సోమ రుద్రేశ శతకము.
మరుమాముల దత్తాత్రేయ శర్మ
1ఆదిభిక్షుడ వీవు మా అయ్యవగుట
బూడిదనిడిన చాలు మాపుణ్యమగును
కోరుకొననిది యిచ్చుటే గొప్ప గుణము
సోమరుద్రేశ నీలీల శుభకరమ్ము!
2
మంచు కొండలఱేడ మామంచి వాడ!
జాలిగుండెల గౌరమ్మ జతను గూడి
అరిగి కరిగెదవుగద! నీవమ్మతోడు
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ!
3
తాండవమ్మాడెదవట తైతక్క యనుచు
కలిసియాడునంట కలికి కాంక్ష దీర
ఇల్లఱికపు టల్లుడవు యిట్లెన్నినాళ్ళు
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ!
4
కులము లేదంట యేదినీ గోత్రమయ్య
ఇల్లు లేదయ్యె నినుగన్న తల్లి లేదు
కోరి నిన్నెట్లు వలచెనో గౌరి దేవి?
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
5
మల్లె తావుల మాయయ్య మనసు తెలిసి
మిసిమి భ్రమరాంబ మాయమ్మ మెచ్చి వలచె
వర్ణభేదాలు పాటించు వారు గారు
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
6
వసతి యయ్యెను 'సతి'లేక వల్లకాడు
వసనమయ్యెను పులితోలు, విసముమేత
వ్యసనమయ్యెను మితిలేని వరము లిడుట
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
7
కొండయిల్లయ్యె నీకండ కొండతనయ
కొండధనువయ్యె నీచేత, కోటిలింగ!
కొండ దేవరవైన నీగుండె మృదువు
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
8
సగము మేనిచ్చి నగజాత జతనుగూడి
వింత రూపమ్ము దాల్చిన వేల్పు పెద్ద
వీవు; ప్రకృతివో పురుషుడోఎఱుగమెపుడు
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
9
మాటతోడనే యర్థమ్ము మనెడురీతి
తోడునీడగా మీవలె విడువకుండ
ఉండుటేరికి సాధ్యమీ ఉర్విమీద
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
10
కోరి గొంతెత్తి పిలిచినన్ చేరవచ్చి
వరములిత్తువు తరతమం బరయకుండ
కోరుకొనుటొక్కటే చాలు కొడుకుల కిల
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
11
ఏమి చూతువో ముక్కంటి ఎవరి కెరుక
చేరి వినునేమి వెంకయ్య చేటచెవుల
ఏమి తలచునో జగదీశి ఎవరికెరుక
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
12
ఈశ ఐశ్వర్య దాత యంచెలుగు నెత్తి
పిలువ ఫలమిదా మానెత్తి పిడుగువడెను
బూడిదనిడితి తనువంత పూసితిరుగ
సోమరుద్రేశ నీలీల చోద్యమయ్య !
13
అట కుబేరుండు మీమిత్రుడగుట జేసి
అన్నపూర్ణమ్మ మీసతి యగుట జూచి
కోరుకొంటి కపాలి ! నా నేరమేమి?
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
14
అడిగి చిరుతొండ నంబి మాంసాశనమును
కోరి తిన్నని నంజుడున్ కొదువదీర
ఒనర విషమును మెక్కియెట్లోర్చినావొ
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
15
ఎవరి నడుగక దైత్యుల కెవరికైన
కోరు వరములనిత్తువే కొరత లేక
నిన్ను మార్చ హరివిరించి కెన్ని పాట్లు
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
16
ఎవరు పిలిచిన నేగుదు వెద్దునెక్కి
ఏమి కోరినన్ కాదన కిత్తువంట
వెనుక ముందేమి చూడవా వెఱ్ఱి సామి
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
17
తెలిసి తెలియక మదినిండ దలచి కొలువ
పత్రిపుష్పాల పూజించి భక్తి వేడ
ఆశుతోషుడ వగుదువో ఆదిదేవ!
