జైశ్రీరామ్.
భక్తవరులైన పాఠకులకు కైమోడ్పులతో చేసుకొనుచున్న విన్నపము.
జగన్మాతకు సంబంధించిన ఈ నా కృతిని మీరెంతయో భక్తితో పఠించుచుందురు. రసానుభూతి పొందుచూ పఠించే మీ మనసునకు నా రచనలో కాని, ముద్రణలో కాని దొర్లెడి లోపములు కంటకప్రాయమై ఆవేదనకు కారణమగుట తటస్థపడవచ్చును. అట్టి దోషములు మీరు గుర్తించినచో ఆ అమ్మవారి విషయముగా గ్రహించి దోషరహితముగా ఉండవలెననే కాంక్షతో నాదృష్టికి మీ కామెంట్ ద్వారా తెలియఁ జేసినచో నా తప్పులను సరిదిద్దుకొనఁగలను. మీ సహాయమును నేనెన్నటికీ మరువను.
తప్పక సహకరిస్తారుకదూ?
నమస్సులు.
ఆంధ్ర పద్య సహిత ప్రతిపదార్థ భావ సహిత సౌందర్యలహరి
పద్యరచన…చింతా రామకృష్ణారావు.
ఓం శ్రీమాత్రే నమః.
పండితాభిప్రాయములు.
అవధాన భారతి. సాహితీ
చతురానన. ఛందో వైవిధ్యనిష్ణాత. ఛందస్సవ్యసాచి. స్వర్ణ కంకణ-కవిగండ పెండేరపు సత్కార
గ్రహీత. విద్వాన్ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు. ఎం.ఏ., విశ్రాంత సంస్కృతాంధ్రోపన్యాసకులు. హైదరాబాద్. 92913 33880.
సంశబ్దనం.
పద్యరచనలోనెన్నెన్ని
మార్గములున్నవో- అన్నింట తన ప్రతిభాపాండితీవైభవముతో నడిచి- తనతో బాటు మరికొందరిని
నడిపించి- శ్రీ భారతీ పద పద్మారాధకులుగా నిలిచిన వారు శ్రీ చింతా
రామకృష్ణారావుగారు.
వీరి చిత్తవీథి యందు
నొక భావన మెరుపుతీగవలె మెరసిన వెంటనే దానినొక రసవత్తర కావ్యముగా రచించి-
తెలుఁగువారికి నందించుట యనునది యొక దీక్షగా తలంచినటుల - వీరు వ్రాసిన కావ్య పరంపరల
ద్వారా మనము తెలిసికొన వచ్చును. వీరి ప్రోత్సాహముతో మరికొందరు పద్య ప్రేమికులు
పద్య రచయితలై వీరివలె గ్రంథములు రచించి భాషాసేవ చేయుచున్నారు.
శ్రీ చింతావారి కలమునుండి
జాలువారిన మరొక అద్భుత కావ్యము 'ఆంధ్రసౌందర్యలహరి." ఇది యనువాద కావ్యము. సాక్షాత్ శంకర స్వరూపమైన
ఆదిశంకరాచార్య విరచితమగు' సౌందర్యలహరి" ని వీరు తెలుగున పద్యకావ్యముగా రచించుటయే కాక మూలశ్లోకములకు తెలుఁగు
ప్రతిపదార్థమును భావమును వ్రాసి మనకునందించినారు.
ఒకరి కావ్యమను మరోకవి
మరియొకభాషలో
ననువదించుటకు - తదనువాద కవికి రెండు భాషలందు తగినంత
పట్టుండవలయును,
మూలకవి భావమును చక్కగా గ్రహించవలెను. ఉన్నదున్నట్టుగా భావ వ్యక్తీకరణ
చేయవలయును. "కాళిదాసు కవిత్వము కొంత- నాకైత కొంత అన్నట్లుగా వ్రాయ కూడదు. సహజ
భావన పాఠకులుమెచ్చు కొనునట్లుండవలెను.
ఏతద్విషయమున శ్రీ చింతావారు
శ్రీశంకరుని భావముననుసరించియే - శ్లోకములకు పద్యములందించినారు. ఆయా ప్రతి పద్యమూ
శంకరుని ప్రతిపాదిత భావమునే ప్రకటీకృతము చేయుచున్నది.
మొదట శ్రీగౌరీ ప్రార్థనాపద్యమునందే
శా. శ్రీమన్మంగళ! శాంభవీ జనని! హృచ్ఛ్రీ చక్ర సంవాసినీ!
సామాన్యుండను, నీ కృపామృత రుచిన్ సౌందర్య సద్వీచికన్
నీమంబొప్పఁ
దెనుంగు చేసెద, నతుల్, నీవే లసద్వాణిగాఁ
బ్రేమన్ వెల్గుము శంకరాత్మ గతితోఁ బ్రీతిన్ గనన్ శంకరుల్.
అంటూ తాను సామాన్యుఁడనని, శ్రీ శంకరుని సౌందర్యలహరి అసామాన్యమని,
ఆంధ్రానువాదము చేయుచుంటినని, నీవే
లసద్వాణిగాఁ బ్రేమన్ వెల్గుమంటూ అనువాదమును ప్రారంభించి-
అమ్మదయతో - అసామన్యమగు రీతిగా పద్యములను వ్రాసి తన ప్రతిభను వినయ మతితో తెలియఁజేసారు.
శంకరభగవత్పాదుల తొలి
శ్లోకమగు “శివశ్శక్త్యా యుక్తో యది భవతి” ని మనోజ్ఞముగ అమ్మా! అంటూ త్రిమూర్తుల కర్తవ్యములను
వారలకబ్బిన శక్తులకు నీవే మూలమనుచు చక్కని పదములతో రచించినారు.
42వ శ్లోకమగు “గతైర్మాణిక్యత్వం…..ధిషణామ్.” ను అనువదించునపుడు పద్యమునందు చూపిన పద
శైలి మూలశ్లోక భావమున కంటె మరింత గొప్పగానున్నది.
60వ శ్లోకమగు “సరస్వత్యాస్సూక్తీ”….కినొనరించిన పద్యానువాదము ప్రశంసనీయము. పద్యమెత్తుగడలోనే
“వాణీ గానసుధాస్రవంతి కుశలత్వప్రాభవంబీవు” అంటూ శ్రీ చింతావారు తనకున్న
సంస్కృతభాషాపాండితీశోభను అసామాన్యమగు రీతిగా మనముందు కనబరిచినారు.
90వశ్లోకమున “దదానే…..చరణతామ్.”
అను శ్లోక అనువాదమునందు తుమ్మెదను సుకాండి యను పదప్రయోగమును
జూపి తమకున్న పర్యాయపద ప్రయోగ చాతురిని ప్రదర్శించినారు.
నివేదనలో సౌందర్యలహరి మరియు తానొనర్చిన పద్యానువాదమునందలి
పద్యములను పాఠకులు చదివినచో కవియైన నన్ను, చదివిన చదువరులనెల్లరను దయతో చూడుమని, ఫలశ్రుతిని
వెల్లడి చేసినారు.
ఇలా వంద శ్లోకములకు వంద పద్యములు, వంద
ప్రతిపదార్థములు, వందభావములను వ్రాసి శ్రీ రామకృష్ణారావు శ్రీ
శంకరుల కృపకు, ఆదిదంపతులైన
పార్వతీపరమేశ్వరుల దయకు పాత్రులైనారు.
*పుంభావ భారతీ* బిరుదుప్రదానము చేయుచు పంచరత్నములు.
కం. చింతా యను పద భావమె
చింతించుట
యగును, మీరు
చిత్తమునందున్
సంతతము
చింత చేయుచు,
సంతసమున
కావ్యమల్లు శక్తుండయితే.
కం. ఎన్నని వ్రాయుదురయ్యా!
ఎన్నగ
మీ ప్రాయ మెంత? యెసగెడు
చిత్తం
బున్నట్టి
శక్తి సంపద
లున్నట్టి
శరీర బలము లునికిన్ గనుమా!
కం. పద్దెములెన్నివిధంబులొ
యద్దెస
మీ గమనముండు, నాలోచనముల్
తద్దిశ
మెరయున్ గావ్యం
బొద్దికతో
వ్రాయబోదురొక్క క్షణానన్.
కం. *పుంభావ భారతీ* యని
సంబోధనతోడ
మిమ్ము చక్కగఁబిలుతున్
బింబోష్ఠివాణి
ఘనధీ
సంబంధయుతుండవౌట
సత్కవివర్యా!
కం. సొంపగునీ బిరుదమ్మున్
సొంపుగ
నే నిచ్చుచుంటి సుందరమతితో
న్నింపుగ
నను మన్నించుచు
కెంపుల
మీ బిరుదపంక్తికిన్ జతనిడుడీ!
చక్రాల లక్ష్మీకాంతరాజారావు
19.10.29
ఆంధ్ర పద్య సహిత సటీక సౌందర్యలహరి
పద్య రచన…చింతా రామకృష్ణారావు.
ప్రార్థన.
శా. శ్రీమన్మంగళ! శాంభవీ జనని! హృచ్ఛ్రీ చక్ర సంవాసినీ!
సామాన్యుండను, నీ కృపామృత రుచిన్ సౌందర్య సద్వీచికన్
నీమంబొప్పఁ
దెనుంగు చేసెద, నతుల్, నీవే లసద్వాణిగాఁ
బ్రేమన్ వెల్గుము శంకరాత్మ గతితోఁ బ్రీతిన్ గనన్ శంకరుల్.
భావము.
ఓ మంగళా! ఓ శాంభవీమాతా! నా హృదయమనెడి శ్రీచక్రమునందు వసియించు తల్లీ! నేను అల్పుఁడను. నీ కృపామృతముయొక్క తేజస్సు చేత సౌందర్యలహరిని తెలుఁగు పద్యములుగా వ్రాయుచున్నానమ్మా. నీకు నమస్కరించెదను. నీవే ప్రకాశవంతమైన వాణిగా శంకరులయొక్క ఆత్మమార్గమున ఆ శంకరులే ఆనందించు విధముగా ప్రకాశింపుము.
తే.గీ. ధరణిఁ బడ్డ పాదములకు ధరణి తానె
చూడనాధారమమ్మరో! శోభనాంగి!
నీదు సృష్టిలో దోషులన్ నీవె కాచి
శరణమొసగంగవలెనమ్మ! శరణు శరణు.
భావము.
భూమిపై పడిన పాదములకు భూమియే ఆధారము. అటులనే నీ సృష్టిలో ఉన్న దోషులను నీవే కాపాడి శరణ మొసగ వలె నమ్మా! నీవే నాకు శరణు.
సౌందర్య లహరి.
శ్రీశంకరభగవత్పాదులు
సమయ యను చంద్రకళను పద్యశతముచేఁ బ్రస్తుతించుచున్నారు.
1 వ
శ్లోకము.
శివశ్శక్త్యా
యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న
చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|
అతస్త్వామారాధ్యాం
హరి హర విరించాదిభి రపి
ప్రణంతుం
స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి ||
శా. అమ్మా! నీ వతఁడై రహించుటనె చేయంగల్గు నీ సృష్టి
తా
నెమ్మిన్, గల్గని
నాడహో, కదలగానే
లేడుగా సాంబుఁ డో
యమ్మా! శంభుఁడు, బ్రహ్మయున్,
హరియు నిన్నర్చించ దీపింత్రు, ని
న్నిమ్మేనన్
దగ నెట్లు కొల్చెదరిలన్ హీనంపుపుణ్యుల్, సతీ! ॥ 1 ॥
ప్రతిపదార్థము.
హే
శివే! = ఓ
పరమేశ్వరీ!
శివః
= శివుడు;
శక్త్యా
= శక్తితో,
యుక్తః
= కూడి యున్నపుడు;
ప్రభవితుం
= సృష్టించుటకు;
శక్తః
= సమర్థుఁడు;
ఏవం
= ఈ విధముగా;
నచేత్
= కాదేని (అనగా శక్తితో కూడి ఉండనిచో),
దేవః
= ఆ శివుడు;
స్పందితుం
అపి = చలించుటకు కూడా;
నకుశలః
= నేర్పరికాడు,
అతః
= ఈ కారణము వలన,
హరిహరవిరించాదిభిరపి
= విష్ణువు, శివుడు, బ్రహ్మ
మొదలగు వారి చేత గూడా;
ఆరాధ్యాం
= పూజింప దగిన;
త్వాం
= నిన్ను గూర్చి,
ప్రణంతుం
= నమస్కరించుటకుగాని;
స్తోతుంవా
= స్తుతించుటకుగాని;
అకృత
పుణ్యః = పుణ్యము చేయనివాడు;
కథం
= ఏ విధముగా;
ప్రభవతి
= శక్తుడగును?
శక్తుఁడు కాలేడమ్మా.
భావము.
అమ్మా, ఓ భగవతీ! సర్వమంగళస్వరూపుడైన
పరమశివుడు, పరాశక్తి అయిన నీతో కూడి ఉన్నప్పుడు మాత్రమే,
సకల సృష్టి నిర్మాణము చేయడానికి సమర్థుఁడై ఉన్నాడు. నీతో కూడి
ఉండకపోతే, అంతటి శుభప్రదుడైన పరమశివుడు సైతం కనీసం కదలడానికి
కూడా అశక్తుడౌతాడు. హరి హర బ్రహ్మాదులచేత మరియు వేదములచేత కూడా ఆరాధింపబడే నీకు
నమస్కారం చేయాలన్నా, స్తోత్రం చేయాలన్నా, కనీసం స్మరించాలన్నా– పూర్వ జన్మలలో చేసుకున్న
పుణ్యబలం లేకపోతే ఎట్లా సాధ్యం అమ్మా!
2 వ శ్లోకము.
తనీయాంసం
పాంసుం తవ చరణ పంకేరుహ భవం
విరించిస్వంచిన్వన్
విరచయతి లోకా నవికలమ్,
వహత్యేనం
శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః
సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిమ్ ||
శా. నీ పాదాంబుజ రేణువున్ గొని, జగన్నిర్మాణ
మా పద్మజుం
డోపున్
జేయఁగ, విష్ణు
వా రజమునే యొప్పార కష్టంబుతో
దీపింపన్
దగ వేయి శీర్షములతో ధీరాత్ముఁడై మోయునే,
యాపాదాబ్జము
దాల్చు రేణువు శివుండత్యంత రాగోన్నతిన్.॥ 2 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ జననీ!
విరించిః
= బ్రహ్మ,
తవ
= నీ యొక్క,
చరణ
పంకేరుహ భవం = పాద పద్మము నందు పుట్టిన,
పాంసుం
= ధూళిని,
తనీయాంసం
= లేశమాత్రమును,
సంచిన్వన్
= గ్రహించుచున్నవాఁడై,
లోకాన్
= చతుర్దశ భువనములను,
అవికలం
= ఏ మాత్రము దెబ్బతినకుండా,
విరచయతి
= సృష్టించుచున్నాడు,
ఏవం
= ఈ లేశ మాత్ర ధూళినే,
శౌరిః
= విష్ణువు,
సహస్రేణ
శిరసాం = (ఆది శేషువుగా) తన వెయ్యి తలలతో,
కథమపీ
= అతికష్టముతో,
పహతి
= భరించుచున్నాడు,
ఏవం
= ఈ లేశ మాత్ర ధూళినే,
హరః
= హరుడు (శివుడు),
సంక్షుద్య
= చక్కగా మెదిపి,
భసీతోద్దూలన
విధిం = విభూతిని పైపూతగా పూసుకొనునట్టు,
భజతి
= సేవించుచున్నాడు.
భావము.
