వైవిధ్య సృజనశీలి
పి. వి. బి. శ్రీరామమూర్తి
రచన ఓ మేధో మథనం. క్షీర సాగర మథనం తరువాతే అమృతం లభించింది.అలాగే రచన కూడ.అయితే ఇక్కడ లభించేది సాహిత్యామృతం.దాన్ని పంచేందుకు ఎంతో అలోచన, కృషి,పరిశీలన ఉండాలి.తీసుకున్న ఇతివృత్తసంద్రపు లోతులు కొలవగలగాలి. కథాంశపు ఔచిత్యత,పాత్రల మనోధర్మాలు,భావోద్వేగాలు,ఉచితా నుచితాలు మనోనేత్రంతో దర్శించగలగాలి.
మనోయవనికపై వారి హావభావాలు, ప్రవర్తన, ప్రదర్శించుకోగలగాలి.చెప్పదలచుకున్న కథలో పాత్రలస్వభావం,మనోస్థితి,ఉద్వేగస్థాయిని బట్టిపాత్రల చేత సంభాషణలు పలికించాలి. అవి పెద్దవిగా ఉండాలా, లేదా చిన్నవిగా ఉండాలా, అసలు ఏమి లేకుండా ఉండాలా అన్న విషయంలో రచయితకు ఎంతో స్పష్టత ఉండాలి. రచయితకు మాండలీకంలో రాయాలనే అభిలాష ఉంటే గనక , అది చాలామందికి అర్ధమయ్యేటట్టు రాయాలి.అది పాత్రోచిత భాషలోఉండాలి . కథను చదివించే రీతిలో చెప్పటం తెలియాలి.అదే కథాకథనంఅంటాం కదా ! పైన చెప్పుకున్న వాటి కలబోతే కథాశిల్పం.
ఈ లక్షణాలను సలక్షణంగా కలిగి, ఓ విలక్షణ రీతిలో ఐదు దశాబ్దాలకు పైగా సాహితీసృజనచేస్తున్న సుప్రసిద్ధరచయిత శ్రీ. పి. వి. బి. శ్రీరామమూర్తి జీవిత, సాహిత్య విశేషాలను తెలుసుకుందాం.
జనన విద్యాభ్యాసాలు :
తండ్రి రామారావు,తల్లి లక్ష్మి నారాయణమ్మల ఎనిమిదిమంది సంతానంలో మూడవవారుగా 15.4.1951లో రణస్థలం అనే గ్రామంలో శ్రీకాకుళం
జిల్లా లో జన్మించారు. తండ్రిఉపాధ్యాయులు.వీరి విద్యాభ్యాసం చీపురుపల్లిలో ప్రారంభమై కోనూరు,మెట్టుపల్లి లలో, విజయనగరం మహారాజా సంస్కృతకళాశాలలో సాగి ఆంధ్రా యూనివర్సిటీ లో ముగిసింది. పండిత శిక్షణను పొందారు
ఉద్యోగబాధ్యతలు :
1972నుండీ 2008వరకూ పార్వతీ పురం అర్. సి. యమ్ బాలుర పాఠశాలలో తెలుగుపండితునిగా
ఉద్యోగం.
రచనా వ్యాసంగం :
17సంవత్సరాలవయసులో రచనకు శ్రీకారం. అన్ని పత్రికల్లో 400 కి పైగా కథలు వచ్చాయి. అనేక కథలకు బహుమతులు వచ్చాయి. వీరి కథలు.. ముళ్ళు.. అరణ్య రోదనం అన్న పేరుతో సంపుటాలుగా
వచ్చాయి. హాస్య.. వ్యంగ్య కథలు అన్న పేరుతో ఒక సంకలనం వచ్చింది .వెలుగుబాట, సంకెళ్లు,ప్రేమసూత్రం జేబులో బొమ్మ, ఇదో యజ్ఞం, నేరం శిక్ష అనే నవలలు రాసారు.చిన్న పిల్లలకోసం కథలు రచించారు.
రేడియో రచయిత గా :
విశాఖ పట్టణంరేడియా ద్వారా 10 నాటికలు ప్రసార మయ్యాయి.వాటిలో పావలా శ్యామల, కోకా సంజీవరావు లాంటి అద్భుత నటులు నటించారు. ఆధ్యాత్మిక ప్రసంగాలతో పాటు , 50కథలు,కవితలు కూడ వచ్చాయి
నాటకరంగానుభావం :
పార్వతీపురంలో మిత్రసాహితీ సంస్థ కార్యదర్శిగా 25 సం.లు సేవచేసి పాఠశాల పిల్లలకు నాటికలు రాసి ప్రదర్శింప చేసారు. అంతేకాదు హరిశ్చంద్ర లో నక్షత్రకునిగా 50కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు.
