జైశ్రీరామ్.
(కందాష్టోత్తరత్రిశతి)
శ్రీవర కందము లెన్నియొ
రావకమై రంజిలంగ వ్రాసితి శివతన్
మావర గావగ రమ్మిట
వీ వరమే కోరు కొందు నీరజ నయనా!
(శ్రీరామా నీవరమే కోరు కొందు)
పద్య ప్రాశస్త్యము,
________________
సీ ; అందాల కందాలు అపురూప ఛందాలు
ఎలనాగ నాగ నడకల యింపు లలర
కలకంఠి కథనాలు కలహంస రాగాలు
కులదీప్తి దీపాలు వెలుగు లొదవ
నటరాజ నయనాలు నయనాల సొబగులు
సొబగుల విరి గంగ సోయగాలు
మథురాతి మథురాలు మానినీ గంధాలు
గంధాల కందాలు కలుము లమర
తే గీ: లలిత సుమగంథి శ్రీరమ లాల నలర
సరస సౌందర్య గరిమల సార మనగ
చదువు లమ్మయు గిరి సుత సంతసింప
నడచు కందము లిలలోన నాణ్య మలర! 1
సీ; అందాల ఛందాలు అపురూప బంధాలు
బంధాల చిందులు బహు పసందు
అర్ధ ప్ర బోధాలు ఆద్యంత రహితాలు
భావ సారూప్యాలు భద్ర తములు
చతురోక్తి వచనాలు సౌజన్య రమ్యాలు
మణిమాది సిద్థులు మంగళములు
ఆ,వె: అట్టి భువిని పుట్టి యానంద మందంగ
పట్టుపట్టి ధర్మ వంతు లవగ
ధర్మ నిరతి గల్గి దయగల్గి మెలుగుడీ
సమత మమత కుదుర సాదరమున ! 2.
కంద పద్య ప్రాశస్త్యము,
=====≈=============
కం:-అరువది నాలుగు మాత్రలు
అరుదైన కళల సమతను యలరెను కందమ్!
గురుతమ కందము ఛందము
సురలే కొనియాడ వెలసె శోభాయుతమై! 1
భావము:-అరువది నాలుగు మాత్రలతో చతు షష్టి కళాత్మకమై దేవతలే కొని
యాడ తగు నది కంద పద్యము,
కం:-పరిపూర్ణ చంద్ర కళలకు
మరి నాల్గింతల వెలుగుల మార్మ్రోవ భువిన్
వరమై కందము భాసిలె
పరమాత్ముని శోభ లలర భాసుర లీలన్! 2.
భావము:-పూర్ణ చంద్రుని పదునారు కళలకు నాల్గింతల కాంతులు మార్మ్రోగు
నటుల అరువది నాలుగు కళలతో పరమాత్ముని కృపచే భూమియందు వెలసెను,
కం:-అందాల బరిణె కందము
కెందామర సాక్షి సిరికి కేల్మోడ్చ వలెన్
పొందుగ మాత్రలు నాల్గిట
కంద గణాలు పదు నారు గడగును వరమై! 3,
భావము;-అందాల బరిణె యైన కందముపొందుగ నాల్గు మాత్రలు ఒక గణము
చొప్పున పదునారు గణములు గా కూర్చిన లక్షమీ మాతకు నమస్క రింప వలెను.
కం:-అరువది నాలుగు మాత్రలు
మెరగౌ కాణీల తులను మేధిని గనగా
కరమది రూప్యంబు విలువ
సరియౌ సిరి సంపదులుగ సరగుం కందమ్! 4.
భావము;-కందము నందలి యరువది నాలుగు మాత్రలు అరువది నాలుగు
కాణీలుగా శ్రేష్ఠ మగు రూపాయి విలువకు సరియగును,అది యే సంపద యనబడును,
కం:-పరకలు ముప్పది రెండును
దొరకొని రతనాల సిరుల తోరపు రుచులన్
పెరిగెను కందపు టందము
మరు మల్లియ సోయగముల మారుతి కెనయై! 5.
భావము;-ముప్పది రెండర్ధణాలు రతనాల సిరుల కాంతులు వలన కందపద్యము
మారుతి వలె మల్లియల వలె గుభాళించెను,
కం:-గణములు,గగ,భ,జ,స,నల,లు
మణిమాదుల కెనయౌచు మంగళ కరమై
గుణి జాష్టమ ప్రభల వెలిగి
మణి ద్వీపపు దీప్తి నింపె మహిమాన్వితమై! 6.
భావము:-గగ,భ,జ,స,నల,లను గణములుమణి మాది యష్ట సిద్దులకు సాటి యౌచు,
శోభాకరమై యెనిమిది రెట్లగుచు అనగా అరువది నాలుగు బీజము లౌచుమహిమాన్వితమై
మణిద్వీపపు కాంతి నింపెను,
కం:-కష్టము కందము లల్లుట
ఇష్టము పడి ధృష్టి నిడగ నెంతో శులభమ్!
ద్రష్టలు గాకున్నను సరె
తృష్ణతొ పూరింపగలరు ధీయుతు లౌచున్! 7,
భావము:-కంద పద్య మల్లుట కష్ట మందురు,కాని ధృష్టి పెట్టిన వ్రాయుట శులభము,
నిష్ణాతులు గాకున్నను తృష్ణ యున్న ధైర్యముతో పూరింపగలరు,
కం:-ధనమును సొమ్మందురు గద
మును రూకలె సొమ్ము లనగ మోదము నొందెన్
మనె రూపాయే సొమ్ముగ
కన,కంద మదేను భువిని గాసిలె చూడన్! 8.
భావము:-ధనమును సొమ్మని పిలుతురు,రూపాయిలే సొమ్ముగా భూమిని పేరు గడించెను,
కందము కూడ భూమియందు విలువ గలదాయెను,
కం;-సత్యము,ధర్మ మహింసల
నిత్యము,నిఖిలము,సుకరము!నింగీ నేలన్!
గత్యను కూలపు మార్గము
అత్యంత మనోహరంబు!నందుమి భువిలోన్! 1.
కం:-గురుతర బాధ్యత చేకొని
గురు,మంగళ విద్య నిమ్ము!గురు వర దేవా!
పరమార్ధ మదియె ప్రగతికి!
నిరతము నీ నామ స్మరణ నెలకొను !భువిలోన్! 2.
కం;-కుతలము పతలము జేసెడి
పతితపు విద్యను గరుపకు!పండిత వర్యా!
అతల,వితల,సుతలములను
నుతులుగ దీర్చంగ వలయు!నూతతన రీతిన్! 3.
కం:-నుతమతి నృతి గనుమా!భువి
సతతము పరహింస తగదు!సామము మేలౌ!
సతి సుతుల భవిత మేలగు
బ్రతుకే! సౌభాగ్య గరిమ!భాసిలు సుగుణా! 4,
కం:-గురువే!జ్ఞానము నరుడా!
నరుడా!పరమార్ధ మెంచు!నౌదల వరదా!
వరదా మమెగా?పర మన్నది!
పరమంబే!జీవ ముక్తి!భాగ్యము సుమ్మా! 5.
కం:-చీకటి వెలుగుల బ్రతుకులు
చేకొను ధర్మార్ధ కామ!జీవిత సరళై !
మేకొను పురుషార్ధములను!
చేకురు మోక్షంబు తుదకు!జీవన మింతే! 6.
కం;-చీకును చింతయు లేకను
చేకొను కార్యాల నెల్ల!శివ మవ భువినిన్!
ప్రాకకు పర సొత్తునకున్!
ఛీ కొడుదురుగా!జనాలు!చెలగుమి నీతిన్! 7.
.
కం:-ధన దర్పము తగ దేరికి?
మను ధర్మము పాలనమున!మంచిగ మనుమా!
అనరాని మాట లాడక!
విని,నీతిని ధర్మ మతిని!విశ్వము మెచ్చన్! 8.
కం:-వెలి భూది పుండ్ర ధారీ!
కలిసెను నీ మేనిఛాయ!కమ్ర స్వరూపా!
యలరెను మూడవ నేత్రము
జ్వలితపు టగ్నిగ!వరాంగ !జంగమ దేవా! 9.
కం:-గతి చెడు వారల నంటకు
మతి భ్రమితుల మాట వినకు!మనుజ వరేణ్యా!
అతులిత గుణ గణ్యుల కిల
సతతము నంజలి ఘటించు!సాదర మతినిన్! 10.
కం;-కష్టము కలిగిన దినముల
భ్రష్టునిగా దలచి!భీతి బాధిల తగునా?
ఇష్టపు సుఖమయ జీవము.
స్రష్టయు కలిగింప పొంగ!చక్కన యౌనే? 11.
కం:-నోటికి వచ్చిన మాటలు
మాటాడెడు వారి బ్రతుకు మంగళ కరమా!
కీటక ధ్రష్టుడు కాబడి
మాటాడక మడియు గాదె!మాత్సర్యమునన్! 12.
కం:-రెంటికి చెడు రేవడి వలె
మింటికి నేతాము నెత్త!మేలా?మత్తా!
కుంటివి గాకను!దైవము
కంటికి చూ పట్లు?ధర్మ కారివి కమ్మా? 13.
కం:-యమ పాశము మెడ నంటిన
మమకారము చెదరు!శ్రీలు మహి విడువడునే?
కుమలక జీవిత మందే!
గమి జేరెడు మార్గ మెంచు!కర్తవ్య నిధీ! 14.
కం:-దేవుని మాన్యంబులు గొని
దీవింపుమి దేవ యనగ !దీవించు నొకో?
కావలి గాయక మెక్కిన
దావానలమందు జిక్కి!దగ్ధము కాడే? 15.
కం:-దేవుని బంగరు నిధులను
కావలసిన వన్ని మ్రింగి!కాలము గడుపన్!
శ్రీవరదుడు!మిన్నకుండునె?
పావకు ననలంపు జ్వాల!భస్మము జేయున్! 16.
కం:-పదములు విసరకు వడి వడి
పదపడి శ్రమియించు రేయి బవళులు యనకన్!
ముదమును విడ నాడకుమా!
సదయుని గను సర్వ మేలు!శర్వుడు మెచ్చున్! 17.
కం:-కైలాస శిఖరి వాసిగ!
నీలాంబర జాలు వారు!నీరపు జటలన్!
వ్రేలగ నర్తించు హరుడ
పాలకు డీవేను మాకు పన్నగ భూషా! 18.
కం:-హాలా హల వేడిమికిని
నీలాల కురుల జలము!నిమ్మల మేర్పన్!
కాలార్తి జనుల బాపగ
నీలో గల శివము భవము!నిర్మల తేజా! 19.
కం:-శివుడా!భవుడా!హరుడా!
శివ రూపము నేలు మముల!శ్రీకరములతోన్!
భవి కాటకములు బాపుమ
నవిరళ సుమ గంథ శోభ!నర్చింతు నయా! 20.
కం:-నిను వీడి కదల నేరను
మనసా,వచసా,కరణను!మా ధవు డీవే!
మనుకలి సుఖముల నిమ్మా!
మను జనితుల బాధ లెల్ల!మడియింపు మయా! 21.
కం:-సు రుచిర ఫలములు దెచ్చితి
సుర శ్రేష్టా!వరమయూఖ!సోమా!గొమ్మా!
