మేలిమిబంగారం మన సంస్కృతి….సూక్తిమౌక్తికాలు
1. శ్లో. గజాననం భూత గణాధి సేవితమ్ - కపిత్థ జంబూ ఫల సార భక్షితమ్
ఉమా సుతం శోక వినాశ కారణమ్న - మామి విఘ్నేశ్వర పాద పంకజమ్.
తే.గీ. శ్రీగజానను, జీవాళి సేవలు గొను,
ఘన కపిత్థజంబూఫలఖాదికి, నుమ
కంటివెలుగైన, దుఃఖముల్ కాల్చునట్టి
యాత్మ గణపతి పదములకంజలింతు
క. గజ వక్త్రు, పార్వతీసుతు,
విజయదు, జంబూ కపిత్థ ప్రియ ఫల ఖాదిన్,
భజియించి, వాని పదములు
నిజమనముననిలిపి చేతు నేర్పున ప్రణతుల్.
భావము: గజ ముఖుడు, భూత గణములచే సేవించ బడే వాడు, వెలగ మరియు రేగు పండ్ల గుజ్జును భక్షించు వాడు, పార్వతీ పుత్రుడు, దుఃఖ వినాశ కారకుడు అయిన విఘ్నేశ్వరుని పాద పద్మములకు నమస్కరించుచున్నాను.
2. శ్లో. అంగం
గలితం పలితం ముండం
దశనవిహీనం జాతం తుండం
వృధ్ధో యాతి గృహిత్వా
దండం
తదపి న
ముంచత్యాశాపిండం.
గీ. తనువు చిక్కు, తల నెఱియు, దంతతతియు
ఊడు, నడువ దండముఁ గొను, వడుకుచుండు
నట్టి వృద్ధత్వమొందియు నతులమైన
యాశ వీడదు, పెఱుగుచుండదియె వింత.
భావము. శరీరము కృశించి, చిక్కి ముడతల పడినను, తల పూర్తిగా నెరసి పోయినను, పండ్లు ఊడిపోయి నోరు బోసియైనను, ముసలి తనం వచ్చి కర్రను పట్టుకుని గాని నడువలేక పోయినను ఆశమాత్రము అతనిని వదలదు.
3. శ్లో. అంజలిస్తాని పుష్పాణి
వాసయంతి కరద్వయం ౹
అహో సుమనసాం ప్రీతిర్వామదక్షిణయో: సమా౹౹
తే.గీ. కరములన్ జేరు పుష్పముల్ కలుగఁ జేయు
రెండు చేతులకున్ దావి మెండుగటులె
మంచివారిని చెడువారనెంచకుండ
ప్రేమగా జూతురందరిన్ ధీమహితులు.
ఆ. దోసిటగల పూలు వాసన కలిగించు
రెండు చేతులకును నిండుగాను.
సుజనులట్టులుండు, చూపరు భేదంబు.
కుడిని యెడమ నొకటె కూర్మి చూపు.
భావము. చేతిలో ఉన్న పువ్వులు భేదం లేకుండా రెండు చేతులను
సుగంధ భరితంగా చేస్తాయి. అలాగే సహృదయులు చెడ్డవారని,
మంచివారని బేధం లేకుండా సమంగా ప్రేమిస్తారు.
4. శ్లో. అ కరుణత్వ
మకారణ విగ్రః
పరధనే పరయోషితి
చ స్పృహా
సుజన బంధు
జనే ష్వసహిష్ణుతా
ప్రకృతి సిద్ధ
మిదం హి
దురాత్మనాం.
తే.గీ. దయయె లేకుండు. కలహించు భయములేక.
పరుల ధన, స్త్రీల నాశించు. పరవశించు.
కారణము లేక ద్వేషించు ఘనుల, మిత్ర
వరుల, దుష్టుని. సహజాత మరయ నిదియె.
భావము. దయాగుణము లేక పోవుట, అ కారణముగా అందరితో కలహించుట, పరుల ధనమును స్త్రీలను కోరుకొంటూ వాటితో పరవశించుట, గొప్ప వారిని, మిత్రులను కారణము లేకుండానే ద్వేషించుట మొదలగు యిటువంటి గుణములు దుర్మార్గులకు పుట్టుకతోనే వచ్చును.
5. శ్లో. అకర్తవ్యేష్వసాధ్వీవ తృష్ణా ప్రేరయతే జనం
తమేవ సర్వ పాపేభ్యో లజ్జా మాతేవ రక్షతి.