అమ్మా! నీ పాదపద్మములనంటిన లేశమాత్ర ధూళిని గ్రహించి, బ్రహ్మ
ఈ లోకాలన్నింటినీ ఏ విధమైన లోపములు లేకుండా సృష్టి చేయగలుగుతున్నాడు. అలాగే
శ్రీమహావిష్ణువు కూడా నీపాదపద్మములనంటిన లేశమాత్ర ధూళిని గ్రహించి, ఆదిశేషుడి
సహాయంతో ఈ లోకాలన్నిటినీ అతికష్టం మీద మోయుచున్నాడు. నీపాద ధూళి మహిమచే
సృష్టింపబడిన ఈ లోకాలన్నిటినీ శివుడు యుగాంతములలో బాగా మెదిపి, ఆయన
ఒళ్ళంతా విభూతిగా పూసుకొంటున్నాడు.
3 వ శ్లోకము.
అవిద్యానామంతస్తిమిర
మిహిరద్వీపనగరీ,
జడానాం
చైతన్యస్తబక మకరంద స్రుతి ఝరీ,
దరిద్రాణాం
చింతామణి గుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం
దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ||
సీ. అజ్ఞాన తిమిరాననలమటించెడువారి కమిత!
సూర్యోదయమయిన పురివి,
మందబుద్ధులకును
మహిత చైతన్యమన్ మంచి పూవులనొల్కు మధువువీవు,
దారిద్ర్యముననున్న
వారిని కరుణించు చింతామణులహార కాంతివీవు,
సంసారసాగర
సంలగ్నులకునిలన్ ధరణిఁ గాచిన కిరిదంష్ట్రవీవు.
తే.గీ. శంకరుని యాత్మలో వెల్గు శశివి నీవు,
రామకృష్ణుని
కవితాభిరామమీవు,
పాఠకుల
చిత్తముల నిల్చు ప్రతిభవీవు,
నిన్ను
సేవించువారిలోనున్నదీవు.॥ 3 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ జననీ!
ఏషః
= ఏ నీ పాద
ధూళి ఉన్నదో అది
అవిద్యానాం
= అజ్ఞానులకు,
అంతస్తిమిర=
లోపల ఉన్న (అభ్ఞానమను) చీకటికి,
మిహిర
ద్వీపనగరీ = సూర్యుడు ఉదయించు ప్రదేశమునకు చెందిన పట్టణము,
జడానాం
= అలసులగు మంద బుద్ది గలవారికి,
చైతన్య= జ్ఞానమను
స్తబక
= పుష్ప గుచ్చమునుండి వెలువడు,
మకరంద
స్రుతి = తేనె ధారల
యొక్క
ఝరీ
= నిరంతర ప్రవాహము,
దరిద్రాణాం
= దరిద్రుల పట్ల,
చింతామణి
= చింతామణుల
గుణనికా
= వరుస (పేరు)
జన్మజలధౌ
= సంసార సముద్రము నందు,
నిమగ్నానాం
= మునిగి సతమతమగు వారి పట్ల,
మురరిపు
వరాహస్య = వరాహరూపుఁడగు విష్ణుమూర్తియొక్క,
దంష్ట్రా
భవతి = కోరలు అగుచున్నవి.
భావము.
తల్లీ! జగజ్జననీ! నీ పాద పద్మ పరాగము అజ్ఞానుల పట్ల
సూర్యుడుదయించు పట్టణము వంటిది. మంద బుద్ధి గల జడుల పట్ల జ్ఞానమను తేనెను
జాలువార్చు ప్రవాహము వంటిది. దరిద్రుల పట్ల చింతామణుల వరుస వంటిది. సంసార సాగరమున
మునిగి సతమతమగు వారికి, సముద్రమున దిగబడి వున్న భూమిని పైకి ఉద్ధరించిన
విష్ణుమూర్తి అవతారమైన ఆది వరాహవు కోరవంటిది.
4 వ శ్లోకము.
త్వదన్యః
పాణిభ్యామభయవరదో దైవతగణః
త్వమేకా
నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా |
భయాత్
త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం
శరణ్యే
లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ||
సీ. నీకంటెనన్యులౌ నిఖిలదేవతలెన్న నభయముద్రను గల్గి
యలరుదురిల,
శ్రీద!
వరాభయచిహ్నముల్ ప్రకటితముద్రల నభినయము గల తల్లి
వీవేను, ముఖ్యమౌ
యీశ్వరీ! సృష్టిలోఁ గారణమొకటుండెఁ గనగ నిజము,
కోరక
పూర్వమే కోరికలను తీర్చి నీ పాదముల్ భీతినే దహించు,
తే.గీ. అట్టి నీ పాదములు నేను పట్టనుంటి,
శరణు
కోరుచు, మా
యమ్మ! శరణమిమ్మ.
రామకృష్ణుని
కవితలో ప్రాణమగుచు
వెలుఁగు
మాయమ్మ! నిన్ను నే విడువనమ్మ! ॥ 4 ॥
ప్రతిపదార్థము.
లోకానాం
= లోకములకు,
శరణ్యే
= రక్షకురాలవగు,
హే భగవతి
= ఓ తల్లీ,
త్వదన్యః
= నీకంటె వేరైన,
దైవతగణః
= దేవసముదాయము,
పాణిభ్యాం
= చేతులతో,
అభయవరదః
= అభయవరముద్రలను ధరించుచున్నది.
ఏకా
= (ఒక) ముఖ్యురాలగు,
త్వమేవ = నీవుమాత్ర మే,
పాణిభ్యాం
= హ స్తముల చేత,
ప్రకటిత
= వెల్ల డింపఁబడిన,
వరాభీత్యభినయా
= వరాభయవ్యంజక ముద్రలను ధరించుదానవు,
నైవాసి
= కావుగదా,
హీ =
ఇట్లని,
తవ
= నీ యొక్క
చరణా
వేవ= పాదములే,
భయాత్
= భయము నుండి,
త్రాతుం=
కాపాడుట కొఱకున్ను,
వాంఛాసమధికం
= కోరికకి మించిన,
ఫలం
= ఇష్టలాభమును,
దాతుం
= ఇచ్చుటకును,
నిపుణౌ
= నేర్చినవి.
భావము.
సర్వలోకముల వారికి దిక్కైన ఓ జగజ్జననీ! ఇంద్రాది ఇతర
దేవతలందరు తమ రెండు హస్తములందు వరద, అభయ ముద్రలను దాల్చుచుండగా నీవు ఒక్కదానివి నీ
హస్తములతో వాటిని అభినయించకున్నావు. భయము నుండి రక్షించుటకు, కోరిన
వాటిని మించి వరములను ప్రసాదించుటకు – నీ రెండు పాదములే సమర్థములై ఉన్నవి గదా! (మరి
ఇంక హస్తముల అవసరము నీకేల యుండును అని భావము).
5 వ శ్లోకము.
హరిస్త్వామారాధ్య
ప్రణత జన సౌభాగ్య జననీం
పురా
నారీ భూత్వా పురరిపుమపి క్షోభ మనయత్ |
స్మరోఽపి
త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా
మునీనామప్యంతః
ప్రభవతి హి మోహాయ మహతామ్ ||
ఉ. నీ యభయమ్మునొంది హరి నేర్పుగ స్త్రీ
యవతారమెత్తి, తా
మాయను
ముంచె నా శివుని, మన్మథుఁడున్ నినుఁ బూజ చేయుటన్
శ్రేయము
పొందె, భార్య
రతి ప్రేమను చూఱగొనంగఁ గల్గె, సు
జ్ఞేయము
నీ మహత్త్వమిదె, చేసెద నీకు నమశ్శతంబులన్. ॥ 5 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ జననీ!
హరిః
= విష్ణువు,
ప్రణత = నమస్కరించు
జన
= జనులకు,
సౌభాగ్య
జననీం = సౌభాగ్యమును ప్రసాదించు తల్లివైన,
త్వాం
= నిన్ను,
ఆరాధ్య
= ఆరాధించి,
పురా
= పూర్వము ఒకప్పుడు,
నారీ
= స్త్రీ
రూపమును
భూత్వా
= ధరించి,
పురరిపుం
+ అపి = త్రిపుర హరుడైన శివునకు సైతము,
క్షోభం
= చిత్తక్షోభమును,
అనయత్
= కలుగ జేసెను,
స్మరః
+ అపీ = స్మరోఽపి = మన్మథుడు కూడా,
త్వాం
= నిన్ను; (గూర్చి)
నత్వా
= నమస్కరించి, (అనగా
- పూజించి);
రతి = రతీదేవి
నయన
= కన్నులకు
లేహ్యేన
= ఆనందాస్వాదకరమైన,
వపుషా
= చక్కని దేహముతో,
మహతాం
= గొప్పవారైన,
మునీనాం
+ అపి = మౌనముగా తపస్సు గావించు ఋషులను సహితము,
అంతః
= (వారి) మనస్సు లోపల;
మోహాయ
= మోహపరవశులను చేయుటకు,
ప్రభవతి
హి = సమర్హుడగుచున్నాడు కదా.
భావము.
నమస్కారము చేసేవారికి సమస్త సౌభాగ్యములు ప్రసాదించే ఓ
తల్లీ! ముందు నిన్ను హరి ఆరాధించి మోహినీ రూపమును పొంది శివునికి చిత్త క్షోభను
కలిగించాడు. మన్మథుడు నిన్ను ప్రార్థించి రతీదేవి కనులకు లేహ్యము వంటి మేనితో
మునులను మహామోహవశులను చేయగలిగాడు.
6 వ శ్లోకము.
ధనుః
పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః
వసంతః
సామంతో మలయమరు దాయోధనరథః |
తథాప్యేకః
సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగాత్తే
లబ్ధ్వా జగదిదమనంగో విజయతే ||
సీ. హేమాద్రి పుత్రి! నిన్నేమని పొగడుదు, నీ చూపు
పడెనేని నిత్య శుభము
లందగవచ్చును, మందస్మితా!
నీదు కడగంటి చూపునన్ గంతుడిలను
పూలవిల్లే
కల్గి, పూర్తిగా
తుమ్మెదల్ నారిగా కల్గి, యనారతంబు
నైదు
బాణములనే యాయుధాలుగఁ గల్గి, జడుఁడుగా
నుండియు వడివడిగను
తే.గీ. మలయ మారుత రథముపై మసలుచుండి
సృష్టినే
గెల్చుచుండె, నీ
దృష్టి కొఱకు
భక్తులల్లాడుచుంద్రు
నీ ప్రాపుఁ గోరి,
చూచి
రక్షించు, నేనునున్
వేచియుంటి. ॥ 6 ॥
ప్రతిపదార్థము.
హిమగిరిసుతే
= హిమవత్సర్వత రాజపుత్రికా!
ధనుః
= విల్లు,
పౌష్పం
= పుష్పమయమైనది,
మౌర్వీ
= అల్లెత్రాడు,
మధుకరమయీ
= తుమ్మెదలతో కూర్పఁబడినది,
విశిఖాః
= బాణములు,
పంచ
= ఐదుమాత్రమే,
సామంతః
= చెలికాడు,
వసంతః
= రెండు నెలలే ఉండు వసంత ఋతువు,
ఆయోధన
రథః = యుద్ద రథము,
మలయమరుత్
= మలయ మారుతము,
తథాపీ
= ఐనప్పటికీ
అనంగః
= శరీరమే లేని మన్మథుడు,
ఏకః
= ఒక్కడే,
తే
= నీ యొక్క,
అపాంగాత్
= కడగంటి చూపు వలన,
కాం
+ అపి = అనిర్వచనీయమైన,
కృపాం
= దయను,
లబ్ధ్వా
= పొంది,
ఇదం
= ఈ,
సర్వం
జగత్ = సమస్త జగత్తును,
విజయతే
= జయించుచున్నాడు.
భావము.
ఓ హిమవత్పర్వత రాజపుత్రీ! పుష్పమయమైన విల్లు, తుమ్మెదల
వరుసతో కూర్చిన అల్లెత్రాడు, లెక్కకు ఐదు మాత్రమే బాణములు, అల్పాయుష్కుడు-జడుడు
అయిన వసంతుడు చెలికాడు, మలయ మారుతమే రథము. ఇలా ఏ మాత్రము సమర్దములు
కానివగు ఇట్టి సాధన సామగ్రితో కనీసము శరీరము గూడా లేనివాడైన మన్మథుడు నిన్ను ఆరాధించి, అనిర్వచనీయమైన
నీ కరుణా కటాక్షమును పొంది ఈ సమస్త జగత్తును జయించుచున్నాడు కదా!
7 వ శ్లోకము.
క్వణత్కాంచీ
దామా కరి కలభ కుంభ స్తననతా
పరిక్షీణా
మధ్యే పరిణత శరచ్చంద్ర వదనా |
ధనుర్బాణాన్
పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తా
దాస్తాం నః పురమథితు రాహో పురుషికా ||
సీ. మణుల గజ్జియలతో మహనీయ మేఖలన్ మిలమిల కనిపించు
మెఱుపుతోడ,
గున్నయేనుగు
యొక్క కుంభంబులన్ బోలు పాలిండ్ల బరువుచే వంగి యున్న
సన్నని
నడుముతో, శరదిందుముఖముతోఁ, జెరకు
విల్లును, పూలచెండుటమ్ము
నంకుశమ్మును
గల్గి, యరచేతఁ
బాశమ్ము కల్గి చూపులనహంకారమొప్పి
తే.గీ. లోకములనేలు మాతల్లి శ్రీకరముగ
మాకునెదురుగ
నిలుచుత మమ్ము గావ,
జన్మసాఫల్యమొసఁగంగ, సన్నుతముగ
ముక్తి
సామ్రాజ్యమీయంగ పొలుపుమీర. ॥ 7 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ జననీ!
క్వణత్
= చిఱుసవ్వడి చేయు,
కాంచీదామా
= గజ్జెల మొలనూలు గలదియు,
కరి
కలభ = గున్నఏనుగుల,
కుంభ
= కుంభస్తలములతో పోల్చదగిన,
స్తన
= స్తనములచేత,
నతా
= ఇంచుక వంగినట్లుగా కనబడునదియు,
పరిక్షీణా
= కృశించిన,
మధ్యే
= నడుము గలదియు,
పరిణత
= పరిపూర్ణమైన,
శరత్
చంద్ర వదనా = శరదృతువు నందలి పూర్ణిమా చంద్రుని వంటి వదనము గలదియు,
కరతలైః
= నాలుగు చేతులయందు,
ధనుః
= విల్లును,
బాణాన్
= పుష్పమయమైన బాణములను,
పాశం
= పాశమును,
అపి
= మరియు,
సృణి
= అంకుశమును,
దధానా
= ధరించునదియు,
పురమధితుః
= త్రిపురహరుడైన శివుని యొక్క,
ఆహో
పురుషికా = అహంకార స్వరూపిణి యగు జగన్మాత,
నః
= మా యొక్క,
పురస్తాత్
= ఎదుట,
ఆస్తాం
= సాక్షాత్కరించు గాక !
భావము.
చిరుసవ్వడి చేయు గజ్జెల వడ్డాణము గలది, గున్న
ఏనుగు కుంభములను పోలు స్తనములు కలిగి కొద్దిగా వంగినట్లు కనబడునది, సన్నని
నడుము గలది, శరదృతువు
నందలి పరిపూర్ణమైన పూర్ణిమ చంద్రుని పోలే ముఖము గలది, నాలుగు
చేతులయందు వరుసగా ధనుస్సు, బాణములు, పాశము, అంకుశములను
ధరించి యుండునది, శివుని యొక్క శక్తి స్వరూపిణియునగు జగన్మాత
మాకు ఎదురుగా సుఖాసీనురాలై సాక్షాత్కరించుగాక!
8 వ శ్లోకము.