అరవిందాయత లోచన
నిరతము నను బ్రోవ రావ!నిర్మల రూపా! 22.
కం:-శివ కేశవు లొకటే యని
భవ బంధము బాపి సుఖము వర్షింతురనే?
శ్రవణము విన మానిమదిని
చెవిటిగ భేదంబు లేర్ప!ఛీ యని పించున్! 23.
కం:-భావము భక్తికి నిలయము
జీవిని పరమాత్మ యొకటె?జేర్చును ముక్తిన్!
నావకు చుక్కాణి వలెను
శ్రీ వరదుని యాన నొప్పు!శివ సాయుజ్యమ్! 24.
కం:-తారల నడుమ శశాంకుడు
నీరజ నాభుడు,వనజుడు నింగీ నేలన్!
పారెడు జలములు వనములు!
కారక మూర్తులవరమన కాదన వశమే? 25.
కం:-పంచా త్మక భూత గణము
సంచిత ధర్మంబు విడక!సంసారమునన్!
పంచిన జీవిత మెంచగ!
సంచిత పుణ్యాల భువికి!యానంద మదే! 26.
కం:-దేవత లను కూలింపగ
దైవము నెగతాళి సేయ!తగునా?నరుడా!
పావన ధర్మము వీడకు
జీవింపుమి దైవ భక్తి!శ్రే లొన రంగన్! 27.
కం:-గురునే!మరచిన శిష్యుడు
పరమాత్ముని మరువ కున్నె?పాపాత్ముడునై!
చరమౌ!జీవిత శోభలు
స్థిరమా?తల బిరుసు తగ్గి!దీప్తుల్ సడలున్! 28.
కం:-ఆకలి దప్పులు దీర్పగ
మేకొను ధాతృత్వ గుణము!మిక్కిలి కలుగన్!
లోకులు శ్లోకులు కాబడు
నాకము కీర్తించు జగతి నేర్మిన్! కూర్మిన్! 29.
కం:-చెడు నెయ్యము చేయకు మిల
బడి దొంగల మాటవినకు!భద్రత మాయున్!
నడవకు మొంటరి నెపుడును
కడు దీక్ష మెలగు చదువున! చతురుడ వౌచున్! 30.
కం;-మనుజులు మనవా రంచును
ధన దాహము తప్పు సుమ్మి!ధరణీశులకున్!
ధనమే!ధర్మము కాదయ!
మనుమా కీర్తింప జనము మహనీయుడవై! 31.
కం;-చిన నాటి చెలిమి మరువకు
తన వారికి హాని గల్గ తప్పించు యుతిన్!
వినరాని మాట లాడకు!
కనుమా!పరమాత్మ నరుల కన్నుల లోనన్! 32.
కం;-చెడు విడి మంచిని కోరుము
మిడియకుమా!ధనము జూచి!మేలును గనుమా!
పడమట కాపుర ముండకు
విడు దూరము దుష్ట తతిని!పీడయు తొలగున్! 33.
కం:-పర హింసకు తావీయకు
పర పీడన మెచ్చు కొనకు!పట్టును విడకున్!
సరి వారికి సాయ పడుము
పరముని మనసార గొల్వు!పద్ధతి మీరన్! 34.
కం:-నిడువగు నాశా పాశము
పొడవును తగ్గింప ధరను!పూజ్యుల వెంటన్!
నడు,నిరతము మేలొనరును
పుడమిని రక్షింప గలరు పూజ్యత చెడకన్! 35.
కం:-తప్పులు జేయుచు నొప్పుగ
గొప్పగ తమ తప్పు దాచి!కోవిదు లనగా!
నొప్పునె?శ్రీవర శుభ కర
తప్పించుకు తిరుగ లేరు!దానవ వైరీ! 36.
కం;-విను రసమయ గీతాలను
తనియగ తిను రుచి ఫలాలు తప్పక నెన్నో!
కను బీదల యాక్రందన
విని,సాయము జేయవలెను!విమలాత్ముడవై! 37.
కం:-తరగని సంపద యున్నను
సరి పడదని దోష మార్గ సంపాదనచే!
పరి పూర్ణత గాంచ నగునె?
సరి గాదుర నూహిలంగ!చక్కగటి బుద్ధిన్! 38.
కం:-గురు ఛండాలము బట్టిన
పరమాత్ముడు కాయ లేడు!ప్రాళుబ్ధముకున్!
సరియగు శిక్షను పొందును
సిరు లెడమగు చింత దక్కు!జీవిత మందున్! 39.
కం:-పంచ మహా పాతకులకు
వంచిత కుశలాగ్ర బుద్ధి!పట్టును భువిలో!
సంచిత పుణ్యాళు రకును
పంచుమి శుభకరము లెన్నొ?భాగ్యం బదియే! 40.
కం:-ముందూ వెనుకలు గనవలె
మందముగా మసలకు మిల!మహితాత్మకుడా!
కెందామర లక్ష్మీ పతి!
ముందుండును భక్త తతికి!మూర్ఖత విడుమా! 41.
కం:-హేమవతీ హిమ సుత పతి
కామారి త్రి నేత్రు డతడు!గౌరీ పతియై!
సోముడు భీముడు తానై
క్షేమం బొసగును జనులకు!శ్రీ లలరంగన్! 42.
కం:-ముచ్చటిల మూడు కన్నులు
అచ్ఛపు టెకిమీడు!నరుల యాలన మందున్!
మెచ్చగ నవచ్చును కావగ
కచ్ఛిత మతనిది కొలువుడి!కైవలదాయిన్! 43.
గణ త్రయానులోమ విలోమ కందము,
*********************************
కం:-సరి గమ పద నిస సమరస
స రమస సని దప మగ రిస సంగీతంబౌ!
తిర తప పత రతి నెగురుత!
తరుగునె?తిర తప రతి!దానవ వైరీ! 44.
స రమస=రమతో కూడిన(లక్ష్మీ ప్రసన్నమైన),నెగురుత=పైకెగయుట(ఉత్తే
జమౌట).తరగునె=తరుగునా(తరుగదు).తిర తప పత రతి=స్థిరమైన తపస్సుచే
అనుదాత్తమైన రతి.
భావము:-ఉదాత్తాను దాత్త స్వరితమై,అనులోమ విలోమ భ్రమకమైమానసికోత్తేజమై
ఉత్తుంగ తరంగ మాలికా స్రవంతియై,మనోహ్లాదమై,ప్రసన్నతా వాచియై, శ్రావ్య మైనదే సంగీతము,
గూఢార్ధ వాచి
××××××××××
సరి గమ పద నిస సమతుల్యత,మనోహరమై(లక్ష్మీ ప్రసన్నమై)సని దప మగరి సలు
సంగీత స్వరము లగును,తిర తపస్సు నందు దిగ జారిన యనురాగము మరల
నుత్తేజమగును,పరమాత్మా!తిర తపానురాగము తరుగనేతరగదు,
తిరతపము=ఉదాత్తము,పత రతి=అనుదాత్తము,
కం;-మంచికి మచ్చను దేకుమి
సంచిత ధనముల కెల్ల!సారము ధర్మమ్!
పంచకు చెడు గింటింటకు
వంచన మది మాన వలెను!పద్ధతి బ్రతుకన్! 45.
కం:-పొగడుచు స్వార్ధత నితరుల
తగు తగ తమ కార్యములవి!తప్పక తీరన్!
ఎగ నెట్టి పలక రింపని
జగ మొండుల దూరమిడుము!చతురత మీరన్! 46.
కం:-విని, వినని యట్లు నొప్పెడి
మనుజుల దరి జేర బోకు!మాన్యుడ వగుచో!
తిని లేదను వారి కతన
కని పించును చైదమందు!కల్లా కపటమ్! 47.
కం:-తన గొప్ప తాను జెప్పగ
విను వాడే వెర్రి వాడ!విసుగును కాదే!
ధనముండి బీద యరుపులు
విను వారే!ఉండరయ్య!విశ్వంబింతే! 48.
కం:-దాసాను దాసు డంచును
మోసంబున ధనము నొంది!మోసరి యగుచో?
వాసంబే లేక ధనము
బాసియు,నేకాకి యగును!భాసుర లీలన్! 49.
కం:-చాలించు జాతి మతములు
పాలించుమి నీతి మీర పలువురు మెచ్చన్!
మేలెంచి పరుల కెల్లను
నేలయు క్షమియించి గాచు!నేర్పున హరుడే! 50.
కం:-కన్నులు తలకెక్కినచో?
ఇన్నూ మిన్నూ కనదిక!యేడ్పే మిగులున్!
మన్నుమి మంచిగ జగమున!
నిన్నే మెత్తురు జను లిల!నిక్కము సుమ్మా! 51.
కం:-కందయు ,ఆవయు బచ్చలి
పొందుగ బెల్లంబు జేర్చి!పూర్ణత గనగా!
సుందరి వండగ ఘుమ ఘుమ
కెందామర సాక్షి మెచ్చి!కీర్తిల జే యున్! 52.
కం:-సతి సుతులకు గతి పతియే
పతియే!పరమాత్ము డతివ!భాగ్యపు గతియౌ!
గతియౌ ప్రగతే నుతి యౌ!
నుతియౌ గుణ తాపసంబు!నూటికి నెలవౌ! 53.
నూటికి నెలవౌ=పూర్ణాయువునకు నిలయమగును,
(ముక్త పదగ్ర స్తాలంకారము)
కం:-గత జల సేతువు వ్యర్ధము
మతి మాలిన వారి మాట!మన్నన గనునే!
అతులిత ప్రజ్ఞను మెచ్చుము
జత గూడుమి మంచి వారి!జాగృత మతివై! 54.
కం;-పెద్దల సుద్దులు వినుమా!
వద్దను పని మాన వలయు!పద్ధతి తోడన్!
హద్దులు మీరియు జనకుమి
పద్ధతి యది కాదు బాల!భంగము కల్గున్! 55.
కం:-కలిగిన కాసులు చాలును
వెలగల నీ బ్రతుకు కేల?భంగుర పడెదే!
నెల తాలుపు శివు డుండగ
బలము ధన మదెయె!గదయ్య భాగ్యోదయుడా! 56.
కం:-శుద్ధాత్ముడ వీవనగా!
బద్ధాత్మత!హరిని గొల్చు!భాగ్యము గనుమా!
యిద్ధాత్రి భాగ్య మేలను?
బుద్ధిం వసియించు మిలను!ఉచ్ఛతి గనుమా! 57.
కం:-వేసరి ఘోషి లసురులు
గాసిలి కడలిని జిలికిన!కడకేమాయెన్?
వాసవు డొసగెనె యమృతము
చే సాచిన ఫలిత మలర జేయునె?కవగా! 58.
కం:-పర నారీ వ్యామోహము
వర ధామము జేరనీక!ప్రాణము దీయున్!
వరదుడు రావణు డేమయె?
పరమాత్ముని రాము చేత !బాసెం యశువుల్! 59.
కం:-కల నిజ మగునే?కలలో!
తలపులు కొండంత లుండ!దక్కునె?సుఖమున్!
మలినపు టూహలు మానిన.
తుల తూగెదు దాన పరత!తోరపు భక్తిన్! 60.
కం:-అరువది నాలుగు కళలిల
పరగెను కాణీల
తులను!వర రూప్యంబై!