ఆ. సాధ్వి కాని వనిత చందమౌనత్యాశ.
చేయరాని పనులు చేయఁ జేయు.
కన్నతల్లి యట్లు కాపాడు సల్లజ్జ,
చెడును చేయనీక నడుపు చుండు.
భావము. దుష్ట స్త్రీ వలె , అత్యాశ - మానవులను చేయరాని పనులు చేయటానికి ప్రేరేపిస్తుంది. లజ్జ (సిగ్గు) మాత్రం కన్నతల్లి వలె వారిని సమస్తపాపాలనుండి (చెడు పనులు చేయనీయకుండా) కాపాడుతుంది.
6. శ్లో. అకామాన్ కామయతి యః, కామయానాన్ పరిత్యజేత్
బలవంతం చ యో ద్వేష్టి తమాహుః మూఢచేతసమ్.
క. ఇష్టపడని వారినిష్టపడుచు, తన
నిష్టపడెడివారినిష్టపడక,
బలునితోడ వైరములు పెట్టుకొని చెడు
మూర్ఖుడెపుడు. కనుడు పూజ్యులార!
భావము. ఎవడు తనను ఇష్టపడనివారిని ఇష్టపడతాడో, ఎవడు తనను ఇష్టపడేవారిని వదలుకుంటాడో, ఎవడు బలవంతునితో వైరం పెట్టుకుంటాడో వానిని మూఢాత్ముడు అంటారు.
శ్లో. అకాలే కృత్యమారబ్ధం కర్తుర్నార్థాయ కల్ప్యతే
తదేవ కాల ఆరబ్ధం మహతేஉర్థాయ కల్ప్యతే.
క. సమయము గని పనులు మనము
సముచితముగ సలుప సుఫల చయము కన నగున్
సమయము విడి సలుపు పనులు
సముచిత ఫలమొసగవు కద! సమయము కననౌన్.
భావము. సమయంకాని సమయంలో ప్రారంభించిన పని కర్తకు ప్రయోజనాన్ని కల్పించదు. అదే పనిని సరియైన కాలంలో ప్రారంభిస్తే అతనికి గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
శ్లోll అకృత్వా పర సంతాపం అగత్వా ఖల మందిరం
అక్లేశయత్యచాత్మానం యదల్ప మపి తద్బహుః.70
తే.గీll పరుల సంతాప హేతువై ప్రబల రాదు.
చెడుగు సహవాసమెన్నడు చేయరాదు.
సుకృత లేశంబులవియెయౌన్ చూచుచుండ
ఘనతరంబుగ మనకిది కనగ నగును.
తే.గీll
పరుల సంతాప హేతువై ప్రబల రాదు.
చెడుగు సహవాసమెన్నడు చేయరాదు.
సుకృత లేశంబులవియెయౌన్ చూచుచుండ
ఘనతరంబుగ మనకిది కనగ నగును.
భావము:- ఇతరులకు సంతపము కలిగించకయు; ఖలులతో సహవాసము చేయకయు; గావించిన కొలది సుకృతములు కూడా మహత్తరమైనవగుచున్నవి.
శ్లో. అక్రోధేన జయేత్ క్రోధమ్. అసాధుమ్ సాధునా జయేత్.
జయేత్ కదర్యం దానేన, జయేత్ సత్యేనచాஉనృతమ్.
గీ. కోపమును శాంతిచే గెల్చుకొనగవచ్చు.
సాధువృత్తినచే గెల్తుమసాధుతతిని,
పిసినితనమును దానాన పెకల వచ్చు.
నృతముతోడనె గెలుతుమనృతమునిలను.
గీ. కోప విరహిత బుద్ధిచే కోపి మనసు,
సాధు గుణమున దుష్టునసాధు మతిని,
లోభినీవిని, మరియు నీ లోని సత్య
మున నసత్యమున్ విజయించి ముక్తి గనుడు.
భావము. శాంత స్వభావముతో క్రోధమును జయింప వచ్చును. సాధు స్వభావముతో అసాధుస్వభావమును జయింప వచ్చును. పిసినిగొట్టుతనమును దానముతో జయింప వచ్చును. అబద్ధమును సత్యముతో జయింప వచ్చును.
శ్లో. అక్షరద్వయ
మభ్యస్తం “నాస్తి నాస్తీ”తి యత్పురా
తదిదం “ దేహి దేహీ
”తి విపరీతముపస్థితమ్.
