గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, డిసెంబర్ 2008, శుక్రవారం

బ్రతకండి. బ్రతకనివ్వండి. మానవత్వాన్ని పరిమళించండి.

మానవులకు వైవాహిక జీవితంలో భగవంతుడిచ్చే అపురూప కానుక సంతానం. వంశ వృద్ధిని కాంక్షించి ధర్మ బద్ధమైన వివాహ వ్యవస్థను మన పూర్వీకులు నెలగొల్పారు. దంపతులు తమ ప్రణయ జీవితంలో తమకు కానుకగా లభించిన సంతానాన్ని చూసుకొని మురిసిపోతూ, ప్రపంచంలోనే తన బిడ్డలు గొప్పవారని భావిస్తూ, వారు గొప్పగా రాణించడానికి తల్లిదండ్రులుగా తాము ఎంతటి శ్రమ దమాదులనైనా ఓర్చుకొని తమ సుఖ భోగాలను కూడా వీడి, తమ పిల్లలి భవిష్యత్తే తమ అంతిమ లక్ష్యంగా భావించారా అన్న విధంగా వారి కొరకై నిరంతరం శ్రమిస్తుంటారు. ఇంత అపురూపంగా వారిని పెంచుకొంటుంటే
స్వార్ధపరులు, ఉగ్రవాదులు, మత మూఢులు, మానవతా హీనులు, అజ్ఞానాంధులు, అపురూపంగా పెరిగిన యీ పసి హృదయాలలో విష బీజాలు నాటి, ఆ పిల్లల హృదయాలను కలుషితం చేసి, వారిలోని మానవత్వాన్ని మటుమాయం చేసి, అపురూపంగా తమకు లభించిన యీ మానవ జన్మను నిరర్ధకం చేయడమే కాకుండా వారిని అనేక విధములైన అసాంఘిక చర్యలకు ప్రోత్సహించి, సంఘంలో అరాచకాలు సృష్టించి, మానవుని సాంఘిక జీవనానికి అభద్రతా భావం కలిగిస్తూ, తాము కోరుకొన్న విధంగా, ఆపిల్లలను మలచుకొని, వారిని రెచ్చగొట్టుతూ, తాము మాత్రం ఏ.సీ. గదుల్లోఉంటూ, టీ.వీ. లో తమ ప్రభావంతో సమాజంలో జరుగుతున్న అరాచకాలు చూసి పొంగిపోతూ, పైశాచికానందాన్ని పొందుతున్నారు.

అరాచకాలను ప్రోత్సహిస్తున్న ఈ నరరూప రాక్షసులు ఎంతమంది తల్లిదంద్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారో వారెప్పుడైనా ఆలోచించారా? ఆలోచించరు. ఎందుకాలోచిస్తారు? వారిలో కరడు కట్టిన మూర్ఖత్వం వారిలోని జ్ఞానాన్ని పూర్తిగా మటుమాయం అయేలా చేసెస్తుంది.

మానవులుగా పుట్టిన ప్రతీవారూ మనసుపెట్టి ఒక్కసారి ఆలోచించండి. మానవ జన్మ ఎంత అపురూపమైనదో. ఈ అపురూపమైన జన్మలో శరీరం ఉన్నంత వరకే మనం సుఖమయ జీవితం, ఆనందమయ జీవితం, గడపడానికీ, మనం ఉన్నందుకు మనతోటి సామాజికులకూ సుఖ సౌఖ్యాలను అందించ గలగడానికీ సాధ్యమవుతుంది. ఈ శరీరమే మనం కోల్పోతే చేయడానికి మనకేముంటుంది? మనలను కన్న తల్లి దండ్రులకానందమివ్వాలన్నా మనం జీవించి వున్నప్పుడేకదా సాధ్యమయ్యేది. అందుకని ఏ విధంగా చూచినా మనం భగవంతుడిచ్చిన ఆయుర్దాయమున్నంత కాలం మనం సుఖంగా జీవిస్తూ, సమాజ సౌఖ్యం కోసం మనం చేయ గలిగినంత మేలు చేయాలి. ఆ సమాజంలో ప్రశంసింప బడుతున్న మనలను గని మన తల్లిదంద్రులు ఆనందపడేలాగా చేయాలి. మనల్ని కన్న తల్లిదంద్రులకు పిచ్చనుకొంటున్నారా? మనల్ని ప్రేమగా చూచి, తమ సౌఖ్యాలను కూడా చూసుకోకుండా మనకోసమే అనేక శ్రమ దమాదులకోర్చుకొంటూ మనకోసమె జీవించే మన తల్లిదండ్రులకోసం మనం ఒక్కసారైనా ఆలోచించక్కరలేదా? మనం మన ఆలోచనని కలిగుండక్కరలేదా? మాటల గారడీలతో మనలను లొంగదీసుకొంటె ఆ మూర్ఖులికి మనం లొంగిపోవడమేనా? వారు సృష్టించే మారణ హోమమనికి మనమే కారకులమై, మనమే సమిధలై నశించిపోవాలా? మనకు మెదడు లేదా? మనలను కనవారు నిరర్ధకంగా మనల్ని కన్నారా? మసిబారిపోవడానికి మన జీవితాలే అంత తేరగావున్నాయా? ధనాన్ని చూపించి మనల్ని వారు ప్రలోభ పెట్టవచ్చు. మన తల్లి దంద్రులకు మనం మరణించినతరువాత వచ్చే ధనం కావాలనుకొంటున్నామా? మనల్ని కోల్పోయిన పిదప వారికి కలిగే శోకాన్ని మనం పోయిన పిదప వచ్చే ధనం తీర్చ గలదనుకొంటామా? వారు సంతోషిస్తుంటే వారి సంతోషం మనం కళ్ళారా చూచినప్పుడేకదా మనకానందం.

