గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జనవరి 2010, గురువారం

ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.


శ్రీ గురుభ్యో నమ:
భక్త బంధువులారా! 
లోక బంధువైన ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైన  మాఘమాసం రాబోతున్న సందర్భంగా ఆ లోక బంధువును ఆయురారోగ్య ఐశ్వర్యముల కొఱకు కొలవ దలచుకొన్నవారు పఠించుట కనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో, 
మకుటం లేని మహా కవి రాజు, లబ్ధ ప్రతిష్ఠులు, విశ్రాంత సంస్కృత కళాశాలాధ్యక్షులు, శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి ప్రియ శిష్యులు అయిన 
శ్రీ మానాప్రగడ శేషశాయి హృదయం నుండి ఉప్పొంగిన భక్తి భావంతో కలం నుండి జాలువారిన కవితాస్రవంతి 
 "మకుటం లేని మహా శతకం" గా
అనేకమంది మహా పండితుల, కవుల మన్నన లందుకొన్నది ప్రసన్న బాస్కరము అనే ఈ శతక రాజము.ఇది కేవలము నియమిత పరిధిగల పుస్తకాలలోనే ఉండిపోవడం అనేకమంది పాఠకులకు అలభ్యంగా ఉంది. ముందుగా మాగురు దేవులైన శ్రీ మానాప్రగడ శేషశాయి పాదారవిందములకు ప్రణమిల్లుతూ, . . . ఆసక్తిగల ప్రతీ ఒక్కరికీ ఈ మహనీయుని రచన అయిన " ప్రసన్న భాస్కరము"  పఠన యోగ్యంగా ఉండటం కొఱకు ఆంధ్రామృతంలో 13 భాగాలుగా  ప్రచురిస్తున్నాను. ఇది 6/13వ భాగము. ఉదార స్వభావులైన పాఠకులెల్లరు సరస హృదయులై పఠించఁగలందులకు మనవి. ధన్య వాదములు. 
జైహింద్. 
ప్రసన్న భాస్కరము 
రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. 
61.దళిత తమిస్ర రాశి! ప్రణత ప్రియ దర్శన పుణ్య భాసి!నీ 
చలువ గదా! రవీ! కిరణ సార దయామృత ధారఁ జేసి, లో 
కులు రుచిరాన్న పానముల కున్ దను పందుట,మంచి దారిలో
మెలఁగుట, యేమి నీ మహిమ! మింటికి మంటికి మేల్మియందమా?
62.అతిశయిత ప్రభావ కిరణా! కరుణామృత వృష్టి కారణా!
పతిత జనావనా! నిగమ పార చరత్పద పద్మ భావనా!
నతి పరమప్రియా! నిను వినా మఱి యెవ్వరినాశ్రయింతు? పా
ప తిమిర మార్ప, పున్నెముల బంగరు పంటలొసంగ, భాస్కరా!
63.అతిశయిత ద్యుతీ! శ్రూతుల కామెత రామయ గాధ! కప్ర పా
రతు లిడు లోకమా సుగుణ రాశికి బల్ మరియాద వాసికిన్!
శిత రుచిగా వెలుంగ జన జీవన మిచ్చితె ఆత్మ తేజ మ
ద్భుతము గదా! భవత్ కిరణ పుణ్య విశేష మచింత్య వైభవా!
64.నిరతిశయ ప్రభా భరణ! నీవు వినా మఱి యెవ్వరయ్య! యీ
పరమ దురంతమౌ తిమిర పాపము నార్పఁగఁ జాలువారు? దొం
తరలు సుధా నిధాన కిరణమ్ములు జీవ రసాయనమ్ము లీ
ధర కురిపింతు రెల్లరము తామర తంపరలై చెలంగగా!
65.సిందూరారుణ సుందరా! తుషిత రాజీవా! త్రిలోకీ మహ
స్స్పందా! సర్వ సురాసురార్చిత పదాబ్జా! త్రయీ పారగా! 
అంధీభూత జగత్ ప్రకాశక రుచీ! ఆరోగ్య సంధాయకా!
వందేహం గ్రహ దీపకం హితకరం వాల్లభ్య సంసిద్ధయే!
66.కన దతి లోక కాంతి కళికా! వినతామర లోక నాయకా!
దిన మణి చల్వ యీ పొదలు, తీవలు, పూల తరుల్, సుగంధ జీ
వనముగఁ బ్రాణవాయువిటు పంచుట, సేఁగిఁ దొలంచుటల్ క్షుధన్
దనుపుట లౌర! నీ కిరణ తత్త్వ మనూహ్యమ! బోధ పుష్కరా!
67.శివుఁడవొ? నీవు జీవుఁడవొ? శ్రీ పతివో? జలజాసనుండవో?
యెవఁడ వటంచు నిన్ బరిగణింప వలెన్? గరుణాంశుమౌళి! యా
దివిభువి సర్వ లోకములు తీర్థమయ ప్రణవైక దేశమై
తవిలి చరింపఁ గన్నెదుర దర్శన మిచ్చిన ధన్య మూర్తివో?
68.మిల మిల లాడు నీ పసిఁడి మేడ హజారముఁ జూడ నేర్తునే? 
తలతల లాడు నీ కిరణ తత్వ రహస్య మెఱుంగ నేర్తునే?
జలజ మనోహరా! కొనలు సాగిన చీఁకటి పాదుఁ దృంచి, కన్
వెలుఁగు లొసంగి  ప్రోవఁ గదె? విస్తృత లోక హితైక జీవనా!
69.విలవిల లాడు లోకము రవీ! యిరులంబడి, నీ వెలుంగులన్
జిలుకక యున్న, అల్ల చిటి చేతులఁ దాకి  సుఖ ప్రసంగముల్
సలుపక యున్న! మేల్పసిడి చాయల ఊయల లూగి రక్తిమై
చెలఁగక యున్న, నీవ కద జీవన దాత,వభీష్ట దర్శనా!
70.రేయి యుయాల లోన పవళింపఁగఁ జేతువు సృష్టి  అమ్మవై,
యే యెడకో అలంత మరలించి బళా! సరి క్రొత్త ఊపిరిన్
పోయుదు వంతలో అరుణముల్ ద్యుతులాశల నిండ జల్లి, తం
డ్రీ! యెవరయ్య! మేలు పొనరింతురిటుల్? రవి! జీవ కోటికిన్! 
71.రేయిఁ బవళ్ళు నీకయి శిరీషమృదూ! మది వేఁగి వేఁగి, యే 
వేళకు నీదు చాయ లగుపింపక, కుంచిత పాణి శోణిమల్ 
వాలక, బెంగ గొన్నచెలి పద్మిని వోలెఁ దపింతు! రాగ లీ
లా లసమానలాలన కరా! చల మేలర? సాకరా! రవీ!
72.తిమిరము దట్టమై అడవి తీవ వలెన్ నలు మూల లల్లి, లో
కము నలయింపఁ జేర్చితివిగా కిరణంబను గండ్ర గొడ్డలిన్?
అమిత సహస్ర భాను మహిమాయిత మండల దీప్తి! నీ ప్రతా
ప మెఱుఁగ శక్యమా? తెలుపవా? రవి! నీ మెఱపుల్ తళత్తళల్!

Print this post

2 comments:

Unknown చెప్పారు...

బాగున్నాయండి పద్యాలు.

SRRao చెప్పారు...

ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.