గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, డిసెంబర్ 2008, సోమవారం

షడ్విధా నాతతాయినః .మేలిమి బంగారం మన సంస్కృతి 43

ఆకతాయి కాదు. ఆతతాయి.
మనలో చాలామంది కుర్రకారుచేసే చెడు పనులు చూచి వట్టి ఆకతాయిసుమా ఆ అబ్బాయి అని అంటూంటాము. ఇక్కడ మనమొక విషయం గమనించాలి. అసలు ఆకతాయి అంటే యేమిటని.
అసలు ఆకతాయి అనే పదం కాదు ఆపదం ఆతతాయి. ఆతతాయి అని యెవరినన వచ్చో ఒక చక్కని నిర్వచనం ఒక శ్లోకములో వుంది. చూడండి.
శ్లో:-
అగ్నిదో గరదశ్చైవ
శస్త్రోన్మత్తో ధనాపహః
క్షేత్ర దార హరశ్చేతాన్
షడ్విధా నాతతాయినః .
తే:-
అగ్ని విషములు బెట్టెడి అధముల, మఱి
ఆయుధంబునజంపెడి అశుభ పరుల,
క్షేత్ర దారల హరియించు కౄరుల, గని
ఆతతాయిగ చెప్పగ నర్హమగును.

భావము:-
ఇంటికి కాని, సంసారములో కాని అగ్గి పెట్టే వారినీ, పరులపై విష ప్రయోగము చేసే వారినీ లేదా విషము గ్రక్కే వారినీ, ఆయుధముతో దాడి చేసే వారినీ, భూములనపహరించే వారినీ, భార్య నపహరించే వారినీ, ఆతతాయిలు అని అన వచ్చును.
ఇప్పుడు అనుసరణీయం కాక పోయినా పూర్వ కాలంలో ఈ ఆతతాయిల విషయంలో గల శిక్ష ఒక శ్లోకం వివరిస్తోంది. మనం అనుసరించ వద్దు కాని ఆ శ్లోకంలో ఏం చెప్పారో తెలుసుకొందాము .
శ్లో:-
గురుం వా, బాల, వధ్వౌవా,
బ్రాహ్మణంవా బహు శృతం.
ఆతతాయిన మాంతవ్యం
హంత్యాదే వవిచారయన్.
తే:-
గురువు, బాల వధువనక, గొప్ప వేద
విదుడు బ్రాహ్మణుడనకుండ కౄరముగను
ఆతతాయైన చంపగ నర్హమయ్య.
యోచనేమియు లేకయే. నీచు లంచు.
భావము:-
ఆతతాయి అయితే అట్టి వారు గురువవ వచ్చును, బాలులవ వచ్చును, స్త్రీ లవ వచ్చును, అనేక వేదముల నెఱిగిన బ్రాహ్మణు లవ వచ్చును, అటువంటి వారిని విచారణ చేయనక్కర లేకుండానే హతమార్చ వచ్చును.
ఇది ఈనాటి న్యాయము కాదని మనం ముఖ్యంగా గ్రహించాలి. పూర్వ కాలంలో ఎంతటి నిబద్ధతతో ప్రతీవారూ ప్రవర్తించ వలసి వుండేదో , ఎంతటి కట్టుబాట్లు కలిగుండేవో మనం గ్రహించడానికే యీ శ్లోకాలు మనం తెలుసుకోవలసి వుందని మాత్రం చెప్పగలను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.