పరకలు ముప్పది రెండిట
నిరుపమ పదునా రణాలు యెనిమిది బేడల్! 61.
(పై పద్యముతో అన్వయం)
కం;-వర పావులాలు నాల్గై
వరార్ధ రూప్యము లెనిమిది!భద్రత గనగా!
గురుతరమౌ సొమ్ములు నిల
కురిపించును కందరాజి!గుణ గణ ఖనియై! 62.
భావము:-కందమునకు కాణులు 64.పరకలు 32.అణాలు 16.బేడలు 8.
పావులాలు 4.అర్ధ రూపాయిలు2.రూపాయి 1.
కం:-ఊహించి తెన్నొ?రీతుల
పాహీ పరమాత్మ టంచు బవళులు రేలున్!
దాహము తీరగ ధనమిడు
ధీహరు సంకల్ప మొదవ !దేర్చితి నంతే! 63.
కం:-ఏకాంతము రాత్రంతయు
శోకాకుల భార చిత్త శోధన మలరెన్!
రూకలు కళలకు పొందిక
శ్రీ కాంతుని దయను గూర్చి చెలగితి నింతే! 64.
భావము=ఏకాంతముగా రాత్రంతయు,శోధించి కళలకు ,రూప్యములకు
గల సంబంధము,శ్రీకాంతుని దయ వలననే కనుగొన గల్గితిని,
ప్రభా వంతమైన కళలు,ధనమునకు పోల్ఛ బడుట వలన, కందపద్యము
విలువ పెరిగెను,
కం:-చెంచెల గుణ నిధి లక్ష్మిని
పంచక నీ చెంత నుంచి భ్రమకము నాపన్!
వంచించియు లాగు కొనరె?
దంచియు ప్రాణాలు దీసి!తామస మొప్పన్! 65.
కం:-తప్పుగ నప్పులు జేయుచు
పప్పులు బెల్లములు పంచి!వంచన జేయన్!
అప్పది తీరు న దెప్పుడు?
చిప్పయె గతి పట్టును గద?చింతింప భవిన్! 66.
కం:-నిలు పుండ్ర మేర్చి కూర్చియు
విలువగు నప్పులను తెచ్చి వెచ్చించి వడిన్!
తెలియని వానిగ కనపడ!
తొలి బీదరికంబె గల్గు!తొందర పాటున్! 67.
కం:-చెల్లని మాటల నాడుచు
తొల్లెన్నడు గనని రీతి!దోచుకు తినగా!
చిల్లరి మల్లరి కబురులు
చెల్లునె?దైవాంశుల కిల?శ్రీకర జెపుమా! 68.
కం:-ఉచ్ఛము నీచము తెలియని
తుచ్ఛుల చేతులను జిక్కి ! దొర్లుచు నేడ్చున్!
పచ్చటి సంసారంబులు
మెచ్చునె దోషంపు చింత?మేధిని గనవే! 69.
కం:-అచ్ఛపు టాంధ్రా వనిలో
పచ్చటి సంసారము లిటు పాడొనరంగన్!
ఇచ్ఛను మెచ్చు నదెవ్వరు?
కచ్ఛితముగ నుండ వలెను!ఘనతను పెంచన్! 70.
కం;-పన్నీట పంది ముంచిన
మున్నీటికి మోస మబ్బు!మూర్ఖుని మార్పన్!
కన్నీటి కాటుక చెరుగును
సున్నాయై జీవ సరళి!క్షుద్రత గాంచున్! 71.
కం:-పందుల గమి పొలమున బడ
అందున గల చెఱకును తిను నాహ్లాదమునన్!
ఎందులకీ యుపమానము?
సుందర వదనారవింద శోధించు మదిన్! 72.
కం;-నిజములు నిష్టురములు భువి
భజనలు పరమాత్మ వరము!భాసిలు నిలలోన్!
సుజనుల పలుకులు కుజనుల
కజయము గన్పట్టు పుడమి!నంబుజ నాభా! 73.
కం: -సరసీరుహ తేటి గముల
నిరుపమ వర నిశ్వనములు!నినదింప భళెన్ !
సుర వరదుల మంతనముల
సురభిళ సుమ మందిరాలు సొబగుల వెలిగెన్ 74.
కం:-రుధిరోస్తి త్వగావృతమై
వొదలంబడు నొడలు!మాంస భరితమునై,క్షో
భిద,దర్శన భీభత్సము
మది నూహిల శోభ గలదె ? మానవ దేహమ్! 75.
కం:--జీవన మరదండము సుమ !
పావన కల్యాణ దాయి !పరమేశుడె పో!
భావన భక్తి యుతంబున
నేవముగా!జీరు హరిని నిర్మల మతినిన్! 76. ,
కం:-భావము రావము తాళము
శ్రీవరమది తెలిసి మసలు!శ్రేయము గల్గున్ !
తావక నీతి సు మార్గము
నీ వశమై నిల్చు గాక!నిరుపమ శీలా ! 77.
కం:-పోతరము వీడి బ్రతుకుమి
నీ తరమున కీవె సాక్షి!నిరుపమ మదియే!
పాతకము లంట నీకుమి
చేతన శివమని దలచుమి!జీవిత మందున్! 78.
ఈవె సాక్షి=దాన గుణమే ఋజువు
కం:కండలు తిరిగిన యోధులు
నుండిరి యీనాటి వరకు!నోర్మిని మనుమా!
మండిత కీర్తి ప్రతిష్టలు
యుండును పో శాశ్వతంబు!నున్నతి గనుమా! 79.
కం:-కలికీ చిలుకల కొలికీ
కొలికీ రత్నాల సరుల!కోమలి నెలతా!
నెలతా సుర యమ లలితా
లలితా!సౌందర్య లహరి! లాలన గనుమా! 80.
(ముక్తపద గ్రస్తాలంకారము).,
కం:-కలనం శౌర్యము విను కలి
కలి వినుతానృత మతియ!కాముక చలనా!
చలనా!సంస్కృతి కలనా!
కలనానిల దీప్తి వదన!కా జేయు సిరుల్! 81.
కలనా=కూడు కొనిన,కలనానిల దీప్తి=యుద్థమున చెలరేగు నగ్ని జ్వాలలు
వినుతానృత మతియ=అబద్ధము లాడే బుద్ధి,
(ముక్తపద గ్రస్తాలంకారము).
కం:-దండము బూనితి నంచును
ఛండాలపు చేతనాలు!చాలించ వలెన్!
దండ ధరు డుండె కనుమా!
దండించును మరువ బోకు త్రష్టా!భ్రష్టా! 82.
కం:-కమలాకర శ్రీకర,మా
మమతా లలితా చలితము!మారుత మమరన్!
సు మథు సలి లోర్ము లమర!
తమి తీరగ చూపరులకు తన్మయము గదే! 83.
కం:-జనియింతురు జనములు భువి
తనువును చాలింతు రిచట తథ్యము సుమ్మా!
అన వధ్య మాప మరణము
చను సన్మార్గము పుడమి !సన్మతి నుతివై! 84.
కం:-దండీగా ధన ముండిన
కొండను ఢీ కొట్ట గలవు కోటెకి మేటై!
దండైన యండ యుండగ!
ఛండాడెడు మూక చాలు!జయ మంద భువిన్! 85.
కం:-మెత్తగ దంచుదు రిచ్చట
చిత్తము రంజిలగ కొండ !చేరుటె మేలౌ!
మొత్తము కొండల నంటిరి
అత్తరు గంథముల తోడ నలరార సురల్! 86!
కం:-పాషాణ హృదయ తుల్యురు
ద్వేషాశూయల దివురుచు!తిరుగుదు రిలలోన్!
కాషాయంబులు దాల్చుచు
భేషజముల దోషులగుచు!పేరిలుదు రిలన్! 87.
కం:-చూడగ పనిలో స్వార్ధము
తోడే ధనమంచు నిలను దుష్టులు నౌచున్!
పాడును గోరుటె ధ్యేయము
వీడని చీడలు నరులన వినవేమి టయా! 88.
.
కం:-నీతియు లేనటి కోతులు
పాతుక ధన మెంచి మంచిపరగుచు నుందుర్!
మాతకు అన్నము పెట్టరు
చేతికి లే దీవి!నరుల చేతన మింతే! 89.
కం:-తొమ్మిది పదులగు రచనలు
నెమ్మనమున నీశ్వరుండు!నిమ్మల మేర్చన్!
అమ్మ గళంబు విరి సరుల
ఠొమ్మా!రక్షింప!కోరెద నెదలోన్! 90
కం:-తప్పులు చేయుచు నుందురు
గొప్పకు ముందుందు రవని!కొండల నొందన్!
అప్పులు నొప్పుగ జేతురు
చిప్పల గతి నెంచి ముంచి!చెప్పుచు నీతుల్! 91.
కం;-శ్రమ పడ నోపరదెప్పుడు?
తమి తీర ధనము నెంచుచు తనియుచు నుందుర్!
సమతా మమతలు గనవెటు
మమకారపు స్వార్ధచింత!మాయదు కలిలోన్! 92.
కం:-కోటలు పేటలు గావలె
చేటుకు ముందుందు రిలను!జీవన మింతే!
కాటకము లంట నోపరు!
పాటక నైజంబు వీరి బ్రతు కెంచ భువిన్ ! 93.
కం:-కష్టించి పనిని జేయుచు
ఇష్టంబని శ్రమ పడుదు రిలను!ఇనకుల తిలకా!
నష్టంబు కలుగ నీయరు
స్రష్టయు దీవించ వలయు!చక్కటి శ్రమకున్! 94.
కం:-త్రికరణ శుద్ధి నమ్మితి
వికటిత సంకటిత వెతకు!విలపించెదు, నా
కిక గతి నీవే!హర హర
చక చక రక్షింప రమ్ము! జంగమ దేవా ! 95.
కం"-శివ మయపు జగతి యందున
శివుడే సర్వోపగతుడు!శ్రీకరు డతడీ!
భవముల కెడ మేగి మనుమ
భవ బంధ విమోచనంపు మార్గము నిమ్మా ! 96.
కం:-రంకే రామాయణమని
బొంకే గద!భారతమని! భూ జన మనగా!
జంకేల నయ్య?శంకర!
ఓంకార మహేశ ఈశ!ఉన్నతి గూర్పన్ ! 97.
రంకు=లేడి,బొంకు=అబద్ధము,మాయ
కం:-అంకను జంకను బొంకను
శంకరు నైనా జనులు శంకింతు రయా!
పంకజ నాభుని సైతము!
వంకెంతురు మానవాళి!!పద్ధతి యింతే! 98.
కం:-మత్తుకు తొత్తులు కాబడి
పొత్తుకు నెగ నామ మెట్టి!పోగాలురునై!
ఎత్తుకు పోదురు నతివల!
మెత్తగ దంచంగ వలయు!మేటులు నౌచున్! 99.
కం:-కాటేయు నాగుబాముల
మేటిగ త్రాగించ పాలు మిక్కిలి ప్రేమన్!
కాటేయ మాన కొప్పునె
కౌటిల్యపు తీరదంతె?కనవే!బాలా! 100.
కం:-గణకుడు తన పింపించుచొ?
గణనాకుల భార చిత్త గ్రాహ్యం బగునే!
