గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, డిసెంబర్ 2008, బుధవారం

గాయంతి దేవాః కల గీతికాని. మేలిమి బంగారం మన సంస్కృతి 34.

భారత భూమాత ప్రాశస్త్యము
భూమిపై జీవకోటి తమ కర్మ ఫలాన్ని బట్టి ఎక్కడోక్కడ పుట్టుతూనే వుంటుంది. మంచి చెడ్డలను తానూ అనుభవిస్తుంది.
ఐతే భారత భూమిపై జన్మించుట అనే భాగ్యం చాలా పుణ్య ఫలం వల్ల మాత్రమే సంభవిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహించక్కరలేదు. సాక్షాత్తు విష్ణు పురాణంలోనే భరత భూమిని ప్రశంసిస్తూ ఒక శ్లోకముంది.
పరిశీలించండి.
శ్లో:- గాయంతి దేవాః కల గీతికాని
ధన్యాస్తు తే భారత భూమి భాగే
స్వర్గాపవర్గాస్పద మార్గ భూతే
భవంతి భూయః పురుషాః సురత్వాత్.

:- భారత భూమిపై కలుగు భవ్య మహాద్భుత జన్మ జన్మ. యీ
భారత మాతృ గానమును భక్తిగ దేవత లాచరింత్రు. యీ
భారత భూమి స్వర్గ పథ ప్రస్ఫుట మార్గము, ముక్తి మార్గమున్.
భారత మాతకున్ కడుపు పంటగ పుట్టుట భవ్య యోగమే.
చూచారా ఎంత అద్భుత భావనో. సాక్షాత్తూ విష్ణు పురాణంలో భరత మాతను గూర్చి ఆనాడే యిలా వ్రాశారంటే ఎంత పునీతమైన భూమిపై మనం జన్మించామో తెలుస్తోందా?
భావము:-ఓ భారత మాతా! నీ బిడ్డలు ధన్యులు. నిన్ను గూర్చి దేవతలు గానం చేస్తున్నారు. స్వర్గ లోకమునకు, మోక్షమునకు నీవే మార్గము. సోపానమూ నీవే సుమా. ఎంతో పుణ్యము చేసుకొనిన ప్రాణికి మాత్రమే నీ సంతతిగా పుట్టే భాగ్యం లభిస్తుంది. అని విష్ణు పురాణం భరత మాతను ప్రశంసించింది.
అంతటి ప్రాశస్త్యము గల భరత భూమిపై జన్మించిన మన జన్మ ఎంత పునీతమైందో కదా! ఈ పుణ్య భూమిపై పుట్టినందుకు సన్మార్గ వర్తులమై మన యోగ్యతను నిరూపించుకుందాం.
జైహింద్.
Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

చాలా అద్భుతమైన శ్లోకమందించారు మాన్యవర

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.