ఆ. నాస్తి నాస్తి యని యనాథులకీయమి
నాటి లోభితనము నేటి ఫలము.
దేహి దేహి యనుచు దేవురింపఁగ వచ్చు.
దాన ధర్మబుద్ధి దైవ గుణము.
భావము. పూర్వం “నాస్తి, నాస్తి ” అనే రెండక్షరాలు నేర్చిన ఫలితంగా ఇపుడు “దేహి,దేహి” అనవలసిన విపరీత స్థితి ఏర్పడింది ! (పూర్వం ఎవరికీ దానం చేయకపోవటం వల్ల , ఇపుడు యాచించే స్థితి సంక్రమించింది.
గణేశ శ్లోకం:
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే
ప్రతిపదార్థము:
అగజ = పార్వతీ దేవి యొక్క;
ఆనన = ముఖము అనెడి;
పద్మ = కమలమునకు (ప్రకాశింపఁ జేసెడివాఁడగు),
ఆర్కం = సూర్యుడయినవానిని;
గజ = ఏనుగు;
ఆననం = ముఖము కలవానిని;
అహః నిశం = పగలు; రాత్రి;( ఎల్ల వేళలా)
భక్తానాం = భక్తుల కొఱకు;
అనేక = చాల;
దం = ఇచ్చువాడగు (వరములు);
ఏక = ఒకే;
దంతం = దంతము కలవాడగు;
తం = అట్టి వినాయకుని;
ఉపాస్మహే = ఉపాసింతుము.
క. అగజ ముఖాంబుజ దినకరు,
ప్రగణిత గజముఖుని, సతము భక్తుల కోర్కెల్
జగమున నొసగెడి మహితుని
సుగుణదుఁడగు నేకదంతు, శుభదు భజింతున్.
గీ. యజ్ఞవాటిక కింటికి,అఖిల పుణ్య
క్షేత్రములకు,వృద్ధులు, గురు, శిశుల, గర్భ
వతుల, రాజుల దేవులన్ వట్టి చేతు
లనిల గనగ పోరాదంద్రు వినయ మతులు
భావము.(అగజ)పార్వతి ముఖపద్మమును వెలిగింపఁ జేయు సూర్యుఁడువంటి వానిని, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని ఉపాసింతుము.
శ్లో:-
అగ్నిదో గరదశ్చైవ
శస్త్రోన్మత్తో ధనాపహః
క్షేత్ర దార
హరశ్చేతాన్
షడ్విధా నాతతాయినః
.
తే:-
అగ్ని విషములు బెట్టెడి అధముల, మఱి
ఆయుధంబునజంపెడి అశుభ పరుల,
క్షేత్ర దారల హరియించు కౄరుల, గని
ఆతతాయిగ చెప్పగ నర్హమగును.
భావము:-
ఇంటికి కాని, సంసారములో కాని అగ్గి పెట్టే వారినీ, పరులపై విష ప్రయోగము చేసే వారినీ లేదా విషము గ్రక్కే వారినీ, ఆయుధముతో దాడి చేసే వారినీ, భూములనపహరించే వారినీ, భార్య నపహరించే వారినీ, ఆతతాయిలు అని అన వచ్చును.
శ్లో. అగ్నిహోత్రం
గృహం క్షేత్రం
, గర్భిణీం వృద్ధబాలకౌ ,
రిక్తహస్తేన నోపేయాత్ , రాజానాం
దైవతం గురుమ్ .
ఆ. అగ్ని కడకు, స్వగృహ, మారాధ్యదైవమ్ము
సన్నిధులకు, గురుని సన్నిధికిని
క్షేత్రములకు, వృద్ధ, శిశువుల చూలింత
వట్టి చేత పోకు ప్రభులఁ జూడ.
గీ. వట్టి చేతుల పోరాదు వసుధపైన
అగ్నికార్యంబు, స్వగృహంబు, నఖిల క్షేత్ర
ములు, గురున్, గర్భిణిన్, వృద్ధు, భూపు, దైవ,
బాల దర్శనార్థము పోవుచో. భవ్యులార!
భావము. అగ్నిహోత్రము, స్వగృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీ స్త్రీ, ముసలివారు, బాలురు, రాజు, దైవము, గురుడు - వీరివద్దకు బోవునప్పుడు వట్టిచేతులతోపోరాదు. ఏదో పండునైన, పూవునైన తీసుకొనిపోయి, సమర్పించ వలెను.
