గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, డిసెంబర్ 2008, బుధవారం

నాతి చరామి.


భార్యాతిక్రమణ దోషము:-

ప్రియ సాహితీ బంధువులారా! సుమనర్నమస్సులు.
మనం రామాదివద్వర్తితవ్యం అని నేర్చుకొనే వుంటాం కదా! భగవంతుడే సాక్షాత్తు ఎన్ని అవతారాలెత్తినా మానవులకు ఒక్క రామావతారమే ఆదర్శంగా చెప్పుకోవడంలోగల ఆంతర్యం గ్రహించ లేకపోలేము కదా!
రాముడు పితృ వాక్య పరిపాలకుడు. మీదుమిక్కిలి ఏక పత్నీవ్రతుడు కూడాను.

ధర్మార్థ కామాల్లో భార్య నతిక్రమించకూడదని శాస్త్రం చెప్పడమే కాదు. పెళ్ళినాటి ప్రమాణాలు కూడా అదే కదా?
ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్యం. అని వరుడుచేత ప్రమాణం చేయించి అందుకంగీకరించిన పిడపనే అంటే నాతి చరామి అని అన్న పిదపనే కన్యా దాత తన కుమార్తెను అనగా వధువును వరునికి దానంగా యిస్తాడు.
అంత నమ్మకం కలిగించి ఒక స్త్రీని తనకు ఇల్లాలుగా పొంది ధర్మ బద్ధంగా ప్రవర్తించ వలసిన పురుషుడు ఆమె యిష్టానికి వ్యతిరేకంగా పెళ్ళినాటి ప్రమాణాల్ని తుంగలో త్రొక్కి హేయంగా ప్రవర్తించడం అతి హేయమైన పని. మగ జన్మనెత్తినవాడు నిజ జీవితంలోను, వైవాహిక జీవితంలోను రాముడిలా ప్రవర్తించాలి. అది ధర్మము.

ఈ సామాజిక ధర్మాన్ని అధిగమించినవారు రౌరవాది నరకాల్ని పొందుతారు. ఐతే ఒక్కొక్కప్పుడు అనుకోని అవకాశం ధర్మాతిక్రమణకు దోహదపడవచ్చు. బలోద్ధతమైన ఇంద్రియ గ్రామముచే భార్యను అతిక్రమిస్తే, .....తరువాత జరిగిన తప్పును తెలుసుకొని........... పశ్చాత్తప్తుడైతే .........అట్టి వానికి ఆ చేసిన పాపానికి చెప్పిన ప్రాయశ్చిత్తమును బోధాయన సూత్రాల్లో మనం చక్కగా గమనించ వచ్చు. ఆ సూత్రాన్ని పరిశీలిద్దామా?

బోధాయన సూత్రము:-
దారా వ్యతిక్రమీ ఖరాజినం బహిర్లోమ పరిధాయ " దారా వ్యతిక్రమణే భిక్షాం " ఇతి సప్తాగారాణి చరేత్. సావృత్తిః షణ్ మాసాన్.

చంపకమాల:-
వరగుణ యైన భార్య నటు వంచన చేసి, పరాంగనన్ సమా
దరణము చేసి పొంది తది తప్పు. క్షమింపను, భిక్ష, వేడుచున్
దిరిపము నెత్తుకో వలయు దీనత గాడిద చర్మ మూని. తా
గురుతుగ నారు మాసములు. గుర్తుగ రోజుకు యేడు యిండ్లలోన్.

భావము:-
భార్యను మోసగించి పరస్త్రీ లోలుడై మానసికముగ కాని, శారీరకముగ కాని అనుభవించినవాడు ఆ దోషమునకు ప్రాయశ్చిత్తముగా తన వొంటిపై గాడిద చర్మమును కప్పుకొని { అంటే నేను బుద్ధిలేని గాడిదను సుమా అని తెలియ జెప్పడం } రోజుకు యేడిండ్లలో మాత్రమే భార్యనతిక్రమించి పరస్త్రీతో సంభోగించిన పాపాత్ముడను. అట్టి నాకు భిక్ష వేయుడు. అంటూ ముష్టి ఎత్తుకొనుచూ ఆ వచ్చిన పదార్థముతోనే జీవనం సాగిస్తూ యి విధంగా ఆరు నెలలు జీవించాలి. ఆ విధంగా చేస్తే ఆ పాపం కొంత శమిస్తుంది.

చూచారా. భార్యాతిక్రమణ ఎంతటి ఘోరాతి ఘోరమైన పాపమో? అంతటి పాపం చేయకుండా బుద్ధిగా జీవించడమే మనకు మంచిది కదా! మరి మనం మంచిగా వుందామా?
జైహింద్. Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

రామకృష్ణారావుగారూ,

అద్భుతంగా శలవిచ్చారు. మానసిక వ్యభిచారులకు కూడా కనువిప్పు కలిగించే పద్యం అనడంలో సందేహమే లేదు.
అయితే, దేవుడే దిగి వచ్చి శిక్షలు అమలుపరచడం ప్రారంభిస్తే గాడిదలు అంతరించిపోయిన జంతువులలోకి వస్తాయనడానికి సందేహించను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.