గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, డిసెంబర్ 2008, శుక్రవారం

దారిద్ర్య రోగ దుఃఖాని. మేలిమి బంగారం మన సంస్కృతి 31

దరిద్రాదులు మన కర్మ ఫలాలు.
లోకంలో జీవించే ప్రతీ వారూ సుఖ దుఃఖములకు లోనవకుండా వుండడం కష్ట సాధ్యం. ఈ సుఖ దుఃఖాలకూ మూలం వారు వారు చేసుకొన్న కర్మలేనని వివరిస్తున్న ఈ క్రింది శ్లోకాన్ని పరిశీలించండి.
శ్లో:-దారిద్ర్య రోగ దుఃఖాని
బంధన వ్యసనానిచ
ఆత్మాపరాధ వృక్షస్య
ఫలాన్యేతాని దేహినాం.

తే:-నరున కాత్మాపరాధమన్ తరువు ఫలము
లరయ దారిద్ర్యములు, దుఃఖ వ్యసన బంధ
నములు, రోగముల్, కావున నరుడెఱంగి
ఆత్మ సాక్షిగా నడచిన హాయి గొలుపు.

భావము:-దారిద్ర్యము, దుఃఖము, వ్యసనము, బంధనము, రోగము, ఇవన్నియూ మానవునకు తప్పక అనుభవించ వలసిన ఫలములు. ఈ ఫలములు కాసే వృక్షము మరేదో కాదు. మానవులు చేసుకొనిన అపరాధములే. ఈ అపరాధములే బీజముగా మారి మొలకెత్తి, మహా వృక్షమై ఆ వృక్షమునకు కారణ భూతుడయిన వానికే దాని ఫలములనందించును. ఆ ఫలముల నా నరుడు తప్పక అనుభవించి తీరవలెను. మనమనుభవీంచే వన్నీ అట్టి కర్మ ఫలములే సుమా!
ఈ విషయ జ్ఞానము కలిగిన పిదపనైనను మనము సత్కర్మలనాచరించో సత్ఫల ప్రాప్తి కలిగి మన ఆనంద ప్రదమగును. అలాగే చేసే ప్రయత్నమైనా చేద్దామా మనం?
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.