శ్లో:-
గురుం వా,
బాల, వధ్వౌవా,
బ్రాహ్మణంవా బహు
శృతం.
ఆతతాయిన మాంతవ్యం
హంత్యాదే వవిచారయన్.
తే:-
గురువు, బాల వధువనక, గొప్ప వేద
విదుడు బ్రాహ్మణుడనకుండ కౄరముగను
ఆతతాయైన చంపగ నర్హమయ్య.
యోచనేమియు లేకయే. నీచు లంచు.
భావము:-
ఆతతాయి అయితే అట్టి వారు గురువవ వచ్చును, బాలులవ వచ్చును, స్త్రీ లవ వచ్చును, అనేక వేదముల నెఱిగిన బ్రాహ్మణు లవ వచ్చును, అటువంటి వారిని విచారణ చేయనక్కర లేకుండానే హతమార్చ వచ్చును
శ్లో. అజరామరవత్
ప్రాజ్ఞో విద్యామర్థం చ
సాధయేత్,
గృహీత ఇవ కేశేషు
మృత్యునా ధర్మమాచరేత్.
క. జరయును, మరణము లేనటు
ధర విద్యా ధనములందెదరు కనఁ బ్రాజ్ఞుల్.
మరణము దరి కొనినటులుగ
చరియింతురు ధర్మములనుసరణీయమెదే.
గీ. ముసలితనమును మృతియునుపొందననుచు
ధనము విద్యయు సాధించి మనుట శుభము.
మృత్యు ముఖముననున్నట్లు నిత్యమునిలను
ధర్మవర్తన మెలగుట ధర్మమర్తయ.
ఆ. ముసలితనము, మరణము తనకు లేనట్లు
ధనము విద్య లరసి గొనుత నరుడు.
మృత్యువమరుటెఱిగి నిత్యంబు ధర్మము
చేయుచుండుటొప్పు. చేయుడయ్య.
గీ. మరణమన్నది లేనట్టి మహితునివలె
ప్రాజ్ఞుఁడాస్తిని విద్యను పడయవలయు
మృత్యు వొందుట ముందున్న సత్యమనుచు
ధర్మ మొనరించగావలె మర్మము విడి.
గీః- ముదిమి మరణము లేనట్లు ప్రోగు చేయు
ధనము, విద్యయు ప్రాజ్ఞులు ధరణిపైన.
కేశమును పట్టె మృత్యువన్ ధ్యాస గలిగి
ధర్మ మాచరింపగ తగు ధన్యత గన.
భావము. ప్రాజ్ఞుడు తనకు ముసలితనము, మరణము లేవనే ఆలోచనతో - విద్యను, ధనాన్ని సంపాదించాలి. మృత్యువు తన జుట్టుపట్టుకొని తీసుకు పోవటానికి సిద్ధంగా ఉందనే ఆలోచనతో ధర్మాన్ని ఆచరించాలి.
శ్లో. అజ్ఞానాత్ యది వా మోహాత్ కృత్వా కర్మ విగర్హితం
తస్మాద్విముక్తి మన్విచ్ఛన్ ద్వితీయం న సమాచరేత్.
గీ. జ్ఞాన హీనత చేతనో కామ, మోహ
మదములను చేసి, దుష్కృత్య వ్యధను పొంది,
మదిని చింతించు వారలు మరల నటుల
భావము. అజ్ఞానంతో గానీ, మోహం వల్ల గానీ ఒక నింద్యమైన పనిని చేసి, దాని నుండి విముక్తి పొందదలచిన వారు అలాంటి పని మరొకసారి చేయకూడదు.
శ్లో: అజ్ఞానా
దథవా జ్ఞానాదుత్తమః
శ్లోకనామ యత్
సంకీర్తితమఘం పుంసో దహేదేధో
యథా உనలః (భాగవతము 6-2-18)
గీ: గడ్డి మేటునె యగ్గి తా కాల్చినట్లు
తెలిసి హరి యను భక్తుల,తెలియకుండ
హరిని పలికెడి భక్తుల దురిత తతిని
కాల్చివేయును. హరినామ ఘనత గనుమ.
భావము: అగ్ని ఏ విధముగా గడ్డి మేటిని దగ్దింపజేయునో అట్లే ఎవరు తెలిసి గాని, తెలియక గాని ఉత్తమః శ్లోకుడగు భగవంతుని నామమును కీర్తించుదురో వారి సమస్త పాపరాశి భస్మీ భూతమగును.
