గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 57వ శ్లోకం. 430 - 434. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోఅర్ధనారీశ్వరీ దేవీ సర్వవిద్యాప్రదాయినీ

భార్గవీ యాజుషీవిద్యా సర్వోపనిషదాస్థితా 57 [ భుజుషీవిద్యా

430. ఓం *అర్ధనారీశ్వర్యై* నమః.

నామ వివరణ.

అమ్మ అర్థనారీశ్వరి.

తే.గీ.  *అర్ధ నారీశ్వరీ! * జన్మ సార్థకమగు

నీవు శివునితో నాలోన నిండి యున్న,

తల్లిదండ్రులయిన మిమ్ము తలచుకొనుచు

సేవలన్ జేసి తరియింతు శ్రీకరముగ.

ఓం *దేవ్యై* నమః.

కం*దేవీ!* నీ పద సన్నిధి

భావించిన చాలునమ్మ భక్తి మనమునన్

శ్రావించునమృతమటులను,

జీవించెద మిము దలచుచు స్థిరమతినిడుమా.

ఓం *అర్ధనారిశ్వరీదేవ్యై* నమః.

తే.గీ.  *అర్థ నారీశ్వరీదేవి! * సార్థకమగు

నాదు జన్మంబు, నీవున్న నా మనమున,

నీవు శివునితో నాలోన నిండి యున్న,

సేవలన్ జేసి తరియింతు శ్రీకరముగ.

431. ఓం *సర్వవిద్యాప్రదాయి*న్యై నమః.

నామ వివరణ.

సమస్త విద్యలనూ ప్రసాదించు జనని.

తే.గీ.  *సర్వ విద్యాప్రదాయినీ! * సకల విద్య

లుర్విపైనుండినన్ నిన్ను గర్వపడుచు

చూడఁ జేసెడి విద్యయే చూడ విద్య

వందనంబులం జేసెద నందుకొనుము.

432. ఓం *భార్గవ్యై* నమః.

నామ వివరణ. భృగుమహర్షికుమార్తె మన అమ్మ.

తే.గీ.  *భార్గవీ! * కృపఁ జూడుమా! భర్గురాణి!

మార్గమీవౌచు ముక్తి సన్మార్గమిడుము.

ముక్తి నందగలేని నా భక్తి యేల

భక్తి నెన్నుచు నాకింక ముక్తినిమ్ము.

433. ఓం *యాజుషీవిద్యా*యై నమః. (భూజుషీ విద్యా)

నామ వివరణ.

యజ్ఞవిద్యాస్వరూపిణి అమ్మ.

తే.గీ.  వినుమ *యాజుషీవిద్యా!* ప్రవీణవీవు

కావునన్ మది యజ్ఞాదికంబులకును

తావలము చేసి మదిలోన తనియు మీవు

వందనంబులు చేసెదనందుకొనుము.

ఓం *భూజుషీ విద్యా*యై నమః.

నామ వివరణ.

భూమిని సంరక్షించుకొను విద్యనెరిం గిన జనని

తే.గీ.  వినుత *భూజుషీవిద్యా!*ప్రవీణ వీవు

భూమినే మది కాపాడు పూర్ణ రూప!

రక్షణమ్మిమ్ము నాదు నిరీక్షనరసె,

వందనంబులు చేసెదనందుకొనుము.

434. ఓం *సర్వోపనిషదాస్థితా*యై నమః.

నామ వివరణ.

సమస్త ఉపనిషత్తులలోఉన్న తల్లి మన అమ్మ.

కంభాషలలో వెలిగెడి మా

తా! *సర్వోపనిషదాస్థితా!* జయమమ్మా!

నీసరి లేరిల తెలుఁగను

బాసను కావంగ జనని! వరలగనిమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.