మనం జీవించాలి. సమాజంలో ప్రతీ ఒక్కరూ హాయిగా మనలాగే జీవించాలి. మన తల్లి దండ్రులూ, అలాగే మనలాంటివారి తల్లి దండ్రులూ హాయిగా జీవించాలి. అందరం హాయిగా మరణించేదాకా జీవించగలగాలి. అందుకొరకు మనవంతు సహకారం మనం అందించాలి. సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనివ్వ కూడదు. మనం టెర్రరిష్టులుగా మారడం చాలా చాలా అవివేకం. సాధించేదేమీ లేదు. పాపాలూ, వారుపెట్టే శాపాలూ తప్ప.

ఓ యువకులారా! మీదేదేశమైనా అవవచ్చు. మీదేజాతైనా అవవచ్చు. మీరూ అందరిలాగే మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రుల చేతిలో ముద్దుగా పెరిగినవారే. మీ జీవితాలు కూడా చాలా అమూల్యమైనవే. అర్థంలేని, ఎందుకూ పనికిరాని, ఎవరికీ మేలు చేయలేని, మీకు సమూలంగా నాశనాన్ని కలిగించేటువంటిన్నీ అయిన దుష్ట రాక్షసుల అర్థ రహిత దుర్బోధలు వినకండి. అవి విని మీరు రెచ్చిపోతే దానివల్ల మీరూ మీ అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్న మాట మరువకండి. మీ తల్లి దండ్రులను క్షోభ పెట్టకండి. మీరూ హాయిగా జీవించండి అందరినీ హాయిగా జీవించనివ్వండి. మిమ్ములను దుశ్చేష్టలకి పురికొల్పే ఆ దుర్మార్గులు ఏ.సీ. రూముల్లో వుంటూ టీ.వీ.ల్లో బ్లూఫిల్ములు చూస్తూ, మీ మరణ వార్తకు చింతించకపోయినా మీరు వారి ప్రోద్బలంతో కలిగించిన మారణ హోమాన్ని వార్తల్లో చూస్తూ పైశాచకానందాన్ని పొందుతున్నారు. మీరూ గమనించి చూడండి. ఔనో కాదో మీకూ తెలుస్తుంది. నా మాటలు విన్నారా మీరూ సుఖంగా వుండగలుగుతారు. మీ తల్లిదండ్రుల్నీ సుఖంగా వుంచ గలిగిన వారవుతారు. మీరుపోతే మీకేముంటుంది
? ఎందుకు చెప్పానో గ్రహించి, మీరూ సుఖపడండి. సమాజాన్నీ సుఖంగా నిర్భయంగా వుండనివ్వండి. మీ కెవరైనా దుర్బోధ చేస్తే అది వారిపైనే ప్రయోగించి, మట్టుపెట్టండి. చేతులు జోడించి మరీ మిమ్మల్నర్ధిస్తున్నాను. మిమ్మల్ని కన్న తల్లి దండ్రులకు కడుపుశోకం కలిగించకండి. మీరు మంచి వారు. పుట్టుకతో అందరిలాగే మీరందరూ మంచివారే. నామాట తప్పక వింటారుకదూ?
నమస్తే. Print this post

1 comments:

durgeswara చెప్పారు...

చాలా బాగా వ్రాశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.