శ్లో. అతి
కామాత్ దశగ్రీవః – అతి
లోభాత్ సుయోధనః,
అతి దానాత్
హతః కర్ణః,
– అతి సర్వత్ర
వర్జయేత్.
ఆ.వె. కామ లోభ దాన కర్మంబు లమితమై
రావణ కురుపతులు నీవి కర్ణు
డిలను చంపఁబడిరి. మెలగుట మంచిది
మితిని మీరకుండ క్షితిని జనులు.
భావము. మితి మీరిన కామముచే రావణాసురుఁడును, మితి మీరిన లోభ గుణముచే సుయోధనుఁడును, మితిమీరిన దానగుణముచే కర్ణుఁడును భూమిపై చంపఁ బడిరి. కావున ఏ విషయములోనూ మితి మీరి ప్రవర్తించుట మంచిది కాదు.
శ్లో. అతి
పరిచయా దవఙ్ఞా, సంతతగమనా
దనాదరో భవతి
మలయే భిల్ల
పురంధ్రీ , చందనతరుకాష్ఠ మింథనం
కురుతే.
గీ. చనువు పెఱుఁగ నలక్ష్యము సంభవించు.
నిరత మేగ ననాదరణీయులవరె?
జీర్ణ గంధపు మ్రానుల చేత వంట
భిల్ల వనితలు చేయరే? విరివి చేసి.
భావము. పరిచయము ఎక్కువయినకొద్దీ అలక్ష్యభావము పెఱుగును. అస్తమాను వస్తూ పోతూ ఉంటే అట్టివారిపై అనాదర భావము పెఱుగును. మలయ పర్వతములపై లభించెడి చందనదారువు మనకెంతో అపురూపమైనది. అట్టి మంచి గంధపు చెట్టు కర్రను అక్కడ నివసించే కోయ స్త్రీ వంట కట్టెలుగా ఉపయోగించుచుండును కదా!
శ్లో. అతి
రమణీయే కావ్యే పిశునోన్వేషయతి
దూషణాన్యేవ.
అతి సుందరేపి
వపుషి వ్రణమేవహి మక్షికా
నికరః.
క. దుష్టుఁడు నిరతము తప్పుల
నిష్టంబుగ వెదకుఁ గృతుల నేర్పడు గుణముల్
స్పష్టంబుగ కనుట మదికి
కష్టంబగు. కనగ మక్షికాన్యాయమిదే.
భావము. ఈగ అందమైన శరీరముపై వ్రాలుటకిష్టపడదు. సరికదా వ్రణములపై వ్రాలుటకే ఎంతో ఇష్టపడును. అటులనే అతి రమణీయ కావ్యమున దుష్టుఁడు దోషముల కొఱకే అన్వేషించును. గుణములున్నను గ్రహింపనేఱడు కదా!
శ్లో. అతి రూపోద్ధతాత్ సీతాஉతిగర్వా ద్రావణో హతః,
అతిదానాద్బలి ర్బద్ధశ్చాతి సర్వత్ర వర్జయేత్.
క. అతి గర్వముచే రావణు
డతి సౌందర్యమున సీత, యతి దానముచే
క్షితి బలియును, బాధ పడిరి.
అతి అన్నిట విడువ వలయు నరయుఁడు సుజనుల్.
భావం. ఆపూర్వమైన సౌదర్యం వల్ల సీత ఇక్కట్ల పాలైంది. మితిమీరిన గర్వంవల్ల రావణుడు నిహతుడైనాడు. పరిమితి లేని దానంవల్ల బలి చక్రవర్తి బంధింపబడ్డాడు.
కనుక అతి అన్నివేళలా విడిచిపెట్టవలసిందే.
శ్లో. అతో విచారః కర్తవ్యో జిజ్ఞాసోరాత్మవస్తునః
సమసాద్య దయాసింధుం గురుం బ్రహ్మవిదుత్తమమ్.
గీ. ఆత్మనెఱుఁగఁగ జిజ్ఞాసనలరు సుమతి
బ్రహ్మ విద్యలో నిపుణుని, భక్త సులభు
ననుపమాన దయాపరు నరసి వానిఁ
శిష్యుఁడై తాను గురువును చేర వలయు.
