లనెను. "ప్రియమైన సీతా, ఆ హారమును నీవు ఎవనికి ఇచ్చిన ఆనందము కలుగునో, ఎవనికి తేజస్సు, ధృతి, యశస్సు, దాక్షిణ్యము, సామర్థ్యము, వినయము, దూరదృష్టి, వీరత్వము, పరాక్రమము, మేధస్సు నిత్యము ఉండునో వానికి ఇమ్ము. ఆ హారమును నల్లటి కనులు కలిగిన సీత వాయుపుత్రునకు ఇచ్చెను. వానర వరేణ్యుఁడగు హనుమంతుఁడు ఆ హారమును ధరించగా, చంద్రకాంతులతో, తెల్లని మబ్బులతో అలంకరింపబడిన పర్వతమువలె ఒప్పెను.
శత్రువులను హింసించునట్టి ద్వివిదునకు, మైందునకు మరియు నీలునకు వారి ఇష్టములను బట్టి బహుమతులు రాముఁడు ఇచ్చెను. వానరవృద్ధులందరును, ఇతర వానరేశ్వరులు యథాయోగ్యముగా వస్త్రాభరణములతో సన్మానింపఁబడిరి.
విభిషణుని, సుగ్రీవుని, హనుమంతుని, జాంబవంతుని మరియు సర్వ వానరవృద్ధులను రాముని కొరకు విసుగు, అలసట చెందకుండా ఉన్నవారిని. వారికి ఇష్టములైన అన్ని రత్నములతో సత్కారములు చేయగా, వారు సంతోషమనస్కులై తిరిగి వెడలిరి.
వందనము చేయుచూ ఆ మహాత్ములగు వానరోత్తములు, రామునిచే వీడ్కోలు గొని కిష్కింధకు వెడలిరి. వానరశ్రేష్ఠుడగు సుగ్రీవుఁడు రామ పట్టాభిషేకము చూచి, రామునిచే సత్కరింపబడి కిష్కింధకు వెడలెను. ధర్మాత్ముఁడు, ప్రఖ్యాతి కలిగిన రాక్షసరాజగు విభిషణుఁడు, తన కులధనమగు రాక్షస రాజ్యము మరియు పరివారమును తీసుకుని లంకకు మరలెను. అఖిల రాజ్యములు శాసించగల, శత్రువులను సంహరించిన, మహాయశస్సు కలిగిన రాఘవుఁడు పరమ ఔదార్యముతో, పరమానందముతోనుండెను . ధర్మవత్సలుఁడగు రాముఁడు ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ఇట్లనెను. “ధర్మజ్ఞా! నాతో పాటు ఈ రాజ్యమును పూర్వరాజులు సైన్యముతో కూడి పాలించినట్లు, నేను మన పితరుల నుంచి పొందినట్లు, నీవు కూడా యువరాజు వలె రాజ్యభారమును తీసుకొనుము అనెను. అన్నివిధముల బ్రతిమిలాడినగాని సౌమిత్రి అంగీకారము తెలుపని కారణమున, యౌవరాజ్యాభిషేకమును రాముఁడు భరతునకుఁ జేసెను. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయాది ఇతర యజ్ఞములు రాముఁడు ఆచరించెను. రాజ్యమును పదివేల సంవత్సరములు అనుభవించిన రాఘవుఁడు నూరు అశ్వమేధయజ్ఞములలో మంచి అశ్వములు మరియు దక్షిణలు దేవతల కోసము సమర్పించెను. ఆజానుబాహుఁడు, ప్రతాపవంతుఁడునైన రాముఁడు, లక్ష్మణునితోఁ గలిసి రాజ్యమును పాలించెను.
ధర్మాత్ముఁడగు రాముఁడు గొప్పది ఉత్తమమైనది అగు రాజ్యమును పొంది, దేవతల ప్రసన్నము కొరకు తన పుత్రులు, భ్రాతృలు, బంధువులుతోఁ గలసి బహువిధములగు యజ్ఞములు చేసెను. వైధవ్య విషాదము, కౄరమృగముల భయము, వ్యాధి భయములు లేక రామరాజ్యము కీర్తింపఁబడెను. దొంగతనము లోకమునందు లేదు. జనుల యందు వ్యర్థభావము లేకుండెను. వృద్ధులు బాలురపై ప్రేతకార్యములు చేయవలసిన అవసరము రాకుండెను. అంతా ఆనందముతో ఉండెను. అందరూ ధర్మపరులై ఉండిరి. రాముని దృష్టిలో ఉంచుకుని పరస్పరము హింసించుకొనక యుండిరి. వేల సంవత్సరముల ఆయుర్దాయముతో, వేలమంది పుత్రులతో, అనారోగ్యము లేక, శోకము లేక రామునిచే రాజ్యము పాలింపఁబడెను.
