గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 51వ శ్లోకం. 388 - 397. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోసత్తాజాతిః ప్రమాఽమేయాఽప్రమితిః ప్రాణదా గతిః

అవర్ణా పంచవర్ణా సర్వదా భువనేశ్వరీ 51  

388. ఓం *సత్తాజాత*యే నమః.

నామ వివరణ.

గొప్పబ్రహ్మ కుటుంబమునకు చెందిన జనని మన అమ్మ.

తే.గీ.  నతులు వినుత *సత్తాజాత! * గతిని మార్చి,

నన్ను సన్మార్గమున నిల్పి, మన్ననమున

కన్నతల్లివై రక్షింపు కరుణఁ జూపి,

వందనంబులు చేసెద నందుకొనుము.

389. ఓం *ప్రమా*యై నమః.

నామ వివరణ.

భక్తులను అంచనా వేయగలిగిన తల్లి మన అమ్మ.

తే.గీ.  *ప్రమా! * మాత! భక్తుల నొనరఁ గనుచు,

వారి శక్తిని మతినెంచి ప్రణవ తేజ

మందఁ జేయుచు శుభదవై ముందు నడుపు

నిన్ను మతినెంచి చూచెద సన్నుతముగ.

390. ఓం *అమేయా*యై నమః

నామ వివరణ.

ఎటువంటి సరిహద్దులూ లేని జనని.

తే.గీ.  కను *మమేయా! * మహిత భక్త కామ్యదవయి,

కని యమేయమౌ నినుఁ గను కామితమును

తీర్చు మాత్మ సువర్చవై తీరుగాను,

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం *మేయా*యై నమః.

తే.గీభక్తులకు మేయవీవమ్మ, భవ్య*మేయ! *

భక్తసులభవు కావునన్ భజన చేతు

భక్తి గొలుపుచు మదిలోన వరలుమమ్మ,

వందనంబులు చేసెద నందుకొనుము.

391. ఓం *అప్రమిత*యే నమః.

నామ వివరణ.

ప్రమితమేమాత్రమూ కాని జనని మన అమ్మ.

తే.గీప్రమిత మన్నది లేని *యప్రమితి! * నతులు,

వేద సంభాసితా నీదు వెలుగు తీరు

కనగ నప్రమితమ్ముగా, ప్రణుతులమ్మ!

వందనంబును చేసెద నందుకొనుము.

ఓం *ప్రమితయే* నమః

తే.గీవేద మూలసూత్రములచే విదితమగుచు,

*ప్రమితి! * నా నుతులంది, నా భ్రమలు పాపు

మమ్మరో! నీదు  మది కడుఁ గమ్మనమ్మ,

వందనంబులు చేసెద నందుకొనుము.

392. ఓం *ప్రాణదా*యై నమః.

నామ వివరణ.

ప్రాణములను ప్రసాదించు జనని.

తే.గీ.  *ప్రాణదా! * నీవె నాకున్న ప్రాణమమ్మ!

ప్రణవ  తేజంబె ప్రాణమై ప్రబలు లోన,

జీవమున్ బ్రహ్మమేకమై చెలగునట్లు

చేయుమమ్మరో  నీకృపన్ జిత్తమలర.

393. ఓం *గత*యే నమః.

నామ వివరణ.

గమ్యమయిన తల్లి మన అమ్మయే.

తే.గీ.  *గతి! * శుభాకార వీవమ్మ కరుణ తోడ

గతివగుచు నాకు ముక్తిని  కలుగఁ జేయు

మమ్మ! పూజింతు నిన్ను నే నెమ్మితోడ,

వందనంబులు చేసెద నందుకొనుము.

394. ఓం *అపర్ణా*యై నమః.

నామ వివరణ.

పార్వతీ మాత మన అమ్మయే.

తే.గీ. అక్షయంబగు శివదీక్ష నలరి నీవు

పర్ణమైనను గొనని యపర్ణవమ్మ,

కను *మపర్ణ! * నన్ సతతంబుఁ గరుణతోడ,

వందనంబులు చేసెద నందుకొనుము.

395. ఓం *పఞ్చవర్ణా*యై నమః.

నామ వివరణ.

నమశ్శివాయ అను ఐదు వర్ణముల స్వరూపము అమ్మయే. విస్తారమై యొప్పు వర్ణ

సముదాయము అమ్మయే.

తే.గీ*పఞ్చవర్ణా! * సువిదిత ప్రపంచమైన

భవుని పఞ్చాక్షరిన్ గల్గు వర్ణములవి

నీవె గణియింప, నిజమిది నీరజాక్షి!

వందనంబులు చేసెద నందుకొనుము.

396. ఓం *సర్వదా*యై నమః. ౩౯౦

నామ వివరణ.

సమస్తమునూ ప్రసాదించు జనని అమ్మయే.

తే.గీ.  సర్వమిచ్చెడి *సర్వదా! *  సవినయముగ

నిన్నుఁ గొలిచెడి భక్తులే సన్నుతులిల,

ముక్తి నీవెయై యొసగెడి శక్తివమ్మ

నిన్ను కోరగానేల నాపన్న రక్ష!

397. ఓం *భువనేశ్వర్యై* నమః.

నామ వివరణ.

చతుర్దశ భువనములకూ ప్రభ్విణి మన అమ్మయే.

తే.గీ.  మహిత *భువనేశ్వరీ! * జయ మార్గ మీవె,

నాదు దేహంబె భువనము, మోదమొసగు

నీవె యీశ్వరి విచ్చటన్, నిన్నుఁ గొలుతు,

వందనంబులు చేసెద నందుకొనుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.