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
18
నిన్ను గోరిన గిరిజనే నీకు గూర్చ
కుసుమ శరములనేసెనా రసికరాజు
కాముగాల్చియున్ కామేశ నాముడైన
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
19
సతియె దొరసాని మామయే సార్వభౌము
డధిక బలశాలి రావణుండాది బంటు
సకల దేవతల్ నినుగొల్చు సంగతిదియె
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
20
పంచభూతాలు తలవంచి పంచనిలువ
మౌని గణములు వినుతించి మదిని గొలువ
మాయయగునట్టి ప్రకృతి మీ మహిళగాగ
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
21
సకలలోకాలు మీమ్రోల సాగిలవడ
సకల సంపదల్ కొనగోటి సమముగాగ
కాటిచితులలో కాపురం బేటివింత?
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
22
అంబరముల దాల్చవు దాల్చవాభరణము
లాశ లార్భాటములులేని ఆదిజటివి
అమ్మ నిన్నెట్లుగోరెనో అరయమయ్య
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
23
అన్నపూర్ణయె తానఖిలార్థ దాత్రి
మంజు మంగళగౌరియౌ మాతయామె
ఏమి సుఖియించె నీతోడ నెఱుగలేము
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
24
ఏదిశూన్యమో అదియెనీ నాదమగును
ఏదిపూర్ణమో అదియెనీ వేదమగును
ఉంట లేకుండుట యను నీ రెంటనీవె
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
25
కాలు దన్నితి కాలితో బాలు గావ
కంటగాల్చితి వలఱేని గౌరి గూడ
గంగ నెత్తితి తలను సద్గతుల నిడగ
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
26
అవధులెఱుగని యాశల యందు చిక్కి
కోరు మావింత కోర్కెల తీరులరసి
వినెదవో వినవో మొరల్ విశ్వనాథ!
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
27
నశ్వరంబైన బ్రతుకిచ్చి నటననేర్పి
జననమరణాల సరిమధ్య చతురఖేల
వేడుకగుమీకు మాకేమొ వేదనయగు
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
28
ఉన్న సంసార సాగరంబెన్నమాకు
ఆశలే లహరులగుచు నాక్రమించు
విశ్వ సంసారి! మీకెన్ని వేదనలొకొ?
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
29
ఆగకుండ మా కోరిక లన్నిదీర్తు
వలుపు సొలుపులేకుండ మాయార్తిదొలగ
కొంత సేదదీరుమిదె నా గుండెగుడిని
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
30
నేను రుద్రుడ నౌదును నిన్నుగొలువ
నీవు సౌమ్యుడ వౌదువు నేను నీకు
భక్తుడనగుటవలన నద్వైతమిదియె
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
31
అమ్మ లేదయ్యె నీకయ్యయసలెలేడు
ఆడుబిడ్డలులేరు నీతోడురారు
ఎద్దునెక్కెద వెచటికో యేగెదెపుడు
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
32
'చేదుకో మల్లన' యనుచు చేరి పిలవ
కొండ దిగివచ్చి నిలిచిమాయండ నుండు
దండి దేవుడవందుకే తలుతునయ్య
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
33
భక్తి కేదారి కేదారి పరమపురుష
శక్తికే దారి జడదారి సత్ప్రకాశ
ముక్తి కేదారి మీదారి భోగిభూష
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
34
బ్రహ్మమొదలు పిపీలికావ్యాప్త జగతి
జడము చేతనముల లోని శక్తివంట
పశుపతీ!యనిన కలుగు పరవశమట
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
35
ఆశలుడుగని చోటేది అవనిదివిని
ఈశుడుండని తావేది యిహపరాన
ఆశలీశులొకటె బహిరంతరముల
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
36
బెడగు కన్నులున్ నెఱివేణి జడలుగట్టె
బుసలపాములాభరణాలు నొసటబూది
ఏమిరూపము నీదయ్య యెంచిచూడ
సోమరుద్రేశ నీలీల చోద్యమయ్య !