సుధాసింధోర్మధ్యే
సురవిటపి వాటీ పరివృతే
మణిద్వీపే
నీపోపవనవతి చింతామణి గృహే |
శివాకారే
మంచే పరమశివ పర్యంక నిలయాం
భజంతి
త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీమ్ ||
సీ. అమృత సింధువు మధ్య నమరిన రతనాల దీవియందున్నట్టి
దివ్యమైన
కల్పవృక్షంబుల
ఘన కదంబముల పూదోట లోపలనున్న మేటియైన
చింతామణులనొప్పు
శ్రీకరంబైనట్టి గృహములో శివుని యాకృతిగనున్న
మంచంబున
శివుని మంగళోరువు గొప్ప స్థానంబుగాఁ గల జ్ఞానపూర్ణ
తే.గీ. వర దయానందఝరివైన భవ్యరూప!
ధన్య
జీవులు కొందరే ధరను నీకు
సేవ
చేయగాఁ దగుదురు, చిత్తమలర
నిన్ను
సేవింపనీ, సతీ!
నిరుపమాన! ॥ 8 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ జననీ!
సుధాసింధోః
= అమృత సముద్రము యొక్క,
మధ్యే
= నడుమ,
సురవిటపి
= కల్పవృక్షముల యొక్క,
వాటీ
= తోటలచే
పరివృతే
= చుట్టబడిన,
మణిద్వీపే
= మణిమయమైన దీవియందు,
నీప
= కడిమి చెట్ల
ఉపవన
వతి = ఉద్యానము కలిగిన,
చింతామణి
= చింతామణులచే
నిర్మింపబడిన
గృహే
= గృహము నందు,
శివాకారే
= శివశక్తి రూపమైన,
మంచే
= మంచము నందు,
పరమశివ
= సదాశివుడను
పర్యంక
= తొడనే,
నిలయాం
= నెలవుగా గలిగిన,
చిత్
+ ఆనంద + లహరీం = జ్ఞానానందతరంగ రూపమగు,
త్వాం
= నిన్ను,
కతిచన
= కొందరు,
ధన్యాః
= ధన్యులు (మాత్రమే),
భజంతి
= సేవించుదురు.
భావము.
అమ్మా…అమృతసముద్రము మధ్యలో కల్పవృక్షాలతో నిండియున్న
మణిద్వీపంలో, కదంబపుష్ప
వృక్ష తోటలో, చింతామణులతో
నిర్మించిన గృహమునందు, త్రికోణాకారపు మంచము మీద, పరమశివుని
పర్యంకస్థితవై ప్రకాశించుచు, జ్ఞాన స్వరూపమై నిరతిశయ సుఖప్రవాహ రూపముగా ఉన్న
నిన్ను- స్వల్ప సంఖ్యాకులైన ధన్యులు మాత్రమే సేవించుకోగలుగుతున్నారు.
9 వ శ్లోకము.
మహీం
మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం
స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి |
మనోఽపి
భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే
పద్మే సహ రహసి పత్యా విహరసే ||
సీ. పూజ్య పృథ్వీ తత్వముగను మూలాధారముననుండు
తల్లివి ఘనతరముగ,
జలతత్త్వముగ
నీవు కలుగుచు మణిపూర చక్రమందున నొప్పు చక్కనమ్మ!
యగ్ని
తత్త్వమ్ముగానమరి యుంటివిగ స్వాధిష్ఠాన చక్రాన దివ్యముగను,
వాయు
తత్త్వమ్ముగా వరలి యుంటివి యనాహత చక్రమందున నుతిగ జనని!
తే.గీ. యల విశుద్ధచక్రాన నీ వాకసముగ,
మనసువగుచు
నాజ్ఞాచక్రమునను నిలిచి,
మరి
సహస్రారము సుషుమ్న మార్గమునను
చేరి, పతితోడ
విహరించు ధీరవమ్మ! ॥ 9 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ జననీ!
మూలాధారే
= మూలాధార చక్రమునందు,
మహీం
= పృథివీ తత్త్వమును,
మణిపూరే
= మణిపూర చక్రము నందు,
కం
= ఆపస్తత్త్వము, అనగా- జలతత్త్వమును,
స్వాధిష్టానే
= స్వాధిష్థాన చక్రము నందు,
హుతవహం
= అగ్నితత్వమును,
హృది
= హృదయమందలి అనాహత చక్రము వద్ద,
మరుతమ్
= వాయు తత్త్వమును,
ఉపరి
= పైన ఉన్న విశుద్ధ చక్రము నందు,
ఆకాశం
= అకాశతత్త్వమును,
భ్రూమధ్యే
= కనుబొమల నడుమ గల ఆజ్ఞా చక్రము నందు,
మనోఽపి
= మనస్తత్త్వమును గూడా (కలుపుకొని),
కులపథం
= కులమార్గము, అనగా
- సుషుమ్నామార్గమును,
సకలం
+ అపి - సకలమపి =
అంతను కూడ,
భిత్వా
= ఛేదించుకొని చివరకు,
సహస్రారే
- పద్మే = సహస్రార కమలమందు,
రహసి
= ఏకాంతముగా నున్న,
పత్యాసహ
= భర్తయగు సదాశివునితో గూడి,
విహరసే
= క్రీడింతువు.
భావము.
అమ్మా! నీవు సుషుమ్నా మార్గములో మూలాధార చక్రమునందు
భూతత్త్వమును, మణిపూరకమందు
జలతత్త్వమును, అనాహత
మందు వాయుతత్త్వమును, విశుద్ద చక్రమందు ఆకాశతత్త్వమును, ఆజ్ఞా
చక్రమునందు మనోతత్త్వమును చేధించుకొని సహస్రార చక్రమందు నీ భర్తతో ఏకాంతముగా
విహరిస్తున్నావు.
10 వ శ్లోకము.
సుధాధారాసారైశ్చరణయుగళాంతర్విగళితైః
ప్రపంచం
సించంతీ పునరపి రసామ్నాయ మహసః|
అవాప్య
స్వాం భూమిం భుజగ నిభమధ్యుష్ఠవలయం
స్వమాత్మానం
కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి ||
సీ. శ్రీపాదముల నుండి చిందుచుఁ బ్రవహించు
నమృతవర్షంబుతోనలరు నీవు
నిండుగ
డెబ్బది రెండు వేలున్నట్టి నాడీప్రపంచమున్ దడుపుచుండి,
యమృతాతిశయముననలరెడి
చంద్రుని కాంతిని కలుగుచు, కదలుచుండి
మరల
మూలాధార మహిత చక్రము చేరి, స్వస్వరూపంబగు సర్పరూప
తే.గీ. మునను చుట్టగాచుట్టుకొనిన జననివి,
నీవె
కుండలినీశక్తి, నిదురపోవు
చుందువమ్మరో!
మాలోన నుందు వీవె.
వందనమ్ములు
చేసెద నిందువదన! ॥ 10 ॥
ప్రతిపదార్థము.
హే భగవతి! = ఓ జననీ!
చరణ
= పాదముల
యుగళ
= జంట యొక్క,
అంతర్విగళితైః
= మధ్య నుండి స్రవించుచున్న,
సుధా = అమృతము యొక్క
ధార
= ధారయొక్క
ఆసారైః
= వర్షముచేత,
ప్రపంచం
= పంచతత్త్వదేహమును ప్రేరేపించు నాడీ మండలమును,
సించంతీ
= తడుపుచున్నదానవై,
రస
= అమృతము యొక్క
ఆమ్నాయ = గుణాతిశయ రూపమయిన
మహసః
= కాంతులు గల
చంద్రుని నుండి,
స్వాం = స్వకీయమైన
భూమిం
= భూతత్త్వమునకు సంబంధించిన ఆధార చక్రమును,
పునః
= మరల,
ఆవాప్య
= పొంది,
భుజగ
నిభం = సర్పమువలె,
అధ్యుష్ఠ
=
అధిష్ఠింపబడిన
వలయం
= కుండలాకారమైన దానినిగా,
స్వం
= తనదగు
ఆత్మానాం
= నిజ స్వరూపమును,
కృత్వా
= చేసి (అనగా - ధరించి, లేదా - పొంది),
కుహరిణి
= తామర పూవు బొడ్డు వద్దనుండు సన్నని రంధ్రము వంటిదైన,
కుల
(కు = పృథివీ తత్త్వము, ల = లయము నొందు) సుషుమ్నా మూల మందలి,
కుండే
= కమల కందరూపమైన చక్రము నందు,
స్వపిషి
= నిద్రింతువు.
భావము.
తల్లీ! నీపాదద్వయము నుండి జాలువారిన అమృతధారలచే లోకమును
తడుపుదువు. అమృత రూపమగు చంద్రుని వలన, నీ
స్వస్థానము చేరుటకు- పాము వలె నీ నిజరూపమును పొంది సూక్ష్మరంధ్రము గల సుషుమ్నా
ద్వారమున వున్న మూలాధారమందు సర్వదా నిద్రించెదవు.
11 వ శ్లోకము.
చతుర్భిశ్శ్రీకంఠైశ్శివయువతిభిః
పంచభిరపి
ప్రభిన్నాభిశ్శంభోర్నవభిరపి
మూలప్రకృతిభిః |
చతుశ్చత్వారింశద్వసుదల
కలాశ్చ త్రివలయ-
త్రిరేఖభిస్సార్ధం
తవ శరణకోణాః పరిణతాః ||
సీ. శ్రీచక్రమది నాల్గు శివచక్రములు, వాటి
నుండియే విడివడి యున్న శక్తి
చక్రమ్ము
లైదుతోఁ జక్కఁగ నున్నట్టి, సృష్టికి మూలమై చెలగుచున్న
తత్త్వమ్ముతోఁ
గూడి తనరు నీ వాసమౌ శ్రీచక్రమందలి చెలగు కోణ
ములనష్టదళముల
నలపద్మషోడశమును మేఖలాతంత్రముగను, మూడు
తే.గీ. భూపురములును కలిసిన మొత్తమటుల
నలుబదియు
నాలుగంచులు కలిగి యుండె
నమ్మ
నీవాసమపురూపమైనదమ్మ!
నెమ్మి
నిన్ను నేఁ బూజింతునమ్మ నమ్మి. ॥ 11 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి = ఓ జననీ!
చతుర్భిః
= నలుగురైన,
శ్రీ
కంఠైః = శివులచేతను,
శంభోః
= శివుని కంటె
ప్రభిన్నాభిః
=వేరైన,
పంచభిరపి
= ఐదుగురైన,
శివయువతిభిః=
శివశక్తుల చేతను,
నవభిః
= తొమ్మిదిఐన,
మూల
ప్రకృతిభిః అపి = మూల కారణముల చేతను,
తవ
= నీ యొక్క,
శరణ
= నిలయమగు శ్రీ చక్రము యొక్క,
కోణాః
= కోణములు,
వసుదళ
= ఎనిమిది దళముల చేతను,
కలాశ్ర
= పదునాఱు
దళముల చేతను,
త్రివలయ
= మూడు మేఖలల (వర్తుల రేఖల) చేతను,
త్రిరేఖాభిఃసార్థం
= మూడు భూపుర రేఖల చేతను,
పరిణతాః
= పరిణామమును పొందినవై,
చతుశ్చత్వారింశత్
= నలుబది నాలుగు అగుచున్నవి.
భావము.
తల్లీ! నాలుగు శివకోణములు,
తద్భిన్నములైన అయిదు
శక్తికోణములు, తొమ్మిది
మూల ప్రకృతులతోనూ, అష్టదళ పద్మము,
షోదశదళ పద్మము, మేఖలాత్రయము, భూపురత్రయములతో
నీవుండే శ్రీచక్రము 43 త్రికోణములతో అలరారుచున్నది.
12 వ శ్లోకము.
త్వదీయం
సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం
కవీంద్రాః
కల్పంతే కథమపి విరించి ప్రభృతయః |
యదాలోకౌత్సుక్యాదమరలలనా
యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపామపి
గిరిశ సాయుజ్య పదవీమ్ ||
శా.
నీసౌందర్యముపోల్చఁ జాలరు భవానీ! బ్రహ్మసూత్రమ్ములున్
నీ
సౌందర్యము గాంచి యప్సరసలున్ నిన్బోలలేనందునన్
ధ్యాసన్నిల్పి
మహేశ్వరున్ మనములన్ ధ్యానించి తాదాత్మ్యతన్
భాసింపంగను
జూతురైక్యమగుచున్, భక్తిప్రదా! శాంభవీ! ॥ 12 ॥
ప్రతిపదార్థము.
తుహిన
గిరికన్యే = ఓ పార్వతీ!
త్వదీయం
= నీ యొక్క
సౌందర్యం
= అందచందములను,
తులయితుం
= ఉపమానములతో సరిపోల్చి చెప్పుటకు,
విరించి
ప్రభృతయః = బ్రహ్మమున్నగు,
కవీంద్రాః
= కవిశ్రేష్ఠులు సైతము,
కథమపి
= ఏ విధముగను
కల్పంతే
= సమర్థులు
కాకున్నారు
యత్
= ఏ కారణము
వలన అనగా
ఆలోక
= నీ
సౌందర్యమును చూచుట యందలి
ఔత్సుక్యాత్
= కుతూహలము వలన
అమర
లలనాః = దేవతా స్త్రీలు,
తపోభిః
= నియమనిష్టలతో తపస్సు చేసి గూడ,
దుష్ప్రాపాం
అపి = పొంద శక్యము కానిదైనను,
గిరిశ
= శివునితో
సాయుజ్య = సాయుజ్యము,
పదవీం
= పదవిని,
మనసా
= మనస్సుచేత,
యాంతి
= పొందుచున్నారు.
భావము.
అమ్మా! బ్రహ్మ విష్ణు ఇంద్రాది కవీంద్రులు కూడా ఎంత ప్రయత్నించినా
నీ దేహ సౌందర్యముకు సాటి చెప్పలేకపోతున్నారు. దేవతా స్త్రీలు, అప్సరసలు
నీ సౌందర్యము చూచుటకు కుతూహలము కలవారై, నీ అందముతో సాటిరాని వారై, కఠిన
తపస్సులచే కూడా పొందలేని శివసాయుజ్యమును మనస్సుచే పొందుతున్నారు.
13 వ శ్లోకము.
నరం
వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం
తవాపాంగాలోకే
పతిత మనుధావంతి శతశః |
గలద్వేణీబంధాః
కుచకలశ విస్రస్త సిచయాః
హటాత్
త్రుట్యత్కాఞ్చ్యో విగళిత దుకూలా యువతయః ||
శా. కన్నుల్ కాంతి విహీనమై, జడుఁడునై, కాలంబె తాఁ జెల్లెనం
చెన్నంజాలిన
వానిపైన బడినన్ హృద్యంపు నీ చూపహో!
కన్నెల్
చూడగ నెంచి వానిని మదిన్ గాంక్షించుచున్ బయ్యెదల్
క్రన్నన్
జారఁగ, నీవి, మేఖలలు
జారన్, బర్వునన్
వత్తురే ॥ 13 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ అమ్మా!
వర్షీయాంసం
= మిక్కిలి ముసలివాడైనను,
నయన
విరసం = వికారమును గొలుపు కన్నులు గలవాడైనను,
నర్మసు = ప్రణయకామకేళీ విలాసాదుల యందు
జడం
= మోటువాడైనను,
తవ
= నీ యొక్క,
అపాంగాలోకే
= క్రీగంటి అనుగ్రహ వీక్షణమునకు పాత్రమైన,
నరం
= మనుష్యుని (అతడు
మన్మథుని వలె కనబడి) చూచి,
యువతయః
= యౌవతులు,
గళత్
= జాఱుచున్న, (విడివడుచున్న)
వేణీ
= జడల యొక్క
బంధాః
= ముడులు కలవారై;
కుచకలశ
= కడవల వంటి స్తనములపై నుండి,
విస్రస్త
= జాఱిపోయిన,
సిచయాః
= పైట కొంగులు గల వారై,
హఠాత్
= ఆకస్మికముగా,
త్రుట్యత్
=
తెగివిడిపోయిన
కాఞ్చ్యః
= మొలనూళ్ళు గలవారై,
విగళిత
= వీడిపోయిన
దుకూలాః
= పోకముడులు కలవారై;
శతశః
= వందలకొలది,
అనుధావంతి
= అనుసరించి వెంట పరుగెత్తుచుండిరి.