రామ, రామ, రామ అనుచు రాముని గురించి, రామరాజ్యమును గురించి ప్రజలు చర్చించుకొనిరి. జగత్తంతయు రామరాజ్యమును కీర్తించెను. నిత్యము పుష్పములతో, ఫలములతో మరియు విస్తృతమైన కొమ్మలతో చెట్లు ఉండెను. మబ్బులు సకాలములమున వర్షించెను. శరీరములకు సుఖము కలిగించు విధముగ గాలి వీచెను.
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లోభము లేక, తమ తమ కర్మలయందు ఆనందముగా ప్రవర్తించుచుండిరి. ప్రజలు ధర్మపరులై, అబద్ధములు పలుకక, రామరాజ్యమున అందరు మంచి లక్షణములతో ధర్మపరాయణులై యుండిరి.
పదకొండు వేల సంవత్సరములు తన తమ్ములతోఁ గలిసి శ్రీరాముడు రాజ్యపాలనను చేసెను.
ఓం శ్రీమాత్రే నమః.
రామానుగ్రహం.
ఆత్మ స్వరూపులకు కైమోడ్పులు. ఈ శ్రీరామ పట్టాభిషేక పద్యానువాదానికి ప్రేరణ మీకు తెలియవలసి ఉంది. ఆ మధ్య శ్రీ మాచవోలు శ్రీధరరావుగారి శ్రీధర రామాయణము గ్రంథావిష్కరణ మా SRV Dhatmistha క్లబ్ హౌస్ లో జరిగింది. అప్పుడు ఆ సభలో సుప్రసిద్ధ కవి శ్రీ కడయింటి కృష్ణమూర్తి " రామాయణాన్ని ఎందరు కవులు పద్యగ్రంథంగా వ్రాసినా వాటి ముద్రణకయే ఖర్చు నేను భరిస్తాను అని ప్రకటించగా సుమారు 12 మందికవులు వ్రాశారు. ప్రజ పద్యం అనే సాహిత్య వేదిక నిత్యమూ చేపట్టే కార్యక్రమాలలో భాగంగా తే.23 - 3 - 2025న యీ 12 రామాయణ గ్రంథాలు ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టి, కార్యక్రమారంభంలో వాల్మీకి రామాయణంలోని బాలకాండలో మొదటి ఇరవై శ్లోకములు, అరణ్యకాండలో చివరిదయిన 131వ సర్గ శ్రీరామ పట్టాభిషేక ఘట్టము పారాయణ చేయుటకు నిర్ణయించారు. మా తమ్ముఁడు చి. నారుమంచి వేంకట అనంతకృష్ణ గారు ఏమి చేసినా తప్పక అద్భుతమైన పరార్థము, పరమార్థము ఉంటాయి. ఇది చూచిన నాకు అనిపించింది. ఏమనంటే ... పారాయణ చదువుకొంటూ పోతూ ఉండే ఫలితం ఒకెత్తయితే, ఆ చదివేది మనసునకు పూర్తిగా అర్థమయి పారాయణ చేస్తే అది మరో ఎత్తు అని అనిపించి ఈ పట్టాభిషేక ఘట్టాన్ని అర్థమయే తేలికగా ఉండే తేటగీతులలోనికి అనువదిస్తే ప్రయోజనకరంగా ఉంటుందేమో అని అనిపించింది. అమ్మా సీతమ్మా ఏమంటావు తల్లీ అని భావించుకొన్నాను. అంతే క్షణం ఆలస్యం చెయ్యకుండా ఆ సీతారాముల ప్రేరణతో రచనకుపక్రమించాను. ఒక్క రాత్రిలోనే ఆ సీతారాములు ఈ ఘట్టాన్ని నాచే లోకకల్యాణకరంగా వ్రాయించుకున్నారు. నిజం చెప్పాలంటే నా మనసు సంతోషం పట్టలేక అనంతకృష్ణ, దత్తాత్రేయ తమ్ములకు, డా.డీ.వీ.జీ.యే.