గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 56వ శ్లోకం. 422 - 429. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోశతరుద్రహరా హంత్రీ సర్వసంహారకారిణీ

పురుషా పౌరుషీ తుష్టిస్సర్వతంత్రప్రసూతికా 56  

422.  ఓం *శతరుద్రా*యై నమః.

నామ వివరణ.

శతరుద్ర స్వరూపిణి అమ్మ.

కం.  *శత రుద్రా! * నినుఁ గొలిచెద

నతి భక్తిని శుభనుతవని హాయిగ మదిలో,

క్షితిపై సదయులు వెలుగుత,

మతిమాలిన చేష్టులింక మాయుత, జననీ!

423. ఓం *హరా*యై నమః.

నామ వివరణ.

పాపములను హరించు లోకమాత మన అమ్మ.

తే.గీహరణఁ జేయుమ పాపముల్ *హర*! మదంబ!

నిన్ను నిరతంబు మదినిల్పి మన్ననమునఁ

గొలుచు పుత్రుండనోయమ్మనిలుపుము నను,

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం *శతరుద్రహరా*యై నమః.

నామ వివరణ.

శతసంఖ్యాకరుద్ర శక్తితో కూడిన హరస్వరూపిణి అమ్మ. బాణములతాకిడికి కలిగిన బాధను

హరించు తల్లి మన అమ్మ.

కం*శతరుద్రహరా! * దేవీ!

మతిలో నిలుమమ్మ నీవు మాన్యతఁ గొలుపన్

క్షితిఁ గెల్తు, నీవె కలిగిన

నుతియించఁగఁ జాల నే మనోజ్ఞ సునామా!

424. ఓం *హన్త్ర్యై* నమః.

నామ వివరణ.

దుష్ట సంహారము చేయు జనని అమ్మ.

కం*హన్త్రీ! * కృపఁగను నన్నున్,

మన్త్రార్థము లెఱుగ నేను, మాన్యా! దయతో

మన్త్రార్థంబులఁ దెలిపి కు

తన్త్రంబులనుండి కావుదయతో నీవే.

425. ఓం *సర్వసంహారకారిణ్యై* నమః.

నామ వివరణ.

సమస్త సంహారమునకు మూలకారణము అమ్మయే.

తే.గీ*సర్వ సంహార కారిణీ!* గర్వమణచి

నన్ను రక్షింపుమా భువిన్ మిన్నగాను,

సర్వమున్నీవె, దుష్టులన్ సంహరించి

కావుమా శిష్టులన్ నీవు కరుణఁ జూపి.

426. ఓం *పురుషా*యై నమః.

నామ వివరణ.

అతిపురాతనమయినది మన అమ్మ.

కంపురుషాహంకృతిఁ బాపుచు

పురుషులకున్ జ్ఞానమిచ్చు  పుణ్యద! జననీ!

*పురుషా! * కొలిచెద నిన్నున్

గరుణను మతి నుండుమమ్మ కావగనెపుడున్.

427. ఓం *పౌరుష్యై* నమః.

నామ వివరణ.

పురుషకారములైన శాస్త్ర విహిత కర్మలను ఆచరించడానికి వలసిన ధైర్య సాహసాలను ప్రసాదించే పౌరుష లక్షణము అమ్మయే.

తే.గీ.  *పౌరుషీ! * నీకు నున్నట్టి పౌరుషంబె

నాకునున్ గొల్పి నిలుపుమా శ్రీకరముగ,

జీవి పౌరుష హీనుడన్ భావ మదియె

తలపగాలేను నను నీవె నిలుపుమమ్మ.

428. ఓం *తుష్ట*యే నమః .

నామ వివరణ.

నిత్యమూ సంతోషముగా తృప్తిగా ఉండు జనని.

తే.గీ.  తుష్టి నాత్మకుఁ గొల్పెడి *తుష్టి! * నీవె

తుష్టి రూపాన మదినుండి తుష్టినొంద

సంతసంబిక నేముండు? సాంత మీవె

ప్రేమతోడుత మదినుండి ప్రీతిఁ గనుము.

429. ఓం *సర్వతన్త్రప్రసూతికా*యై నమః.

నామ వివరణ.

అన్ని తంత్రములకూ జనని అమ్మ.

తే.గీ.  *సర్వ తన్త్ర ప్రసూతికా!* సాక్షివీవె

సర్వతంత్రంబులకునిల, సౌమ్య! నీవె

సర్వతంత్రంబులును నాకు , జయనిధాన!

వందనంబులం జేసెద నందుకొనుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.