భావము. ఆత్మ గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు ఆలోచించాలి. అటువంటివాడు మొదట బ్రహ్మవిద్యలో నిపుణుడై, దయ కలిగిన ఒక ఉత్తముఁడైన గురువును సమీపించాలి.
శ్లో. అదండ్యాన్ దండయన్ రాజా ,దండ్యాంశ్చైవాప్యదండయన్
అయశో మహదాప్నోతి నరకం చైవ గచ్ఛతి.
క. దోషిని శిక్షింపక ని
ర్దోషిని శిక్షించుటరయ దోషాన్విత మీ
దోషము చేసిన నరకము.
ధ్యాసఁ గలిగి మెలఁగుట మన ధర్మము. కనుడీ.
భావము. నిర్దోషులను దండించి,దండింప దగినవారిని దండింపని రాజు గొప్ప అపకీర్తిని పొందటమే కాక,నరకానికి పోతాడు.
శ్లో. అదృష్టపూర్వా బాహవః సహాయాః సర్వే పదస్థస్య భవంతి వశ్యాః
అర్ధాద్విహీనస్య పదచ్యుతస్య భవంతి కాలే స్వజనోపి శత్రుః
గీ. రెండు చేతులా గడియించు చుండువాని
కండగానుందురందరూ. అట్లు కాక
వట్టి చేతుల నుందుమా ఒట్టు రారు
దరికినొక్కరూ నిజమిది.మరువరాదు.
భావము. అదృష్టం మనకి కలసి వచ్చినంతసేపూ
రెండుచేతులా సంపాదిస్తున్నంతసేపూ బయటివాళ్ళు అందరూ మన అడుగులకు మడుగులొత్తుతారు.
అర్ధవిహీనస్య అంటే డబ్బు లేనప్పుడు పదవి పోయినప్పుడు అదే స్నేహితులు బంధువులు శత్రువులుగా మారిపోతారట... దీనినే జగద్గురు ఆదిశంకరాచార్యులవారు భజగోవిందం లో ఇలా చెప్తారు.
శ్లో. అద్రోహః
సర్వభూతేషు కర్మణా మనసా
గిరా
అనుగ్రహం చ దానం
చ శీలమే
తత్ప్రప్రశన్యతే (మహాభారతం అను. 124-66)
(మహా భారతము - వన పర్వము - ౨౯౭ - ౩౫.)
తే.గీll
త్రికరణముల చేతను ప్రాణులకు నపకృతి
చేయకుండుట; ప్రేమతో చేర్చుకొనుట;
తనకు కలిగిన దానిని దాన మిడుట;
మన సనాతన ధర్మంబు. మఱవఁ దగదు
తే.గీ. కరణములు మూటిచే వైరి కాక యుంట,
దయను వర్తిలుచుండుట ప్రియము తోడ,
దాన సద్గుణౌఁడుచునీ ధరణి నుంట
శీలవంతుల లక్షణ జాలమరయ.
గీ. జీవ కోటిపై విద్రోహ చింత లేక,
దయకు రూపముగా నిల్చి, దాన విరతి
కలిగియుండుట శీలంబుగా గణింత్రు
బుధులు. కనుడయ్య విజ్ఞాన పూర్ణులార!
తే.గీll త్రికరణముల చేతను ప్రాణులకు నపకృతి
చేయకుండుట; ప్రేమతో చేర్చుకొనుట;
తనకు కలిగిన దానిని దాన మిడుట;
మన సనాతన ధర్మంబు. మఱవఁ దగదు.
భావము. ప్రాణులన్నిటి యందు మనోవాక్కాయ కర్మలచే వైరము లేకుండుటయు, దయకలిగి ఉండుటయు, దానముచేయుటయు శీలముగా ప్రశంసింపబడుచున్నది.
శ్లో. అధీత్య చతురో వేదాన్
సర్వశాస్త్రాణ్యనేకశః|
బ్రహ్మతత్వం న జానాతి
దర్వీ సూపరసం యథా||
తే.గీ. బ్రహ్మ తత్వంబు నెఱుఁగని వారు నాల్గు
వేదములనెఃత చదివినన్ విలువ లేదు.
శాస్త్రములనెన్ని నేర్చినన్ జ్ఞాని కాడు.
పప్పుచారున గరిటయట్లొప్పు కనగ.
భావము. వేదములను బాగుగా చదివినప్పటికీ,సర్వశాస్త్రములను అనేకమార్లు అద్యయనం చేసినప్పటికీ పరబ్రహ్మతత్త్వమును అర్ధం చేస్కొని వాడు పప్పు లేక చారు యందలి గరిటె లాంటివాడగుచున్నాడు.
