గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జనవరి 2010, ఆదివారం

ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.


శ్రీ గురుభ్యో నమ:
భక్త బంధువులారా! 
లోక బంధువైన ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైన  మాఘమాసం రాబోతున్న సందర్భంగా ఆ లోక బంధువును ఆయురారోగ్య ఐశ్వర్యముల కొఱకు కొలవ దలచుకొన్నవారు పఠించుట కనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో, 
మకుటం లేని మహా కవి రాజు, లబ్ధ ప్రతిష్ఠులు, విశ్రాంత సంస్కృత కళాశాలాధ్యక్షులు, శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి ప్రియ శిష్యులు అయిన 
శ్రీ మానాప్రగడ శేషశాయి హృదయం నుండి ఉప్పొంగిన భక్తి భావంతో కలం నుండి జాలువారిన కవితాస్రవంతి 
 "మకుటం లేని మహా శతకం" గా
అనేకమంది మహా పండితుల, కవుల మన్నన లందుకొన్నది ప్రసన్న బాస్కరము అనే ఈ శతక రాజము.ఇది కేవలము నియమిత పరిధిగల పుస్తకాలలోనే ఉండిపోవడం అనేకమంది పాఠకులకు అలభ్యంగా ఉంది. ముందుగా మాగురు దేవులైన శ్రీ మానాప్రగడ శేషశాయి పాదారవిందములకు ప్రణమిల్లుతూ, . . . ఆసక్తిగల ప్రతీ ఒక్కరికీ ఈ మహనీయుని రచన అయిన " ప్రసన్న భాస్కరము"  పఠన యోగ్యంగా ఉండటం కొఱకు ఆంధ్రామృతంలో 13 భాగాలుగా  ప్రచురిస్తున్నాను. ఇది 2/13వ భాగము. ఉదార స్వభావులైన పాఠకులెల్లరు సరస హృదయులై పఠించఁగలందులకు మనవి. ధన్య వాదములు. 
జైహింద్.
ప్రసన్న భాస్కరము

రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.
13.కామిత పుణ్య దర్శనుడు, కంజ వికాస కరుండు, ఋగ్యజు
స్సామ మహాధ్వ పారగుడు, సర్వ సురాసుర పూజితుండు, తే
జో మహితుండు, కాల పిత, సూర్యుడు, బ్రహ్మ శివాచ్యుతాత్మక 
స్వామి, తమో హరుండు, కను పండువు మాకుఁ బ్రసన్నుడయ్యెడున్.
14.అతులిత రాగ రమ్యహృదయా! యరుణద్యుతి మన్మహోదయా!
నతి దయ చేసి చేకొనవ? నా కను చీఁకటి మాపవా? చతు
శ్శ్రుతి వినుత ప్రభావ! మధు సూదన మానస తేజ! కాంతి భా
సిత సకల ప్రపంచ! సరసీరుహ సాధు విలోకన ప్రియా!
15.ప్రాణి జగన్మనో నయన! భాసుర తేజము, సర్వ లోక సం
ప్రీణన, మాశ్చలత్ప్రళయ భీకర రౌద్రము, భద్ర కారి, రు
క్ఛోణిమ, మీప్సిత త్రితయ సుందర, మంబుజ సుందరీ, ప్రియ
ప్రాణ మరీచి మండలము రక్తిమ మాకుఁ బ్రసన్నమయ్యెడున్.
16.ప్రాణ పదమ్ముగా మురికి బండను నేరుపుతో మలంచి, క
ల్యాణ వితర్దిఁ జేసి,మనుమంటివి. మంటి గొనమ్ముఁ జేసి.ని
ద్రాణుడ నైతి. దుర్వ్యసన దగ్ధుడనై మసినైతి. నీ దయా
పాణి తలారుణ స్పృహను భద్ర హరిన్మణిఁ జేయవే ప్రభూ!
17.నను దమరామరీ మకుట నవ్య మణిస్ఫుట కాంతి తుందిల
మ్మమృత రుచి ప్రసారము, సమాశ్రిత సజ్జన భాగధేయ, ము
త్తమ పద రూపణాయణము, తత్వ నిరూపణ, మద్భుత ప్రభా
వము రుచిరార్క మండలము వన్నెలు మాకుఁ బ్రసన్నమయ్యెడున్.
18.బహు భువన ప్రకాశములు, ప్రాణ పద స్థితి నాశ  కారక
స్పృహములు భూత కోటి నవ చేతన హేతువు, లద్రి సాను ది
క్కుహర మణిప్రదీపములు, కోమల పల్లవ చారు శోణిమల్.
బహు రమణీయ భాను కర పంక్తిలు, మాకుఁ బ్రసన్నమయ్యెడున్.
19.గైరిక ధాతు చిత్రణ సఖారుణ, మంబు ధర ప్రణాభ కి
మ్మీరిత, మింద్ర దిగ్రుచిర మేచక రాగ, మనంత కాంతి సం
భారము, సంచలత్కనక వర్ణ దిశా ముఖ రాగ రమ్య సిం
దూరము సూర్య తేజము గనుంగవ మాకుఁ బ్రసన్నమయ్యెడున్.
20.పొడిచిన మొగ్గ కన్నఁ  గడు ముద్దు మెఱుంగులు, కాఱు చీకటిన్
తడవెడు జీవ కోటికి సుదర్శనముల్, జల యజ్ఞ దీక్ష స
ల్పెడు నును దమ్మి కన్నులకు విందులు, జక్కవ జంట ఆర్తికిన్.
విడుపులు లోక బాంధవుని వెల్గులు మాకుఁ బ్రసన్నమయ్యెడున్.
21.మనుమిను సీమ లేర్పఱచు మంగళ దీపిక, దిగ్వధూముఖ
మ్మునకు మెఱుంగు, లో వెలుఁగు, పున్నెము వెన్నెల, చిమ్మ చీఁకటుల్,
తునుము కటారి, భూభువన తోషణ భూషణ మైన భాను దే
వుని కిరణంబు క్రొంబసిఁడి పూఁతలు మాకుఁ బ్రసన్నమయ్యెడున్!
22.సుర మకుటాగ్ర రత్న రుచి సుందరముల్, దరహాస సారసా
దరములు, జీవ లోక సుకృత స్ఫురణంబులు, సర్వ దైవతా
భరణము, లాశ్రితావన శుభ ప్రభవమ్ములు, వే వెలుంగులౌ
కిరణము లాత్మ బోధములు  కెంపులు మాకుఁ బ్రసన్నమయ్యెడున్.
23.సురపితృ యజ్ఞముల్ కిరణ సుందర! చెందు నభీష్ట సిద్ధి, నీ
కరుణన వేచి, సి స్థిరముగా వెలుఁగొందు జగత్తు నీ ప్రభా
స్ఫురణన చేసి, రే బవలు పున్నమ మాస వివేచనంబు నీ
తిరుగుటఁ జేసి కాంచెదము దివ్య కృపాకర! తీర్థ భాస్కరా!
24.కమల తలోదరీ ముఖ సుఖ స్పృశముల్, కరవీర కాంతి మం
జిమములు, కుంకుమ ద్యుతి వశీ కృత వాసవ దిగ్వధూముఖ
ప్రముదిత సర్వ లోకములు, రాగ రస ప్రచలత్కుసుంభముల్,
నమ దమరమ్ము లర్క కిరణమ్ములు మాకుఁ బ్రసన్నమయ్యెడున్!
 లోక బాంధవుని వెల్గులు మాకుఁ బ్రసన్నమయ్యెడున్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.