గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఫిబ్రవరి 2025, గురువారం

సర్వమంగళా! నా పద్య పంచకము.

 జైశ్రీరామ్.

1ఉ.  శ్రీమహనీయనామ! నివశింపుము నాహృదయాబ్జమందు, నీ
నామము సంస్మరించిననె నా భవబంధము లంతరించు, నీ
స్వామియు నీవు నా మదిని చక్కగ నిల్చిన జన్మ ధన్యమౌ
నో మహిమాన్వితా! సుతుఁడ నొప్పుగ నన్ గను సర్వమంగళా!

2చం. ఇహమున సంచరించునెడ నీశ్వరి నీ స్పృహ  కల్గియుండి స
న్నిహితము నీకునౌచు మది, నిత్యవసంతవిశేషశోభతో
నహరహమున్ మెలంగుట మహాద్భుత  శాశ్వత ముక్తియోగమే,
రహి గనఁజేయు నిన్ గను వరంబిడు, ముక్తిద! సర్వమంగళా!

3చం. ప్రియముగ నా మదిన్ నిలిచి ప్రేరణఁ గొల్పెడి పార్వతీసతీ!
నయ శుభమార్గ దర్శివయి నన్ నడిపింపుము లోకపావనీ!
క్షయ మెఱుగంగ రాని కృప చక్కఁగ నాయెడచూపు నీకిలన్
జయము, దయాంబురాశి! విలసన్నుత నీకిట సర్వమంగళా!

4.ఉ.  కోపమెఱుంగనట్టి బుధకోటిమనంబుల వెల్గు శాంభవీ!
దాపరికంబె లేనిశుభ తత్వమె నాకును గొల్పుమమ్మ! యీ
పాపపు పంకిలమ్ము నిను పాయఁగ జేయుచు నుండునమ్మ! నా
పాపములన్ హరించి,గుణవర్ధన చేయుమ సర్వమంగళా!

5చం.  నిలకడ లేని నా మదిని నీవు వసించి స్థిరంబు గొల్పి, నా
పలుకులె సత్కవిత్వముగ వర్ధిలునట్లుగ చేయుచున్న నిన్
బలుమరు మ్రొక్కెదన్ సుగతి భాగ్య మొసంగుచు కావుమమ్మ! నా
తలపులలోన నిల్చి, పరతత్వము గొల్పుము సర్వమంగళా!

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.