కథా సంకలనాలు :
ముళ్ళు,వ్యంగ్య హాస్య కథలు,అరణ్య రోదనం కథలు సంపుటుల ప్రచురణ.సంకెళ్ళు నువ్వు ఎమెస్కో ముద్రణ . ఈనాడు అం తర్యామి శీర్షిక కు వ్యాసాలురాసారు ..
హిందీ లోకి అనువాదం :
ముళ్ళు, సొరాజ్యం తాత, పునాదిరాళ్లు అన్న వీరి కథలను ఇనుగంటి జానకి హిందీలోకి అనువాదం చేసారు. అవి సూత్ర,సర్వనామ్ అనేహింది పత్రికలలో ప్రచురితమయ్యాయి..
పురస్కారాలు :
విజయనగరం అభినందన సంస్థ2021లో ఉత్తమ రచయితగా పురస్కారం ఇచ్చింది.పలు సన్మానాలు అందుకున్నారు . చిత్తూరు సృజన సాహితి అరణ్య రోదనం అనే సంకలనానికి పురస్కారమిచ్చింది.
రచయిత కావటానికి స్ఫూర్తి :
నాచుట్టూ ఉన్న వాతావరణం నన్ను రచయిత ను చేసింది .తిక్కన, పోతనను, వేమనలను
సంస్కర్తగా కందుకూరి వీరేశలింగం పంతులుగార్ని అభిమానిస్తారు.. రావిశాస్తి అంటే ఇష్టం.ఏఒక్క ఇజానికీ బధ్ధులు కారు ఒక్క హ్యూమనిజానికి తప్ప .
" రచయితకు వ్యక్తిత్వం ఉండాలి.విషయం చెప్పే ధైర్యం ఉండాలి! నిజాయితీ, నిబద్ధత ఉండాలి " అంటారు.
రచయిత గా ఎదిగిన వైనం :
ప్రేమ్ చంద్, ఠాగురు, శరత్ బాబుల రచనలు విపరీతంగా చదివారు. ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక లతో పాటు ఆనాటి వారపత్రికల చదివిన స్ఫూర్తితో రచనలు చేసారు.
" మా నాన్నమ్మ కథానిధి.చెప్పిన కథ చెప్పకుండా రోజు మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టి కథలు చెప్పేది. నేను రాయాలనే కోరిక కలిగింది. మొదట అన్నయ్య, నేను కలసి నవలలు రాసాం. అయితే అవి పడలేదు. " రచయితగా తన ప్రస్థానం ఎలా సాగిందో చెబుతూ.
తొలి కథ…పాపం శైలజ..కృష్ణా పత్రికలో అచ్చయింది
పార్వతీపురం ఉద్యోగం అప్పుడే..కదంబ సాహితి.. అన్న పేరుతో స ఒక సాహితీ సంస్థ ఏర్పాటు చేసి, కార్యదర్శి గా ఉన్నాను. అదే నన్ను రచయితను చేసింది.
అప్పటినుంచి ఇప్పటివరకు కథల రాస్తూనే ఉన్నారు.
2000 లో ముళ్ళు 2008లో హాస్య, వ్యంగ్య కథలు సంపుటాలుగా వచ్చాయి. పదిహేనే ళ్ల తరువాత..38 కథలతో….అరణ్య రోదనం.. అనే పేరుతోఒక పుస్తకాన్ని తెచ్చారు.
వైవిధ్యమైన కథాంశాలతో.. చక్కని పాత్ర చిత్రణతో.. సంధ రభోచిత మాటలతో విలక్షణంగా నిలిచే వీరి కథల మీద కొందరు పి. హెచ్. డి. చేస్తున్నారు.
అరణ్యరోదనం కథల సంపుటి ....విశేషాలు…కొన్ని కథల విశ్లేషణ ::
ఈ సంకలనంలో 38 కథలున్నాయి. ఇవి ప్రముఖ పత్రికలలో పడ్డాయి. పాఠకుల కెంతగానో నచ్చిన, విమర్శకుల మెచ్చుకున్న, తనకు నచ్చిన వాటిని ఒకసంకలనం గా మనకందించారుశ్రీ పి. వి. బి. అన్నిటికి చదివించేశక్తి వుంది. వాటిల్లో కొన్నిటిని పరిచయం చేసుకుందాం.
