గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, డిసెంబర్ 2008, ఆదివారం

సంధ్యా దీపం నమోస్తుతే. మేలిమి బంగారం మన సంస్కృతి 38

సంధ్యా దీప వందనము:-
తమసోమా జ్యోతిర్గమయ ! అంటూ మనం ప్రార్ధిస్తాం కదా! అట్టి జ్యోతిని గూర్చిన అవగాహన మనకవసరమే కదా? మన మందరం సంధ్యా సమయంలో చేసే జ్యోతిని గూర్చిన ప్రార్థన ఒకటుంది కదా! దాని నిప్పుడు చూద్దాం.
శ్లో:-దీపం జ్యోతిః పర బ్రహ్మా
దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే.

:-దీపము జ్యోతి సురూపము.
దీపము తిమిరమును బాపు. తేజము నొసగున్.
రూపము చూపెడి సంధ్యా
దీపమునకు నంజలింతు. తృప్తిగ నెలమిన్.
భావము:-దీపము ప్రజ్వలనమే స్వరూపముగా కలది. అదియే పర బ్రహ్మము. అన్నిటి మీదను సమానముగా తేజస్సును బరపును. అట్టి దీపము వలననే సర్వ కార్యములూ సుగమములగుచున్నవి. అట్టి సంధ్యా దీపమా! నీకివే నా వందనములు.
కన్నులున్నా కబోదులం మనం రాత్రి సమరంలో దీపపు కాంతి లేకపోతే. ఔనంటారా? కాదంటారా. అలాంటి దీపము సాయం సంధ్య మొదలు మళ్ళీ సూర్యోదయం వరకూ మన కన్నులకు వస్తు సముదాయాన్ని కనిపింప చేస్తుంది. జీవన గమనానికి కన్నులెంత ముఖ్యమో కాంతి కూడా అంతే ముఖ్యంకదా. అందుకే అలాంటి కాంతినిచ్చే సంధ్యాదీపానికి ప్రతీ సంధ్యా సమయంలో మనం నమస్కరించడం మనకున్న సంస్కారానికి నిదర్శనం. ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసి రోజూ ప్రార్థన చేద్దామా మరి?
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.