గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 52వ శ్లోకం. 398 - 405. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోత్రైలోక్యమోహినీ విద్యా సర్వభర్త్రీ క్షరాఽక్షరా

హిరణ్యవర్ణా హరిణీ సర్వోపద్రవనాశినీ 52  

398. ఓం *త్రైలోక్యమోహిన్యై* నమః.

నామ వివరణ.

మూడులోకములకూ మోహమును కలుగఁజేయు తల్లి.

తే.గీ.  తలపఁ  *ద్రైలోక్యమోహినీ! * దారి నీవె

ముక్తిపై మోహముననుంటి భుక్తితోడ

ముక్తినొసగుము, నినుఁ గొల్చి పూజ చేసి

వందనంబులు చేసెద నందుకొనుము.

399. ఓం *విద్యా*యై నమః.

నామ వివరణ.

విద్యా స్వరూపిణి అమ్మ.

తే.గీ.  మహిత *విద్యా! * శుభాకార! స్పృహను గొలిపి

పద్య విద్యవై నాలోన ప్రబలు నీవు

ముక్తి గొలిపెడి విద్య నాసక్తి నిమ్ము,

వందనంబులు చేసెద నందుకొనుము.

400. ఓం *సర్వర్త్ర్యై* నమః.

నామ వివరణ.

సమస్తమును భరించు జనని అమ్మ.

తే.గీ.  *సర్వభర్త్రీ! * సదాచార! సర్వ మీవె,

చూచి పూరించు తల్లివి,   వేచితి నిట,

భుక్తి ముక్తుల నిచ్చు నిన్ బూజ చేయ,

వందనంబులం జేసెదనందుకొనుము.

 

401. ఓం *క్షరా*యై నమః.

నామ వివరణ.

నశింపఁజేయగల తల్లి మన అమ్మ.

తే.గీసతి! *క్షరా! * సుధాసింధు! నిన్ నుతులు సేయ

నాదు శక్తి చాలదుకదామోదమలర

మదిని భావించు నా భక్తి, మన్ననమున,

వందనంబులు చేసెద నందుకొనుమ.

402.  ఓం *అక్షరా*యై నమః.

నామ వివరణ.

నాశ రహిత అమ్మ.

తే.గీక్షరము కానట్టి తల్లి*వక్షర! * మదంబ!

స్థిరముగా నీవు నా మదిన్ వరలుమమ్మ!

నిన్ను సేవించి కృతినౌదు మన్ననమున,

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం*క్షరాక్షరా*యై నమః.

నామ వివరణ.

నశింపఁజేయగల నాశ రహిత అమ్మ.

తే.గీ.  *క్షరాక్షరా! * మదిలోన నుండుమమ్మ!

క్షరముగానున్న దేహాన కరుణ తోడ

నక్షరంబుగ వెలుగుదువమ్మ నీవు

వందనంబులు జేసెద నందుకొనుము.

403. ఓం *హిరణ్యవర్ణా*యై నమః.

నామ వివరణ.

స్వర్ణ స్వరూపిణి అమ్మ.

తే.గీ.  అనుపమ *హిరణ్యవర్ణా! * ప్రియంబు తోడ

నీవు మాలోన వెలుగుచు, నిత్యపూజ్య!

భవ్య సంస్కారమనియెడి స్వర్ణమిచ్చి,

నిలుపుచుంటివి నీలోనఁ గలుపుకొనగ.

404 ఓం *హరిణ్యై* నమః.

నామ వివరణ.

దుఃఖహారి మన అమ్మ.

తే.గీ.  *హరిణి! * మా బాధలన్ బాపు నిరుపమవని

నిన్ను సేవించుచుంటి నాపన్న రక్ష!

సకలసుఖములనొసఁగెడి చక్కనమ్మ!

వందనంబులు చేసెద నందుకొనుము.

405. ఓం *సర్వోపద్రవనాశిన్యై* నమః.

నామ వివరణ.

సమస్తమయిన ఉపద్రవములను హరించు తల్లి.

కం.  *సర్వోపద్రవ నాశిని! *

గర్వాంధ తమమ్ము పాపు కరుణామూర్తీ!

నిర్వక్ర ముక్తి మార్గము

నుర్విన్ దయ చేయుమమ్మరోనినుఁ గొలుతున్.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.