మణి,ధన కనకాది నిధులు
మణి కంఠుడు కావ గలడె?మాధవ శౌరీ! 101.
(మణి కంఠుడు=అయ్యప్ప స్వామి)
కం:-గ్రుడ్డుకు వెంట్రుక లాగెడు
గడ్డులు గల రి జ్జగాన!గౌరీ నాధా!
చడ్డీ లిక జారి పడును
తెడ్డే సరియైన దుడ్డు!ధీవర గవవే! 102.
కం:-తీగెలు రహలాగిన డొంకలు
తెగి పడి వెలికొచ్చు సుగుజ!తీరింతె సుమా!
దాగునె దుష్టార్జితమది
లాగుదురే!ప్రభులు భువిని!లాలూ చేలన్? 103.
కం:-మగతమి చెడి పగతురబడి.
జగదభిదంబుల చెరుపను సాహసి వైతే!
పగ బూని ప్రగతి మాపగ!
చిగురించునె?జాతి ఖ్యాతి!చేతవ శూన్యా! 104.
కం:-గరిమ రతి తిరము గనుత
గరిమ నుత రతి తిరము గనుగా!నుత భువిన్!
తిర మమరి,గతి రమ తగను
సు రతి నుమ తిరతి గని మరి!సొగ సిల్లు గదే? 105.
కం:-బేసుల బేసి గణంబులు
భాసురముగ సరుల సరులు!వలదెటు?జగణమ్!
శాసిత సరులం మూడట
వాసిలు జగణమది కంద పద్దెపు సరళై! 106.
భావము:-బేసి1,3 పాదములందు బేసి గణములు(1,3,)సరి పాదము2,4
లందు,సరిగణములు(2,4.6)జగణము వేయుట తగదు,సరి పాదములందు
2,4 లలో)3,వగణము తప్పక జగణము వేయవలెను,ఇదియే కంద పద్య
లక్షణము,
కం:-జడ ముడి విడువడి చేడియ
వడిపడి కదలాడ మృఢుడు!పడి పడి నుడివెన్!
వడిపడి వెడలెద వేడకు?
విడ నాడకు గడి విడ నిడ!వేడెదు వడి నిన్! 107.
వడిపడి=తొందరపడి,ఏడకు=ఎచ్చటకు?.విడనాడకు=వదిలి పెట్టకు,
గడి విడనిడ=ఇచ్చట నేను అదుపు తప్పను,విడువడి=విడువ బడి,
కం:-పంకము నంటిన పొంకము
భంగుర పడు నిను తపాన!భాస్వత్కాంతిన్!
సంకట మొందిన ముదుసలి
సంకుల సమరాన మ్రగ్గు చావుకు దరియై! 108.
కం':-గతి లేని ప్రగతి శూన్యము
మతి మాలిన మాట యట్లు!మాసిన కీర్తౌ!
నుతి గనని జీవ యాత్రౌ
పతితుండవు గాకు మయ్య!వరమయ జీవా! 109.
కం:-తన పెంపే మోక్షంబని
మను వారిని మంట గల్ప!మాన్యం బౌనే?
తన యట్లు పరుల పెంపును
తనియగ వీక్షించు వాడె!తత్పరు డిలలోన్! 110.
కం:-ఆకటి చీకటి ప్రళయం
ప్రాకటమున గోరు మెతుకు!నాప్రాణము నిల్పన్ !
చేకొను ధర్మం బెన్నడు
నీకదియె?భుక్తియు పరమము నిరుపమ శీలా! 111.
కం:-నా పొట్ట నాకు గొప్పని
నీ పొట్టే నింపు కొనిన నీచము కాదే?
ఏపొద్దు చూడ వన్యుల
నీ పద్దే మారు!సుగతి నీ కబ్బునె కో? 112.
.
కం:-అమ్మకు అన్నము పెట్టని
దొ మ్మరి పెద్దమ్మ కేమొ దుద్దులు కొనునా!
కమ్మని బ్రతుకుం బ్రతుకని
క్రమ్మరి జీవం బిటు లెగ?కాతురె? సురలున్! 113.
కం:-తనువే శాశ్వత మనుకొని
మనుజుల జీవముగ నిల్చి మందత గంటిన్!
. జని వెత లతులితము లకున్
మనసా వెరగొంది జనెదు! మారాడ నికన్! 114.
శరీరము శాశ్వతమని తలపోసి"జీవము"తనువు పడెడు కష్టములు
జూచితట్టుకొన జాలక వెళ్ళెద ననెను,
కం;-కనుత నుతులు కుతలమునను
వినుత మతుల వెతలు దీరు!వెరపెడలంగన్!
తను తప నుతమతి తపనము
మును తపమతి నుతుల మేలు ముద మొదవునుగా! 115.
కం:-లలనా నల జ్వాలల పడి
తలబింకపు టసురు డంత ! దండన లోనై!
తల లూడి పడగ రావణు
డల రాముని బాణములకు నశువులు బాసెన్! 116.
కం;-ద్రౌపది వలువలు నూడ్చిన
పాపంబది కౌరవ తతి ప్రాణము తీసెన్!
చేపకు చెడు వతివల దరి
నీపని సరి తెలిసి మసలు నీతిని థాత్రిన్! 117.
కం;-అమ్మా,!అక్కా!,చెల్లీ
తమ్ములు!అన్నలు!తనదగు దైవము లంచున్!
ముమ్మాటికి నొప్పు కొనుచు
సమ్మతి చరియించు ధాత్రి!సౌజన్యుడవై! 118.
కం:-వనములు నాశన మేర్చుచు
ధన దాహము నిసుక మట్టి త్రవ్వుచు నేగన్!
కనికర మూనునె?వరుణుడు!
మను జాళిని నీట ముంచి !మడియింప కిలన్! 119.
కం:-జాతికి రక్షణ నీయక!
మేతకు నేతలు దలంప మేలా?ధాత్రిన్!
పోతర మూనిన సరియా!
నీతిని కాంక్షింప వలయు!నిర్మలు రౌచున్! 120.
కం:-కుల మత భేదము సరియా?
లలితంబుగ బీదవారి లాలన గనుమా!
పోతర మూనుట సరియా!
నీతిని కాంక్షింప వలయు!నిర్మల మతినిన్! 121
కం:-ఓటుల రాజ రికంబిది
చేటునకే ధారి తీయు!చెల్లునె?సమతన్!
కోటాల ధాష్టికంబున
కాటౌ జీవాళిభవిత!కంటక మౌచున్! 122.
కం:-ఆకటి చీకటు లలమగ!
ప్రాకటముగ జీవ సరళి !భంగము లలరున్!
ఈకటు వెటుల?సహింతురు!
కూకటికే మోసమౌను!కువలయ మందున్! 123.
కం:-కూకటి లేని వటంబుకు
చేకొని యూడలు నిలుపును చేదోడునునై!
ఈ కటు తర జనమున కిట!
శోకమెగద?నూత లేక!ఈక్షోభక వినుమా! 124.
కం:-కావలి కాపును మ్రింగగ
భూవరులే?భువిని మ్రింగ భంగుస పడదే?
దావానల దీప్తి ప్రభులు
భావంబే!భగంన చర్య!భావింప భువిన్! 125.
(కాపు=పంట)
కం:-ఆకలి దీర్ప నశక్యము
ఈ కలి భారతి జనులకు !నేదైవంబున్?
బోకులు టోకరు లుండి రి
శ్రీకర !సరి జేయ వలయు!జీవుల నిలలోన్! 126.
కం:-అంబోధి నిధులు మ్రింగగ
శంభుం డేపాటి?వీరి శౌర్యంబు దరిన్!
ఆంబా!జగదాంబ గనవే!
ఆంబోతుల పొంక మార్పి!యండగ నిలుమా! 127.
కం:-ఎన్నో! కష్టము లొందితి!
కన్నా!కష్టాల కొలిమి మ్రగంగితి నెంతో?
మన్నించి కవిత లెలమిని
నన్నే!రక్షింప రమ్ము! నమ్మితి కృష్ణా! 128.
.కం:-మెత్తని చిత్తము నిత్తరి
తుత్తునియలు కాబడె నిట!తోయజ నేత్రా!
ఎత్తరి యెవరే మనినను?
చిత్తము నందుంచు కొనెదు!చెప్పక జూబున్! 129.
కం:-మెత్తని వాడే వీడని
కత్తులు దూయంగ వచ్చు!కల్లరి జనులన్!
చిత్తుగ మల్లేశుడె పో!
తుత్తునియలు జేయు నంచు!దూరను పరులన్! 130
(అష్టోత్తర త్రిశతి).
కం;-ఫలితము తలపోయక మరి
నెలకొను కర్తవ్యములను!నేర్రపున జేతున్!
పలువురి మాటలు వినియును
తలచెద నీతిని సుగుణత!తారకు మెచ్చన్! 131.
కం;-విష మది డెందము నిండగ
ఝష భంగిమ నీదులాడు!జనముల మనముల్!
విష పూరిత మాటలు విని
శషభిషలకు తావీయకు!జ్ఞూనుడ వయ్యున్! 132.
కం;-అశదృశ లీలను ప్రతిభను
వెస నెఱుగని మంద భాగ్య వితతిని విడుమా!
పసరము మేసెడి పశువులు
కొసకును పాలిచ్చి మెదలు!కోరును మేలున్! 133.
కం:-అక్కరకు రాని నెయ్యము
చిక్కలు తొలగించ లేని చైదుల మననన్!
మక్కువ జూడని మనుజుల
చక్కున విడువంగ వలయు!చతురత నిలలోన్! 134.
కం:-నేతల తేనియ మాటలు
చేతల మృగతృష్ణ నీరు చింతా వలయమ్!
కోతుల గమి చేతన మటు
ప్రేతాత్ముల మాటలటులు!పేరా!యూరా! 135.
కం:-ఏచీ పూచీ లేకను
సా చరులకు సాయ పడగ సౌజన్య మగున్!
నీచుల నీచత గనుచును
ఛీ ! ఛీ! యనకున్న తప్పు!చెల్వుడ వినుమా! 136.
కం"-చేసిన తప్పును జేయుచు
గాసిలి నంచును బలుకగ!గౌరవ ప్రధమా!
కోసిన కోతలు జాలును
మూసుకు పోవయ్య నోరు!ముక్తేది?తుదన్! 137.
కం;-అడిగిన దానము జేయని
జఢుడే!పీనారి గాక!జంగము డగునే?
మడి యెడ మిడి జనియెడు! దురి
దురితుడె పో?తులువ యగుచు!దుర్గతి నొందున్! 138.
కం:-ఛందముల"కంద"మందము!
బంధము హరి చందన మదె? భావోర్మిళమై !
సుందర నందన వనమున
మందారము!సిరి సదనము!మాధవ మదియే? 139.
కం:-అల్లిక జిగి బిగి "కందము"
మెల్లగ నురు భావ గరిమ!మేలగు పదముల్!
నుల్లము రంజిల పొదిగిన
చెల్లును భావోర్మిళతను!శ్రీవర మౌచున్! 140.
కం:-దురహంకారులు దుష్టులు
పర హింసే!పుణ్యమనెడు!పాపాత్ములచే!
పరి పూర్ణ మాయె!నిక్కలి
పరమాత్మా!కన్ను తెరువు!పాపుల మాపన్! 141.