శ్లో. అనంతరత్న
ప్రభవస్య యస్య
హిమం న
సౌభాగ్య విలోపి జాతమ్
l
ఏకో హి
దోషో గుణ
సన్నిపాతే
నిమజ్జతీందోః కిరణేష్వివాంకః ll
కు.సం. 1-2
తే.గీ. రత్నరాశులు కల హిమాలయము కీర్తి
మంచు పోకార్పఁగా నేరదెంచి చూడ.
దోషమొకటైనగుణములఁ జేసి మాయు.
మచ్చలవి చంద్ర కాంతిలో మఱఁగిపోవె.
భావము.
చంద్రునిలోని మచ్చ చంద్రుని తెల్లని కిరణాలతో కలసిపోయినట్లు‘ ఎన్నో రత్నరాశులకు , వృక్షరాజములకు నిలయమైన హిమవత్పర్వతములో మంచు నిండియుండట యనే ఒక దోషము లెక్కింప దగినది కాదు. అనంత గుణరాశిలో ఒక్క దోషమున్నను అది గుణములలో కలిసిపోవును.
శ్లో. "అనన్తరత్నప్రభవస్య యస్య,
హిమం న
సౌభాగ్యవిలోపి జాతమ్,
ఏకో హి
దోషో గుణసన్నిపాతే,
నిమజ్జతీందోః కిరణే ష్వివాంకః"
(కుమారసంభవము.)
క. గుణ సంహతినొకదోషము
కనఁబడు. గుణంబు చెడదు. ఘనతనె యొప్పున్.
కనఁబడు వెన్నెలె. యందన
కనుమరుగగు గాదె మచ్చ? కాంచఁగ మనకున్.
భావము.
సుగుణములు కుప్పలు కుప్పలుగా నున్నపుడు ఒకదోషమున్నను అది వానిలో మునిగి కలిసిపోవును గాని వస్తువునకు కళంకము తెచ్చిపెట్టనేఱదు. ఉదా- సుధాకరుని కిరణములయందు నల్లనిమచ్చ.
శ్లో:- అనంత శాస్త్రం
బహు వేదితవ్యం
- స్వల్పశ్చ కాలో బహవశ్చ
విఘ్నాః.
యత్ సారభూతం
తదుపాసితవ్యం - హంసో యథా
క్షీరమివాంబు మిశ్రమ్.
గీ:- ఎఱుగఁ దగు శాస్త్రములు పెక్కులిహమునందు.
కాల మల్పము కావున కలియుగమున,
హంస నీటిని విడి పాలనరయునట్లు,
సారమున్నట్టి శాస్త్రముల్ చక్క గొనుడు.
గీ:-
శాస్త్ర మెఱుగ ననంతము సమయ మల్ప
మధిక మాటంకములు కాన హంస యెట్లు
పాలుమాత్రమె గ్రహియించి ప్రబలు? నట్ల
మంచి మాత్రమె గ్రహియించి మహిమ గనుడు.
భావము:- శాస్త్రములు అనంతముగ నున్నవి. తెలియ తగినది చాలా ఉన్నది. కాలమా స్వల్పముగా నున్నది. విఘ్నములా అనంతముగా కలుగుచునే ఉండును.కావున హంస ఏ విధముగా పాలను మాత్రమే గ్రహించి నీటిని విడిచి వేయునో అదే విధముగా మనము కూడా కావలసినంతమట్టుకు సారభూతమైన దానిని స్వీకరించ వలెను.
శ్లో. అనిత్యాని శరీరాణి, విభవో నైవ శాశ్వతః ౹
నిత్యం సన్నిహితో మృత్యుః, కర్తవ్యో ధర్మ సంగ్రహః ౹౹
కం. నిత్యంబు కాదు దేహము,
నిత్యంబులు కావయ ధరణిని విభవంబుల్,
మృత్యువు చేరువనుండును,
నిత్యముధర్మార్జనంబు నెరపఁగవలయున్.
భావము. మన దేహాలు శాశ్వతము కావు. నాశనం పొందుతాయి. అటులనే మన వైభవాలు కూడా శాశ్వతం కావు. చావు ఎపుడు మనకు దగ్గరగా ఉంటుంది. కావున ధర్మమును సంగ్రహించుట మన కర్తవ్యము.
