గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 50వ శ్లోకం. 380 - 387. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోమంత్రబ్రాహ్మణవిద్యార్థా నాదరూపా హవిష్మతీ

ఆథర్వణిః శ్రుతిః శూన్యా కల్పనావర్జితా సతీ 50  

380. ఓం *మన్త్రబ్రాహ్మణవిద్యార్థా*యై నమః.

నామ వివరణ.

బ్రహ్మ మంత్రాభ్యాసము చేయు తల్లి.

కం.  *మన్త్రబ్రాహ్మణవిద్యా

ర్థా*న్త్రములన్ బిగియఁ బట్టి ప్రఖ్యాతిగ నీ

మన్త్రంబులు చదువు ఘనుల

కున్త్రాసము కలుగనీకు, కొలిచెద నిన్నున్. (అంత్రములు=ప్రేగులు)

381. ఓం *నాదరూపా*యై నమః.

నామ వివరణ.

ఓంకార నాద స్వరూపిణి అమ్మ.

తే.గీ.  *నాదరూపా! * మహాదేవిబోధఁ గొలుపు

మాత్మలోనుండి నాకిల నతులితముగ.

నాదరూపాత్మ నేను నీ కాదరమున

వందనంబులు చేసెద నందుకొనుము.

382. ఓం *హవిష్మత్యై* నమః.

నామ వివరణ.

హోమగుండమునవేయు హవిస్సులు అమ్మయే.

తే.గీ.  విను *హవిష్మతీ! * కృపతోడ వీనులార,

పద్యపాదమ్ములన్ హవిర్భాగముగను

నీకు నర్పించుటెఱుఁగను, నీవె కనుచు

స్వీకరింపుము పద్యాల చిత్ర గతులు.

383. ఓం *ఆథర్వణ్యై* నమః.

నామ వివరణ.

అధర్వణ వేదము అమ్మయే.

తే.గీ.  మహిని *నాథర్వణీ! * నీవు మహిమ తోడ

పద్య రూపాన ప్రభవించు, పరవశింతు,

వెలుగ పద్యమధర్వణ వేద సరణి

నందఁ జేసెద నీ కృపనంది నీకు.

384. ఓం *శ్రుత*యే నమః.

నామ వివరణ.

అమ్మ వేదముల రూపమే.

తే.గీ.  *శ్రుతి! * యనుశ్రుతంబుగ వెల్గు చుండె జగతి,

శ్రుతులు, నీరూపమగుటచే  నతులితముగ,

కృత మహాపుణ్య ఫలముచే శ్రుతులు దొరుకు

ప్రభవమొందెడి పద్యముల్ వరలు శ్రుతియె.

ఓం *ఆథర్వణిః శ్రుతయే* నమః.

తే.గీనిరుప*యాధర్వణిఃశ్రుతీ! * నిన్నుఁ గొలుతు

వేద విజ్ఞానమే లేని సాధకుఁడను,

నీవె నాకు వేదంబులు నిజము తల్లి!

వందనంబులు చేసెద నందుకొనుము.

385. ఓం *శూన్యా*యై నమః.

నామ వివరణ.

ఆరంభము ముగింపు లేని శూన్య మన జనని.

తే.గీ.  *శూన్య! * లోకంబు శూన్యమే, చూడకున్న

నిన్ను మనసార మదిలోన మన్ననమున,

మాన్య! హృదయంబులో చేరి మనుము, నీకు

వందనంబులు చేసెద నందుకొనుము.

386. ఓం *కల్పనావర్జితా*యై నమః. ౩౮౦

నామ వివరణ.

కల్పననుండి వర్జింపబడిన అకల్ప మన అమ్మ.

తే.గీ.  *కల్పనావర్జితా! * స్వ సంకల్పమదియె

సృష్టి జరుగఁగఁ జేయునే, దృష్టి పెట్టి

కల్పనంబును చేయవు, కమల నయన!

వందనంబులు చేసెద నందుకొనుము.

387. ఓం *సత్యై* నమః.

నామ వివరణ.

సతీదేవి మన అమ్మయే.

తే.గీ.  *సతి! * పరాశక్తి నాలోన సన్నుతముగ

నిత్యమున్ వెల్గు చుంటివి, భృత్యులెల్ల

సేవలందింపఁ గొనుటకై, సేవ్య పాద

పద్మములు నీవె పద్య సంభాస! నతులు.

మ.  *సతి* నీ పాద పయోజముల్ కొలిచెదన్, సన్మార్గ సద్వర్తనన్

క్షితిపై నాకు నొసంగుమమ్మ సతమున్ క్షీరాబ్ధి పుత్రీ రమా!

మతిలో నీవె వసింపుమా సతతమున్ మాతా! సుశబ్దంబులే

స్తుతరీతిన్ వరపద్యపాదములలో శోభిల్లగాఁ జేయుమా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.