కం;-తుంటరు లేలిక యందున
మంటలు చెలరేగి!భువిని మాడ్చును గాదే!
ఒంటరి జీవన సాగునె?
తంటాలకు నిలయ మౌచు ధాష్టేకమునన్! 142.
కం;-కంటక చైదుల నంటిన
కంటక మౌ!జీవ సరళి!కాఠిన్యమునై!
కుంటీ!గ్రుడ్డీ!భేదము
కంటికి గనరాక ద్రచ్చు!కారం రక్తమ్! 143.
కం:-బడుగు బలహీన వర్గము
ఒడి దుడుకులు పడుచు నుండు!ఒబ్బిడి గనకన్?
తడబడి బ్రతుకుట తథ్యము
విడి దుప్టుల కెడ మగుటది?పేర్మెయు నౌగా! 144.
కం;-స్రష్టయు సృష్ఠియు సేయగ
నిష్టముగా స్థితిని గూర్చు!నిందిర ప్రియుడున్!
సృష్టిని యిష్టము లేర్చును
నిష్టత లయ మేర్చు శివుడు!నేరిమి మీరన్! 145.
కం;-తెలివికి సంస్కృతి నిలయము
వెలయంగా విలువ పెచ్చి విద్వత్ఖనియౌ !
తల బిరుసు తగ దదేరికి?
విలువను తగ్గించు జగతి!వెరసెదు గనుమా! 146.
కం:-మంచీ చెడ్డల నెంచుము
కుంచిత బుద్ధిని విడుచు!కోమల మనమున్!
వంచన మించుక లేకను!
సంచిత నైపుణ్య సరళి!సాగుమి!జగతిన్! 147.
కం:-పరు లందు నంచి నెంచుమి!
పర దూషణ భూషణంబు పట్టకు మదినిన్!
పర మేలు కోరు మెన్నడు?
పరమార్ధంబది జగాన!పట్టుమి విడకన్! 148.
కం:తొగసుని భగ భగల కిలను
జగ తాపము పెచ్చె నెంతొ?సర్వేశ్వరుడా!
నిగమాంత వేద్యు డీవయ!
ఖగ వాహన గావు జనుల!కమ్మటి చూపున్! 149.
కం;-కారము మిరియము నూరకు
చేరువ గలవారి చెలిమి చేయుమి నరుడా!
పారకు మది కొప్పని పని
దూరకుమీ!శత్రు నింట!దురితము లలరున్! 150.
కం:-తేజోన్విత శివ సిరుల్
భీజోత్శు క మెరుగ లేక!భేషజు లగుచో?
సౌజన్యము చెడు!హరియు
నీ జన్మకు సిరుల నీడు!నిక్కము గనుమా! 151.
కం:-దెయ్యాల వేద పఠనము
సయ్యాటము జేయు నీదు సంగమ మెంచన్!
నుయ్యో గొయ్యో గాకను
చెయ్యిచ్చునె?సత్కృతముకు!చేతోన్ముఖమై! 152.
కం;-చెడు నెరిగి మంచి మాసెను
మిడి జ్ఞానుల మత్సరాన!మిడిసెను చూడన్!
కడి దూర మేర్చి శివుడే?
జడిపించి నరక మొసగును! 153.
కం:-భ్రష్టలు స్రష్టలు కాగను
స్రష్టల కిల తావు లేక చతికిల బడిరే!
ఇష్టము భ్రష్టము కాబడె!
ముష్టికి నిలయం బిదాయె! మోదింప సురల్! 154.
కం:-వెలవెల బోతివి శంకర!
తల నీలి కురుల జలములు!! నెలతాలుపులున్!
యలివేణి పార్వ తమ్మయు
మలినుల సరి జేయ రమ్ము!మాధుర్యమతిన్! 155.
కం:-అక్షరము క్షరము కానిది!
అక్షరమే!రక్ష! దక్ష! యానంద మదే?
అక్షర జ్ఞానము కావలె!
దక్షత చేకూర్చు నదియె!ధాత్రీ తలినిన్! 156.
కం;-మట్టిన పుట్టి పెరుగుచును
మట్టిలొ గలిసెడి!మనుజుడ!మత్సర మేలన్?
పుట్టుక చెడ బుట్టిన,సిరి
పట్టియు కాల్జేర్చు నయ్య!పగ తగదు భువిన్! 157.
కం:-కట్టిన పుట్టము విడు నటు
తట్టుచు విడు దేహ మవని!తజ్జీవ మిలన్!
తట్టు కొనం గల వెట్టుల?
పట్టున యమ పాశ బద్ధ ప్రాణము లలరన్! 158.
కం;-మూడగు నాళ్ళ స జీవము
పీడగ దలపోసి నరుల పీడింపంగన్?
చేడియ లాడును కాలుడు
నీడను నిలువంగ నీక!నిష్టుర జీవా! 159.
కం:-పరహాని నెంచు బ్రతుకులు
నిరతము నీ జిహ్వ నాటి!నీచత గూర్చున్!
తర తమ భేదము మాపును
శరఘాతపు చావు దక్కు!సత్వర గతినిన్! 160.
కం;-దురితపు పనులను జేయకు!
త్వరితము యమ ఘంట మ్రోగు!తామస జీవా!
స్వరములు వర భీజంబులు
చరచును జన్మంబు వడిని!సాగిల పడగన్! 161
కం:-చేకొనకు?రాక్ష సత్వము
మేకొనుచు కోతి చేష్టల!మేథిని వెలుగన్!
కాకలు దీరిన వారలె!
చీకాకులు బడిరి యెంతొ?చింతించి మదిన్! 162.
కం;-పరులకు మెతుకును పెట్టక!
కరకౌ!రక్కసుడ వైన!కాడె!గతియౌ!
మరి నోట దిగక మెతుకును
ధర నాకలి చావు దక్కు!దర్పము విడుమా! 163.
కం:-కుల బలము కలదు నాకని
సల సల మరిగెడు జలముల!జలకము లాడన్!
గుల తీరి బొబ్బ లెక్కును
కులుకే!వెలి కేగు నింక!కుల మెంచకుమా! 164.
కం:-కలి యెంత గడ్డు దైనను
కల దించుక సత్య మిలను!కాదన గలమే!
మలినుల రోతల మాటలు
తుల చేయక సాగ వలయు!తొందర పడకన్! 165.
కం:-కడి యెడమిడి భవు డలరగ
వడి చెడు గుడు విడు మిక!పడ బోకు నురిన్?
కుడి యెడ మెడమిడి మనుమా!
మడియక!మిడి పడక నడుమ!మాడకు మూఢా! 166.
కం:-చెడు నాడ నాడి కొరవడు
కడ కేడుపు బడి చెడుదువు!కాడే!గతియౌ!
కడ కంటి ధృగావస్తను!
చెడి తడి మెదు జగతిని చేదస్తుడవై! 167.
కం:-మనమున చెడు నూహల జను
మనుజుని మాడే పగులును!మాత్సర్యమునన్!
ధనికుడ నని మిడిసి పడకు!
తను వది బుద్బుధ సమముర!దర్పము విడుమా! 168.
కం:-కని పెంచి పెద్ద జేసిన
తనయుని తన నేలుబడిని!దనరగ జేయన్!
మను మాడు మగువ చాలదె ?
తన చేతల చిక్కి మగడు ధర్మము తప్పన్? 169.
కం:-చిన నాటి చెప్పు చేతలు
తనయను సరి దీర్చు గాదె?తగు తగ నీతిన్!
మనకేమని ముద్దింపగ!
మనువాడెడి మగని తీరు!మాయని మచ్చౌ! 170.
కం:-తనయుని చెడుగా దీర్చిన
తన తండ్రిది తప్పగు నిల!దల పోయంగా!
తనయను చెడుగా దీర్చిన
తన తల్లిదె!తప్పగు ధర!ధర్మంబింతే! 171.
కం:-తన పెంపే!యింపంచును
తన పర భేదంబు వీడి!ధాష్టీకు డవన్!
ఘనతే!తనదంచు మసల
జనములు ఛీ కొడుదు రిలను!స్వార్ధము విడుమా! 172.
కం:-వడి వడి మాటలు తూలుచు
పడి పడి తన గొప్ప జెప్ప!తగునే?వినగా!
జఢ తత్వము విడ నాడక
చెడుగా సరి యటంచు బల్క!చీలవె?చెవులున్! 173.
కం:-కుల కాంతను నే నంచును
పలు కాంతల జీవ శైలి వర్లిత మేలా?
నిలు నీదు పరిధి లోబడి
నిలచును నకీర్తి!ప్రతిభ నింగీ నేలన్! 174.
కం:-నందిని పందిగ దలచిన
పందిగ జన్మింతు వీవు!పర జన్మమునన్!
వందన మిడ మాని శివుని
సంధింపకు చెడు నుడువులు!చావే గతియౌ! 175.
కం:-రాయిగ శివునే!దలచిన
వాయించును తిక్క దీర్చి!పట్టున దిట్టై!
వాయస ఘోషలు వర్ధిల
సాయంబే!శూన్య మగును!సార విహీనా! 176.
[వాయస ఘోషలు=కాకుల యరుపులు(బంధు జన రాక
సూచకము)].
కం:-పలు జన్మల పుణ్యంబున
నిల మానవ జన్మ మొచ్చె!నిక రాదు భవిన్!
కలగా మిగలకు ధాత్రిని
తల పోయుమి!ముక్తి నొంద తత్పర మతెవై! 177.
కం:-కలి యొంటి పాద నడకిది
మలినా వస్తను జనములు మసలుదు రిలలోన్!
కల నైన సత్య మెంచరు?
వెలయుమి ధర్మాత్ముడౌచు!విలు వెలయ కలిన్? 178.
కం;-అడు గడుగు నాత్మ వంచన
పడి తిందురు పరుల సిరులు!పందుల వోలెన్?
నెడ మెడ మేగుచు ధర్మము
సుడి గుండము చిక్కె కలిని!రోధింప మదిన్! 179.
కం:-చిత్తము పర విత్తమునకు
మొత్తము మోద మనంగ!మొరలిడు జనులున్!
ఎత్తరిని స్వార్ధ మెంతురు!
పొత్తుకు సరిగారు వారు!బుద్ధిగ వినుమా! 180.
కం:-కుంచిత బుద్ధులు ఘనులై
అంచిత సిరి సంపదలతొ?యలరార కలిన్!
సంచిత గుణ సోమ్యుల ఠిల!
నెంచగ శ్రీవరుడె సుమ్మ!నిల బ్రోవ వలెన్! 181.
కం:-నిజమును పలికిన దోషము
భజనయె?పరమార్ధమిచట!పను లొనరంగన్!
ప్రజనాడి!ధనము పట్టెను
సుజనాళికిచుక్కెదురై!శూన్యత బొడమెన్? 182.
కం;-జగ మొండులు ప్రభవించిరి
భగ భగ లిల నిగ నిగ లయె!బాధిల జగమున్!
తొగసుడు వీరల గనుచును
పగ విడి చరియింప"కలి"-ప్రభావము గాదే? 183.
కం:-పలు మేక వన్నె పులులిట
వెల గల జన ప్రాణములను!వెలి దీసి తినన్?
విలు వేది?నీకు భారతి
నిలువున దహియింప రావె?నీచాళి నిలన్! 184.