37
బట్టలొల్లని జగజెట్టి భైరవుడవు
వ్యోమ కేశుండవైనట్టి యొంటివేల్పు
వూర్ధ్వరేతుడ వీవట యోగిఘనుడ!
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
38
గజముఖుండేలు ప్రమథాది గణము నెపుడు
షణ్ముఖుండగును నిలింపసైన్య నేత
వారసత్వమ్ము లీలీల పరిఢవిల్ల
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
39
అప్పునందుమునిగి తలనప్పుదాల్చి
అప్పురముల గాల్చితివప్ప! అబ్బురముగ
అప్పునిప్పుల నొప్పుమై గప్పుకొనెడు
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
40
నశ్వరంబని లోకము నాగభూష!
భస్మమేయగుననిదెల్పు ఫాలకీల!
చేతదాల్తు కపాలమ్ము చిన్మయముగ!
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
41
అభవుడ వనాది దేవుడవగుట వలన
అంతుచిక్క వాద్యంతము లరయలేము
నిన్ను నున్నంత కొలుచుటే నిఖిలమగును
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !!
42
చెలగి శిరమున గంగమ్మ చిందులేయు
కసరిబుసగొట్టు కాలాహి కంఠమందు
కదలి కీలాగ్ని సెగపెంచు నుదుటి కంట
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
43
రాలె నీ చేతి బుడుబుక్క రవముతోడ
అక్కరములన్ని యవనిపై నక్షయముగ
ఆది వాఙ్మయ మూర్తివై యలరు నట్టి
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
44
భూత పైశాచికపు ప్రేతభూమి నిలిచి
జీవిత చరమాంక గతిని శివముగూర్చి
చిత్త శాంతిని! సరిభూమి నిత్తువు, హర
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
45
తీరుతీరైన వేషాల తీర్చి దిద్ది
జననమరణాల భ్రమణాల చక్రములను
త్రిప్పి యాడించి మురిసెడు ద్రిమ్మరివగు
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
46
కసరిబుసకొట్టి భయపెట్టు కాలనాగు
కదలి యలలెత్తి సురగంగ కలతపెట్టు
గిరిజ యేరీతి నినుజేరి క్రీడసలుపు?
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
47
ఒకడు వాడియౌ కొమ్ముల నొద్దికగను
ఒకడు తొండము నూపుచున్ యొదిగియొదిగి
ప్రకట పరతురీ జగదేక ప్రాభవమును
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
48
శూలమునకు వాడికొనలు చూడమూడు
కనులుమూడు, లలాటరేఖలవి మూడు
మూడు లోకాలనేలెడి వాడవగుట
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
49
పశులు పక్షులు దేవతల్ ప్రమధవరులు
యక్ష గంధర్వ కిన్నెరాద్యతుల నుతుల
వరలు హిమజాత తోడుగా పశుపతీశ!
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
50
ఇంత పొగడిన చాలు నెంతెంతొపొంగి
ఎంత కఠినాత్మునైనను కరుణజూపి
ఉబ్బులింగడవైతివీ వబ్బురముగ
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
51
పాలసంద్రమ్ము జిలుకగా భయద కాల
కూటవిషము రాగ తొణకకుండ నట్టి
విషము ద్రావితి విదియేమి వెఱ్ఱిసామి
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
52
ఏటి గట్టున కట్టినయింటిలోన
ఒంటిలింగడవేరీతి నుంటివయ్య
కంట కునుకైన లేకముక్కంటిఱేడ!
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
53
వరుస సాలీడు కాళమ్ము కరియు జేరి
నిన్ను పూజించుఫలమిదా నిటలనేత్ర!
తెలిసె పో! నిన్ గొలువ నిను కలియుటగును
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
54
ఈశ్వరార్చనచేయగా నిహముపరము
కాలకంఠుని గొల్వగా కలదభయము
చంద్రశేఖరు స్మరణమే జన్మ వరము
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ!