భావము.
తల్లీ! నీ క్రీగంటి చూపుపడిన మానవుడు, అతడు
కురూపియైనా, ముదుసలి
అయినా, సరసమెరుగని
వాడయినా, అలాంటి
వాడిని చూసి- మహా మోహముతో కొప్పులు వీడిపోవగా,
పైట చెంగులు జారిపోవగా, గజ్జెలమొలనూళ్ళు
తెగిపోవగా, ప్రాయములో
ఉన్న వందల కొద్దీ స్త్రీలు అతని వెంటపడతారు. అంటే అమ్మవారి అనుగ్రహము అట్టి
కురూపిని కూడా మన్మధుని వంటి అందగాడిని చేయునని భావము.
14 వ శ్లోకము.
క్షితౌ
షట్పఞ్చాశద్ ద్విసమధిక పఞ్చాశదుదకే
హుతాశే
ద్వాషష్టి శ్చతురధిక పఞ్చాశ దనిలే |
దివి
ద్విష్షట్ త్రింశన్మనసి చ చతుష్షష్టిరితి యే
మయూఖాస్తేషామప్యుపరి
తవ పాదాంబుజయుగమ్ ||
సీ. భూతత్త్వముననొప్పి పూజ్య మూలాధార మున నేబదారు
కిరణములుండ,
జలతత్త్వముననున్న
చక్కని మణిపూరమున నేబదియు రెండు ఘనతనుండ,
నగ్నితత్త్వంబుననలరి
స్వాధిష్ఠానమున నరువదిరెండు ప్రణుతినుండ,
వాయు
తత్త్వము తోడవ ననాహతమునందు నేబది నాలుగుధృతిని యుండ
నాకాశ
తత్త్వాన నలవిశుద్ధమునందు డెబ్బదిరెండు ఘటిల్లి యుండ,
మానస
తత్త్వాన మహిత యాజ్ఞాచక్రముననరువదినాల్గు వినుతినొప్ప
తే.గీ. నట్టి వాని సహస్రారమందునున్న
బైందవ
స్థానమున నీదు పాదపంక
జంబు
లొప్పి యుండును దేజసంబు తోడ,
నట్టి
నిన్ గొల్తునమ్మరో! యనుపమముగ. ॥ 14 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ జననీ!
క్షితౌ
= పృథివీ తత్త్వమునకు చెందిన మూలాధార చక్రమునందు,
షట్‌పఞ్చాశత్
= ఏబది యారు,
ఉదకే
= జలతత్త్వమునకు చెందిన మణిపూర చక్రమునందు,
ద్వి
సమధిక పఞ్చాశత్ = ఏబది రెండును,
హుతాశే
= అగ్నితత్త్వమునకు చెందిన స్వాధిష్ఠాన చక్రమునందు,
ద్వాషష్టిః
= అరువది రెండును,
అనిలే
= వాయు తత్త్యమునకు చెందిన అనాహత చక్రమునందు,
చతురధిక
పఞ్చాశత్ = ఏబది నాలుగును,
దివి
= అకాశతత్త్వమునకు చెందిన విశుద్ధి చక్రమునందు,
ద్విఃషట్
త్రింశత్ = డెబ్బది రెండును,
మనసిచ
= మనస్తత్వమునకు చెందిన ఆజ్ఞా చక్రము నందు,
చతుష్షష్టిః
= అయివది నాలుగును,
ఇతి
= ఈ విధముగా,
యే మయూఖాః
= ఏ కిరణములున్నవో,
తేషాం
= వాటి అన్నిటికిని గూడ,
ఉపరి
= పై భాగమున,
తవ
= నీ యొక్క,
పాదాంబుజయుగమ్
= చరణ కమలముల జంటవర్తించును.
భావము.
ఓ దేవీ! మూలాధారము పృథ్వీతత్త్వముతో కూడినది. అందు కాంతి
కిరణములు 56. మణిపూరకము జలతత్త్వముతో కూడినది. అందు కాంతి కిరణములు 52.
స్వాధిష్టానము అగ్నితత్త్వాత్మకము. అందు కిరణములు 62. అనాహతము వాయుతత్త్వాత్మకము, అందు
కిరణములు 54. విశుద్ధిచక్రము ఆకాశతత్త్వాత్మకము. అందలి మయూఖములు 72.
మనస్తత్త్వాత్మకమగు ఆజ్ఞాచక్రమునందు కిరణములు 64. ఈ వెలుగు కిరణములన్నింటినీ
అధిగమించి, వాటి
పైన నీ చరణ కమలములు ప్రకాశించుచున్నవి.
15 వ శ్లోకము.
శరజ్జ్యోత్స్నా
శుద్ధాం శశియుత జటాజూట మకుటాం
వర త్రాస
త్రాణ స్ఫటికఘుటికా పుస్తక కరామ్ |
సకృన్నత్వా
నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధు
క్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః ||
సీ. శరదిందు చంద్రికల్ సరితూగనంతటి నిర్మలదేహంపు
నెలతవీవు,
పిల్ల
జాబిలి తోడనల్ల జడలతోడ నుతకిరీటమునొప్పు నతివవీవు,
కోరికల్
తీర్చెడి తీరైన వరముద్ర, భయమును బాపు నభయపు ముద్ర,
స్పటిక
మాలను దాల్చి, సన్నుతంబుగ
దివ్య పుస్తకంబును దాల్చి నిస్తులవయి
తే.గీ. యొప్పు నీకు వందనములు గొప్పగాను
చేయు
సజ్జనులకునబ్బు శ్రీకరముగ
మధువు, గోక్షీర, ఫలరస
మాధురులను
మించు
వాగ్ధాటి భువిపైన మేల్తరముగ. ॥ 15 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ జననీ!
శరత్
= శరత్కాలపు
జ్యోత్న్నా
= వెన్నెలవలె,
శుద్ధాం
= నిర్మలమైనదియు,
శశియుత
= నెలవంకరేఖను కూడినదియు నయిన,
జటాజూట
= జుట్టు ముడి అనెడి,
మకుటాం
= కిరీటము గలదియు,
వర = వరద
ముద్రను,
త్రాసత్రాణ
= అభయముద్రయు,
స్పటిక
ఘుటికా = స్పటికములతో కూర్చడిన అక్షమాలయు,
పుస్తక
= పుస్తకమును,
కరాం
= హస్తములందు గలిగినదానిగా,
త్వా
= నిన్ను,
సకృత్
= ఒక్కమారు,
నత్వా
= నమస్కరించిన,
సతాం
= బుద్ధిమంతులకు,
మధు
= తేనె,
క్షీర
= పాలు,
ద్రాక్షా
= ద్రాక్షా ఫలముల,
మధురిమ
= తీయదనమును,
ధురీణాః
= వహించి యున్న మధురాతిమధురమైన,
ఫణితయః
= వాగ్విలాస వైఖరులు,
కథమివ
= ఎట్లు,
సన్నిదధతే
= ప్రాప్తించకుండును?
భావము.
తల్లీ! శరత్కాలపు వెన్నెలవలె శుద్ధమైన తెల్లని కాంతి
కలిగినట్టి, చంద్రునితో
కూడిన జటాజూటమే కిరీటముగా కలిగినట్టి, వరదాభయ ముద్రలను,
స్ఫటిక మాలా పుస్తకములను
నాలుగు చేతులలో ధరించి ఉన్న నీకు, ఒకసారైనా నమస్కరించక సజ్జనులు, కవులు
తేనె, పాలు, ద్రాక్ష
పళ్ళయొక్క మాధుర్యము నిండి యున్న వాక్కులను ఎలా పొందగలరు?
16 వ శ్లోకము.
కవీంద్రాణాం
చేతః కమలవన బాలాతప రుచిం
భజంతే
యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ |
విరించి
ప్రేయస్యాస్తరుణతర శృంగార లహరీ
గభీరాభిర్వాగ్భిర్విదధతి
సతాం రంజనమమీ ||
చం. కవుల మనంబులన్ జలజ గౌరవ సద్వన సూర్యకాంతివౌ
ప్రవర
మనోజ్ఞమౌ నరుణ పావననామ! నినున్ భజించుచున్
బ్రవరులు
బ్రహ్మరాజ్ఞివలె భాసిలు దివ్య రసప్రథాన సు
శ్రవణ
కుతూహలంబయిన జక్కని వాగ్ఝరితో రహింతురే. ॥ 16 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ జననీ!
కవీంద్రాణాం
= కవిశ్రేష్ఠుల యొక్క,
చేతః
= చిత్తములు
అనెడి
కమలవన
= పద్మ వనములకు,
బాలాతపరుచిం
= ఉదయసూర్యుని కాంతి వంటిదగు,
అరుణాం
+ ఏవ = అరుణ యను పేరు గల,
భవతీం
= నిన్ను,
కతిచిత్
= కొందఱు,
సంతః
= ఏ విబుధ జనులు,
భజంతే
= సేవించుదురో
అమీ
= అట్టి వీరు,
విరించి
ప్రేయస్యాః = సరస్వతీ దేవి యొక్క,
తరుణతర
= ఉప్పాంగు పరువపు,
శృంగార
= శృంగార రసము యొక్క,
లహరీ
= కెరటము వలె,
గభీరాభిః
= గంభీరములైన,
వాగ్భిః
= వాగ్విలాసము చేత,
సతాం
= సత్పురుషులకు,
రంజనం
= హృదయానందమును,
విదధతి
= చేయుచున్నారు.
భావము.
తల్లీ! బాల సూర్యుని కాంతి- పద్మములను వికసింపజేసినట్లుగా, కవీంద్రుల
హృదయ పద్మములను వికసింపచేసే నిన్ను, అరుణవర్ణముగా ధ్యానించే సత్పురుషులు-
సరస్వతీదేవి నవయౌవన శృంగార ప్రవాహము వంటి గంభీరమైన వాగ్విలాస సంపదతో, సత్పురుషుల
హృదయములను రంజింపచేసెదరు.
17 వ శ్లోకము.
సవిత్రీభిర్వాచాం
శశిమణి శిలాభంగ రుచిభి
ర్వశిన్యాద్యాభిస్త్వాం
సహ జనని సంచింతయతి యః |
స
కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభి
ర్వచోభిర్వాగ్దేవీ
వదన కమలామోద మధురైః ||
సీ. అనుపమవాక్కునకును మూలహేతువై చంద్రకాంతిమణుల
చక్కనైన
ముక్కల
కాంతులఁ బోలి వశిన్యాది శక్తులతోఁ గూడ చక్కగ నిను
నెవరు
ధ్యానింతురో యిలపైన వారలు మహనీయ సుకవుల మాన్యతయును,
రసవత్తరంబును, రమ్య
సరస్వతీ ముఖపద్మసంభూత పూజ్య వాక్సు
ధామోద
మధుర మహావచనంబులన్ గమనీయమైనట్టి కావ్యకర్త
తే.గీ. యగుట నిక్కంబు,
శాంభవీ! ప్రగణితముగ,
శక్తి
సామర్థ్యముల ననురక్తితోడ
నాకునొసగంగ
వేడెదన్ శ్రీకరముగ
నిన్నుఁ
గవితలన్ వర్ణింప నిరుపమముగ. ॥ 17 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ జననీ!
వాచాం
= వాక్కులకు,
పవిత్రీభిః
= జనక స్థానీయులును,
శశిమణి
శిలా = చంద్రకాంతమణుల,
భంగ
= ముక్కల యొక్క,
రుచిభిః
= కాంతులను పోలెడు,
వశిన్యాదిభిః
సహ = వశినీ మొదలగు శక్తులతో గూడ,
త్వాం
= నిన్ను
యః=
ఎవడు,
సంచితయతి
= చక్కగా ధ్యానించునో
సః
= అతఁడు,
మహతాం
= వాల్మీకి మొదలైన మహాకవుల యొక్క,
భంగి = (రచనల) రీతుల వలె నుండు
రుచిభిః
= రసవంతమైన,
వాగ్దేవీ
వదన కమల = సరస్వతీదేవి ముఖము అనెడు కమలము నందలి,
ఆమోద
= పరిమళముచేత,
మధురైః
= మధురములైన,
వచోభిః
= వాక్సంపత్తితో,
కావ్యానాం
= కావ్యములకు,
కరాభవతి
= రచయితగా
సమర్ధుఁడగు చున్నాడు.
భావము.
జగజ్జననీ! వాక్కులను సృజించు వారు, చంద్రకాంతమణుల
శకలముల వలె తెల్లనైన దేహముల కాంతికలవారు అగు –
వశినీ మొదలగు శక్తులతో కూడిన
నిన్ను ఎవరు చక్కగా ధ్యానించునో వాడు – మహాకవులైన వాల్మీకి కాళిదాసాదుల కవిత్వరచన వలె
మధురమైన, శ్రవణరమణీయమైన, సరస్వతీ
దేవి యొక్క ముఖ కమల పరిమళములను వెదజల్లు మృదువైన వాక్కులతో – రసవంతమైన
కావ్య రచన చేయగల సమర్థుఁడగును.
18 వ శ్లోకము.
తనుచ్ఛాయాభిస్తే
తరుణ తరణి శ్రీసరణిభి
ర్దివం
సర్వాముర్వీమరుణిమ నిమగ్నాం స్మరతి యః |
భవంత్యస్య
త్రస్యద్వన హరిణ శాలీన నయనాః
సహోర్వశ్యా
వశ్యాః కతి కతి న గీర్వాణ గణికాః ||
సీ. తరుణ తరుణి కాంతిఁ దలఁ దన్ను కాంతితో వెలిఁగెడి
నీదైన వెలుఁగు లమరి
యాకాశమున్
భూమినంతటన్ గాంతులు చెలఁగు నా యరుణిమన్ దలచు నెవ్వ
డట్టి
సాధకునకు ననుపమరీతిని బెదరుచూపులతోడ ముదము గదుర
నూర్వశీ
మున్నగు సర్వాంగసుందరుల్ వశముకాకెట్టుల మసలగలరు?
తే.గీ. నిన్ను నిరతంబుఁ గొలిచెడి నిత్యభక్తి
నాకొసంగుము
మాయమ్మ! శ్రీకరముగ,
నీదు
పాద పరాగమే నియతిఁ గొలుపు
నాకుఁ
బ్రాపింపఁ జేయుమో నయనిధాన! ॥ 18 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ అమ్మా!
తరుణ
తరణి = ఉదయ సూర్యుని యొక్క,
శ్రీ
సరణిభిః = కాంతి
సౌభాగ్యమును బోలు,
తే =
నీ యొక్క,
తనుచ్చాయాభిః
= దేహపు కాంతుల చేత,
సర్వా
= సమస్తమైన,
దివం
= ఆకాశమును,
ఉర్వీం
= భూమిని,
అరుణిమ
= అరుణ
వర్ణము నందు,
నిమగ్నాం
= మునిగినదానిగా,
యః
= ఏ సాధకుడు,
స్మరతి
= తలంచుచున్నాడో,
అస్య
= అట్టి సాధకునికి,
త్రస్యత్
= బెదరుచుండు,
వనహరిణ
= అడవి లేళ్ళ యొక్క,
శాలీన
= సుందరము లైన,
నయనా
= కన్నులు
కలిగిన వారు,
గీర్వాణ
గణికాః = దేవలోక వేశ్యలు,
ఊర్వశ్యాసహ
= ఊర్వశి అను అప్సర స్త్రీతో సహా,
కతికతి
= ఎందరెందరో,
న
వశ్యాః భవంతి = లొంగిన వారుగా ఏలకాకుందురు ? అందఱూ వశ్యులగుదురు.