కం:-చెడు వినకు కనకు మయ్యా?
నడువుమి సుజనుల నడుమను!నౌఠా యనగన్ !
పుడమిని పుణ్యము నెంచుము
కడ మోక్షము దక్కు నయ్య!కన్నయ కరుణన్! 185.
కం;-అనలము తెలిసియు తాకకు!
తనువే!దహియింప బడును!తధ్యము!సుమ్మా!
ముని జన,తప హోమకులను
దును మాడగ దలచు మనిషి!దుర్గతి నొందున్! 186.
కం:-చింతల పంతము బడకుమి
పంతము పడ వలె చదువుల ప్రావీణ్యతలన్!
శాంతము పరహిత మెలమిని
కాంతల మానములు గావ!కైవల మదియే! 187.
కం;-కలకంఠి కంటి జలముల
వెలయగ!సిరు లెడలును వడి!వేధిలు జగమున్!
కలి యాకలి చావు లలరు
జలధులు ప్రళయము లలరగ!చత్తురు జనముల్! 188.
.
కం:-నిలుపగ సమతా మమతలు
తొలి వీడు జాతి మతములు!తుల నాత్మకతన్!
మలి,కుల జాఢ్యము నెడమిడు
కల కల లాడు జగములను!కల్ముల నెలమిన్! 189.
.
కం:-కలి జీవన సుడు లెడమిడి
వెలుగుమి పురుషార్ధములను!వెను దన్ను నవున్!
నెలమిని వెలి విడు స్వార్ధము.
తిలకుడ వౌ దీవు!జగతి తియ్యని బ్రతుకున్! 190.
కం:-పుట్టిరి పుణ్యులు భూతలి
పెట్టని కీర్తుల వెలుగుచు!పెన్నిధు లైరే!
తుట్టలు భ్రష్ట నికృష్టులు!
పుట్టిరి ఘన కీర్తి చెరుప పుడమిని గాదే? 191
కం:-తనువెల్ల విషము నిండగ
మును పెన్నడు కనని యటుల!మోహము జూపన్!
కని,మోస పడకు మెన్నడు?
మనుమా!యెడముంచి రసను!మంగళకరమౌ! 192.
కం:-మంచిని చెడుగా నెంచుచు
సంచిత స్వార్ధంపు చింత సచ్ఛీలు రనే
వంచన చెడుగును పులిమిన
కంచికి జను సత్య మెటుల?కలి ధర్మ మునన్! 193.
కం;-గతుకుల బడి కదలాడెడు
వెత లతులిత జీవ ఠథము!వెడలును వడిగా!
గతి గన సతి సుత వలయము
మతి కుదురుగ జేయు హరుడె!మనుజుల పాలిన్ ! 194.
కం;-స్వర వ్యంజన సరళీ కృత
వర చతురార్ధ కలిత!వాగ్ఘరి గరిమన్!
సుర నుత ఛందో రీతులు
సురవాణీ వరదమౌత!సొబగుల తెలుగున్! 195.
కం:-సుమ సరి మరు సరి సొగసరి
రమ సరి రతనాల సిరుల రాజిలు రమణీ!
కమలా,విమలా,నటకలి,
కమలాలయ వర మనీషి !గావుత మములన్! 196.
కం:-అమలా,విమలా,కమలా,
హిమ కరి, మరుకలి ,కతనల!హేమ వరాళీ!
సుమనస.సుందరి!మథుమతి
మమకారత గావు మముల!మాథవి కలిమిన్! 197.
కం:-అంగజ వైరి త్రిలోచన!
భంగము లెడమేర్చి గావు!భద్ర!కఫర్ధీ!
జంగమ దేవర శంభో?
గంగా.గౌరీ!వరమయ!కావుమి మములన్! 198.
కం:-మరు సాయక!విరి తూపుల!
సుర నారీ!హృదయాంత ఠంగ!సోముడ వీవై!
వర సిరి మంతన శ్రీ హరి
పరమా!గావంగ రమ్ము!వరశ్రీ లోలా! 199.
కం;-గురు మల్లేశుని కృపచే!
వర శత ద్వయ మమరె నంచు పటుదల దీక్షన్!
నిరతము కేల్మోడ్చెద!నెద!
పరిపూర్ణాయువు నొసంగ!ప్రార్ధింతు నిలన్! 200.
కం;-హరు ఢమరోద్భవ స్వనములు
పరమేశుని నాట్య జనిత!వర భీజములై!
ధరణిం వెలసెను భాషలు
కర మరుదౌ!కావ్య సరళి!గంథ సుమాలన్! 201.
కం;-పద విన్యాసము భావము
పద గుంభన భావ గర్భ !బంధోన్వితమై!
బుధ చిత్ర గర్భ కవితలు
సదయామయు!నాట్య భంగి సరగుం!ధాత్రిన్! 202.
కం;-బంధము చిత్రము నమరిన
యందమునౌ!చిత్ర కవిత!నాహ్లాదమగున్!
బంధోద్భవ ఛందము లిల
నందురుగా!గర్భ కవిత!!నవనీ తలమున్! 203.
కం;-తెలియక జేసిన తప్పులు
మలి జేయను!దేవ!దేవ!మల్లేశ్వరుడా!
వెలగల నీ!యారాధన
బలమది!కైవల్య మిడను!ప్రార్ధింతు మదిన్! 204.
కం:-ముక్తికి భక్తే!కావలె!
భక్తియె!పరమాత్మ గనును!పరమార్ధ మదే!
యుక్తియు!ముక్తియు!భక్తియు!
శక్తుడు!పరమేశు డీవె?శంభో!సాంభా! 205.
కం;-మన సది పరుగిడు వేగము
తను మెచ్చిన తీరు జనును!తప్పును గనకన్!
మనసదుపు తప్ప నీకుమ!
మనుకలి శుభ తీరు గనగ!మలచుము!సుగుణా! 206.
కం;-ఉన్నది చాలును నాకని
చెన్నుగ జీవంబు గడుప !శివమౌ!జీవమ్!
మిన్నగ నెంచకు మెన్నడు?
సన్నుతి కెడమౌదు వీవు!చక్కగ వినుమా! 207.
కం:-కులమది యన్నము పెట్టదు
కలతల కది దారి తీయు!కలవర మేర్చున్!
కలి సున్న కలధు సుఖమిల
కలయే!కుల జాఢ్య మిలను!కనుమీ!సత్యమ్! 208.
కం:-చలి తీరు ననెడు భ్రమతో
మెల మెల మిణుగురుల జేర!మెరుగుయె!గాకన్!
విలువగు వేడియు గల్గునె?
కలయే సుమ జాతి మేలు కలి కాలమునన్! 209.
కం;-జాతి కతీతము స్వార్ధము
పాతుక ధన మద్ది!జగతి బాంధవ్యమునన్!
నీతికి జాతియు నిలువదు
ఘాతుకముల పుట్ట సుమ్మ!కన వేమి టయా! 210.
కం:తినకున్న కడుపు మాడును
తనకున్న!చెడెద వవనిని !వినుత యశశ్వీ!
తనకున్నది చాలను కొని
మనియెడు వాడే! జగతికి మంగళ కరుడౌ! 211.
కం;-సున్నా!పది కందము గద!
సున్నా!లేకున్న యొకటె?సూర్యుం డతడే!
మిన్నున కాంతులు జిమ్మును
కన్నా!యేకంబనేక!కర్మల కెనయౌ! 212.
కం;-సున్నా!శూన్యం బనబడు
సున్నా!లేకున్న జగతి శూన్యంబు గదే!
సున్నా సంఖ్యాన్వితమై
మిన్నంటెను గణిత విలువ!మేథిని మెచ్చన్! 213.
కం:-కల లోని శోభ మాదిరి
నిలలో పని తీరు పగిధి!నిర్మల మగునే?
వెల లేని బ్రతుకు తెరగున
కలి కాలపు తీరదంతె?కాంచ వదేలన్? 214.
కం;-బడి వీడి చదువ బోకుము
గడి మీరుచు మాటలాడ గడగకు మయ్యా!
మిడి పాటు చగ దదేరికి!
సుడి గుండము చిక్కె దీవు !చూడుమి భవితన్! 215.
కం:-పడి లేచు కెరట మట్టుల
పడినను బాధిలకు మిలను!భర్గుని.కృపచే!
వడి లేచుట తధ్య మయా!
కడు నేర్పు వహించి మెలుగు!కాచును ధర్మమ్! 216.
కం:-తొత్తలు ధనమత్తులు భువి
చెత్తలొ కదలాడు క్రిములు!చేరకు వారిన్!
మొత్తము దురితములు చెలగి
మొత్తము లేకుండ చెడును!బంధ మదంతే! 217.
కం;-చెడపకు నితరుల నెన్నడు
చెడిపిన చెడె దీవు భువిని!ఛీ యన జనముల్!
చెడు వినక కనక యున్నను
గడియును సుఖ జీవన మిట!కలుముల నెలవై. 218.
కం:-బలవంతుడ నని దేవుని
పలు విధముల దూర నౌనె?పాపము గాదే!
బల దర్ప మణగు రోజుల
పలు భాములు నొందె దీవు!ప్రాళుబ్ధమునన్! 219.
కం:-అందాల నంది వాహన
ముందర శివ గణము నడువ!ముక్కంటి హరా!
సుందరి హిమ సుత తోడుత
ఛందాలను బ్రోచు రుచుల!సౌ గంధానన్! 220.
కం:-ఇందిర మందిర సుందర
సుందర వరదమ స్థితి కర!సు రుచిర గంథా!
గంథా!తపనసా నందా!
నందా నందన సుర వర నటనల శౌరీ! 221.
కం :-తేనియ లూరెడి మాటలు
మానవతను వీడి పలుకు మాటలు వినుచో!
మానము ముప్పున నొప్పును
దానవులను వీడ వలయు తప్పక ధాత్రిన్! 222,
.
కం;-దుష్టుని సర్పము కాటిడ
నిష్టుర వచనాలు పేలి నీల్గడె?వడిగాన్!
భ్రష్టుడు కుల కంటకుడై
కష్టాలకు తాళ లేక!కాలుని వశమౌ! 223.
కం:-అరుల నురులు తొలగు నిటుల
సరిసమ భావంపు పెంపు!సమతయు కుదురన్!
కరి వెలగ పండు కైవడి
తిరు గెరుగని మాన్యులగుట!తథ్యము సుమ్మీ! 224.
కం:-ఏమియు జూసియు మిడిసెదు?
నీమాలకు నామ మిడుట నీతియు నౌనే?
భూమియు సంపద నిలువదు
భూమిని సత్యంబె నిల్చు!పోవును సర్వమ్! 225.
కం:-మాటల పంతము నూనకు
చేటున కది దారి జూపి!చెడదీయు సుమా!
గీటగు సత్యము ధర్మము
మేటుల కది సాధ్య పడును!మేధిని గనుమా! 226.
కం:-వెంటను రావవి కోటులు
కంటకమే యగు తుదికిని!కాదన గలమే?
పంటికి దోషము నంటకు
మంటిని దలపోసి మనుమ!మనిషిగ ధాత్రిన్! 227.
మంటిని=మన్నును( భూమిని )
కం:-భూమిని నమ్మిన వానికి
భూ మాతయె భుక్తె ముక్తి!భూషణ మదియే?