55
భోగముల్గోరుకొననట్టి భోగిభూష
సుధను సురలకిడిన సుధాంశుమణిశీర్ష
స్ధాణువైమను భ్రామరీ చంచలాక్ష
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
56
పత్రియిచ్చిన సంతృప్తి పడుచు దేవ!
నీళ్ళు బోసిన నిష్టార్థ నిధులనిడుచు
నిన్ను కోరిన నిడుదువు నిఖిల సుఖము
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
57
నిన్ను దలచిన నేరీతి నీకు ప్రియమె
నిన్ను గొలిచిన నేరీతి నీకు నయమె
నిన్ను గోరిన నిత్తువు నిన్ను నీవె
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
58
అచట!సోమోదయంబాయెనభ్రవీధి
ఇచట సోమసుందరుడహో హృదయ మందు
సోముడక్కడ నిక్కడ శోభలీనె
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
59
ఎఱుక గల్గిన వాడ వీవెరుక వగుచు
నరుని జగజెట్టిగానిల్పు కరుణగలిగి
పాశుపతమిడితివి ధర్మ పక్షమునకు
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
60
సతిని వెతుకుచు వ్యథచెందు స్వామి కొరకు
సాగరమ్మును లంఘించు సాహసివయి
వాయు సుతుడవైతివమేయ బలుడ! హరుడ!
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
61
అగ్నులందున విహితవేదార్థములను
సత్త్వసంపదలందిరు సంధ్యలందు
పరమ భాగవతుల యందు వరలెదవట
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
62
ఎవ్వరేది చేసిన అదిఈశ్వరేచ్ఛ
ఏదిపొందిన అదియెల్ల ఈశ్వరాజ్ఞ
మీదికానిది లేదేది మింటమంట
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
63
అణువునుండియునిండి బ్రహ్మాండమంత
వెలుగు చైతన్య తేజమై ప్రియముగూర్చు
సృష్టి సర్వము పర్వము చిన్మయమ్ము
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
64
మాయలారింటి నొకచోట మంతరించి
కాయమందున జీవమ్ము ఖాయపరిచి
కోర్కెలన్ రగిలించి సంక్షోభ పరచు
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
65
ఎవని కధికారమిత్తువో యెపుడుగూల్తు
వెవరి కెవ్వరి జతగూర్చి బవరమందు
కలిమి లేములన్ గల్పించి కాలగతుల
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
66
పంచభూతముల్ సృజియించి పరిచి జగతి
పాంచభౌతిక దేహాన బ్రతుకునిడగ
భ్రమల మునుగగ త్రిగుణాల వలను వేయు
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
67
ఉన్నదానిని వదలుచు నురుకులెత్తి
లేని దానికి వగచుటే లేకితనము
హృదయ సదనాన నీవుండ నేదికొరత?
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
68
ఆదిభిక్షుడ వీవు యిష్టార్థదాత!
బూదిపూయుదు వీవె యీ భువనభర్త!
మాయగూడెదవా మాయ మాయమవగ
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
69
సిరినిగలిగిన వాడైన తిరిపెమెత్తు
వటువురూపమెత్తి బలిని వంచనమున
వేల వేషముల్ వేసెడు విష్ణు మాయ
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
70
తాను చేసినబొమ్మయే తనకు నచ్చి
బమ్మ కైననుపుట్టెలే రిమ్మతెగులు
కామమేరికి చేదౌను కామహారి!
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
71
భోగతల్పమునందున్న భోగికైన
తమ్మి పీఠమ్ముపైనున్న తాతకైన
ఆపదుద్ధారకుడ వీవె అద్రిజేశ!
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
72
వెదకితిని వెఱ్ఱినై నేను విశ్వమంత
దొంగవై యుంటివా! అంత రంగమందు
నిన్ను కనుగొను టెట్టులో నిటలనేత్ర!