సోమయాజులు గార్లకు పంపుతూ, మా SRVD ELIGHT సమూహంలో కూడా పెట్టాను. ఈ సమూహం యెల్లప్పుడూ నన్నెంతగానో ప్రోత్సహిస్తుంది. అందుకని ఈ సమూహంలో కూడా పెట్టాను. అంతే మా తోటి సభ్యులయిన ఒకరు .. తన పేరు ప్రకటించ వద్దన్న శ్రీమన్నారాయణ భక్తులు ఎంతో ఉప్పొంగిపోతూ ఈ గ్రంథం ముద్రణ ఖర్చు నాకు అందుబాటులో ఉంటుందంటే నేను సంతోషంగా భరిస్తాను, శ్రీరామ నవమినాడు ఆవిష్కరించుకుందాం అన్నారు. వీరు ముద్రింపిస్తున్న సంగతి తెలిసి, ఆ గ్రంథం ఆవిష్కరణము శ్రీరామ నవమినాడు మన ఎలైట్ గ్రూపు అద్భుతంగా చేస్తుంది, సిద్ధం చెయ్యండి అని గ్రూప్ సభ్యులు నన్ను ప్రోత్సహించారు. అంతే నాకు కాళ్ళూ చేతులూ ఆడ లేదు. శ్రీరామ నవమి దగ్గరపడుతోంది. నేను ముద్రణార్హంగా శుద్ధప్రతి సిద్ధం చెయ్యగలనా? అని భయపడుతూ ఆ శ్రీరామానుగ్రహమే ఇంతవరకూ తేగా ఇంక ఈ పని కూడా ఆ రాముఁడే చేయించుకోకుండా ఉంటాడా అని భావించి ప్రతీ పద్యానికీ భావాన్ని కూడా వ్రాసి ప్రారంభం, ముగింపు పద్యాలు జత చేసి అయిందనిపించాను. డా. డీ.వీ.జీ.యే.సోమయాజులుగారు గ్రంథము మొత్తం చదివి తగిన సూచనలు చేసి నిర్దోషంగా ఉందని నిర్ధారించడంతో ముద్రణకు మనసు అంగీకరించింది.
మా అనంతకృష్ణ తమ్ముఁడు నాకు కొండంత అండ. వారి సూచన మేరకు ముందడుగు వేశాను.
ముందుగా అనేకులయిన రామాయణకవులకు గ్రంథముద్రణ చేయించిన శ్రీ కడయింటి కృష్ణమూతిగారికి, గ్రంథాలను ఆవిష్కరణద్వారా చక్కని పారాయణ ఏర్పాటు చేయుటద్వారా నాకు ప్రేరణ కలిగించిన శ్రీ అనంతకృష్ణగారికి ప్రజపద్యనిర్వాహకత్రయంలో మిగిలిన పెద్దలయిన డా.పటువర్ధన్ గారికి, గణేశ్ గారికి, గ్రంథ పరిష్కరణ చేసిన డా.డీ.వీ.జీ.యే.సోమయాజులు గారికి, ఇంకనూ నన్ను ప్రోత్సహించిన అభిమానులకు, ముఖ్యంగా ఈ గ్రంథ ముద్రణను అభిమానంతో చేయించిన అజ్ఞాత నారాయణ భక్తులకు, ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమము చేయించుటకు ముందుకు వచ్చిన మా SRVD ELIGHT సమూహం సభ్యులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియఁజేసుకొంటున్నాను. శ్రీ సీతారామచంద్రుల పాదపద్మాలకు ప్రణమిల్లుచు ఈ గ్రంథ రచన ప్రేరకులకు, కారకులకు ముద్రాపకులకు,ఆవిష్కారమహోత్సవమును నిర్వహించిన మహోదయులకు ఈ గ్రంథ పాఠకులకు నిరంతరం శుభపరంపర కలిగిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. అందముగా ముద్రించిన ముద్రణాలయం వారికి ధన్యవాదములు.
ఇట్లు సుజన విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.
తే. 18 – 3 – 2025.
పండితాభిప్రాయాలు.
మృదు సమీక్ష.
బ్రహ్మశ్రీ భమిడిపాటి వీరనారాయణ
శ్రీ రామ పట్టాభిషేకమును అనేక కవులు, రచయితలు తమ భక్తి, నమ్మకము మరియు ఆచారముల ద్వారా కవితలుగా రాశారు. కాని శ్రీ చింతా రామక్రిష్ణ రావు గారిది విభిన్నం.