కామార్తిని మెలుగ తగదు
రామము కాదని యెరింగి!రాజిలు ధాత్రిన్! 228.
కం;-వంచితమై రంకు వలన
అంచిత రామాయణంబు యలరెం ధాత్రిన్!
సంచిత పాపము నొడి గొని
పంచమ వేద మది!శకుని పాత్రచె నొప్పెన్! 229.
కం;-తన వేశ్య లక్షణంబున
తానే ఘనమంచు నూగు!తమ్ముల భంగిన్!
మానాభిమాన మేర్చక
కోనేటి జలము మురికని!కూయిడు!గొప్పై! 230.
కం;-గబ్బున బడి గుబ్బెత బలె
తబ్బిబ్బున లేచి పడుచు!తద్దివసము నన్!
అబ్బబ్బ సొద యి దంచును
నిబ్బరమును వీడి బల్కె!నిరసాకులయై! 231.
కం:-సుబ్బా రాయుని శోభల
అబ్బబ్బో నింగి నేల లల్లా డెనుపో !
బెబ్బులులే!భీతిలు గద!
అబ్బా యీశోభ చూడ!నాశ్చర్య మగున్! 232.
కం:-చెప్పెడు వానికి చెవుడన
గొప్పగ విను వాని తెల్వి!కొదు వాయెను కో!
అప్పుల నెప్పుడు చెప్పకు!
గొప్పని బీదరుపు విన్న!కూర్మి యునౌనే? 233.
కం:-ఏపే లేదిక భూతలి
వాపోవగ లాభ మేమి?వాటిలునె సిరుల్?
గో పాలకు డా శ్రీహరి!
నేపీయగ గొల్తు మదిని!నిర్మల బుద్ధిన్! 234.
కం:-నీరును పారగ నీకను
వారిని వర హర్మ్య వాటి!వర్ధిల జేయన్!
నీరము నిచ్చెడి వరుణుడు
పారింపడె?ప్రళయ మొప్ప!వారిం నేలన్! 235.
కం:-విపరీత చేష్ట వలనను
అపకారమె దక్కు నయ్య!నాలోచింపన్!
ఉపకారము మంచికి నవ!
సు పరిచితుడ వౌదు విలను!శోభిలు కీర్తిన్! 236.
కం;-కడుపున విష మిడు కొని భువి
నడ యాడెడు నాట్య జీవి!నర్మము వలనన్!
గుడి,బడి వాసము చెడు నయ
నెడ నెడ కష్టాలు గల్గు!నెరుగుమి నరుడా! 237.
కం:-ఇష్ట పడి విషము మ్రింగిన
కష్టము కలిగింప కున్నె?గౌరవ ప్రణతిన్!
నష్టపు నైజము దానిది!
స్రష్టయు సరి జేయ గలడె?సౌజన్యమునన్! 238.
కం;-కని పెంచి పెద్ద జేసిన
మనుజుల తలి దండ్రులనిల!దయ జూపనిచో?
మును ముందు వారి తీరది
కను లారగ కాంచ గల్గు! కాలము రాదే? 239.
కం:-జన్మము పితరులు నీయగ
కన్మరు గగు పెండ్లి కాగ!గర్వము బలియన్!
మున్ముందు చూతురే?భువి
తన్మానస క్షోభ జగతి!తప్పదు భావిన్! 240.
కం:-భీభత్సము చవి జూచిన
లొభత్వ మదేల?నయ్య!లొంగకు ధాత్రిన్!
శ్రీ బంధము 'కలి'కందము
నీ బంధమె!నీకు రక్ష!నిరుపమ శీలా! 241.
కం;-నా వాడు నన్ను జూడడె?
పోవాలని యుంది నాకు!పొందగ సుఖమున్!
ఏ వాడ కేగి చూచిన
నీవాడు శివుడు!మరువకు నిరుపమ శీలా! 242.
కం;-కర్మము యిష్టత కోరిన
కర్మాగ్ధ లెల్ల చెడును!కష్టమె మిగులున్!
నిర్మల బుద్ధితొ!వినవలె!
చర్మాంబర ధారి యొకడె!సరిజేయు నినున్! 243.
కం:-సంతప్త జీవ ధాత్రిన్ !
చింతానల జ్వాల లంటి!చేవయు బూదౌ!
హంతము నొందెడు వేళల
పంతే గనదింత సుంత!ప్రాళుబ్ధమునన్! 244.
కం:-అంబర ఛుంభిత శిఖరము
దంబర వరుణాస్త్ర ముల తగ్గున గాదే?
లంబిత పాషాణంబులు
గుంభన చెడి నేల రాల!కుంచిత మౌగా! 245.
కం:-మాయా మేయ జగంబున
మాయే!మేలను కొనుటయు!మంచిది యగునా?
మాయే!నిను పరిమార్చును
మాయను విడు వంగ వలయు మహిలో!బాలా! 246.
కం;-క్రిందకు మీదకు చెందక
కుందితుడౌ!మధ్య ముండు!కువలయ మందున్!
ఎందెందు వెతికి చూచిన
యందందే!కలదు కుట్ర!నాలోచింపన్! 247.
కం:-తిన తిండి లేని వానికి
తనియగ భుక్తంబు దొరుక!దర్పిలు నెంతో?
మను నహముపెచ్చి!భూమిని
తన బ్రతుకే!గొప్పటంచు!తలపక నొడ్లన్! 248.
కం:-గొప్పగ డెప్పరికంబుల
అప్పుల కెగ బడుచు ధాత్రి!నందల మెంచన్?
తిప్పలు ముప్పులు తప్పవు
చిప్పయె!గతి తుది కెరుగుము!జీవన ధాత్రిన్! 249.
కం:-అబ్బకు జబ్బొచ్చిన సరె!
నిబ్బరముగ బ్రతుకు సుతుడు నీచుడు కాడే?
అబ్బబ్బో డబ్బు మత్తది
నిబ్భరతిని మాపు గాదె!నెంచ రదేమో! 250.
కం:-అప్పను తిప్పల ముంచుచు
తప్పక తనయాలి గొప్ప!ధాతృత్వంబున్!
చెప్పుకు తిరిగెడు మనుజుడు
తిప్పలు పడు గాక !భువిని!తిరుమల దేవా! 251.
కం:-చెప్పుల హారము మెడనిడి
గొప్పగ తా శివుడటంచు గోడును సేయన్!
తుప్పును వదలింతురు ప్రజ
తప్పే గద?శివుని బోల్చ!దండన గాదే? 252.
కం;-ఉప్పది రుచులకు మూలము!
చిప్పది ముష్టికి నెలవయ!చెప్పెదు వేలన్?
తప్పకు సు రుచిర జీవం!
ముప్పున పడ బోకు ముష్టి మూర్ఖత్వమునన్! 253
కం:-మనుజుల బోలెడి మనుజులు
మను చుందురు జగతి యందు!మాధవు లీలన్!
కన,గుణముల తేడా యగు
కనుమా!చెడు మనుజుల నిల!కార్యము లందున్! 254.
కం:-తొలకని నిండు ఘటంబటు
మెలుకువ ఘటియించు తెల్వి!మేథిని యందున్!
తెలియని మూర్ఖుల మాటలు
వెల జేయకు విలువ తగ్గు!వేధివి గమ్మా! 255.
కం: మనసున మెచ్చని వారితొ
మనుగడ సాగింప దగదు!మానుమి చెలిమిన్!
మనసున నచ్చిన వారలె!
మన కనువుగ నడుతురు!మంచికి నెలవై! 256.
కం:-కప్పను మ్రింగిన పామును.
గొప్పగ కొనియాడ వలదు!కూర్మియు నొప్పన్!
తప్పే గద పరహింసయు
తప్పగ విడువంగ వలయు దండించి మరిన్! 257
కం:-మెరుగులకు మోస పోకుమి!
మెరుగులొ!నిజ మెంతొ?గనుమ మేథావియునై!
చిరిగిన బట్టలు దాల్చిన
మెరుగౌ!జ్ఞానాంబుధులను!మెచ్చుమి మదినిన్! 258.
కం:-చెడు స్నేహము విడ నాడుము
బడి దొంగల చెలిమి వీడ!బాగౌను సుమా!
నడిచెడు మార్గము!సరియవ!
నడచును సుఖ జీవనంబు!కలుముల నెలవై! 259.
కం:-విన వలెను మంచి మాటలు
చన వలె ,సన్మార్గ మందు!చక్కటి చెలిమిన్!
తిన వలె మథుర ఫలంబులు
తన వలె సరి వారి జూడ!ధర్మము సుమ్మా! 260.
కం:-ఎడ మేగుము చెడు వారికి
నడుమా! సుగుణాల వాల!నరులతొ!నెలమిన్!
విడుమా!దుష్ట నజనంబుల
పడ బోకుమి!పాప కర్మ!భంగము లలమున్! 261.
కం:-మనుజుల నడిపెడు శక్తియు
దనరును దైవంబు వలెను!తప్పక వినుమా!
మను కలి జీవము దనరును
మనుమా!సరివారు మెచ్చ!మాథవ మదియే! 262.
కం:-చెడు గను తలుపులు తెరువకు
నడి సంద్రపు నావ తీరు!నౌ దల గనునే?
పెడ చెవిని పెట్టు చెడుగును
కడు మేలున బరగె దీవు!కావగ సురలున్! 263.
కం:-బలమున్నది నాకంచును
బలిదులచే!భంగ పడగ!భాగ్యం బగునా?
బలమును చదువున జూపుము
బలిదుడ వౌదువు చదువున!భాగ్యోదయుడా! 264.
కం:-మాటలు విని తగువాడకు!
మాటల మర్మ మెరింగి!మాటాడ వలెన్!
చేటునకు చెంత నిలువకు
మా టెరుగుచు మసలు కొమ్మ!మాంగళ్య మదే! 265.
కం:-దురితుల పజ్జను చేరిన
దురితంబులె దక్కు నయ్య!తుంటరి నీతిన్!
స్వరిముల తీరు మారును
జరుగుమి దూరంబు సుగుణ!సత్వర మతినిన్! 266.
కం:-చదువే!తల్లీ దండ్రని
చదువే!గురుడంచు నెంచి!చదువగ వలెనే!
చదువుల మర్మం బెరిగిన
చదువే!చదువంచు నెంచి!చదువుము బాలా! 267.
కం:-ధర్మం బెరుగని కర్మము
ధర్మం బెడ నెట్టి సాగు!తన్మోహమునన్!
మర్మం బెరుగని చదువది
కర్మాంతర్గత ఫలితము!కాదన గలమే? 268.
కం:-మణిమాదులు లేకున్నను
గణకుడు తన గణన కోరు!కార్పణ్యమునన్!
రణమును గోరెడు సఖియకు
గుణములు సరి పోల్ప వశమె?గుణనిధి గనుమా! 269.
కం:-జీవన భాగ్యము కలుగగ
పావనమౌ!పనులు జేసి!పద్ధతి నడుమా!
జీవన నావయు సాగును
శ్రీ వరదంబులు గొనకొని శ్రేయో మయమై! 270.
కం:-పారగు చెలిమిని కోరెడు
ధీరజుని మనమున నుంచి!తనియం తృప్తిన్!
క్షీరము నీటి తెరంగున
నేరుగ మన్నింప బడును!నిర్మల మదియే! 271.