భావము.
జగజ్జననీ! ఉదయించుచున్న బాల సూర్యుని అరుణారుణ కాంతి
సౌభాగ్యమును పోలిన నీ దివ్యదేహపు కాంతులలో- ఈ సమస్తమైన ఆకాశము, భూమి
మునిగి ఉన్నట్లు భావించి ధ్యానించే సాధకునికి- బెదురు చూపులతో ఉండు లేడి వంటి
కన్నులు కలిగిన దేవలోక అప్సర స్త్రీలు ఊర్వశితో సహా వశులవుతారు.
19 వ శ్లోకము.
ముఖం
బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో
హరార్ధం
ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథ కలామ్ |
స
సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతిలఘు
త్రిలోకీమప్యాశు
భ్రమయతి రవీందుస్తనయుగామ్ ||
సీ. శ్రీచక్రముననున్నచిన్మయ బిందువున్ నీముఖసీమగాఁ
బ్రేమఁ గనుచు,
దానిక్రిందను
కుచ ద్వయము నాక్రిందను శివునర్ధభాగమౌ భవుని సతిని,
బిందువు
క్రిందను వెలుఁగు త్రికోణాన క్లీమ్ బీజమున్ మదిన్ లీలఁ గనుచు
నెవరుందురో
వార లెవరినైననుగాని మోహంబులో ముంచి ముగ్ధులవఁగఁ
తే.గీ.
జేయఁ గలుగుదురోయమ్మ! శ్రీకరమగు
దివ్యమైనట్టి
యీ శక్తి భవ్యమైన
నీదు
మేరువుదమ్మరో! నిజము గనిన
నమ్మ!
నీపాదములకు నే నంజలింతు. ॥ 19 ॥
ప్రతిపదార్థము.
హరమహిషి
= శివుని పట్టమహిషివైన ఓ జననీ!
ముఖం
= ముఖమును,
బిందుం
కృత్వా = బిందువుగా చేసి (అనగా - బిందుస్తానమును ముఖముగా ధ్యానించి అని అర్థము),
తస్య
= ఆ ముఖమునకు,
అధః
= క్రిందిభాగమునందు,
కుచయుగం
కృత్వా = స్తనద్వయమును ధ్యానించి,
తత్
= ఆ స్తనద్వయమునకు
అధః
= క్రిందుగా,
హరార్థం
= హరునిలో
అర్థభాగమై యున్నశక్తి రూపమును,(త్రికోణమును)
కృత్వా
= ఉంచి
తత్ర
= అక్కడ,
తే = నీ యొక్క,
మన్మథ
కలాం = కామబీజమును,
యః
= ఏ సాధకుడు,
ధ్యాయేత్
= ధ్యానించునో,
సః=
ఆ సాధకుడు,
సద్యః
= వెనువెంటనే,
వనితా
= కామాసక్తులగు స్త్రీలను,
సంక్షోభం
= కలవరము,
నయతి
ఇతి = పొందించుచుండుట అనునది,
అతిలఘు
= అతిస్వల్ప విషయము,
రవీందు
= 'సూర్యచంద్రులే
స్తనయుగాం
= స్తనములుగా గల,
త్రిలోకీం
అపి = స్వర్గ, మర్త్య, పాతాళలోకములనెడు
స్త్రీని సైతము,
ఆశు
= శీఘ్రముగా,
భ్రమయతి
= అతడు భ్రమింప చేయుచున్నాడు .
భావము.
ఓ మాతా! నీ మోమును బిందువుగా జేసి, దానిక్రిందుగా
కుచయుగమునుంచి, దాని
క్రిందుగా త్రికోణముంచి నీమన్మథకళ నెవడు ధ్యానిస్తాడో, ఆ
ధ్యాన ఫలితంగా కామాసక్తులైన వనితలను కలవరపెడుతున్నాడు. అంతే కాదు ఆ సాధకుడు సూర్య
చంద్రులను స్తనములుగా కలిగిన త్రిలోకిని అనగా స్వర్గ, మర్త్య, పాతాళ
లోకాలనే స్త్రీలను మోహమునకు గురిచేయుచున్నాడు.
20 వ శ్లోకము.
కిరంతీమంగేభ్యః
కిరణ నికురుంబామృతరసం
హృది
త్వా మాధత్తే హిమకరశిలామూర్తిమివ యః |
స
సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్
దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా ||
సీ. ఆపాద మస్తకంబంతటి కిరణాలఁ బ్రసరించు నమృతమ్ము
నసమరీతిఁ
గురిపించుచున్నట్టి
నిరుపమ శశిశిలా మూర్తిగా భావించి స్ఫూర్తితోడ
నే
సాధకుండు నిన్ హితముతోఁ బ్రార్థించునట్టివాఁ డసమానుఁడయిన గొప్ప
గరుడుని
యట్టుల నురగ దంష్ట్రల నుండి వెల్వడు విషమును వింతగాను
తే.గీ. బాపువాఁడగుచుండెను, జ్వరముతోడ
బాధనందువారికి
బాధఁ బాయఁజేయు,
కంటి
చూపుచేఁ దగ్గించఁ గలుగుచుండు
నమ్మ!
నా వందనము లందుకొమ్మ నీవు. ॥ 20 ॥
ప్రతిపదార్థము.
హే మాత! = ఓ జననీ!
యః
= ఏ సాధకుడు,
అంగేభ్యః
= కరచరణాది అవయవముల నుండి,
కిరణ = వెలుగుల యొక్క,
నికురుంబ = సమూహము వలన కలిగిన,
అమృత
రసం = అమృత రసమును,
కిరంతీం
= వర్షించుచున్న,
త్వాం
= నిన్ను,
హృది=
హృదయమునందు,
హిమకర
=
చంద్రకాంతిశిలయొక్క
శిలామూర్తి
+ ఇవ = ప్రతిమవలె,
ఆధత్తే
= ధారణ చేసి ధ్యానించునో,
సః =
ఆ సాధకుడు,
సర్పాణాం
= పాముల యొక్క,
దర్పం
= పొగరును, శాంతింపఁజేయుటయందు
శకుంతాధిప
ఇవ = గరుత్మంతుని వలె,
శమయతి
= శాంతింప చేయుచున్నాడు.
జ్వర=జ్వరతాపముచే
ప్లుష్టాన్
= బాధపడువారిని,
సుధాధార
సీరయా = అమృతమును
శ్రవించు నాడివంటి,
దృష్ట్యా
= వీక్షణము చేత,
సుఖయతి
= సుఖమును కలుగ చేయుచున్నాడు.
భావము.
తల్లీ! అవయవముల నుండి కిరణ సమూహ రూపమున అమృత రసమును
వెదజల్లుతున్న చంద్రకాంత శిలామూర్తిగా నిన్ను హృదయమందు ధ్యానించువాడు, గరుత్మంతుని
వలె సర్పముల యొక్క మదమడచగలడు. అమృతధారలు ప్రవహించు సిరులు గల దృష్టితో జ్వర
పీడితులను చల్లబరచగలడు.
21 వ శ్లోకము.
తటిల్లేఖా
తన్వీం తపన శశి వైశ్వానర మయీం
నిషణ్ణాం
షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం |
మహాపద్మాటవ్యాం
మృదితమలమాయేన మనసా
మహాంతః
పశ్యంతో దధతి పరమానంద లహరీమ్ ||
సీ. మెరుపు తీగను బోలు మేలైన కాంతితోఁ
జంద్రసూర్యాగ్నుల సహజమైన
రూపంబుతోనొప్పి, రూఢిగ
షట్ చక్ర ములపైన నొప్పెడి మూలమైన
వర
సహస్రారాన వరలు నీ సత్ కళన్ గామాదులొందిన క్షాళనమును
మనసులన్
గాంచుచు మహితాత్ము లానంద లహరులందేలుదు రిహము మరచి,
తే.గీ. ఎంత వర్ణించినన్ నిన్నుఁ గొంతె యగును,
శంకరాచార్యులే
కాదు శంకరుఁడును
నిన్ను
వర్ణింపలేడమ్మ! నిరుపమాన
సగుణనిర్గుణసాక్షివో
చక్కనమ్మ! ॥ 21 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ జననీ!
తటిత్
+ లేఖా = మెఱువు తీగవంటి,
తన్వీం
= శరీరము కలదియు,
తపన
శశి వైశ్వానర మయీం = సూర్యచంద్రాగ్ని రూపము కలదియు,
షణ్ణాం
= ఆరు సంఖ్యగలదియు,
కమలానాం
= పద్మముల
యొక్క ( షట్చక్రముల
యొక్క,)
అపి
= మరియు,
ఉపరి
= పై భాగమందు,
మహా
పద్మాటవ్యాం = గొప్పతామర తోటయందు (సహస్రార కమలమందు,)
నిషణ్ణాం
= కూర్చున్న,
తవ
= నీ యొక్క,
కలాం
= సాదాఖ్య బైందవీ కళచే,
మృదిత
= క్షాళనము కావింపబడిన,
మలమాయేన
= కామాది మలినములు,
అనగా
- మాయ, అవిద్య, అహంకారాదులు
గల,
మనసా
= మనస్సు చేత,
పశ్యన్తః
= చూచుచున్న,
మహాంతః
= యోగీశ్వరులు,
పర
మానందలహరీం = ఉత్తవు సుఖానుభవ రసానంద ప్రవాహమును,
దధతి
= పొందుచున్నారు.
భావము.
తల్లీ! భగవతీ! మెరుపు తీగవలె సొగసైన, సూక్ష్మమైన, పొడవైన, ప్రకాశించు
లక్షణము కలిగిన, సూర్య చంద్రాగ్ని స్వరూపమైనది, షట్చక్రాలకు
పైన సహస్రారంలో మహాపద్మాటవిలో కూర్చున్న నీ యొక్క సాదాఖ్య అనే బైందవీ కళను- కామాది
మలినములను పోగొట్టుకున్న మహాపురుషులైన యోగీశ్వరులు ధ్యానించి, మహానంద
ప్రవాహములో ఓలలాడుచున్నారు.
22 వ శ్లోకము.
భవాని
త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం
ఇతి
స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః |
తదైవ
త్వం తస్మై దిశసి నిజసాయుజ్య పదవీం
ముకుంద
బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజితపదామ్ ||
ఉ. అమ్మ! భవాని! దాసుఁడననంటిని, యిట్టుల
నోటివెంట నే
నమ్మ!
భవాని యంటినని యార్ద్ర మనంబున, దేవతాళిచే
నెమ్మిని
సేవలన్ గొనెడి నిత్యవసంత సుపాదపద్మ పీ
ఠమ్మునఁ
జేరఁ జేయుచు నెడందను నన్ గని ముక్తి నిత్తువే. ॥ 22 ॥
ప్రతిపదార్థము.
భవాని!
= ఓ భవునీమాతా!
త్వం
= నీవు,
దాసే = దాసుడనైన,
మయి
= నాయందు,
సకరుణాం
= దయతో కూడిన,
దృష్టిం
= చూపును,
వితర
= ప్రసరింప
చేయుము,
ఇతి
= ఈ ప్రకారముగా,
స్తోతుం
= స్తుతించుటకు,
వాంఛన్
= ఇచ్చగించువాడై,
“భవానిత్వం'
ఇతి = “భవానిత్వం
అని,
కథయతి
= పలుకునో,
తస్మై
= ఆ విధముగా ఉచ్చరించు వానికి,
త్వం
= నీవు,
తదైవ
= ఆ విధముగా ఉచ్చరించుట పూర్తి కాకమునుపే,
ముకుంద
= విష్ణువు,
బ్రహ్మ
= బ్రహ్మదేవుడు,
ఇంద్ర
= దేవేంద్రుడు అనువారి యొక్క,
స్ఫుట
మకుట = స్పష్టముగా కనబడు కాంతివంతమగు కిరీటముల చేత,
నీరాజిత
= హారతి ఇవ్వబడిన,
పదాం
= అడుగులు కల,
నిజ
సాయుజ్య పదవీం = నీ తోడి తాదాత్మ్యము అను పదవిని,
దిశసి
= ఇచ్చెదవు.
భావము.
“తల్లీ! భవానీ! నేను దాసుడను. నీవు నా యందు దయతో కూడిన నీ చల్లని చూపును
ప్రసరింపచేయుము” అని
స్తుతిస్తూ, “భవానీత్వం” అని
మొదలుపెట్టి ఇంకా చెప్పబోయేలోపే వారికి హరి బ్రహ్మేంద్రులు రత్న కిరీటములచే హారతి
పట్టబడు నీ పద సాయుజ్యమును ఇచ్చెదవు.
23 వ శ్లోకము.
త్వయా
హృత్వా వామం వపురపరితృప్తేన మనసా
శరీరార్ధం
శంభోరపరమపి శంకే హృతమభూత్ |
యదేతత్
త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం
కుటిల శశిచూడాల మకుటమ్ ||
సీ. వామ భాగమునందు వరలుచు శివునిలో, సంతృప్తి
కనకేమొ శంభురాజ్ఞి!
మిగిలిన
దేహాన మేలుగా నిలిచినట్లనిపించుచుండెనో యమ్మ! కనఁగ,
నా
మది ముకురాన నీ మాన్య తేజంబు కనిపించునట్టులో కంబు కంఠి!
ఉదయభానుని
తేజమది నీదు దేహంబు నందుండి రవి కోరి పొందియుండు
తే.గీ. నంత చక్కని కాంతితో సుంత వంగి
స్తనభరంబుననన్నట్లు
సన్నుతముగ
మూడు
కన్నులతో వంపు తోడనొప్పె,
నీవు
శివతత్త్వపూర్ణ వో నిరుపమాంబ!. ॥ 23 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ జననీ!
త్వయా
= నీ చేత,
శంభోః
= శివుని యొక్క,
వామం
= ఎడమ భాగమైన,
వపుః
= దేహము,
హృత్వా
= అపహరించి,
అపరితృప్తేన
= సంతుష్టినొందని,
మనసా
= మనస్సు చేత,
అపరం
= రెండవ (కుడి) భాగమైన,
శరీరార్ధం
అపి = శివుని శరీరము యొక్క రెండవ దైనకుడి భాగమును సైతము,
హృతం
= గ్రహింపబడినదిగా,
అభూత్
= ఆయెనని,
శంకే
= సందేహపడెదను,
యత్
= ఏ కారణము వలన,
ఏతత్
= (నా హృదయములో భాసించు) ఈ,
త్వత్
రూపం = నీ దేహము,
సకలం
= వామ దక్షిణ భాగములు రెండును,
అరుణాభం
= ఎఱ్ఱని
కాంతి గలదియు,
త్రినయనం
= మూడు కన్నులతో గూడినదియు,
కుచాభ్యాం
= స్తన యుగ్మముచే,
ఆనమ్రం
= కొద్దిగా ముందుకు వంగినదియు,
కుటిల = వంకరగా నుండు
శశిచూడాల
మకుటం = చంద్రకళచే శిరోమణి గల కిరీటము గలదై ఒప్పుచున్నదియును అగుటవలననే సుమా.
భావము.
