గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, డిసెంబర్ 2008, శుక్రవారం

సర్వే చ సుఖినస్సంతు. మేలిమి బంగారం మన సంస్కృతి 36

సాటి లేని మేటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి:-
ప్రియ పాఠక మహాశయులారా! ఆంధ్రామృత పాన మత్త చిత్తులారా! మేలిమి బంగారమైన మన భారతీయ సంస్కృతిని మీ ముందుంచే భాగ్యము ఆ భగవానుడు నాకు ప్రసాదించినందుకు చాలా ఆనందంగా వుంది.
నిజముగా మన భారత భూమి వేద భూమి మరియు దేవ భూమి. దేవతలకు సృష్టి యావత్తు సమానమే. అదే పద్ధతిని మన భారతీయులు కూడా సృష్టి యావత్తు బాగుండాలనికోరుకొనే తత్వం కలవారుగాన వీరినే దేవతలనవచ్చును. అందరి క్షేమాన్ని కోరుదురనడానికి తార్కాణంగా కనిపించే ఈ క్రింది శ్లోకాన్ని చూడండి.
శ్లో:-సర్వే చ సుఖినస్సంతు.
సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్.

:-లోకులు సుఖముగ నుండుత.
లోకులు రోగములు లేక లొంగక నిలుతన్.
లోకులు మంగళ మొందుత.
లోకులు దుఃఖములు లేక డుంకక నిలుతన్.
భావము:-
లోకమంతటా యెల్లరూ సుఖముగా ఉందురు గాక.
ఎల్లరునూ రోగములు లేనివారై యుందురు గాక.
అందరునూ కల్యాణములనే చూచెదరు గాక.
ఏఒక్కరూ దుఃఖము పొందకుందురు గాక.

చూచారా ఎంతటి చక్కని ఆకాంక్షయో. మన భారతీయులు మాత్రమే ఇంతటి ఉదార గుణ సంపన్నులు. లోకము నందలి ఎల్లరూ సఖ సంతోషాలతో అనారోగ్యాలు లేక ఆనందంగా హాయిగా ఉండాలని నిత్యమూ ప్రార్ధిస్తుంటారు. ఔనుమరి. ఉదార చరితులకు లోకమంతా కుటుంబమే కదా.
మనమూ భారతీయులమై పుట్టినందుకు గర్విస్తూ పైన చెప్పిన విధంగా నిత్యమూ ప్రార్థన చేస్తూ మన ఔన్నత్యాన్ని నిరూపించుకొందామా?
జైహింద్.
Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

రామకృష్ణారావు గారూ,

మీరు బ్లాగు పాఠకులకు అందజేస్తున్న వివరములు చాలా బాగున్నవి. నాదొక విన్నపము. మీకు వీలయిన పక్షంలో పోతనగారి గజేంద్రమోక్షం పద్యములకు ప్రతిపదార్థ తాత్పర్యములు అందించగలరు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! మీరు ఆంధ్రామృతాన్ని గ్రోలుతున్నందుకు నా ధన్యవాదాలు.
మీరు కోరిన విధంగా భాగవతములోని గజేంద్రమోక్షములాంటి ఘట్టాలలోనున్న రసవత్తరమైన పద్యాలకి తప్పక ఆ పరమాత్మ నాచేత అర్థ తాత్పర్యాలు వ్రాయించ గలడని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయం చెప్పినందుకు మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. నమస్తే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.