గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జనవరి 2010, సోమవారం

చిత్ర కవితా ధురీణుఁడు మన చంద్ర మోహనుఁడు.

తే.గీ:-
మిత్ర వరులార! గాంచంగ చిత్ర కవిత
అద్భుతంబది. కనగ నత్యద్భుతంబు.
చంద్ర మోహన సత్కవి సాంద్ర కవిత
చంపకందాటవెలదులఁ జక్క నొప్పె.
తే.గీ.గర్భ ఉత్పలమాల:-
మీరును గాంచు డీ దిగువ మేల్తరమొప్పఁగ తీర్చి యుండె. నా
తీరు సుబోధమై కవన ధీరుల మెప్పులు గాంచు నట్లుగా.
లే రన రాదుగా!కవులు, లీలలుఁ జూపరె? గాం చుడయ్య! యీ
ధీర కవీశ్వరున్.కవిత తీరును మీరలు. గణ్యులెల్లరున్. 
ఈ క్రింది చంప.కం.దాటవెలదులనొక్క చంపక మాలలో  మన చంద్రమోహన్ కవి రచించిన పద్యం.చూడండి.
చం॥    
నరహరి కేశవా వనజనాభ రమాధవ వంశ హస్త బం
ధుర సుగుణాకరా దురిత దూర జనార్దన దోర్బలాఢ్య గీ
ర్వర గిరిజస్తుతా మురహరా సురపూజిత ముఖ్యపాద సుం
దర పురుషాగ్రణీ భుజగతల్ప శచీధవ పుత్ర రక్షణా!
(గర్భ) కం॥   
హరి కేశవా వనజనా
భ రమాధవ వంశ హస్త బంధుర సుగుణా
గిరిజస్తుతా మురహరా
సురపూజిత ముఖ్యపాద సుందర పురుషా
(గర్భ) తే।గీ॥ 
వనజనాభ రమాధవ వంశ హస్త
దురిత దూర జనార్దన దోర్బలాఢ్య
మురహరా సురపూజిత ముఖ్యపాద
భుజగతల్ప శచీధవ పుత్ర రక్ష
చూచారుగా! ఎంత అద్భుతంగా చిత్ర కవితామృతాన్నందించారో మన చిత్ర కవి పుంగవులు లైన చంద్రమోహనులు! 
ఆంధ్రామృతం ద్వారా ఆ కవిపుంగవు నభినందిస్తూ  చెప్పిన తేటగీతి గర్భ చంపక మాలను కూడా చూడ మనవి.
ఆర్యా!చంద్రమోహనా!
అద్భుతం. అత్యద్భుతం. 
చిత్ర కవితామృత సాగరా! అభినందనలు.
తే.గీ. గర్భ చంపక మాలll
సదయ! మహోదయా! సరస సద్గుణ సన్నుత!చంద్ర మోహనా!
మృదులస్వభావుఁడా! కవిత రీతి సుబోధము గాంచి చూడ. నా.
హృదయముపొంగెఁగా! మధు ఘరీ  విధమొప్పెను, మధ్య పద్య ము 
ల్లదిర! యభేద్య సాము లవి.యద్భుతముల్ గద!పూజ్యమిత్రమా!
ఈ కవిపుంగవుని ఆదర్శంగా తీసుకొని మీలో దాగియున్న సత్కవితావేశాన్ని వెలికి తీసి ఆంధ్రామృతాన్ని అందరికీ పంచే ప్రయత్నం తప్పక చేస్తారని ఆశిస్తూ అర్ధిస్తున్నాను. 
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.