తల్లీ! జగజ్జననీ! నీ దేహమంతా అరుణకాంతులు వెదజల్లుతూ, మూడు
కన్నులు గలిగి, స్తనభారముచే
కొద్దిగా వంగినట్లు కనబడుతూ, నెలవంకను శిరోమణిగా కలిగియుండుటను చూడగా – మొదట
నీవు శివుని శరీర వామభాగమును హరించి, అంతటితో సంతృప్తి చెందక, కుడిభాగమైన
శరీరార్ధమును కూడా హరించితివి కాబోలునని సందేహము కలుగుచున్నది.
24 వ శ్లోకము.
జగత్సూతే
ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వన్నేతత్
స్వమపి వపురీశస్తిరయతి |
సదా
పూర్వస్సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివ
స్తవాజ్ఞా
మాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః ||
ఉ. నీ కను సన్నలన్ విధి గణించి సృజించును సృష్టి, విష్ణు
వా
శ్రీకర
సృష్టిఁ బెంచు, హృతిఁ
జేయు శివుండది, కల్పమంతమం
దా
కరుణాత్ముఁడౌ శివుఁడె యంతయు లోనికి చేర్చుకొంచు,
తా
నీ
కను సన్నలన్ మరల నేర్పునఁ జేయఁగఁ జేయు వారిచే. ॥ 24 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ జననీ!
ధాతా
= బ్రహ్మ,
జగత్
= ప్రపంచమును,
సూతే
= సృజించుచున్నాడు,
హరిః
= విష్ణువు,
అవతి
= పాలించి రక్షించుచున్నాడు,
రుద్రః=
రుద్రుడు,
క్షపయతే
= లీనము చేయుచున్నాడు,
ఈశః
= ఈశ్వరుడు,
ఏతత్
= ఈ ముగ్గుఱిని,
తిరస్కుర్వన్
= తిరస్కరించు వాడై,
స్వమపి
= తనదగు,
వపుః
= శరీరమును,
తిరయతి
= అంతర్ధానమును పొందించుచున్నాడు,
సదాపూర్వః
= “సదా? అను
శబ్దము ముందు గల,
శివః
= (సదా) శివుడు,
తదిదం
= (ఈ
చెప్పబడిన) తత్త్వ చతుష్టయమును,
క్షణ
చలితయోః = క్షణ కాలమాత్ర వికాసము గల,
తవ
= నీ యొక్క,
భ్రూలతికయోః
= కనుబొమల యొక్క,
ఆజ్ఞాం
= ఆజ్ఞను,
ఆలంబ్య
= పొంది,
అనుగృహ్ణాతి
= అనుగ్రహంచుచున్నాడు. అనగా మఱల సృజించు చున్నాడు.
భావము.
అమ్మా! నీ లతలవంటి కనుబొమల కదలికనుండి ఆజ్ఞను స్వీకరించి, బ్రహ్మ
ప్రపంచమును సృష్టించును. విష్ణువు పాలించును. రుద్రుడు లయింపజేయును. ఈశ్వరుడు ఈ
త్రయమును తన శరీరమునందు అంతర్ధానము నొందించును. సదాశివుడు నీ కటాక్షమును అనుసరించి
ఈ నాలుగు పనులను మరలా ఉద్ధరించుచున్నాడు.
25 వ శ్లోకము.
త్రయాణాం
దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే
భవేత్
పూజా పూజా తవ చరణయోర్యా విరచితా |
తథా
హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే
స్థితా
హ్యేతే శశ్వన్ముకుళిత కరోత్తంస మకుటాః ||
ఉ. నీదు గుణత్రయంబున గణింప త్రిమూర్తులు
పుట్టిరోసతీ!
నీ
దరి నిల్చి మ్రొక్కిన, గణింతురు వారలు వారికన్నటుల్,
మోదముతోడ
నిన్నుఁ గని పూజ్యముగా మది నిల్పి కొల్తురే,
నీ
దయ కల్గినన్ గలుగు నీ పద పంకజ సేవ మాకిలన్.॥ 25 ॥
ప్రతిపదార్థము.
శివే! = ఓ భవానీ!
తవ
= నీ యొక్క,
త్రిగుణ
జనితానాం = సత్త్వ రజస్తమో గుణముల వలన ఉద్భవించిన,
త్రయాణాం
= ముగ్గుఱైన,
దేవానాం
= బ్రహ్మ, విష్ణు, రుద్రులకు,
తవ
= నీ యొక్క,
చరణయోః
= పాదములందు,
యా పూజా
= ఏ పూజ,
విరచితా
= చేయఁబడినదో,
పూజా
= అదియే పూజగా,
భవేత్
= అగును. (వేరొకటి
పూజ కాదు - అని భావము)
తథాహి
= ఇది యుక్తము, (ఏలననగా)
త్వత్పాద
= నీ పాదములను,
ఉద్వహన = వహించుచున్న,
మణిపీఠస్య
= రత్న పీఠము యొక్క,
నికటే
= సమీపము నందు,
శశ్వత్
= ఎల్లపుడూ,
ముకుళిత
= మోడ్చబడిన
కర
= హస్తములే,
ఉత్తంస
= శిరోభూషణముగాగల,
మకుటాః
= కిరీటములు గలవారై,
ఏతే
= ఈ త్రిమూర్తులు,
స్తితాః
= వర్తించుచున్నారు కాబట్టి.
భావము.
తల్లీ! నీ సత్త్వరజస్తమోగుణములచేత జనించిన బ్రహ్మ విష్ణు
రుద్రులు ముగ్గురూ, నీవు పాదములుంచెడి మణిపీఠమునకు దగ్గరగా చేతులు
జోడించి, శిరస్సున
దాల్చి ఎల్లప్పుడు నిలిచి ఉండెదరు. అందువలన నీ పదములకు చేసే పూజ త్రిమూర్తులకు
కూడా పూజ అగుచున్నది.
26 వ శ్లోకము.
విరించిః
పంచత్వం ప్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం
కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ |
వితంద్రీ
మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశా
మహాసంహారేఽస్మిన్
విహరతి సతి త్వత్పతి రసౌ ||
చం. కలిగెడి యా మహా ప్రళయ కాలమునందున బ్రహ్మ, విష్ణు
రు
ద్రులు, యముఁడున్, గుబేరుఁడు, నరుల్దివిజాధిపుడింద్రుడున్, మునుల్,
కలియుటనిక్కమెన్నగను
కాలగతిన్, గమనించి
చూడగన్
గలియుచు
నిన్ను గూడి కరకంఠుడు తాను సుఖించునేకదా. ॥ 26 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ జననీ!
విరించిః
= బ్రహ్మ
పంచత్వం
= మరణమును,
ప్రజతి
= పొందుచున్నాడు,
హరిః
= విష్ణువు,
విరతిం
= విశ్రాంతిని,
ఆప్నోతి
= పొందుచున్నాడు,
కీనాశః
= యముడు,
వినాశం = వినాశమును
భవతి
= పొందుచున్నాడు.
ధనః
= కుబేరుడు,
నిధనం
= మరణమును,
యాతి
= పొందుచున్నాడు.
మాహేంద్రీ
= ఇంద్రునికి సంబంధించిన,
వితతిః
అపి = పరివారము గూడ,
సమ్మీలితదృశా
= కనులు మూతపడి,
వితంద్రీ
= నిద్రాణమగుచున్నది.
హే
సతి! = ఓ సతీ!
అస్మిన్
= ఈ కనబడు ప్రపంచము,
మహా
సంహారే = మహా ప్రళయము పొందునపుడు,
త్వత్
= నీ యొక్క,
పతి
= భర్త అయిన,
అసౌ
= ఈ సదాశివుడు మాత్రము
విహరతి
= ఏ మార్పునకు గుఱికాక క్రీడించుచున్నాడు.
భావము.
తల్లీ! జగజ్జననీ! ఈ ప్రపంచమునకు మహా ప్రళయము సంభవించినపుడు
బ్రహ్మదేవుడు, విష్ణువు, యముడు, కుబేరుడు, చివరకు
ఇంద్రుడు – వీరందరూ
కాలధర్మము చెందుచున్నారు. కాని, ఓ పతివ్రతామతల్లీ ! నీ భర్త అయిన సదాశివుడు
మాత్రము, ఎట్టి
మార్పులకు గురికాకుండా నిరంకుశుడై విహరించుచున్నాడు గదా!
27 వ శ్లోకము.
జపో
జల్ప శ్శిల్పం సకలమపి ముద్రా విరచనా
గతిః
ప్రాదక్షిణ్య క్రమణ మశనాద్యాహుతి విధిః |
ప్రణామ
స్సంవేశః సుఖమఖిలమాత్మార్పణ దృశా
సపర్యా
పర్యాయస్తవ భవతు యన్మే విలసితమ్ ||
శా. నా సల్లాపము లీకు మంత్రజపముల్, నా
హస్త విన్యాసముల్
భాసించున్
దగ నీకు ముద్రలగు, నా పాదప్రవృత్తుల్ సతీ!
ధ్యాసన్
జేయు ప్రదక్షిణల్, కొనెడు నాహారంబులే యాహుతుల్,
నా
సౌఖ్యాదులు పవ్వళింత సుఖముల్ నా నీకు సాష్టాంగముల్. || 27 ||
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ తల్లీ!
ఆత్మ
+ అర్పణ + దృశా = ఆత్మ సమర్పణ బుద్ధితో, అనగా - సర్వమును పరమాత్మకు సమర్శించుచున్నానను
బుద్దితో,
జుల్పః
= నేను చేయు సల్లాపమే,
జపః
= నీకు చేయు జపము;
శిల్పం
= నేను చేయు క్రియా కలాపములు,
సకలం
= సమస్తమును,
ముద్రా
విరచనా = నీకు చేయు ముద్రలు,
గతిః = నా
గమనములు,
ప్రాదక్షిణ్య
క్రమణం = నీకు చేయు ప్రదక్షిణలు;
అశనా
+ అది = చేయుచున్న
భోజనాదులు,
ఆహుతి
విధిః = నీకు సమర్పించు హవిస్సులు;
సంవేశః
= నేను నిద్రించునపుడు దొర్లుటయే,
ప్రణామః
= నీకు చేయు సాష్టాంగ ప్రణామములు;
అఖిలం
= సమస్తమైన,
సుఖం
= సుఖకరమైన,
విలసితం
= నా విలాసములు,
తవ
= నీకు,
సపర్యా
పర్యాయః = పరిచర్యలు గా అయి నీ పూజయేఅగుగాక!
భావము.
తల్లీ! నా మాటలన్నీ నీ జపముగా, నా
కార్యకలాపమంతయూ నీకు అర్పించే ముద్రలుగా, నా గమనము అంతా నీ ప్రదక్షిణగా, నేను
భుజించేదంతా నీకు ఆహుతిగా, నిద్రించేటప్పుడు, పరుండినప్పుడు
జరుగు దేహములోని మార్పులు- నీకు సాష్టాంగ ప్రణామములుగా, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది
సుఖములు నేను ఆత్మార్పణ బుద్దితో చేసే నీ పూజలుగా అగుగాక.
28 వ శ్లోకము.
సుధామప్యాస్వాద్య
ప్రతి భయ జరా మృత్యు హరిణీం
విపద్యంతే
విశ్వే విధి శతమఖముఖాద్యా దివిషదః |
కరాళం
యత్ క్ష్వేలం కబలితవతః కాలకలనా
న
శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా ||
మ. సుధ సేవించియు మృత్యువొందుదురుగా సోలంగ నా
కల్పమా
విధి
యింద్రాదులు, కాలకూట
విషమున్ విశ్వేశుఁడే త్రాగియున్
వ్యథనే
పొందడు, నిన్నుఁ
జేరి మనుటన్, భాస్వంత
తాటంకముల్
సుధలన్
జిందుచు రక్షణన్ గొలుపనో, శుభ్రాంతరంగప్రభా! ॥ 28 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ తల్లీ!
విధి
= బ్రహ్మ
శతమఖ
= ఇంద్రుడు,
ముఖాద్యాః
= మొదలగు ముఖ్యమైన,
విశ్వే = సృష్టిలో ఉన్న
దివిషదః
= దేవతలు,
ప్రతిభయ
= మిక్కిలి
భయంకరములయిన
జరామృత్యు = జరామరణములను
హరిణీం
= పోగొట్టునది
అయిన,
సుధా
= అమృతమును,
ఆస్వాద్య
అపి = త్రాగినవారై కూడా,
విపద్యంతే
= కాలధర్మము చెందుచున్నారు.
కరాళం
= భయంకరమైన,
యత్
క్ష్వేలం = ఏ కాలకూటవిషమున్నదో,
కబళితవతః
= అది భక్షించినను,
శంభోః
= (నీపతియైన) శివునకు,
కాలకలనా
= కాలధర్మము,
న = సంభవించ
లేదు,
తత్
మూలం = దానికి కారణము,
తవ
= నీ యొక్క
తాటంక
మహిమా = చెవికమ్మల ( కర్ణాభరణముల) ప్రభావమే,
భావము.
తల్లీ ! భయంకరమైన జరామృత్యువులను పరిహరించు అమృతమును త్రాగి
కూడా బ్రహ్మేంద్రాది దేవతలందరూ మృతి చెందుతున్నారు. కానీ నీ భర్త అయిన శివునకు-
కాలకూటము భుజించినప్పటికీ కల్పాంతములందు కూడా చావు లేడు. దానికి కారణము నీ
కర్ణాభరణములయిన తాటంకముల మహిమయే.
29 వ శ్లోకము.
కిరీటం
వైరించం పరిహర పురః కైటభభిదః
కఠోరే
కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటమ్ |
ప్రణమ్రేష్వేతేషు
ప్రసభముపయాతస్య భవనం
భవస్యాభ్యుత్థానే
తవ పరిజనోక్తి ర్విజయతే ||
సీ. విధికిరీటంబిది పదిలంబుగా నీవు తప్పించుకొని
నడు, తగులకుండ,
హరి
కిరీటంబది, యటు
కాలు మోపకు, కాలుకు
తగిలిన కందిపోవు,
నింద్రమకుటమది, యిటుప్రక్క
పోబోకు, తగిలినచో
బాధ తప్పదమ్మ,
ప్రణమిల్లుచుండిన
భక్తుల మకుటమ్ము లనుచుపరిజనంబులనెడివాక్కు
తే.గీ. లటకు నరుదెంచుచున్న నీ నిటలనయను
నకు
పరిజనులముందున నయతనొప్పి
రాజిలుచును
సర్వోత్కర్షతో జయంబు
గొల్పును
సదాశివునిగొల్చు కూర్మి జనని! || 29 ||
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ తల్లీ!
పురః
= ఎదుట,
వైరించం
= బ్రహ్మకు సంబంధించిన,
కిరీటం
= కిరీటమును,
పరిహర
= తొలఁగ జేయుము,
కైటభ
భిదః = కైటభుడను రాక్షసుని వధించిన విష్ణుమూర్తి యొక్క,
కఠోరే
= కఠినమయిన,
కోటీరే
= కిరీటము అంచులందు తాకి,
స్థలసి
= జాఱెదవేమో,
జంభారి
= దేవేంద్రుని
మకుటమ్
= కిరీటమును,
జహి
= వదలి దూరముగా నడువుము - అని ఈ విధముగా
ఏతేషు
= బ్రహ్మేంద్రాదులు
ప్రణమ్యేషు
= మోకరిల్లుచుండగా,
భవనం
= నీ మందిరమునకు,
ఉపయాతస్య
= వచ్చిన,
భవస్య
= నీ పతియగు పరమేశ్వరునికి,
ప్రసభ
= వెంటనే,
తవ
అభ్యుత్థానే = నీవు ఎదురు వెళ్ళు సమయమందు,
తవ
= నీ యొక్క,
పరిజన
+ ఉక్తి = సేవికల వచనము,
విజయతే
= సర్వోత్కర్షతో
విరాజిల్హుచున్నది.
భావము.
