గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 55వ శ్లోకం. 415 - 421. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోకోకిలాకులచక్రేశా పక్షతిః పంక్తిపావనీ

సర్వసిద్ధాంతమార్గస్థా షడ్వర్ణావరవర్జితా 55  

415. ఓం *కోకిలాకులా*యై నమః.

నామ వివరణ.

చక్కని గాత్రము తోపాడెడి కోకిలసమూహము అమ్మయే.

తే.గీ.  *కోకిలాకులా! * నీవిలఁ బ్రాకటముగ

కోకిలలతోడ నిండి యేకాకులకిల

నూరటన్ గూర్తువమ్మరో ధీరురాల!

వందనంబులు చేసెద నందుకొనుము.

416. ఓం *చక్రేశా*యై నమః.

నామ వివరణ.

శ్రీచక్రాధిదేవత అమ్మయే.

తే.గీవినుత *చక్రేశ* నీ కృపన్ విశ్వసింతు,

కాలచక్రాల క్రింద నన్ గరగనీక

కాచి రక్షింపుమోయమ్మ కరుణ చూపి,

వందనంబులం జేసెద నందుకొనుము.

ఓం *కోకిలాకులచక్రేశా*యై నమః.

నామ వివరణ.

సృష్టిలోకోకిలకులానికి ప్రభ్విణి మన అమ్మ.

తే.గీ.  *కోకిలాకుల చక్రేశ! * కోకిల కుల

మహిత చక్రేశవీవు, సమస్త సృష్టి

కోకిలారావములతోడ కూడియుండి

నిత్యము వసంత శోభతో నెగడనిమ్ము,

417. ఓం *పక్షత*యే నమః .

నామ వివరణ.

చంద్రునిహేతువుగా మనము గ్రహించు ఉభయపక్షములూ అమ్మయే.

తే.గీ. *పక్షతీ! * మాసములలోని పక్షములుగ

నీవె వెల్గుచు మాలోన నీ వెలుగులు

పంచుచుంటివి నిన్ను వర్ణించ తరమ?

వందనంబులం జేసెద నందుకొనుము.

418. ఓం *పఙ్క్తిపావనా*యై నమః.

నామ వివరణ.

ప్రపంచమును శుద్ధి చేయు తల్లి అమ్మ.

తే.గీ.  *పఙ్క్తి పావన! * నా పద్యపంక్తులనిల

పావనముచేసి యలరించు పావనివిగ

నిన్ను వర్ణింప నేఁ జాల, నిజము జనని!

వందనంబులం జేసెద నందుకొనుము.

419. . ఓం *సర్వసిద్ధాన్తమార్గస్థా*యై నమః.

నామ వివరణ.

అన్ని సిద్ధాంత మార్గములందునూ ఉండు జనని.

తే.గీ.  *సర్వ సిద్ధాంత మార్గస్థ! * యుర్విపయిన

సర్వ సిద్ధాంతమార్గాలఁ జక్కగ నిను

మేము గ్రహియించి మనెదము మేలుగాను,

వందనంబులం జేసెద నందుకొనుము.

420. ఓం *షడ్వర్ణా*యై నమః.

నామ వివరణ.

షడ్వర్ణములూ అమ్మయే.

తే.గీకనగ షడ్వర్ణములు నీవె కామితదవు!

వినుము *షడ్వర్ణ! * నేఁ జేయు విన్నపములు,

శత్రు షడ్వర్గమును బాపి చక్కగ నను

నాదుకొమ్మమ్మ, నన్నింక చేదుకొనుమ.

421. ఓం *వరవర్జితా*యై నమః.

 

నామ వివరణ.

తనకు ఎటువంటివరములూ అవసరము లేక విడిచియున్న తల్లి.

 

కం.   వరవర్జిత వీవమ్మా!

వరములు మా కొసగుమమ్మ! *వరవర్జిత!* నీ

స్మరణయె నిరతము చేయుచు

పరమార్థము గొలుపు దివ్యభాగ్యమునిమ్మా!

 

ఓం *షడ్వర్ణా వర వర్జితా*యై నమః.

నామ వివరణ.

శా.  *షడ్వర్ణా వర వర్జితా!* శుభ నిధీ! సద్భాగ్యదా! సత్ ప్రదా!

యీడ్వంజాలను దేహమన్ శకట మీవే కాచి రక్షింప నీ

షడ్వర్గంబుగనున్న శత్రువుల నాశంబొందగాఁ జేయుమా,

షడ్వర్గోద్ధతి లేనిచో కనెద నిన్ సంస్కార యుక్తుండనై.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.