గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, డిసెంబర్ 2008, గురువారం

కిం వాససైవం న విచారణీయం. మేలిమి బంగారం మన సంస్కృతి 24

పై పై మెఱుగుల ఆవశ్యకత.
ఈ లోకం చాలా విచిత్రమైనది. పై పై మెఱుగులకే విలువనిస్తుంది. ఇది చాలా నిజం. ఈ విషయంలో ఒక చక్కని శ్లోకముంది. పరిశీలిద్దామా? ఐతే చూడండి.
శ్లో:-కిం వాససైవం న విచారణీయం.
వాసః ప్రధానం ఖలు యోగ్యతాయాః
పీతాంబరం వీక్ష్య దదౌ తనూజాం
దిగంబరం వీక్ష్య విషం సముద్రః

తే:-కట్టు బట్టకె లోకంబు గౌరవంబు.
పట్టు గట్టిన హరి గాంచి పాల కడలి
వాని కిచ్చెను లక్ష్మిని. వస్త్ర హీను
శివుని తా గాంచి విష మిచ్చె. చిత్ర మిదియె.

భావము:-పాల సముద్రుడు పట్టు వస్త్ర ధారి అయిన శ్రీ మహా విష్ణువును గాంచి తన ముద్దుల కూతురయిన శ్రీదేవి నొసగెను. అదే పాలసముద్రుడు దిగంబరుడయిన శివుని గాంచి అతనికి హాలాహలమునిచ్చినాడు.
చూచారా! ఎంత వింతో! ఆ దేవుళ్ళకైనా గౌరవమన్నది వారు ధరించిన వస్త్రములపైనే ఆధారపడి యుండగా ఇక మనబోటి వారి సంగతి వేరే చెప్పాలా? ఉన్నంతలో పరిశుభ్రంగా వున్న వస్త్రాల్ని మనం ధరించి, మన గౌరవాన్ని ద్విగుణీకృతం చేసుకో వల సిన బాధ్యత మనపైనే ఉంది కదా ! నిజాన్ని గ్రహించిన మనం అలక్ష్యం చేయకుండా పాటిద్దామ్మా!
జైహింద్.!
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.