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
73
గంగపుట్టిన చోటల గతులుదెలియ
కొండలెక్కుచు సాగగా కొట్టకొనకు
హైమతోడుగా కన్పింతువాదిదేవ!
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
74
మంచు కొండల శిఖరాల మనెదవనుచు
గిరులఝరులను తరియించి గింజుకొనుచు
మిమ్ము దర్శించు మాత్రాన మిన్నులురుము
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
75
ఇపుడు తెలిసె మీనిజతత్త్వమేమొ యీశ!
తమ్ము దర్శింప తుహినాద్రి దరికిజేర
మమ్ము చూసి కరిగెదవు మంచులింగ!
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
76
గంగవెఱ్ఱెత్తి పారును గౌరిపొంగు
గిరుల దరులన్ని వరదలై గెంతులేయు
ఇదియె కాబోలు మీదయ ఈశ్వరేచ్ఛ
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
77
పానవట్టమొకటి రెండు పైనలింగ
ములుగ; కాళేశ ముక్తీశ మోక్షదాత
ప్రాణహితతోడ గౌతమీ ప్రణయమూర్తి
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
78
నిఖిల కళలందు వెలసిన నిగమమీవు
నిత్య సత్యమైనట్టిదౌ నిష్ఠవీవు
ధ్యానమార్గము నందునన్ జ్ఞాన దీప్తి
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
79
ఆత్మతత్త్వము దెలుపమౌనంబు ఘనత
నెఱిగి రమణర్షి ఉదయించె నరుణగిరిని
అరయ గోచి పాతయె ముక్తి అగ్నిలింగ!
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
80
కొసరి గొడగూచి దినిపించ మెసవితీవు
కోరి బెజ్జమ్మ మురిపాల గుడిచితీవు
నాదు నైవేద్యమెందుకు చేదునీకు?
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
81
సాధ్వి అక్క మహాదేవి సగుణభక్తి
అమ్మ బెజ్జమాంబ వినిర్మలాత్మనిరతి
స్వామిమాకెట్లు గలుగునో పలుకుమయ్య!
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
82
ఒక్కడు మృకండు తనయుడీ యుర్వివెలయ
కాలయమునినీ వదలించి కాలదన్ని
కాలకాలుడ వైతివో కాలకంఠ !
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
83
దిక్కు నీవని తలువగ చిక్కుబెట్టి
చిన్నిసిరియాళు జంపెడి శిక్ష వేసి
పరమభక్తుల హింసించు గరళగాత్ర!
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
84
యోగమేభోగమైనట్టి వ్యోమకేశ!
త్యాగమే యోగమైనట్టి రాగదూర!
ప్రాణికోటిని రక్షించు వాయులింగ
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
85
ఉదధి కంకణముగ, సకలోర్వి కరము
గాగ, దిసమొల వసనమ్ము గగనమనగ
జగములేలెడిజంబుకేశ! పరమేశ!
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ!
86
శూన్యమందు చిదంబర శోభలీను
యారహస్యము దెలుపుమా! ఆశుతోష
సాంధ్య నటరాజ చైతన్య సగుణరూప!
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
87
పార్థివము నందుదయమైన ప్రాణమగుచు
భూతసృష్టికి మూలమౌ వీతరాగ!
మంటిమింటిని యంటితివంట కంట
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
89
పంచలింగాలతో పాంచభౌతికమగు
పంచకృత్యమ్ములైన ప్రపంచమగును
దిక్కు లేలెడి నేత, మాదిక్కు గనుము
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
90
అక్షయంబగు వరముల రక్ష యిచ్చి
దక్షిణామూర్తి వైతివి దనుజులకును
భస్మహస్తమ్ము నీనెత్తి పైకివచ్చె
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
91
నిటలమందగ్ని గళమేమొ నిప్పుకొలిమి
కాటిమంటలకొలువు మీ కరమునగ్ని
జఠరమందగ్ని నెట్లోర్తు శాంతమూర్తి?
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
92
కులముగోత్రమ్ము లేదెట్టి గుణములేదు
నీతిరీతియులేదెట్టి జాతి నీది?