కం:-భూషిత వరదము లిలలో!
దూషితములు కాబడకను!తులనాత్మకమౌ!
భాషణ బుధ నుత మగుచో
పాషండులు మెత్తు రవని!వరదముల వలెన్! 272.
కం:-గణనాతీతు గణాధిప
క్షణికా వేశము తగదు!శత్రుం జయతన్!
గణ.గుణ మెంచియు మనుమా!
గుణ ఖని వౌ దీవు నీతి!కువలయమందున్! 273.
గణ గుణము=శత్రు సమూహముయొక్క స్వభావము
కం:-డెందము కందము ఛందము
బంధము యానంద మయము!భాసుర ప్రభలన్!
ఛందము చందము భళిరా!
చందురు షోడశ కళల !సౌరభ్యమునన్! 274.
కం:-అందానంద సుగంథము
కందముకే దక్కె నిలను!కాదన గలమే!
మందం బేదిర?నడకను
సంధించు జవాశ్వ వేగ!చాతుర్యమునన్! 275.
కం:-అందము తెలుగున ఛందము
ఛందము గణ,పాద భరము!సద్భావమెయిన్!
బంధముల కాంతు లలరును
ఛంద్లకు కంద రాజి సార్ధక మాయెన్! 276.
కం:-కాలపు టొడి దుడుకుల బడి
లాలిత రతనాల సిరులు!!లాలన గనకన్!
లోలాయ మానసంబున
శ్రీ లోలుని కొలువ గల్గు!సిరు లెలమి నిలన్! 277.
కం:-బాలుర తెలివి యమేయము
మలచగ వలె!నాట పాట మథురిమ లొలుకన్!
తెలి వరయగ గరుపుమి!
విలువగు చదువును!సుమతిగ పేరొంద మహిన్! 278.
కం:-మతి కేకాగ్రత కావలె!
యతి,నియతి వలన వశదము!యాంత్రిక మౌతన్!
గతి కుదురు వరకు నాగును
నుతమది పరమాత్ము నరయు!నూధి వచింతున్! 279.
కం:-ఏనగు నశువుల సంఖ్యను
మానితమౌ!సతి సుతులును!మాధవు లీలన్!
కానగ మమకార మదియె!
తానుగ జీవంబు నంటు!తనువది యింతే? 280.
ఏనగు నశువులు= పంచ ప్రాణములు
కం:-పర మున్నదొ?లేకున్నదొ?
వరమౌ!జీవంబు వసుధ!వరలుమి గరిమన్!
నిరతాశ్రిత జీవుల యెడ
నిరతము ప్రేమాభి మాన!నిరతిని గనుమా! 281.
కం:-అనయము వినయము కావలె!
వినయము సర్వోన్నతి నిడు!విద్యయు నదియే!
అనవసర పనులు మానుము!
వినుతి ఘటించును వడిగను!వినుమా!బాలా! 282.
కం:-వర్ణము లేడు భ్రమింపను
నిర్ణితమౌ!తెలుపు రంగు నెలకొను గాదే!
వర్ణము లేవైనను సరె!
తర్ణిని పట్టంగ భవ్యు!దామము గాదే? 283,
కం:-చాలీ చాలని బ్రతుకుల
కేలా? వేషాలు పెచ్చు!నీప్సిత మౌనే?
మేలౌ!చదువులు!చదువుమి
కాలంబే!కలిమి నొసగి!కాచును బాలా! 284.
కం:-బడి ఘంట మ్రోగి నంతనె!
వడిగా!జను బడికి!చదువు విద్యార్ధినివై!
విడ నాడకు చదు వెన్నడు?
బడియే!బంగారు బాట!భవితకు బాలా! 285.
కం:-చదువే!విద్యకు మూలము
చదువే!సంస్కారమిడుచు!చక్కగ బ్రోచున్!
చదువే!జ్ఞ్నము నిచ్చును
చదువే!పర దేశమందు!చాతుర్య మిడున్! 286.
కం;-వినయము పాత్రత ధనమును
ధనమున ధర్మంబు పరముతగుతగ నౌచున్!
ఘన విద్య యొసంగు భువి
విను విద్యయె మూలమౌను!విశ్వము మెచ్చన్! 287.
కం:-భృతి ధృతి స్థితి మతి!విద్యయె?
గత మాగతము నెరుగంగ!ఘన దీప మిదే!
నుతమతి నెలవగు నెన్నడు!
మనుజుడు తరియింప విద్య!మంగళ ప్రధమౌ! 288.
కం:-జంగమ దేవరు స్వరముల
గంగా పరవళ్ళ నడుమ!గల గల ధ్వనులన్!
భంగంబుల బలె విద్యయు
భృంగీ రావంబు దనరె!భేషుగ ధాత్రిన్! 289.
భంగములు=కెరటములు
కం:-చెడు నెడమిడి జనవలె!
బడుగుల బలహీనుల కడ!బంధువు కమ్మా!
కడి కెడము జనకు మెన్నడు?
మడి వదలకు భుక్తి నొసగు!మరువకు సుగుణా! 290.
మడి=పంట భూమి
కం:-అన్నము తిను కుడి చేతితొ
దన్నగు సోదరుల ప్రేమ తగు తగ గనుమా!
ఖిన్నుల బాధలు గనుమా!
వెన్నుని విడనాడ బోకు!విమల యశశ్వీ! 291.
కం:-గ్రాసం బెవరిది యైననై!
వాసంబే!తనది యగుట!వల్లెయు గాదే!
మోసం బెంతటి దైనను
వేసరకం!త్రిప్పి కొట్ట!విజ్ఞానమదే! 292.
కం:-దాసుడ నేనని బలుకుచు
మీసము మెలి వేసి తిరుగ!మేదుర మౌనే?
చాసెద చేయి నటంచును
కేసరియై చ్ప జూడ!కిల్భిష మే గా! 293.
కం;-పాషాణ మెంత దైనను!
ఘోషాసురు చేత జిక్కి!కించిత్తౌగా!
భోషాండుల లెక్కింపున
శేషాచల వాసు డైన !శ్రీలం వీడున్! 294.
కం:-చర చిత్తము విత్తము
పరుగెత్తు స్వదేచ్ఛ నిచ్చ! పట్టదు నొకరిన్!
గురు తత్వులు పరమెంతురు
సిరి నెంచరు!దీక్ష తప్ప!శ్రీకర మదియే! 295.
కం:-దీపాల పెన్నిధి గోపా
పాపాలను జేసి నాడ!పద్దతి గనకన్!
పాపాల రాయుడేనని
కోపించక గావ రమ్ము!గోపీ లోలా! 296.
కం;-నవమే!జగతికి మూలము
నవనీతము నీదు మనసు!నారాయణుడా!
భవ బంధ మోచనంబున
శివ సాయుజ్యంబు నొంద!జేయవె?కృష్ణా! 297.
కం;-భువనము లేలెడు శుభకర
శివు నిల గొలిచెడు నరుడను!జిత కర్ముడ నే!
దివి జో త్తమ!సిరి వరమయ
దివిజత!నను గావ రమ్ము !తేజొ నీధివై ! 298.
కం :-నిలకడ కుదరగ మనసును !
కలతల కెడమేర్చి గావు!కారుణ్య నిధీ !
కలి మాయల దూర మీడుమి!
బలిదుడ నే గాను దేవ పరమాత్మ హరా! 299.
కం:-సిద్ధియు బుద్ధియు కలుగగ
ముద్దుగ గణనాధ యనిన మోదము తోడన్!
పద్ధతి నెలకొను విద్యలు
శుద్ధత చేకూర్చు నెంతొ!శోభిల జగతిన్! 300.
కం:-బుద్ధియె మూలము విద్యకు
బుద్ధిని సిద్ధింప జేయు పుణ్యాత్ముడునై!
సిద్ధి గణాయకు డుండెను
ఒద్దుగ పూజింప!విద్య నొందెదు బాలా! 301.
కం:-చవిగల తేనియ చదువుర
చవి జూచిన జన్మ యెంతొ ? సార్ధక మౌరా!
కవనాలంకృత ఫసుందరి
భవి తీర్చును భాగ్య గరిమ!బంధోన్ముకమై! 302
కం:-చదువున కంతము లేదుర
మథురము!వర భీజ శక్తి!మంత్రిత మౌచున్!
దాయాదుల కీయబడని
పాయస మీ విద్య గాన!వదలకు చదువున్! 303.
కం:మాయామేయ జగంబున
మాయను తొలగించి విద్య మంచిని గూర్చున్!
దాయాదుల కీయబడని
పాయస భోజ్యంబు గాన!వదలకు విద్యన్! 304
కం;-చదువే సత్యము నిత్యము
చదువే!జ్ఞానంబు!తెలివి!సజ్జన స్తుత్యమ్!
చదువే!దారిని చూపును
చదువుమి బంగారు బాల!సద్గుణ శీలా! 305
కం:-జ్ఞానము నొసగెడు విద్యను
దానము జేసిన పెరుగును!తప్పక వినుమా!
కానని వెన్నో జూసెదు
జ్ఞానాంబుధి నీదులాడు సన్మతి వౌచున్! 306
కం:-జడ తత్వము విడ నాడుము
బడి తత్వము నేర్చి కొనుము!బంగరు భవితన్!
నడ యాడెదు సిరుల నడుమ
మిడి మిడి జ్ఞానంబు తొలగు!మేథయు పెరుగున్! 307.
కం:-అష్టోత్తర త్రిశతి కృతిది
శిష్టత గురు"కందము లిల జేసితి'హరుడా!
ఇష్టత దీక్షకు మెచ్చియు
నిష్టను నను బ్రోవ రమ్ము!నేరిము కూర్మిన్,! 308.
ఫల శ్రుతి
కం:-జగమెరిగి మనెడు తీరును
వగపులు తొలగెడు తెరవును!వర్ధిత ప్రగతిన్!
సు గతికి మార్గము జూపును
నిగమార్ధత గూర్చు!బ్రతుకు నిర్మల మేర్చున్!
ఓం తత్సత్
శ్రీ శ్రీశ్రీ ఉమా మల్లేశ్వర స్వామి దేవతార్పణ మస్తు,
మంగళం మహాత్
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
గద్యము:-ఇది శ్రీమదుభయ భాషా భూషణ విద్వద్వరేణ్య వేంకట రాయ శాస్త్రి వరేణ్య
ప్ర పౌత్ర సారస్వతీ కృపా పాత్ర కశ్యపస గోత్ర పవిత్ర వల్లభవఝల సంజ్ఞా పయః
పారా వారా రాకా సుధాకర నరసింహ వరేణ్య పౌత్ర శ్రీరామ మూర్తి,నారాయణాంబా
గర్భ శుక్తి ముక్తా ఫలాయ మాన సోదర ,సోదరీ సమన్విత సుధీ విధేయ అప్పల
నరసింహ మూర్తి శర్మ నామ ధేయ విరచిత"అందాల కందాలు"(అష్టోత్తర త్రిశతి)
కృతి సమాప్తమ్,
ఓం తత్సత్:
శ్రీశ్రీశ్రీ ఉమా మల్లేశ్వర స్వామి దేవతార్పణ మస్తు,
ఓం శాంతిః!శాంతిః!శాంతిః!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.