మాతా! నీ మందిరమునకు నీ పతియగు పరమేశ్వరుడు వచ్చిన తరుణములో, నీవు
వెనువెంటనే స్వాగత వచనములతో ఎదురేగి, ఆయనను పలుకరించుటకు లేచి ముందుకు సాగు
ప్రయత్నములోనుండగా – దారిలో నీకు సాష్టాంగ దండప్రణామము లాచరించు
స్థితిలోనున్న బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదుల యొక్క కిరీటములు- నీ పాదములకు అడ్డు
తగులుతాయి అన్న ఉద్దేశ్యముతో- వీటిని జాగ్రత్తగా దాటుతూ నడువుమని చెప్పే నీ
పరిచారికల మాటలు ఎంతో గొప్పవిగా ఉన్నవి.
30 వ శ్లోకము.
స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితో
నిషేవ్యే
నిత్యే త్వా మహమితి సదా భావయతి యః |
కిమాశ్చర్యం
తస్య త్రినయన సమృద్ధిం తృణయతో
మహాసంవర్తాగ్నిర్విరచయతి
నీరాజనవిధిమ్ ||
శా. అమ్మా! నిత్యవు, నీ పదాబ్జ జనితంబౌ కాంతులే సిద్ధులో
యమ్మా! వాటికి మధ్యనున్న నిను
తామంచెంచు భక్తుండు తా
నెమ్మిన్
సాంబు సమృద్ధినైన గొనఁ డా నిత్యాత్మునే యెన్నుచున్
సమ్మాన్యంబుగ
హారతిచ్చతనికిన్, శంభుస్థ కాలాగ్నియున్. 30.
ప్రతిపదార్థము.
నిత్యే
= ఆద్యంతములు లేని తల్లీ !,
నిషేవ్యే
= చక్కగా సేవింపదగిన మాతా!
స్వదేహ
+ ఉద్భూతాభిః = (తన)నీకు సంబంధించిన దేహము నుండి, (అనగా
- ప్రస్తుతము పాదముల నుండి)ఉద్భవించినట్టి,
ఘృణిభిః
= కిరణములతోడను,
అణిమా
+ ఆద్యాభిః = అణిమాగరిమాది అష్టసిద్ధులతోడను,
అభితః
= చుట్టును ఉండు వానితోడను, (కూడి),
త్వాం
= (ఉన్న) నిన్ను,
అహం
ఇతి = నేను
అను అహంభావన చేత,
సదా
= ఎల్లవేళల,
యః
= ఏ సాధకుడు,
భావయతి
= ధ్యానము
చేయునో,
త్రినయన
సమృద్ధిం = సదాశివుని యొక్క ఐశ్వర్యమును,
తృణయత
= తృణీకరించుచున్న గడ్డి పోచవలె నెంచుచున్న,
తస్య
= ఆ సాధకునికి,
మహా
సంవర్త + అగ్ని = మహా ప్రళయాగ్ని,
నీరాజన
విధిం = నీరాజనమును,
కరోతి
= ఇచ్చుచున్నది
(అని అనుటలో),
కిం
ఆశ్చర్యం = ఏమి ఆశ్చర్యము ఇది ?
భావము.
అమ్మా! నిత్యురాలవగు నీ చరణములనుండి ఉద్భవించిన కాంతులతో, అణిమ, మహిమా
మొదలైన అష్ట సిద్ధులతో కూడిన నిన్ను “నీవే నేను”
అనే భావముతో, నిత్యమూ
ధ్యానము చేయు భక్తుడు ముక్కంటి అయిన శివుని ఐశ్వర్యమును కూడ తృణీకరించగలడు. ఇక
వానికి ప్రళయకాలాగ్ని నీరాజనమువలె అగుచున్నదనుటలో ఆశ్చర్యమేమున్నది?
31 వ శ్లోకము.
చతుష్షష్ట్యా
తంత్రై స్సకలమతిసంధాయ భువనం
స్థితస్తత్తత్సిద్ధి
ప్రసవ పరతంత్రైః పశుపతిః
పునస్త్వన్నిర్బంధాదఖిల
పురుషార్థైక ఘటనా
స్వతంత్రం
తే తంత్రం క్షితితల మవాతీతరదిదమ్ ||
సీ. అరువదినాల్గైన యపురూప తంత్రముల్ ప్రభవింపఁ
జేసెను భవుఁడు తలచి,
యొక్కొక్కటొక్కొక్కటొప్పుగానొరలించి
కోరిన విధముగా దారి చూపి,
హరుఁడు
విశ్రమమొంది, హరుపత్నియౌ
దేవి హరుని యాజ్ఞాపింప వరలఁజేసె
శ్రీవిద్యననితరచిద్భాసమగు
విద్య, విశ్వమందున
బ్రహ్మ విద్య కలుగ
తే.గీ. నాత్మనే దెల్పెడి దరయ నాత్మ విద్య,
రెంటికిసమన్వయముగూర్చి
శ్రేయమునిడు
నట్టిదగు
విద్య శ్రీవిద్య, పట్టినేర్పె,
ముక్తి
నిడునట్టి యీ విద్య పూజ్య శివుఁడు. ॥ 31 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ తల్లీ!
పశుపతిః
= శివుడు,
సకలం
భువనం = సమస్త ప్రపంచమును,
తత్‌తత్
= ఆయా,
సిద్ది = సిద్ధులయొక్క,
ప్రసవ = ఉత్పత్తి యందు,
పరతంత్రైః
= ఇష్టపడునవైన,
చతుష్షష్ట్యా
= మహామాయాశాంబరాదులగు అటువదినాలుగు సంఖ్యగల,
తంత్రైః
= తంత్ర గ్రంథముల చేత,
అతిసంధాయ
=మోసపుచ్చ దాచిపెట్టి,
స్థితః
= స్థిమితముగా నుండెను.
పునః=
మఱల,
త్వత్
= నీ
నిర్భంధాత్
= నిర్భంధము వలన,
అఖిల
= సమస్తమైన
పురుషార్ధ
= చతుర్విధ పురుషార్ధములను,
ఏక ఘటనా
= ముఖ్యముగా సమకూర్చుట యందు,
స్వతంత్రం
= స్వతంత్రమైన,
తే=
నీయొక్క,
తంత్రం
= శ్రీ విద్యా తంత్రమును,
ఇదం
= ఈ చెప్పబడుచున్న దానిని,
క్షితి
తలం = భూతల
వాసులనుద్దేశించి,
అవాతీతరత్
= అవతరింప జేసెను.
భావము.
తల్లీ! జగజ్జననీ! పశుపతి అయిన శివుడు, జీవులను
తృప్తి పరచడానికి వివిధ ప్రక్రియలతో వివిధ ఫలితాలనిచ్చు 64 రకముల తంత్రములను ఈ
లోకమునకు ఇచ్చి, జీవులను మోహవ్యావాహములలో చిక్కుకొనునట్లు చేయగా
– ఆ
విధముగా మోహమునందు పడకుండుటకు బిడ్డలైన జీవులయందు వాత్సల్యముతో – నీవు
నీ భర్త అయిన శివుని ప్రేమతో నిర్బంధ పెట్టగా –
పరమ పురుషార్థ ప్రదమైన-
నీదైన శ్రీవిద్యాతంత్రమును, ఈ భూలోక వాసులకు ప్రసాదింపజేసితివి.
32 వ శ్లోకము.
శివః
శక్తిః కామః క్షితిరథ రవి శ్శీతకిరణః
స్మరో
హంస శ్శక్రః తదను చ పరా మార హరయః |
అమీ
హృల్లేఖాభిస్తిసృభిరవసానేషు ఘటితాః
భజంతే
వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ ||
మ. శివుఁడున్ శక్తియు కాముఁడున్ క్షితియు నా
శీరుండు, చంద్రుండు, చి
ద్భవుఁడున్,
హంసయు, శక్రుఁడున్, గన
ఘనంబౌ తత్ పరాశక్తియున్,
భవుడౌ
మన్మథుఁడున్, దగన్
హరియు, నీ
భవ్యాళి సంకేత స
ద్భవ
హృల్లేఖలు చేరగాఁ దుదల, నీ భాస్వంత మంత్రంబగున్. ॥ 32 ॥
ప్రతిపదార్థము.
జనని!
= ఓ మాతా!,
శివః
= శివుడు (కికారము)
శక్తిః
= శక్తి (ఏ కారము)
కామః
= మన్మథుడు (ఈ కారము)
క్షితిః
= భూమి (పి కారము)
అథః
= తర్వాత,
రవిః
= సూర్యుడు (హి కారము)
శీతకిరణః
= చంద్రుడు (సి కారము)
స్మరః
= మన్మథుడు (కి కారము)
హంసః
= సూర్యుడు (హః కారము)
శక్రః
= ఇంద్రుడు (ల కారము);
తత్
+ అనుచ = వానికి తర్వాత,
పరా
= పరాశక్తి (సి కారము)
మారః
= మన్మథుడు (కి కారము)
హరిః
= విష్ణువు (లి కారము)
అమీ
= (ఈ మూడు వర్గములుగానున్న) ఈ వర్ణములు,
త్రిస్పభిః
= మూడైన,
హృల్లేఖాభిః
= హ్రీం కారముల చేత,
అవసానేషు
= వర్గాంతములందు,
ఘటితాః
= కూడినదై,
తే =
ఆ,
వర్గాః
= అక్షరములు,
తవ
= నీ యొక్క,
నామ
+ అవయవతాం = అవయవములగుటను, అనగా
- మంత్ర స్వరూపవుగుటను,
భజంతే
= పొందుచున్నవి.
భావము.
ఓ జననీ! శివుడు,
శక్తి మన్మథుడు, భూమి
– ఈ
నలుగురూ వరుసగా సూచించు క, ఏ, ఈ, ల – అను అక్షర కూటము;
సూర్యుడు, చంద్రుడు, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు –
ఈ ఐదుగురు వరుసగా సూచించు హ, స్మ, కృ
హ, ల-
అను అక్షర కూటము, పరాశక్తి, మన్మథుడు, హరి – ఈ ముగ్గురు వరుసగా ‘సూచించు
స, క, ల – అను
అక్షర కూటములు –
వాటి అంతము నందలి విరామ స్థానములందు – “హ్రీం” కారముల
చేత సమకూర్చబడినపుడు ఏర్పడు ఆ మూడు కూటములలోని మొత్తము 15 అక్షరములు ‘ఓ
జగజ్జననీ! నీ పంచదశాక్షరీ మంత్ర స్వరూపమునకు అవయవములుగా భాసించుచున్నవి.
33 వ శ్లోకము.
స్మరం
యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనో
ర్నిధాయైకే
నిత్యే నిరవధి మహాభోగ రసికాః |
భజంతి
త్వాం చింతామణి గుణనిబద్ధాక్ష వలయాః
శివాగ్నౌ
జుహ్వంతః సురభిఘృత ధారాహుతి శతైః ||
మ. స్మర బీజంబును,
యోని బీజమును, శ్రీ
మాతృప్రభా బీజమున్,
వరలన్
నీదగు నామమంత్రములకున్ ప్రారంభమున్ నిల్పుచున్
వరచింతామణి తావళాంచితులు సద్భావుల్ శివాగ్నిన్, నినున్,
బరమానందము
తోడఁ జేయుదురు సద్భావంబుతో హోమమున్, ॥ 33 ॥
ప్రతిపదార్థము.
నిత్యే
= శాశ్వతమైన ఓ తల్లీ !,
తవ
= నీ యొక్క,
మనోః
= మంత్రమునకు,
ఆదౌ
= మొదటను,
స్మరం
= కామరాజ బీజమును (క్లీం),
యోనిం=
భువనేశ్వరీ బీజమును (హ్రీం),
లక్ష్మీం
= శ్రీ బీజమును (శ్రీం),
ఇదం
= ఈ
మూడింటిని
నిధాయ
= చేర్చి,
ఏకే
= కొందఱు మాత్రము,
నిరవధిక
= హద్దులులేని,
మహాభోగ
= దొడ్డదైన ఆనందానుభవము యొక్క,
రసికాః=
రసజ్ఞులు,
చింతామణి
= చింతామణుల యొక్క,
గుణ
= సరముల చేత,
నిబద్ధ
= కూర్చబడిన,
అక్షవలయాః
= అక్షమాలలు గలవారై,
శివా
+ అగ్నౌ = శివాగ్ని యందు, (అనగా స్వాధిష్ఠా గ్నియందుంచి)
త్వాం
= నిన్ను, సహస్రారము
నుండి హృదయ కమల మందు నిల్పి,
సురభి
= కామధేనువు యొక్క,
ఘృత
= నేయి యొక్క,
ధారా
= ధారల చేత,
ఆహుతి
= ఆహుతల యొక్క,
శతైః
= పలు మారులు,
జుహ్వాంతః
= హోమము చేయుచు,
భజంతి
= సేవించుచున్నారు.
భావము.
ఓ నిత్యస్వరూపిణీ! రసజ్ఞులు,
సమయాచారపరులు అయిన కొంతమంది
యోగీంద్రులు- నీ మంత్రమునకు ముందు కామరాజ బీజమును,
భువనేశ్వరీ బీజమును, శ్రీ
బీజమును చేర్చి చింతామణులతో కూర్చిన జపమాలికను బూని,
కామధేనువు యొక్క ఆజ్యధారలతో
నిత్యస్వరూపురాలవైన నిన్ను- తమ హృదయ కమలములందు నిలిపి హోమము చేస్తూ, నిన్ను
సంతృప్తి పరుస్తూ తాము నిరుపమాన, శాశ్వత సుఖానుభవమును పొందుతున్నారు.
34 వ శ్లోకము.
శరీరం
త్వం శంభోశ్శశిమిహిరవక్షోరుహయుగం
తవాత్మానం
మన్యే భగవతి నవాత్మానమనఘమ్ |
అతశ్శేషశ్శేషీత్యయముభయసాధారణతయా
స్థితస్సంబంధో
వాం సమరసపరానందపరయోః ||
చం. శివునకు దేహమీవెగ, ప్రసిద్ధిగ
నీవల సూర్య చంద్రులన్
గవలిగ
వక్షమందుఁ గల కాంతవు, నిన్ శివుఁడంచు నెంచినన్
బ్రవిమల
శేషి యా శివుఁడు, వర్ధిలు శేషము నీవె చూడగా,
భవుఁడు
పరుండు, నీవు
పరభవ్యుని సంతసమమ్మరో! సతీ! ॥ 34 ॥
ప్రతిపదార్థము.
భగవతి
= ఓ భగవతీ !
శంభోః
= శంభునకు,
త్వం
= నీవు,
శశి
మిహిర = చంద్రుడు, సూర్యుడు,
వక్షోరుహయుగం
= స్తనముల జంటగా గలిగిన,
శరీరం
= దేహముగల దానివి,
తవ
= నీ యొక్క,
ఆత్మానం
= దేహమును,
అనఘమ్
= దోషము
లేని,
నవాత్మానం
= నవవ్యూహాత్మకుడగు శివానంద భైరవునిగా,
మన్యే
= తలంచుచున్నాను.
అతః
= ఈ కారణమువలన,
శేషః
= గుణముగా నుండునది, అనగా - ఆధేయమై వుండు అప్రధానము,
శ్లేష
= ఆధారమై వుండు ప్రధానము,
ఇతి
= అను
అయం
= ఈ,
సంబంధః
= సంబంధము,
సమరస
= సామ్య సామరస్యములతో గూడిన,
పరానంద
= ఆనందరూపుడైన ఆనంద భైరవుడు,
పరయోః
= ఆనంద రూపమైన భైరవీరూపులుగా,
వాం
= మీ,
ఉభయ
= ఇరువురకు,
సాధారణ
తయా = సామ్యము సామాన్యమై,
స్థితః
= ఉండుట అన్నది ధ్రువమై చెల్లుతున్నది.
