గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జనవరి 2010, ఆదివారం

పురుష సూక్తము. ఆంధ్రానువాదము. 6 వ భాగము.


ఓం నమో నారాయణాయ.
పురుష సూక్తము (6 వ భాగము)

ఊరూ త దస్య యద్వైశ్య:, పద్భ్యాగ్ం శూద్రో అజాయత, చన్ద్రమా మనసో జాత:, చక్షో స్సూర్యో  అజాయత, ముఖా దింద్రశ్చాగ్నిశ్చ, ప్రాణాద్వాయు రజాయత, నాభ్యా ఆసీ దన్తరిక్షమ్, శీర్ష్ణో ద్యౌ స్సమవర్తత, పద్భ్యామ్ భూమిర్దిశ శ్శోత్రాత్, తథా లోకాగ్ం అకల్పయన్.6.   
ప్రతిపదార్థము:- 
అస్య = ఈ విరాట్టుకు 
ఊరూ = తొడలు  
యత్ = ఏవియో
తత్ = అవి
వైశ్య: = వైశ్యుడు.
పద్భ్యామ్ = పాదముల నుండి
శూద్ర: = శూద్రుఁడు
అజాయత = పుట్టెను.
చంద్రమా: = చంద్రుడు 
మనస: = మనస్సు వలన
జాత: = పుట్టెను.
చక్షో: = నేత్రము వలన
సూర్య: = సూర్యుఁడు
అజాయత = పుట్టెను.
ముఖాత్ = ముఖము వలన
ఇంద్ర: = ఇంద్రుఁడును
అగ్నిశ్చ = అగ్నియును
ప్రాణాత్ = ప్రాణము వలన
వాయు: = వాయువును,
అజాయత = పుట్టెను.
నాభ్యా: = బొడ్డు నుండి 
అంతరిక్షం = ఆకాశము,
ఆసీత్ = ఆయెను.
శీర్ష్ణ: = శిరస్సు వలన
ద్యౌ: = ద్యు లోకము
సమవర్తత = కలిగెను.
పద్భ్యామ్ = పాదముల వలన
భూమి: = భూమియును
శ్రోత్రాత్ = శ్రోత్రముచే
దిశ: = దిక్కులును
తథా = అట్లే
లోకాన్ = లోకములును
అకల్పయన్ = పుట్టించిరి.
దండాన్వయము:- 
ఈ విరాట్టుకు తొడలు  ఏవియో అవి  వైశ్యుడు. పాదముల నుండి శూద్రుఁడు పుట్టెను. చంద్రుడు మనస్సు వలన పుట్టెను. నేత్రము వలన  సూర్యుఁడు  పుట్టెను. ముఖము వలన ఇంద్రుఁడును అగ్నియును ప్రాణము వలన వాయువును  పుట్టెను. బొడ్డు నుండి ఆకాశము  ఆయెను. శిరస్సు వలన ద్యు లోకము కలిగెను. పాదముల వలన భూమియును శ్రోత్రముచే దిక్కులును, అట్లే లోకములును పుట్టించిరి.
సీ:- 
విష్ణు తొడల నుండి వెలువడె వైశ్యుండు  
పాదాల శూద్రుఁడు ప్రభవమందె. 
మనసువలన చందమామ జననమందె. 
కండ్లలో నుండి భాస్కరుఁడు బుట్టె.
నీశు ముఖము నుండి యింద్రుండు, నగ్నియు
ప్రాణమునను గాలి ప్రబలె పుట్టి.
నాభి నుండి కలిగె నభమద్భుతమ్ముగ
శిరము వలన కల్గె శ్రీ ద్యుజగతి.
ఆ:-
పాదములను బుట్టె భవ్యమౌ భూదేవి.
దెసలు చెవుల నుండి వెసను బుట్టె.
అటులఁ బుట్టఁ జేసె నన్ని లోకంబులు
నావిరాట్టు మూల మన్నిటికిని. 6. 
వివరణ:- 
కోమటితొడలు, శూద్రుఁడు పదములు ఆయెనని చెప్పి, ఆ విరాట్టు యొక్క మనస్సు వలన చంద్రుఁడును, నేత్రము వలన సూర్యుఁడును, ముఖము వలన ఇంద్రాగ్నులు, ప్రాణము వలన వాయువు బొడ్డు వలన అంతరిక్షము, నెత్తి వలన ద్యు లోకమును, పాదముల వలన భూమియు, శ్రోత్రముల వలన దిక్కులును కలిగెను. ఆప్రకారముననే ఎల్ల లోకములను కల్పించిరి.
ఇది 6 వ భాగము. (స శేషం)
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.