పట్టాభిషేకానికి సంబంధించిన కవితలు, శ్రీ రామునిని మరియు సీతమ్మను పరమాత్మలుగా సూచిస్తూ సాధారణంగా ఆధ్యాత్మికతను, న్యాయాన్ని, ధర్మాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రాథమిక భావాలను పక్కన పెడుతున్నాయి. కానీ కవి గారి ఈ కవితల్లో సంకీర్తన మరియు భక్తి , బహు బాహుళ్య భావనగా వ్యక్తమైనది.
శ్రీ రామ పట్టాభిషేకము, తెలుగు సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానమును కలిగి ఉన్నది. కవిగారు ఈ ఘట్టాన్ని కవితా సందర్భంగా మలుచుకుని, శ్రావ్యమైన భాషలో, సులభంగా అర్థమయ్యే శైలిలో రాసినట్టు ఉంటాయి. పూర్తిగా అన్నిపద్యాలు భక్తి భావనని పెంచేందుకు చర్యలతో కూడిన దృశ్యాలను మనోనెత్రమందు చూపి పాఠకులకు ఆసక్తిని కలిగిస్తాయి.
౧౮) తే.గీ. పద్యమున " వానర వనితలకును చేసె సుమహితాలంకృతి", ౧౦౨) తే.గీ. పద్యమున " ప్రగణితముగ మేఘఘ్ములు వాన గురిసెను మింటనొప్పి" అను పదప్రయౌగములు వారి "కవి కల్ప భూజ, చిత్రకవితాసమ్రాట్" అను బిరుదులు వీరి కీర్తి కిరీటమునకు సొబగులుననొసగినివి.
శ్రీ రామ పట్టాభిషేకము మీద రాసిన కవితలు, శ్రద్ధ మరియు ఆధ్యాత్మిక భావాలు మాత్రమె పొందింనవి కాదు, ఇవి మన ప్రప్రథమ పాత్రలు, రామాయణ పాఠాలు, పవిత్రమైన అర్థం, సమసమాజ సూత్రాలతో కూడిన అనేక అంశాలను అన్వేషించును. కాబట్టి కాలమానం, అనుభవాన్ని, మరియు కవిత్వాన్ని పండించడంలో కవిగారు సఫల మైనారు.
"శ్రీరామ పట్టాభిషేకము" ఒక సమకాలీన విశ్లేషణతో కూడిన గొప్ప కావ్యం. ఇది కేవలం ఆనందానికి మాత్రమే కాదు, మానవ సంబంధాలను మృదువుగా అర్థం చేసుకోవడానికి కవిగారి పూర్తి ప్రయత్నం. అందులోని భావుకత్వం ప్రతి పాఠకుడికి ఒక స్ఫూర్తి కలిగిస్తోంది.
ఈ కవితలు మనకు రాముడి పట్ల ఉన్న భక్తిని, ఆయన విలువలను గుర్తు చేస్తాయనే చెప్పవచ్చు.
ప్రతి తెలుగు సాహిత్య పాఠకులు ఈ అద్భుత రచనను తప్పక చదవాలి. ఇది నిత్య పారాయణ గ్రంథముగ స్వీకరించదగినదని మనవి.
శ్రీరామచంద్ర! కరుణాకర రాఘవేంద్ర! - రాజేంద్రచంద్ర రఘువంశసముద్రచంద్ర!
సుగ్రీవనేత్రయుగళోత్పల పూర్ణచంద్ర!- సీతామనఃకుముదచంద్ర! నమోనమస్తే!!
బుధజన విధేయుఁడు
వీర నారాయణ భమిడిపాటి. భాగ్యనగరము.
తే. 18 - 3 - 2025.
శ్రీమన్నారాయణ
స్మరణ.
నామ గోపన చిత్ర గుప్త
పంచమపాద శార్దూలము.
శా. రామా! సుందర! నీకు సాటిలను వీర్నారాయణేన్, తల్లి సీ
తా మాన్యాత్మయె,భక్త మోదకుడ!ధాత్రిన్ రాజిలన్ గావ, రా
రా! మాశ్రీకర భమ్డిపాటినిల భద్రన్ జేయ రా! నీవ మా
క్షేమంబే కను నిత్య పాలకుఁడ వీ శ్రీమద్గుణశ్రీగ రా.
గుప్తపంచపాదము
రామా! శ్రీకర! భండిపాటి కుల వీర్నారాయణన్ గావ రా!
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.