1.అరణ్య రోదనం :
ఇది మొదటి కథ. దీనికి ఎంతో పేరు వచ్చింది.ఇది రచయిత అనుభవాన్ని, నిశితపరిశీలనాశక్తిని చెబుతుంది.సమాజ గమనాన్ని గమనించేవాడిగా అర్ధమవుతారు. కొండల మధ్య ఉండే సవర్ల మీద దాడులు, దోపిడీలు ఎలావుంటాయో చెప్పే గొప్ప కథ. మనుషుల దోపిడీ, దౌర్జన్యానికి, వారు ఎలా బలవుతున్నారో దృశ్యమానం చేసే కథాచిత్రమిది.
కిమిడిగూడ అన్నలకు అపుడపుడు రక్షణ ప్రదేశం. కనుక పోలీసులు ఒక కన్ను వేసి ఉండే ప్రాంతం. ఆ సవర్ల శ్రమను ప్రాణ ధనాన్ని, మాన ధనాన్ని దోచుకునే కొండయ్య అతని కొడుకు ధర్మరాజు లాంటి బడా మనుషులు.ఇంతమంది దోపిడీ దారుల మధ్య సవర్లు బిక్కు బిక్కు మంటూ జీవితాన్ని ఎలా కొనసాగిస్తారో చెప్పే కథ ఇది.
వారు కత్తళ్ళ.. పండుగను సంబరంగా జరుపుకునే వేళ కామానికి రూపమైన ధర్మరాజు, ఆ సవర్ల పెద్ద సాంబ మొగ్గ లాంటి కూతురు.. మల్లిని తుంచేసిన వైనాన్ని, పోలీసులదాడిని వారి దురాగతాలను పద చిత్రాలతో పాఠకులకు చూపే కథ.
స్థూలంగా చూస్తే ఇది సవర్ల తెగకు కుటుంబాలకు చెందిన కథ. కాని సూక్ష్మంగా చూస్తే ఎన్నిఅంశాలో? కొండయ్య లాంటి దోపిడీ దారుల….ఉద్యమకారుల.. పోలీసుల….అడవి జంతువుల దాడి ప్రాణాలు అరచేతి పెట్టుకుని క్షణం క్షణం భయంతో జీవితాన్ని గడిపే కేవలం సవర్ల కథేనా ఇది? కుటుంబం.. సమాజం.. వ్యవస్థ ఎన్ని అంశాలను పొదవుకుందీ కథ.
చాలామంది వేదికల్లో చెప్పే సామాజిక స్పృహ దీంట్లో లేదా? దాన్ని ప్రత్యేకంగా చొప్పించే యత్నం చేయకుండా కథాఇతి వృత్తంలో చోటు ఉంటే ఏ రచయితైనా తప్పక దాన్ని చూపుతాడు. శ్రీరామ మూర్తి గారు చేసిన పని అదే. సామాజిక స్పృహ పులుము కుంటే రాదు.కాని తీసుకున్న అంశంలో సామాజిక కోణం ఉన్నదని భావించిన ఆలోచనాత్మక రచయిత ఎవరైనా దానిని స్పృశించక మానడు.శ్రీరామమూర్తి రాసిన చాలా కథల్లో అది అంతర్లీనంగా ఉంటుంది. ఆ దృష్ట్యా చూసినప్పుడు ఇది చాలా గొప్ప కథ.
ఉపమానాలు :
భావాన్ని పోలికలు చేస్తూ చెపుతుండటం వీరి అలవాటు. సాధ్యమైనంత వరకు నవ నవోన్మేషమైన పోలికలు చేయటం ఈ రచయితకుచాలాఇష్టం.అలాగే ఆ ప్రాంతపుపలుకుబళ్ళుచొప్పించటం మహా మోజు.
.కొన్నిటిని పరామర్శిస్తాను.
*తుఫాన్ సమయంలో హెలికాప్టర్ నుండి ఎగిరివేయవేయబడ్డ ఆహారం పొట్లాల్లా ఆ కొండల మధ్య అక్కడా అక్కడా ఉన్న ఇళ్ళు.
*కోమిటోణ్ణి సూసి నక్క సొంటికొమ్మడిగినట్టు.
*ఏనుగులు ఒరిస్సా అడవుల్నించి..పారొ.. చ్చాయి.