శ్లో. అనిర్వేదః
శ్రియో మూలమనిర్వేదః పరం
సుఖమ్,
అనిర్వేదో హి సతతం
సర్వార్థేషు ప్రవర్తకః.
క. ఉత్సాహమె శ్రేయస్కర
ముత్సాహమె సుఖము గన మహోత్కృష్టంబు
న్నుత్సాహమె నడుపు మనల
నుత్సాహము వీడవలవ రుత్తమపురుషుల్.
భావము. అనిర్వేదమే శ్రేయస్సుకి మూలం, పరమ సుఖం. అనిర్వేదమే మానవుణ్ణి అన్ని కార్యములలోను ముందుకు నడిపిస్తుంది. అనిర్వేదమే అన్నింటిని సఫలం చేస్తుంది.
(నిర్వేదము అనే పదమునకు వ్యతిరేకపదము అనిర్వేదము. నిర్వేదము లేకపోవుట అనగా ఉత్సాహముగా ఉండుట.)
ఏంత సేపటికీ సీతమ్మ జాడ తెలియలేదని స్వామి హనుమ కించిత్ నిర్వేదానికి గురి అవుతాడు. నిరుత్సాహానికి లోనవుతాడు. అంతలోనే తేరుకోని పై మాటలు అంటాడు.
श्लॊ. अन्नदानम् महादानम् विद्यादानमतःपरम् !
अन्नॆन क्षणिकातृप्तिर्यावज्जीवम् च विद्यया !!
శ్లో. అన్నదానం
మహా దానం,
విద్యా దానం తతః
పరమ్.
అన్నేన క్షణికా తృప్తిః,
యావజ్జీవంచ విద్యయా.
గీ. అన్నదానంబు ఘనతరమెన్ని చూడ.
అంతకన్న విద్యాదాన మధిక తరము.
అన్నమున కల్గు సంతృప్తి యా క్షణమునె.
విద్య శాశ్విత తృప్తిని వెలయఁ జేయు.
భావము. అన్నము మహా ఘనతరమైన దానము. విద్యా దానము అంతకంటెను ఘనతరమైనది. అన్నదానము కలిగించే తృప్తి తాత్కాలికమైనదే. విద్యాదానము కలిగించే తృప్తి జీవితమంతయు ఉండును.
శ్లో. అన్నపూర్ణే సదాపూర్ణే!
- శంకర ప్రాణవల్లభే!
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం! - భిక్షాం దేహీ చ పార్వతీ!
తే.గీ. అన్నపూర్ణ! సదాపూర్ణ! యమర వినుత!
శంకరప్రాణ వల్లభా! సరసిజాక్షి!
జ్ఞాన వైరాగ్యములు మాలుఁ గలుగఁ జేయ
పార్వతీ! భిక్షనొసగుమ, ప్రణుతులమ్మ!
భావము. అన్నపూర్ణాదేవీ! ఓ సదాపూర్ణ స్వరూపిణీ! దేవతలచే
ప్రశంసింపఁబడు ఓ తల్లీ! శివంకరుఁడయిన శంకరుని ప్రాణేశ్వరీ!
నాకు హ్ఞానవైరాగ్యములు సిద్ధించుట కొరకు భిక్షను ప్రసాదించుమమ్మా!
శ్లో. అపరాధం సహేతాల్పం తుష్యేదల్పేஉపి చోదయే
మహోపకారాంశ్చాధ్యక్షాన్ ప్రగ్రహేణాభిపూజయేత్.
గీ. అల్ప దోషంబు మన్నింపనగును కనుమ,
అభ్యుదయమల్పమున్నచో నరసి పొగడు,
మేలు చేసిన వారిని మెచ్చుకొనుచు
గౌరవించుము. పొందుము గౌరవంబు.
భావము. చిన్న పొరపాటును క్షమించాలి. అల్పమైన అభ్యుదయానికైనా సంతోషించాలి. మహోపకారం చేసిన వారిని గౌరవించాలి.
శ్లో. అపరాధో న మే உస్తీతి నైతద్విశ్వాస కారణం
విద్యతే హి నృశంసేభ్యో భయం గుణవతామపి.
క. అపరాధము చేయని నా
కపరాధము చేయరితరులనుకొనఁ దగదోయ్.
నెపమెన్నక చేతురు మీ
కపరాధముదుశ్చరితులహర్నిశలు కనన్.
భావము