గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 47వ శ్లోకం. 359 - 366. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోదండినీ ముండినీ వ్యాఘ్రీ శిఖినీ సోమసంహతిః

చింతామణిశ్చిదానందా పంచబాణప్రబోధినీ 47  

359. ఓం *దండిన్యై* నమః.

నామ వివరణ.

దోషులను దండించు తల్లి మన అమ్మ.

తే.గీ.  *దండినీ!* దేవి! నీవు నా దండనున్న

దండిగా కవితాసుధల్ తరలివచ్చి

చేరునాకృతులందున నేరుగాను,

దండిగా నాకు నీకృపనుండనిమ్ము.

360. ఓం *ముణ్డిన్యై* నమః.

నామ వివరణ.

పుర్రెలమాల ధరించిన తల్లి.

తే.గీ.  *ముండినీ! * రక్షవై నాకునుండు నిన్ను

నెట్లు వర్ణింప గలనమ్మ? యిందు వదన!

మండనంబుగ కవితలోనుండుమమ్మ.

వందనంబులు చేసెదనందుకొనుము.

361. ఓం *వ్యాఘ్ర్యై* నమః.

నామ వివరణ.

అమ్మ ఆడపులి.

తే.గీ.  *వ్యాఘ్రి! * దుర్గుణ మృగములు ప్రబలు చుండె

నమ్మరో నామదిన్, చంపుమమ్మ, నీవు

నన్ను రక్షించుచుండుమా మన్ననమున,

వందనంబులు చేసెదనందుకొనుము.

362. ఓం *శిఖిన్యై* నమః.

నామ వివరణ.

అమ్మ ఆడనెమలి

తే.గీ.  *శిఖిని! * నాకిమ్ము సర్వతోముఖజయంబు,

లసదృశమ్ముగ, నిన్ గొల్తు ననుపమాన!

దీప్తమౌనట్టి సద్గుణవ్యాప్తిఁ గొల్పి

నిరతమున్ నన్ను రక్షించు నీరజాక్షి.

363. ఓం *సోమ సంహత్యై* నమః.

నామ వివరణ.

అనేకచంద్రుల సమూహము అమ్మ. అంతటి చల్లని తల్లి.

తే.గీ*సోమ సంహతీ!*కృపతోడ చూడు నన్ను,

చల్లగా కావ నాలోన నెల్లవేళ

లందు నీవుండి, కృపఁ జూపు,మమ్మ దయను,

వందనంబులు చేసెద నందుకొనుము౭.

ఓం *సోమహన్త*యే నమః.

తే.గీ.  *సోమహన్త! * గుణోపేత శుభ చరిత్ర

వీవు, నిన్ గొల్తు భక్తితో నెంచి, నాదు

మనసులో సోములుండిరి, మరువకమ్మ

కూల్చి వారిని, కావు నన్ కువలయాక్షి.

364. ఓం *చిన్తామణ్యై* నమః.

నామ వివరణ.

అనుకొన్నదంతయూ ప్రసాదించు తల్లి మన అమ్మ.

కం.  *చిన్తామణీ!*మదంబా!

సాన్తము తోడుండి నడుపు చక్కగ నన్నున్,

చిన్తావంశజుడను, ని

శ్చిన్తగ నీ వలననుంటి, చేదుకొనుమిలన్

365. ఓం *చిదానన్దా* యై నమః.

నామ వివరణ.

నిరంతర చిదానందస్వరూపిణి మన అమ్మ.

తే.గీ.  *చిదానన్ద!* తేజా! సముద్ధరింప

జగతి కానంద దీప్తులు చక్కగాను

పంచుచున్నట్టి నిన్ను నే నంచితముగ

కొలిచెదన్ మదిలోపలన్  గొలువు తీర.

ఓం *చిన్తామణిచిదానన్దా*యై నమః.

నామ వివరణ.

అనుకొన్నదంతయూ ప్రసాదించు నిరంతర చిదానందస్వరూపిణి మన అమ్మ.

స్వయంకల్పిత చింతితానంద వృత్తము.

గణములు.                …. యతి 9 అక్షరము. ప్రాస కలదు.

*చిన్తామణిచిదానన్దా* శివ నుతా! మదమ్బా!

చిన్తా కులజుడన్ నేనీ  క్షితిని రామకృష్ణన్,

శాన్తిన్ గనగ లేకుంటిన్, సరగునన్ భవానీ!

చిన్తల్ విడును నీవున్నన్ క్షితిని గావు నన్నున్.

366. ఓం *పఞ్చబాణప్రబోధిన్యై* నమః.

నామ వివరణ.

పరమేశ్వరునకు పంచబాణప్రబోధిని మన అమ్మ.

తే.గీ.  *పఞ్చబాణప్రబోధినీ! * సఙ్చితముల

నెటులనెడబాపుదో నీవహీన గతిని,

శివునిమెప్పించి పొందిన చిత్ప్రభాస!

నన్ను రక్షింప వేడుచు నిన్నుఁ గొలుతు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.