*మంచుతో కప్పబడిన కొండలు కేరి బేగుల్లో పెట్టిన
ఆకుకూరల సంచీలా ఉంటాయి.
*సావుకారు ముందు కెళ్తోన్నా అతని మనసు పరుగులుతీస్తోందిగాలికి ఎగిరే జెండాలా.
* కొండలో చలికి జనమంతా రగ్గులు కప్పుకుని గడ్డిలో పెట్టి గోనెల్లోకి దింపిన అరటిపళ్ళ గెలల్లా ఉన్నారు.
*అర్ధ రాత్రి అయిందేమో…కొండ తారు పులుము కున్నట్టుంది.. చింత గీర్లు గోల చేస్తున్నాయి.
*రక్తం మడుగులో చచ్చిన చేపపిల్లలా తేలాడు అతడు.
*అందు కొచ్చే పంట ధ్వంసమయింది.
*కంటికి కునుకురాక దేవత లయారు ఇలాంటివి ఎన్నో!
2. అమ్మా, ఆ బడికి నీ నెల్లనే?
బడికి టైమ్ అయినా లేవని తన కొడుకును తల్లి పారమ్మ లేపటంతో కథ మొదలవుతుంది.సూరి కి బడికి వెళ్ళటం ఇష్టంలేదు. . చేరినప్పుడు వచ్చిన కొత్త బట్టలు, బేగ్…సరదాగానే ఉండేది. కాని వాడిమనసులో ఎన్నో బాధలు. సంవత్సరం అవగానే అందరూకొత్త యూనిఫారాలతో వస్తారు.వీడి నిక్కరు మధ్య
చిరుగును చూసి అందరూ నవ్విన నవ్వుకు వాడికి ఎంతో బాధ అనిపించింది. ఆలస్యమైనందుకు పంతులమ్మ వేసే శిక్షలుభరించలేక పోయాడు.అది సర్కారు బడి. సూరి అక్కడ చదివితే ఉచిత చదువూ, ఇంటికి బియ్యం వస్తాయి.. అందుకు నరసింగుకు అంత శ్రద్ధ కొడుకు చదువు మీద.రెండు సంవత్సరాలైనా వీడికి చదువు అబ్బలేదు. ఈలోపు ఆ బడిలో పిల్లలు కాన్వెంట్ లో చేరారు. ఇవన్నీ సూరికి ఆ బడంటే రోత పుట్టింది.
అతలాకుతలమయ్యే పిల్లవాడి మనసుని శ్రీరామమూర్తి గారు ఎంత బాగా చూపారో చూడండి.
ఈ కథ రాసే నాటి ప్రభుత్వ బళ్ళ తీరు తెన్నులు పరీక్ష విధానాలు ఎలా ఉన్నాయో కళ్ళకు కట్టినట్టు చూపారీ కథలో.
అమ్మా ఆ బడికి నీనెల్లనే! అన్ని అమ్మకు చెప్పి ఎలాగైనా.. ఆ వెంకటేశ్వర కాన్వెంట్ లో చేరి బాగా చదువుకుంటానని అని సూరీడు మనసు కొట్టుకు పోతుండగా కథ ముగుస్తుంది. " చాలా మంచి కథను రాసారు. " అన్ని శ్రీ భరాగో మెచ్చుకున్నారు.
మనం చదివిన కథ సమాజం లోని ఉన్న వాస్తవాలను మనకు అనుభూతంచేయగలగి,ఆలోచింపచేయగలిగితే అది నిస్సందేహంగా గొప్ప కథే. ఈ కథ మనకు ఆ అనుభవాన్ని ఇవ్వటం లేదూ!?
3. హమ్మయ్యా, దేవుడు బజ్జున్నాడు.
తల్లి, తండ్రి, గురువుల ప్రాధాన్యతను చెప్పే కథ. స్కూల్లో ఒక విద్యార్థి ఐదు వందల రూపాయలు పోయినప్పుడు మాస్టారు తరగతి గది నుండి అందరిని బయటకు రమ్మనిఒక్కొక్కరిని లోపలికి వెళ్ళి ఆ దొంగ తనం చేసిన వారెవరో ఆ డబ్బును అక్కడ పెట్టమని చెబుతాడు. కాని అది అనుకున్న ఫలితాన్నిఇవ్వదు.