భావము.
ఓ భగవతీ! నవాత్మకుడయిన శంభునకు సూర్యచంద్రులు
వక్షోరుహములుగా గల నీవు శరీరమగుచున్నావు. కాబట్టి అతడు శేషి (ప్రధానము) నీవు శేషము
(అప్రధానము) అగుచున్నారు. ఆయన పరుడు. నీవు పరానందము. మీ ఇద్దరికిని ఉభయ సాధారణమైన
సంబంధము కలదు. మనలో జీవం ఉన్నంతవరకే మనము అంబికా నామాన్ని జపించగలము. పూజ చేయగలము.
సమస్త భౌతిక వ్యవహారములు నిర్వర్తించుకోగలము. అయితే ఈ పనులన్నిటి నిర్వహణ కేవలం మన
ప్రాణశక్తి వలన మాత్రమే జరగటం లేదు. మన ప్రాణానికి ప్రాణంగా, ఆ
తల్లి మన జీవం చేత సమస్త వ్యవహారాలు నడిపిస్తోంది.
35 వ శ్లోకము.
మనస్త్వం
వ్యోమ త్వం మరుదసి మరుత్సారథిరసి
త్వమాపస్త్వం
భూమిస్త్వయి పరిణతాయాం న హి పరమ్ |
త్వమేవ
స్వాత్మానం పరిణమయితుం విశ్వ వపుషా
చిదానందాకారం
శివయువతి భావేన బిభృషే ||
సీ. ఆజ్ఞా సుచక్రాన నల మనస్తత్త్వమై, యలవిశుద్ధినిజూడ
నాకసముగ,
వరలనాహతమున
వాయుతత్త్వంబుగా, నా మణిపూరమం దగ్నిగాను,
జలతత్త్వముగ
నీవు కలిగి స్వాధిష్ఠాన, నరయ మూలాధారమందు పృథ్వి
గను
నీవె యుంటివి, ఘనముగా
సృష్టితో పరిణమింపగఁ జేయ వరలు నీవె
తే.గీ. స్వస్వరూపమున్ శివునిగా సరగునఁ గని
యనుపమానంద
భైరవునాకృతి గను
ధారణను
జేయుచున్ సతీ! స్మేర ముఖిగ
నుండి
భక్తులన్ గాచుచు నుందువమ్మ. ॥ 35 ॥
ప్రతిపదార్థము.
హే
శివయువతీ ! = ఓ శివుని ప్రియురాలా!
మనః
= ఆజ్ఞాచక్రము నందలి మనస్తత్వము,
త్వం
+ ఏవ = నీవే
అసి
= అగుచున్నావు,
వ్యోమ
= విశుద్ధి చక్రమునందలి ఆకాశ తత్త్వము,
మరుత్
= అనాహత చక్రమందలి వాయుతత్త్వము,
మరుత్సారధిః
= స్వాధిష్టాన చక్రము నందలి వాయు సఖుడైన అగ్ని తత్త్వము,
ఆపః
= మణిపూర చక్రమందలి జలతత్త్వము,
భూమిః
= మూలధార చక్రము నందలి భూతత్త్వము కూడా,
త్వం
ఏవ = నీవే
అసి
= అగుచున్నావు,
త్వం
= నీవు,
పరిణతాయాం
= తదాత్మతను పొందించుటకు,
నహిపరం
= నీ కంటె ఇతరమగు నది కొంచెము కూడా లేదు.
త్వం
ఏవ = నీవే
స్వ
+ ఆత్మానం = స్వస్వరూపమును,
విశ్వవపుషా
= ప్రపంచ రూపముతో,
పరిణమయితుం
= పరిణమింప చేయుటకు,
చిత్
+ ఆనంద + ఆకారం =చిచ్ఛక్తియుతుడైన ఆ ఆనంద భైరవుని,
లేదా - శివతత్త్వమును,
శివయువతి
భావేన = శివయువతి భావముచేత,
బిభృషే=
భరించుచున్నావు.
భావము.
ఓ శివుని ప్రియురాలైన జగజ్జననీ! ఆజ్ఞా చక్రమందలి మనస్తత్వము, విశుద్ధియందలి
ఆకాశతత్త్వము, అనాహత
మందలి వాయుతత్త్వము, స్వాధిష్ఠాన మందలి అగ్నితత్త్వము, మణిపూరమందలి
జలతత్త్వము, మూలాధార
మందలి భూతత్త్వము గూడా నీవే అయి వున్నావు. ఈ విధముగా పంచభూతములు నీవే అయినపుడు ఇంక
ఈ విశ్వమందు నీ కంటె ఇతరమైన పదార్ధము ఏదియు కొంచెము కూడా వుండదు, ఉండలేదు.
నీవే నీ స్వరూపమును జగదాకారముగ పరిణమింప చేయుటకు చిచ్ఛక్తియుతుడైన ఆనందభైరవుని
స్వరూపమును లేదా శివతత్త్వమును నీ చిత్తముతో ధరించుచున్నావు.
36 వ శ్లోకము.
తవాజ్ఞా
చక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం
పరం
శంభుం వందే పరిమిలిత పార్శ్వం పరచితా |
యమారాధ్యన్
భక్త్యా రవి శశి శుచీనా మవిషయే
నిరాలోకే
ఽలోకే నివసతి హి భాలోక భువనే ||
సీ. నీకు చెందినదైన నిరుప మాజ్ఞాచక్ర మది రవి శశికాంతు
లలరునట్టి
పరమచిచ్ఛక్తిచే
నిరువైపులందునన్ గలిగిన పరుఁడైన కాలగళునిఁ
జేరి
చేసెద నతుల్, గౌరీపతిని
భక్తి నారాధనము చేయు ననుపముఁడగు
సాధకుండిద్ధరఁ
జక్కగా రవిచంద్ర కాంతికిన్ గనరాక, కానబడక
తే.గీ. బాహ్యదృష్టికి,
నేకాంత భాసమాన
గణ్యమౌ
సహస్రారమన్ కమలమునను
నిరుపమానందుఁడై
యొప్పి మురియుచుండు
నమ్మ!
నీ దయ నాపైన క్రమ్మనిమ్ము. ॥ 36 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ తల్లీ!
తవ
= నీ సంబంధమైన,
ఆజ్ఞా
చక్రస్థమ్ = ఆజ్ఞాచక్రము నందున్న వాడును,
తపన
శశి = కోటి సూర్య
చంద్రుల
కోటి
= కాంతి వంటి
ద్యుతిధరం
= కాంతి ధరించినవాడును,
పరచితా
= పరి మగు చిచ్చక్తి చేత;
పరిమిళిత
పార్శ్వం = ఆవరింపఁబడిన ఇరు పార్శ్వములు కలవాడును,
పరం
= పరమును అయిన,
శంభుం
= శంభుని
గూర్చి,
వందే
= నమస్కరించుచున్నాను.
యం
= అట్టి ఏ పరమశివుని,
భక్త్యా
= భక్తితో,
ఆరాధ్యన్
= పూజించుచు ప్రసన్నునిగా చేసుకొను సాధకుడు,
రవిశశి
శుచీనాం = రవిచంద్రాగ్నులకు,
అవిషయే
= అగోచరమైనదియు,
నిరాలోకే
= బాహ్యదృష్టికి అందరానిదియు,
అలోకే
= జనము లేని ఏకాంత మైనుటవంటిదియునైన,
భాలోక
భువనే = వెలుగుల లోకమునందు (సంపూర్ణముగా వెన్నెల వెలుగులతో
నిండిన లోకవుందు, అనగా - సహస్రారకవములము నందు)
నివసతివా
= వసించును. అనగా - నీ
సాయుజ్యమును పొందును అని అర్థము.
భావము.
ఓ జగజ్జననీ! నీకు సంబంధించినదైన ఆజ్ఞాచక్రము నందు- కొన్ని
కోట్ల సూర్య, చంద్రుల
కాంతిని ధరించిన వాడును, “పర”యను పేరు పొందిన చిచ్చక్తిచేత కలిసిన, ఇరు
పార్శ్యములు కలవాడును అగు పరమశివునికి నమస్కరించుచున్నాను. ఏ సాధకుడు భజనతత్పరుడై
ఇట్టి పరమ శివుని ప్రసన్నునిగా చేసుకొనునో- అతడు రవిచంద్రాగ్నులకు సైతం
వెలిగించడానికి వీలుకానటువంటిది, బాహ్యదృష్టికి గోచరింపనిది అయిన నీ సాయుజ్యమును
పొందును.
37 వ శ్లోకము.
విశుద్ధౌ
తే శుద్ధస్ఫటిక విశదం వ్యోమ జనకం
శివం
సేవే దేవీమపి శివసమాన వ్యవసితామ్ |
యయోః
కాంత్యా యాంత్యాశ్శశికిరణ సారూప్యసరణేః
విధూతాంతర్ధ్వాంతా
విలసతి చకోరీవ జగతీ ||
ఉ. నీదు విశుద్ధి చక్రమున నిర్మలమౌ దివితత్త్వ
హేతువౌ
జోదుగ
వెల్గు నాశివుని, శోభిలుచుండెడి నిన్నుఁ గొల్చెదన్
మోదమునొప్పుమీ
కళలు పూర్ణముగా లభియింపఁ వీడెడున్
నాదగు
చీకటుల్, మదిననంత
మహాద్భుత కాంతినొప్పెదన్. ॥ 37 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ తల్లీ!
తే
= నీ యొక్క,
విశుద్ధౌ
= విశుద్ది చక్రము నందు,
శుద్ద = దోషము లేని
స్ఫటిక
= స్ఫటిక
స్వచ్ఛతతో
విశదం
= మిక్కిలి నిర్మలమైన వాడును,
వ్యోమ =ఆకాశతత్త్వమును
జనకం
= ఉత్పాదించు వాడును అగు,
శివం
= శివునిని,
శివ = శివునితో
సమాన = సమానమైన
వ్యవసితాం
= సామర్థ్యము గల,
దేవీం
అపి = భవగతి ఐన నిన్నుగూడ,
సేవే
= ఉపాసించెదను,
యయోః
= ఏ శివాశివుల నుండి,
యాంత్యాః
= వచ్చుచున్నదైన,
శశికిరణ
=
చంద్రకిరణముల
సారూప్య
= పోలికయొక్క,
సరణేః
= పరిపాటి కల,
కాంత్యా
= కాంతివలన,
జగతీ
= ముజ్జగములు,
విధూత
= వదలగొట్ట
బడిన
అంతః
+ ధ్వాంతా = ఆత్మలోనుండు అజ్ఞానమను చీకటి గలదై,
చకోరీ
+ ఇవ = ఆడ చకోర పక్షీవలె,
విలసతి
= ప్రకాశించుచున్నది - (అనగా - అట్టి శివాశివులను సేవించెదను అని భావము.)
భావము.
ఓ జగజ్జననీ! నీ విశుద్ధి చక్రము నందు దోషరహితమైన స్ఫటిక
స్వచ్ఛతతో మిక్కిలి నిర్మలమై వుండు వాడు, ఆకాశోత్పత్తికి హేతువైన వాడు అగు శివునిని, అట్టి
శివునితో సమానమైన దేవివైన నిన్ను గూడా ఉపాసించుచున్నాను. చంద్రకాంతులతో సాటి వచ్చు
మీ ఇరువురి కాంతులు క్రమ్ముకొనుటచే, ఈ సాధక లోకము- అజ్ఞానము నుండి తొలగి, ఆడు
చకోర పక్షివలె ఆనందించును.
38 వ శ్లోకము.
సమున్మీలత్
సంవిత్కమల మకరందైక రసికం
భజే
హంసద్వంద్వం కిమపి మహతాం మానస చరం |
యదాలాపాదష్టాదశ
గుణిత విద్యాపరిణతిః
యదాదత్తే
దోషాద్ గుణమఖిలమద్భ్యః పయ ఇవ ||
తే.గీ. జ్ఞాన సుమ మధువును కోరు, కరుణనొప్పు
యోగులగువారి
మదులలోనుండు, మంచి
నే
గ్రహించు హంసలజంటనే సతంబు
మదిని
నినిపి కొల్చెదనమ్మ! మన్ననమున. ॥ 38 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ తల్లీ!
యత్
= ఏ
హంసమిథునము యొక్క
ఆలాపాత్
= సంభాషణ వలన,
అష్టాదశ
గుణిత = పదునెనిమిది సంఖ్యగా చెప్పబడిన,
విద్యా
పరిణతిః = విద్యల యొక్క పరిణతి కలుగునో,
యత్
= ఏ హంసల జంట,
దోషాత్
= అవలక్షణముల నుండి,
గుణం
అఖిలం = సమస్తమైన సద్గుణ సముదాయమును,
అద్భ్యః
= నీళ్ళనుండి,
పయః
ఇవ = పాలను వలె,
ఆదత్తే
= గ్రహించుచున్నదో.
సమున్మీలత్
= వికసించుచున్న,
సంవిత్
= జ్ఞానము అను
కమల
= పద్మము నందలి,
మకరంద
= తేనెయందు మాత్రమే,
ఏకరసికం
= ముఖ్యముగా ఇష్టపడునదియో,
మహతాం
= యోగీశ్వరుల యొక్క,
మానస =మనస్సులలో (మానస సరోవరము నందు)
చరం
= చరించునదియో,
కిమపి
= ఇట్టిదని చెప్పుటకు వీలులేని,
హంస
ద్వంద్వం = ఆ రాజహంసల జంటను,
భజే
= సేవించెదను,
భావము.
ఓ జగజ్జననీ! అనాహత జ్ఞాన కమలము నందలి తేనెను మాత్రమే
గ్రోలుట యందు ఆసక్తి కలిగినది, యోగీశ్వరుల మానస సరోవరములందు విహరించునది, నీరమును
విడిచి పాలను మాత్రమే గ్రహించు సామర్థ్యము గలది,
దేనిని భజించినచో అష్టాదశ
విద్యలు చేకూరునో- అట్టి అనిర్వచనీయమైన శివశక్తులనే రాజహంసల జంటను ధ్యానించి
భజించుచున్నాను.
39 వ శ్లోకము.
తవ
స్వాధిష్ఠానే హుతవహ మధిష్ఠాయ నిరతం
తమీడే
సంవర్తం జనని మహతీం తాం చ సమయామ్ |
యదాలోకే
లోకాన్ దహతి మహతి క్రోధ కలితే
దయార్ద్రా
యా దృష్టిః శిశిర ముపచారం రచయతి ||
సీ. నీదు స్వాధిష్ఠాన నిరుపమ చక్రాన నగ్ని
తత్త్వంబున నమరియుండు
నగ్నిరూపుండైన
యాశివున్ స్తుతియింతు, సమయ పేరున గల సన్నుత మగు
మహిమాన్వితంబైన
మాతృస్వరూపిణీ! నిన్నునున్ దలచుచు సన్నుతింతు
నేకాగ్రతను
జేయు నీశుని ధ్యానాగ్నినల లోకములు కాలుననెడియపుడు
తే.గీ. నీదు కృపనొప్పు చూడ్కులు నిరుపమాన
పూర్ణ
శశిచంద్రికలె యార్పు పూర్తిగాను,
లోకములనేలు
జనని! సులోచనాంబ!
వందనంబులు
చేసెద నందుకొనుము. ॥ 39 ॥
ప్రతిపదార్థము.
హే
భగవతి! = ఓ తల్లీ!
తవ
= నీ యొక్క,
స్వాధిష్టానే
= స్వాధిష్టాన చక్రమందలి,
హుతవహం
= అగ్నితత్త్వమును,
అధిష్ఠాయ
= అధిష్ఠించి,