గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2010, శుక్రవారం

సన్ మంగళాని భవంతు.

పాఠక ప్రకాండులారా!
శా:-
శ్రీ కల్యాణ గుణాన్వితుండు  సుగుణ శ్రీలన్ బ్రవర్తించు, స
ల్లోకావాస విశేష వేష ధిషణా శ్లోకుండు.నారాయణుం,
డేకైకామృత మూర్తి రక్షకుఁడు మిమ్మేలంగఁ బ్రార్ధింతు సు
శ్లోకో ద్దీపిత సర్వ శక్తు లిడుచున్ శోభల్ ప్రకల్పించుచున్.
భావము:-
లక్ష్మీ ప్రదమైన మంగళములతో కూడుకొన్న వాఁడును, మంగళ ప్రదములైన గుణములయందే వర్తించువాఁడును, మంచి లోకములనే ఆవాసముగా కలిగి, విశేషమైన వేషము, తెలివి కలిగిన మంచి కీర్తిమంతుడును అయిన వాఁడు  శ్రీమన్నారాయణ మూర్తియే. మన పాలిటి ఏకైకామృత మూర్తి యైన ఆ రక్షకుడు మీకు మంచి కీర్తిని పెంచే సమస్తమైన శక్తులను బాగుగా కల్పించుతూ మిమ్ములను పాలించ వలసినదిగా ప్రార్థింతును.
చ:-
శుభకరమైన కార్యములు శోభిలఁ జేయఁగ పూనుఁడయ్య! అ
య్యిభమును గాచినట్టుల సుహృజ్జన పాళిని గావమంచు మీ
కభయమొసంగు దైవమున కార్ద్రతఁ బ్రార్ధనఁ జేయుఁడయ్య! మీ
కభయము మీరె కాదె! మిముఁ గాంచెడి దైవమె మిమ్మునొందుటన్.
భావము:-
శుభములను కలిగించునట్టి పనులను ప్రస్ఫుట మగునట్లుగా పూనిక వహించుడు. మీకు అభయమునొసగే అ దైవమునకు  " ఆ మత్తేభమును కాపాడిన విధముగా మంచివారి యొక్క సమూహమును కాపాడు" మని   హృదయము ద్రవించు విధముగా ప్రార్థన చేయుఁడు. మిమ్ములను కాపాడునట్టి దైవము మీయందే ఉండుట వలన మీకు అభయము మీరేకదా!
క:-
మంగళ కరులకు నిరతము
మంగళ ప్రద యగుత! సర్వ మంగళ. ఇక స్
న్మంగళముల కాధరు వయి
మంగళకార్యంబులందుమసలుఁడు మీరల్. 
భావము:-
ఆ మంగళ గౌరి మంగళ ప్రదముగ ప్రవర్తించువారికి ఎల్లప్పుడూ శుభములను చేకూర్చునది యగుఁగాక!ఇంక మీరు సమస్త మంగళములకు ఆధారమై యుండి, మంగళ ప్రదమైన పనుల యందే సంచరింపుడు.
జైహింద్. Print this post

2 comments:

సురేష్ బాబు చెప్పారు...

తన భర్త విషం తాగడాన్ని ఏ భార్యా ఒప్పుకోదు.అలాంటిది తన భర్త హాలాహల విషం త్రాగుతానంటే లోకాల క్షేమం కోసం ఒప్పుకొన్న సర్వమంగళ ఆ గౌరీ దేవి. ఆయమ్మ ఎల్లప్పుడూ లోకాలను శుభంగా చూస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

కథా మంజరి చెప్పారు...

మీ పద్య రచన గంగా ఝరి వలె సాగుతోంది. కవీ, మీకివే అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.