అప్పుడు అబద్దం చెప్పినవారు గాని వారి తల్లిదండ్రులు చచ్చిపోతారు అన్న మాస్టారి మాటలు దేవుడి మనసులో నాటుకుపోయాయి . ఇంటి కొచ్చేసరికి తండ్రి ఒకరి దగ్గర డబ్బు తీసుకుని ఇంకొరికి అన్యాయమైన తీర్పు చెప్పటం, నిగ్గదీసినపుడు డబ్బు తీసుకోలేదని అబద్ధం చెప్పటం వింటాడు.స అది వాడి పసి మనసుని అల్లకల్లోలం చేసి, పెను అలజడిని లేపుతుంది. ఆకలికి, నిద్రకు దూరం చేస్తుంది.అప్పుడు వాణ్ణి బుజ్జగించి, ప్రేమగా మాట్లాడి అసలు విషయం తెలుసుకున్న వాడి అమ్మ వాడికి అద్భుత రీతిలో వాణ్ణి సమాధానం పరచి
అబద్ధం విషయంలో ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని వివరించి వాణ్ణి నిద్ర పుచ్చుతుంది. ఆ సందర్భం లో ఆమె చేత రచయిత చెప్పించిన మాటలు చాలా గొప్పవి. అవి పిల్లాడికి కాకుండా మనకందరకూ.. సమాజానికి చెబుతున్నట్లు ఉంటాయి. చెప్పటానికి..ఆచరించటానికి మనం చూపే ఆగథాన్ని చూపుతాయి.ఓగొప్ప మనస్తత్వ విశ్లేషకుడవుతారు రచయిత. ఆమె కొడుకు దృష్టిలో వాడి తండ్రి ని చులకన చేయదు. అలాగే అబద్ధాలాడటం సహజమని మని చెపుతూ…
నువ్వు మాత్రం ఎపోయూడు తప్పులు చేయకూడదు.
అబద్ధాలాడకూడదు. అపుడే దేవుడు మెచ్చుకుని.. నీ కంతా మంచి చేస్తాడు. " అన్న మాటలు చెప్పిస్తారు.
వాడు నిద్రకు చేరువయ్యాడు. కాని, ఆమె దూరమయ్యింది.కథముక్తాయింపు చూడండి ఎంతటి చర్చకు , ఆలోచనకు దారి తీసేటట్టుగా ఉందో.
" కుసుమకోమల మైన ఈ… దేవుళ్ళ… గురించి –అసత్య అవినీతి మయమైన రొంపిలో కోరుకుపోయిన పెద్దలు ఆలోచిస్తున్నారా?…. వ్యవస్థను కుదిపేసే మాటలు తూటాలివి. పరిశోధకుడిగా…విశ్లేషకుడిగా..
విమర్శకుడిగా.. అనుభవవజ్నుడిగా.. భావితరాలవారికి చక్కని భవితను ఆకాంక్షించే వాడిగా.. ఓ బాధ్యతా
యితమైన మేధావిగా తోస్తారు శ్రీ.పి. వి. బిశ్రీ రామ . మూర్తి.
వీరు రాసిన.. బిక్ష.. అనే కథను కథల మాస్టారు.. కారా గారిని.. కదిలించి, ఈ రచయితను ప్రశంసించేటట్టు చేసింది. అవును నేను బానిసనే.. అనే కథను ఒక డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి స్వయంగా ఫోన్చేసి"ఆలోచింపచేసే
కథ.ఇటువంటి కథాంశంతో రాయటానికి సాహసం ఉండాలి. ఉన్న మీకు అభినందనలు. " అని చెప్పారు
వీరి. సంకెళ్లు.. నవలను చతుర చలసానిప్రసాదరావు
గారు చాలా బాగా మెచ్చుకున్నారు విజయబాపినీడు నిర్వహించిన విజయ మాసపత్రికలో పడిన.. నిప్పు పువ్వు.. అనే కథకు రచయితగా పారితోషకం అందు కున్న తరువాత పాఠక దేవుళ్ళు విపరీతంగా ఇష్టపడిన కథగా ఎంపికై.. కొసరు పారి తోషకం.. అందుకునేటట్టు చేసింది.
"నా ఊపిరి ఉన్నంతవరకు కథలు రాస్తూనె ఉంటాను. "అనే శ్రీ. పి. వి. బి. శ్రీరామ మూర్తి యువరచయితలకుఆదర్శనీయులు, స్ఫూర్తి దాయకులు.
బొడ్డ పాటి చంద్రశేఖర్
ఆంగ్లోపన్యాసకులు.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.