స్థాణువువు కావు జగమేలుజంగముడవు
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
93
మామ తలదీసి మర్యాద మంటగలిపి
వీరతాండవమాడిన వేదవేద్య!
రుద్రుడవు కావగా వీరభద్రుడవిల
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
94
జిలుగు హరిమాయలోజిక్కి చిత్రరీతి
మోసపోతివిగా జగన్మోహిని గని
సోమ సుందర! మోహమే శోభనమ్ము
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
95
జన్మగతమైన కర్మల జాడ్యములను
తొలగద్రోతువు సద్భక్తి తోడ వేడ
ప్రథిత వైద్యనాథుడవను ప్రతిభ వెలయ
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
96
ద్రష్ట వీవైన నటియించు దృష్టి నాది
స్రష్ట వీవైన భోగించు తుష్టి నాది
ఎన్ని జన్మాల బంధమో ఎరుగలేను
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ !
97
ఏదిఖేదమ్ము కానట్టిదీ ప్రపంచ
మెట్టిభేదమ్ము రానట్టి యీశ్వరాజ్ఞ
నిహము లనుభవింప రచించి నిల్పినావు
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
98
వేయిజన్మలనెత్తిన వేదనముల
బాయలేమయ్య నీ దయన్ బడయలేక
వేడ వేములవాడలో భీతితొలగు
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ!
99
భీమ రామేశ్వరారామ ప్రీతితోడ
కాశి కైలాస మెందైన కలవు నీవు
కాటిలోన దాక్షారామవాటిలోన
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ!
100
హరహరాయన పాపముల్ తరిగిపోవు
భవభవాయన క్లేశముల్ భస్మగును
శివశివాయన చింతలే చెదరిపోవు
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ!
101
భోగములనొల్లవైన వైభోగ మిత్తు
వోగిరమునొల్ల కిడు దన్నపూర్ణ భిక్ష
రక్ష ; భోళాశివాధవా ! రాజమౌళి!
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ !
102
మూడుసంద్రాలు తుహినాద్రి మునిగితేల్చి
పానవట్టము లింగమ్ము తానమాడ
నీశ్వరాకృతి భరతోర్వి శాశ్వతముగ
సోమరుద్రేశ నీలీల చోద్యమరయ!
103
ఆత్మలింగమ్ము గోర నేనమృత మొల్ల
అష్టసిద్ధులగోరి నిన్ కష్టపెట్ట
ఊపిరి నిలచుదాక నీ ఊహనిడుము
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ!
104
నీవు మకుటంబు లేనట్టి దేవుడవని
నిత్య సంతోష! భూతేశ! నిగమవేద్య!
నీకు పద్యమకుటమిది; నియతి గొనుము
సోమ రుద్రేశ నీలీల చోద్యమరయ!
105
ఆది కైలాసమునువీడి ఆర్తివినుచు
కాకతీయుల కాలాన కదలి వచ్చి
కొండపాకను వెలిసిన గొప్ప దేవ!
భద్రమిడువాడ! భక్తికిన్ రుద్రదేవ!!
106
కొండపాకను కొలువైన కూర్మిరుద్ర!
సప్త పరివారదేవతల్ సరసనుండ
అభవ! శ్రీ భవానీ సహ విభవముగను
సేవ చేయించు కొనుమభిషేకములను.
107
దత్తభావంబులివియెల్ల రిత్తవోవు
తెగిడినట్లున్న యివియెల్ల పొగడు నతులె
చిత్తశాంతిని సమకూర్చు చిత్తజారి
భద్రమిడవయ్య భక్తుడన్ రుద్రదేవ!!
108
వక్రదంతుని యట్లుగా వలచినన్ను
తొలగ ద్రోయకు నుతులలో దొసగులున్న
కార్తికేయుని రీతిగా కనుమునన్ను
దత్తుడీనాటి వాడొకో దయను గనుము!
స్వస్తి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.